మంగళసూత్రాలని ముత్తైదువుల హృదయానికి ఎందుకు తాకిస్తారు? - నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు

traditional information


మాంగల్యధారణ సమయంలో మాంగల్యాన్ని కళ్యాణ వేదికలో ఉన్న ముత్తైదువుల అందరి చేతులతో తాకించిన తరువాత వరుని చేత వధువు మెడలో మాంగల్యధారణ చేయిస్తూ ఉంటారు. ఇలా చెయ్యడం ఎందుకు అని మనకి ఒక సందేహం కలుగుతుంది. కన్యాదాత ఎంత జాగ్రత్తగా వధూవరుల జాతకాలను చూపెట్టినా ప్రతి నక్షత్రానికి ఒక గండకాలం ఉంటుంది. అలాంటి గండకాలం వస్తే? అన్నటువంటి విషయాన్ని కూడా ఏ తండ్రి ఆలోచించలేడు.

అందుకనే వధువు కళ్యాణవేదిక మీదకి వచ్చేటపుడు కూడా గౌరీ పూజ చేసి వస్తుంది. మరి అందరి స్త్రీలకీ ఉపాసనా శక్తి ఒకే రకంగా ఉండదు కదా! ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్క రకంగా ఉంటుంది. పైగా హృదయస్థానంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు. అందుకనే మాంగల్యధారణ చేయించే సమయంలో కూడా మంగళసూత్రాలను వధువు హృదయస్థానానికి తాకేటట్టుగా పట్టుకొమ్మంటారు. ఇలా ప్రతి ముత్తైదువు యొక్క మెడలో ఆ మంగళసూత్రాలను తాకించడం చేత ఏ తల్లి ఉపాసన ఎక్కువగా ఉన్నదో తెలియదు. అలా తాకించి కట్టడం వల్ల ఆ ఉపాసన శక్తి కొంత ఆ మంగళ సూత్రాలు తీసుకుంటాయి. తీసుకొని వధువుని దీర్ఘసుమంగళిగా ఉండేటట్లుగా అనుగ్రహించగలిగిన శక్తి ఈ ప్రక్రియకి ఉన్నది. అందుకనే మాంగల్యధారణ సమయం ఆసన్నం కాగానే ఇటు మగపెళ్లి వారివైపు వారిలో హుషారుగా ఉన్నవారు కాని, ఇటు ఆడపిల్ల వైపు వారు కాని, ఇలా చెయ్యడానికి కారణం.

ఇలా ముత్తైదువులకు మాంగల్యం తాకించే సమయంలో కొంతమంది లలితా సహస్రం చదువుతారు. పూర్తిగా చదివే సమయం లేకపోయినా “కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా” అన్న నామం వరకు అయినా చదువుతారు. అలా చదవడం వల్ల ఆ తల్లి యొక్క కృప అప్పుడే మాంగల్యం కట్టించుకోబోతున్న వధువు మీద ఉండి తీరుతుంది. విశ్వాసం ప్రధానం.

ఇలా మన సనాతన ధర్మంలో ఆచరించే ప్రతి ఆచారానికి అర్ధం పరమార్ధాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతి యొక్క విషయం గురించి తెలుసుకుంటూ అందరూ ఆచరించేటట్లుగా చూస్తూ మన సనాతన ధర్మం యొక్క వృక్షశాఖలు ఇంకా శాఖోపశాఖలుగా పటిష్టపడాలని, అలా అవ్వడానికి ప్రతి ఒక్కరం మన వంతు కృషి మనం చెయ్యాలని కోరుకుంటూ…

సర్వేజనా స్సుఖినోభవంతు,

మరిన్ని వ్యాసాలు

Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం