లేహ్ అందాలు - కర్రా నాగలక్ష్మి

beauty of leh

   ఖర్దుంగ్ కనుమ

రాత్రి అయిదు నక్షత్రాల సౌకర్యాలు అనుభవించి , మరునాడు చక్కని పొద్దుట ఫలహారం పూర్తి చేసుకొని ఆర్మీ వారి జీపులో బయలుదేరేం . ఆ రోజు మేం ఖర్దుంగ్ కనుమ మీదుగా ప్రపంచం లోని అతి యెత్తైన మోటారు రోడ్డుని , అక్కడనుంచి నుబ్రా లోయను చూసుకొని రాత్రికి మా బస చేరాలి .

మాకు దారిలోకి  కావలసిన స్నేక్స్ , చల్లపానీయాలు లాంటివి పేక్ చేసి కూడా యిచ్చేరు  , యెందుకంటే ఆ దారిలో మిలటరీ పోస్ట్లు తప్ప మరేమీ లేవు అన్నారు .

లేహ్ నగరానికి సుమారు 39 కిలో మీటర్ల దూరంలో ఖర్దుంగ్ కనుమ మీదుగా ఈ ప్రదేశం చేరుకోవాలి . లేహ్ నగరం నుంచి మొదటి 24 కిలో మీటర్ల రోడ్డు  ప్రయాణానికి చాలా సౌకర్యంగా వుంది తరవాతి 15 కిలో మీటర్ల ప్రయాణం బురద , రాళ్లతో కూడిన రోడ్డు అక్కడక్కడ నీళ్లల్లోంచి ప్రయాణం చెయ్యవలసి వచ్చింది . యీ ప్రాంతం సంవత్సరంలో సుమారు 9 నెలలు మంచుతో కప్పబడి వుండి జూన్ జూలైలలో వేసవి కాలం కావడంతో గడ్డకట్టిన మంచుకరిగి ఆ నీరు ప్రవహించడంతో వాటితో పాటు రోడ్డు కూడా పోతూ వుంటుంది . ఇలాంటి అవరోదాలతో మా జీపు ప్రయాణం సముద్రం పైన బోటు విహారాన్ని గుర్తు చేసింది .

ఈ మార్గాన్ని 1976 ఆర్మీ వారి ద్వారా నిర్మింపబడి నిర్వహింపబడుతోంది . 1988 వరకు ఆర్మీ వారి అవసరాలకు మాత్రమే యీ దారిని వాడేవారు , తరవాత దీనిని సామాన్య ప్రజలు వాడెందుకు అనుమతి నిచ్చేరు . ఈ దారి గుండా సంవత్సరంలో 12 నెలలూ ఉష్ణోగ్రతలు సున్న కంటె తక్కువగా నమోదయే ' చియాచిన్ ' హిమనీనదం వద్ద పహారా యిచ్చే సైనికులకు నిత్యావసరవస్తువలు , ఆయుధాలు చేరవేస్తూ వుంటారు . ఈ మార్గం సుమారు 9 మాసాలు మంచుతో కప్పబడి రాకపోకలకు అంతరాయం కలుగుతూ వుండటంతో మిగతా మూడు మాసాలూ చాలా రద్దీగా వుంటుంది .

చరిత్రకు అందిన ఆధారాల ప్రకారం 14వ శతాబ్దం నుంచి లేహ్ నగరం నుంచి మధ్య ఆసియాలో వున్న ' కాష్ ఘర్ ' కు సామానులు చేరవేసేందుకు యీ కనుమ గుండా ప్రయాణించేవారట . ప్రతీ రోజూ సుమారు 10,000. గుర్రాలు అంతే సంఖ్యలో ఒంటెలు  రవాణాలో వుపయోగించే వారు , ఈ ప్రాంతంలో యిప్పటికీ మధ్య ఆసియాలో వుండే రెండు మూపురాల ఒంటెలు అక్కడక్కడ కనిపిస్తాయి . రెండవ ప్రపంచ యుద్ద సమయంలో చైనాకు యీ మార్గం గుండా ఆయుధాలను చేరవేసేందుకు ప్రయత్నాలు జరిగేయట .

ఈ మార్గం లో మొదటి 24 కిలో మీటర్ల ప్రయాణానంతరం ' పుల్లు ' చెక్ పోష్టు చేరుతాం , అక్కడ దారి రెండుగా చీలుతుంది , ఒకటి దక్షిణ పుల్లు కి మరొకటి ఉత్తర పుల్లు కి చేరుతుంది , మన ప్రయాణం ఉత్తర పుల్లు మార్గం లో సాగుతుంది . మిగతా 15 కిలో మీటర్ల ప్రయాణం ముగుస్తూ వుండగానే కనుచూపు మేర వరకు యెటు చూసినా తెల్లని మంచే , అలా మంచులో ప్రయాణించేక యెత్తైన ప్రదేశం చేరుతాం అక్కడ ఆర్మీ వారి పోష్టు వుంది . అందులో మేం వేడి టీ స్నేక్స్ తిని కొన్ని ఫొటోలు తీసుకొని , అక్కడ ఆర్మీ వారి బోర్డ చదివి దానికి కూడా ఫొటో తీసుకొని బయలు దేరేం .

ఆర్మీ వారి బోర్డు ప్రకారం యీ మార్గం 18,380 అడుగుల యెత్తున వున్నట్లు , యిదే ప్రపంచం లోని యెత్తైన మోటారబుల్ రోడ్డుగా రాసేరు . కాని యిప్పటి లెక్క ప్రకారం దీని యెత్తు ఆర్మీ వారి లెక్కకు సుమారు 800 అడుగులు తక్కువ వున్నట్లు , దానికన్నా యెత్తైన రోడ్డు మార్గాలు యింకా వున్నాయని మన గూగులమ్మ చెప్పింది .

1988 తరువాత ఆటో మొబైల్ , మోటారు బైక్ యెక్సపెడిషన్ , హిమాలయ బైక్ ర్యాలీ మొదలయిన స్పర్ధ లు నిర్వహించడం మొదలు పెట్టేరు . బైకర్స్ ఈ కొండలమీద తిరుగుతూ కనిపిస్తారు , ఈ మధ్య కాలంలో యిలాంటి సాహసయాత్రలు బాగా ప్రజాదరణ పొందడంతో యెన్నో పర్యాటక సంస్థలు యెన్నో చిన్నా పెద్దా యిలాంటి యాత్రలను నిర్వహిస్తున్నారు .

లదాక్ ప్రాంతం లో వున్న మిగతా కనుమల కన్నా యీ రోడ్డు చాలా చక్కగా వుండి బోర్డరు రోడ్డు ఆర్గనైజేషన్ వారిచే నిరంతరం మరమ్మత్తులు చేయబడుతోంది .

అక్కడనుంచి మా ప్రయాణం ' నుబ్రా లోయ ' వైపు సాగింది . నుబ్రా లోయ లేహ్ నగరానికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో వుంది . ఈ లోయను స్థానికులు ' ల్దుమ్రా ' అని అనేవారు , స్థానిక భాషలో ' పూలలోయ ' అని అర్దం . నుబ్రా లోయ షైయోక్ నది , నుబ్రా నది యీ ప్రాంతంలో కలిసి ప్రవహిస్తూ యీ లోయ యేర్పడడానికి కారణం అయేయి . నుబ్రా లోయ యెతైన ప్రదేశం లో వున్న ఒక శీతల యెడారి అని అనొచ్చు . నుబ్రా లోయ లదాక్ ప్రాంతాన్ని కరకోరమ్ శ్రేణులను వేరుచేస్తూ వుంది .  షైయోక్ నది సింధునది కి వుపనదికాగా నుబ్రా నది సియాచిన్ హిమనీనదములో పుట్టింది . దీనిని స్థానికులు చియాచిన్ నది అని కూడా వ్యవహరిస్తూ వుంటారు . నదీ తీర ప్రాంతం లో తప్ప మరెక్కడా యెటువంటి చెట్టూ చేమా కనిపించదు . నదీ తీరం వెంట మాత్రం గోధుమలు , బార్లీ , బటాణి , ఆవాలు పంటలు పండిస్తున్నారు . ఆపిల్ , అక్రోటు , ఏప్రికాట్ లాంటి పళ్లచెట్లు అక్కడక్కడ బాదం చెట్లు కనిపించేయి . ఈ లోయ సుమారు పది వేల అడుగుల యెత్తున వుంది . 2014 వరకు భారతీయులకు యీ లోయలోకి వెళ్లడానికి అనుమతి పొందవలసి వచ్చేది . మేం ఆర్మీ వారి అథిధులం కాబట్టి అలాంటి వన్నీ వారే చూసుకున్నారు . ప్రస్తుతం యీ లోయను సందర్శించాలనుకొనే విదేశీయులు అనుమతి లేనిదే యీ లోయలోకి అనుమతించరు .

మేం వెళ్లింది జూన్ ఆఖరు వారం కావడం వల్ల అక్కడక్కడ మాత్రమే పూలతో నిండిన మొక్కలు కనిపించేయి . ఆగష్టు ప్రాంతంలో యిక్కడ పూల ఋతువని అప్పుడు యీ లోయ చాలా అందంగా వుంటుందని అన్నారు .

ఈ లోయ భారత పాక్ సరిహద్దు ప్రదేశం . ఈ లోయలో యెక్కువగా బౌద్ద మతస్థులు కనిపిస్తారు .

నుబ్రా లోయ ముఖ్య నగరమైన ' దిస్కిట్ ' లో  ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలు , కనీస సౌకర్యాలు కలిగిన బసలు వున్నాయి . 1420 లో నిర్మించిన బౌద్ద ఆరామం వుంది . దిస్కిట్ నగరంలో యీ బౌద్ద ఆరామం వారి ద్వారా నిర్మింపబడి వారి ఆద్వైర్యం లో వున్న 33 మీటర్ల యెత్తున్న మైత్రేయ బుద్ద విగ్రహం మనలను ఆకట్టు కుంటుంది . మైత్రేయ బుద్ద అంటే బుద్దుని స్నేహ పూరితమైన అవతారంగా బౌద్దులు భావిస్తారు . ఈ విగ్రహం పాకిస్థాను కి అభిముఖంగా వుంటుంది .

దిస్కిట్ కి దగ్గరగా వేడినీటి బుగ్గలు వున్నాయి . ఇక్కడ ముఖ్యంగా చూడవలసినది ప్రకృతినే .

పూర్వం నుబ్రా సామ్రాజ్యానికి ' హంద్వార్ ' రాజధానిగా వుండేది .

నుబ్రా నుంచి హంద్వార్ కి వెళ్లే టప్పుడు యిసుక మేటలు కనిపించి కనువిందు చేస్తాయి . నదీ తీరాన వున్న పచ్చికను మేస్తూ  రెండు మూపురాల ఒంటెలు కనిపిస్తాయి .

హంద్వార్ భారత సరిహద్దు గ్రామం కాబట్టి అక్కడనుంచి కిందకు వెళ్లే అనుమతి పర్యాటకులకు లేదు . ఇక్కడ స్థానికులలో యెక్కువ సంఖ్యలో బౌద్దులు కాగా తక్కువ సంఖ్యలో షియా , సున్నీ తెగలకు చెందిన మహమ్మదీయులు కూడా వున్నారు . వారే కాక యెర్రటి వుంగరాల జుత్తు , నీలి కళ్లతో చూడగానే వేరేదేశస్థులుగా అనిపించే వారు కనిపించేరు . వారు యేసుక్రీస్తు సమాధి వెతుకుతూ గ్రీకు దేశాన్నుంచి వచ్చిన ఆటవికులు అని తెలుసుకున్న మాకు ఆశ్చర్యం అనిపించింది .

ఆ రోజు మాకు స్నేక్స్ తప్ప బోజనం దొరకలేదు . ముందుగా మాకు తిండి వస్తువులు పేక్ చేసి అందజేసిన ఆర్మీ ఆఫీసర్ల ముందు చూపుకు జోహార్లు అర్పించేం .

మరునాడు ఆర్మీ వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకొని మా బస్సొచ్చే జంక్షనుకి చేరుకున్నాం .

మేం ముందుగా బుక్ చేసుకున్న ప్రైవేటు సంస్థ బస్సులో మా ప్రయాణం పొద్దున్న యెనిమిదికి మొదలయింది . మళ్లా రంగు రంగు ల మట్టి కొండల మధ్యగా సాగింది మా ప్రయాణం . దారిలో యెక్కడా చెప్పుకో దగ్గ జనావాసాలు కనిపించలేదు .మధ్యాహ్నం యేదో పేరుకు రెస్టారెంట్లు అందులో నూడిల్స్ , కూల్ డ్రింక్స్ తప్ప మరేమీ లేవు . మాకు మాత్రం మా ఆర్మీ వారిచ్చిన పేక్డ్ లంచ్ వుంది అది తిన్నాం . చీకటి పడే వేళకి సుమారు 358 కిలో మీటర్ల దూరాన్ని సుమారు పది గంటలలో ప్రయాణించి  ' కే లాంగు ' చేరుకున్నాం . రాత్రి అక్కడే భోజనం చేసి హొటలులో విశ్ర మించేం , పొద్దటే టీ టిఫినులు కానిచ్చి మా ప్రయాణం మొదలయింది . ముందురోజంతా మట్టికొండలు ధూళి దుమ్ము యెగురుతూ వున్న దారి చిక్కని అడవులు మంచు కప్పుకున్న పర్వతాలతో అహ్లాదకరం గా మారింది . ఆ రోజు సుమారు 120 కిలో మీటర్లు ప్రయాణించి మనాలి చేరుకోవాలి . మనాలి చేరే దారిలో రోహతాంగ్ పాస్ వుండడం తో మా బస్సు ఆపరేటర్లు అధికారికంగా గంట మనాలి లో గడపడానికి అనుమతించేరు , కాని మా తోటి ప్రయాణీకులు ఆ గంటను మూడు గంటలుగా పొడిగించడం తో మేము మనాలి చేరే సరికి సాయంత్రం అయింది . రొహతాంగ్ లో బజారు వున్న ప్రాంతమంతా బురదబురదగా వుంటుంది .

రొహతాంగ్ లో యెటు చూసినా తెల్లని మంచే , చాలా శీతాకాలపు ఆటలు జరుగుతూ వుంటాయి . అక్కడ ఎంతసేపు గడిపినా  తనివి తీరదు .

బజారు రోడ్డులో యెన్నో పాక హోటల్స్ వున్నాయి . రుచి యెలా వుంది అన్నది పక్కన పెడితే వేడివేడిగా కడుపు నింపుకోడానికి కావలసినవి దొరుకుతాయి . నూడిల్స్ తో చేసే రకరకాల పదార్ధాలు దొరుకు తాయి .

ఇక్కడితో మా లదాక్ పర్యటన ముగిసింది . దీంతో జమ్ము కశ్మీరు పర్యటన కూడా ముగిసింది .

మళ్లా వారం మరో ప్రదేశాన్ని మీకు పరిచయం చేస్తాను అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు