చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaaram

ఈ రోజుల్లో నిత్యం చూసేదేమిటంటే, ప్రతీ వారికీ బధ్ధకం అంచెలంచెలుగా పెరిగిపోయి, ఏం చెప్పినా, “ రేపు చూద్దాం లెద్దూ..” అనేది వాడకంలోకి వచ్చేసింది. ఈ బధ్ధకం అనేది, రానేకూడదు కానీ,వచ్చిందా ఒక్కటంటే ఒక్కపనీ టైముకవ్వదు. మామూలుగా ప్రతీ రోజూ ప్రొద్దుటే లేవడానికి బధ్ధకం. చదువుకున్నప్పటి రోజులనుండి, ఉద్యోగం చేసినంతకాలం, అవసరార్ధం ప్రొద్దుటే లేవాలికదా, అబ్బే అదేం చిత్రమో, ఒక్కరోజుకూడా, మనస్పూర్తిగా లేచిన పాపాన్ని పోలేదు.ఎప్పుడూ బధ్ధకమే. రిటైరయిన తరువాత తెల్లారకుండా నిద్రలేచేసి, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీయడం.అంటే అర్ధం అయిందేమిటిటా, పనీ, బధ్ధకం Directly Proportional అన్నమాట.

- మనం వాడే సందర్భాన్ని బట్టి అర్ధం మారుతూంటుంది. ఉదాహరణకి, పిల్లాడికి మార్కులు తక్కువొచ్చాయనుకోండి,  తండ్రంటాడూ,

"మామూలుగా బాగానే చదువుతాడండీ, ఇంకొంచం శ్రధ్ధగా చదవడానికి బధ్ధకం" లాగన్నమాట!

ప్రొద్దుటే లేవడానికి అలారం మరీ పెట్టుకుంటారు.పైగా గడియారం ఓ పదిహేను నిమిషాలు ఫాస్ట్ గా పెడతారు. ఆ అలారం కాస్తా పాపం మ్రోగినా, దాని నోరునొక్కేసి, పెళ్ళాం నిద్రలేపినా, 'ఇంకో పది నిమిషాలు పడుక్కోనీయవోయ్, ఇదిగో లేచెస్తున్నా.."అనడమూ బధ్ధకంలోకే వస్తుంది.అలాగే పొద్దుటే స్కూలుకెళ్ళడానికి పిల్లల్ని లేపేడప్పుడు చూస్తూంటాము. ఏ రోజునా టైముకి లేవరు. ప్రతీ రోజూ ఓ యజ్ఞమే!

ఎప్పుడైనా కూతురు పురుటికి వస్తే, నెలలు నిండిన తరువాత,ఎప్పుడైనా డల్ గా ఉన్నట్లు కనిపించిందా, ' ఏమ్మా బధ్ధకంగా ఉందా? హాస్పిటల్ కి ఈవాళో రేపో వెళ్ళాలేమో'అనే మాట ప్రతీ తల్లి నోటినుండీ వింటాము.అంతదాకా ఎందుకూ, తిన్నది అరక్క, పొట్ట ఖాళీ అవకపోతే వాడే పదం 'మల బధ్ధకం' కూడా ఈ క్యాటిగరీ లోకే వస్తుందనుకుంటా.

ఈ రోజుల్లో పిల్లలు, ఆ బధ్ధకం శబ్దాన్ని మార్చేసి స్టైలుగా 'బోరు' అంటున్నారు. తెలుగులో చెప్పుకోడానికి నామోషీ!ఏ రాయైతేనేం బుర్ర పగలుకొట్టుకోడానికీ!చిన్నప్పుడు న్యూస్ పేపరు చదవడం తప్పనిసరైపోయేది. అదే ఓ అలవాటుగా మారింది. అందుకనే మన ఇళ్ళల్లో ఉండే పెద్దవారు, స్కూళ్ళకీ, కాలేజీలకీ వెళ్ళి డిగ్రీలు సంపాదించకపోయినా, న్యూస్ పేపరు చదివే, వారి లోక జ్ఞానం ఇంప్రూవ్ చేసికున్నారు.అందుకే వారికున్న general knowledge ముందర మనం పనికి రాము.ఇప్పుడో, న్యూస్ పేపరు చదవడానికి టైమే ఉండడం లేదూ, ఈ టి.వీ. ల ధర్మమా అని.పైగా, కంప్యూటరు లో ఓ నొక్కు నొక్కగానే, మనకి కావలిసిన సమాచారం వచ్చేస్తోందాయే! మరి బధ్ధకం పెరిగిపోతుందంటే పెరగదు మరీ?పిల్లాడిని అన్నం తినరా అంటే బధ్ధకం.ఈ బధ్ధకం అనేది ఓ national obsession అయిపోయింది.ఏ ప్రభుత్వ ఆఫీసుకైనా వెళ్ళి ఓ పని చేయమని అక్కడ కాళ్ళావేళ్ళా బతిమాలినా సరే, ఛస్తే చేయడు ఓ నాలుగురోజులు ఆగి రండి అంటాడు. మన ఆటగాళ్ళని, ప్రతీ రోజూ ప్రాక్టీసు చేయండిరా బాబూ, అని ఆ కోచ్ లు మొత్తుకున్నా సరే, ఛస్తే వెళ్ళరు.ఈ వేళ చేయవలసిన పని రేపటికి వాయిదా వేస్తున్నామంటే, ఈ 'బధ్ధకం భూతం' మనల్ని ఆవహించేసిందన్నమాటే.భగవంతుడు కూడా బాగుచేయలేడు మనల్ని.ఏదో అదృష్టం కొద్దీ, ఈ బధ్ధకం అనేది లేనిది ఆ ఒక్క 'అమ్మ' కే! ఆవిడకి సరాదాకైనా, బధ్ధకం వేసిందా, ఇంట్లోవాళ్ళ పని గోవిందాయే !ఈ బధ్ధకం కాన్సెప్ట్ గురించి ఇంకొన్ని ఉదాహరణలు గుర్తొచ్చాయి. రోడ్డుమీద సైకిలు మీద వెళ్ళేవాడు, తొక్కడానికి బధ్ధకం వేసి, ప్రక్కనే వెళ్ళే ఏ ట్రక్కు తాడో పట్టుకుంటూంటాడు, చూసే ఉంటారు. ఎప్పుడో దేనికిందో పడేదాకా ఈ బధ్ధకం వదలదు!అసలు ఈ బధ్ధకం మనుషుల్లో ఇలా ప్రకోపించడానికి, మన టెక్నాలజీ కూడా ముఖ్య పాత్ర వహించింది. గుర్తుండేఉండాలి, బ్లాక్ ఎండ్ వైట్ టి.వీ. ల రోజుల్లో ఉన్న రెండు చానెళ్ళనీ మార్చుకోడానికి, చచ్చినట్లు సోఫాలోంచో, కుర్చీలోంచో లేచి వెళ్ళి మార్చుకోవాల్సివచ్చేది. మరి ఇప్పుడో, ఓ రిమోట్టూ.అందుకే కాబోలు ప్రతీ ఇంట్లోనూ, couch potatoes ఎక్కువై, ఒళ్ళు కూడా వంచడానికి బధ్ధకించి, ఊరికే శరీరం పెంచేసికుంటున్నారు! అమ్మల్ని, నాన్నల్ని చూసే పిల్లలూనూ!ఇదివరకటి రోజుల్లో కాళ్ళకి వేసికునే షూస్ నే తీసికొండి, వాటికి లేసులూ వగైరా ఉండేవి. ఎవరింటికైనా వెళ్ళినప్పుడూ, ఏ గుళ్ళోకైనా వెళ్ళినప్పుడూ, తిసిన షూస్ తిరిగి వేసికునేటప్పుడు, ఒంటి కాలు మీద భరత నాట్యం చేయాల్సొచ్చేది. కనీసం ఆ మాత్రమైనా body exercise ఉండేది. మరి ఇప్పుడో, అలాటి షూస్ out of fashion అయిపోయాయి.

కొంతమందిని చూస్తూంటాము కారులో evening walk కి వెళ్తున్నామంటారు.వాళ్ళ మొహం, నడవడానికి కారెందుకంట? ఇదివరకటి రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు తీసికోవాలంటే, చచ్చినట్లు బాంకులకే వెళ్ళవలసివచ్చేది, ఇప్పుడో రోడ్డుకి ఎడా పెడా ఎక్కడ పడితే అక్కడ ఏ.టి.ఎం లూ! టెక్నాలజీ ఉండకూడదనడం లేదు, దీని వలన ప్రతీ విషయం లోనూ మన బధ్ధకం ఎంతలా పేరుకుపోయిందో, ముందు ముందు తరాలవాళ్ళు ఈ బధ్ధకభూతానికి ఇంకా ఎలా ఎడిక్ట్ అవుతారో చెప్పడానిక్ మాత్రమే.ఇదివరకటి రోజుల్లో ఓ ఇడ్లీ ,దోశా వేయాలంటే, ముందు రోజు పప్పు నానబెట్టడం, మర్నాటి సాయంత్రం దాకా పులియబెట్టడం, అబ్బో ఎంత కధా, ఇప్పుడో instant idli,dosa..., పైగా వీధి వీధికీ 'రుబ్బింగ్ మెషీన్ లోటీ!

అంత  దాకా ఎందుకూ, ఎక్కడైనా పచారీ కొట్లలో మనం కొన్నవాటి బిల్లు మొత్తం ఎంతయిందో చూడ్డానికి, కొట్లో కుర్రాడు ఓ calculator తీస్తేనే కానీ లెఖ్ఖకట్టలేడు. ఎక్కాలు నేర్చుకోడానికి రోగమా? ఏం లేదూ వళ్ళంతా బధ్ధకం.ఇదివరకటి రోజుల్లో బట్టలు తీసికెళ్ళేవాడూ, పాలుపోసేవాడూ కూడా టకటకా నోటితో లెఖ్ఖ కట్టేవారు.

ఇప్పుడు వస్తూన్న సదుపాయాలన్నీ ఉండాలి, ఇంకా ఎన్నో మరెన్నో రావాలి. కానీ ఇవన్నీ ఉన్నాయని మన మస్తకానికి బధ్ధకం అబ్బిబెడితే ఎలాగండి బాబూ? చివరకి ఎప్పుడో, పాపం గతితప్పకుండా లబ్ డబ్ మనే మన గుండె కాయకి బధ్ధకం వేసిందనుకోండి ఇంక అంతే సంగతులు !!

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు