సమ్మర్ సీజన్ అంటేనే పెద్ద వెకేషన్‌గా భావిస్తుంటుంది యువత. కేవలం యువత మాత్రమే కాదు, అన్ని వయసులవారికీ 'వెకేషన్' సరికొత్త ఆనందాన్నిస్తుంది. అలాగే న్యూ ఎనర్జీని సొంతం చేసుకోవడానికి ఈ 'వెకేషన్' ఉపయోగపడ్తుంది. ఈ మధ్యకాలంలో వెకేషన్‌ని అడ్వెంచరెస్‌గా మార్చుకోవడానికి యువత ఉత్సాహం చూపుతున్నారు. లాంగ్ టూర్స్, ప్రమాదకరమైన ప్రాంతాల సందర్శన వంటివాటితో యువత తమ వెకేషన్‌ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటున్న నేపథ్యంలో వారికోసం చాలా అడ్వెంచరస్ క్లబ్స్ కూడా ఏర్పాటవుతున్నాయి. సాహసోపేతమైన ప్రయాణాలకు పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ 'క్లబ్స్' ఉపయోగపడతాయి. ఫిట్‌నెస్ ఇందులో ఎంతో కీలకం. ఫిట్‌నెస్ పాఠాలు చెప్పడంతోపాటుగా, సరైన ఆహారం తీసుకోవడం, ప్రమాదాల్ని ఎదుర్కొనేలా మానసిక స్థైర్యాన్ని పెంచడం వంటివాటి ద్వారా అడ్వెంచరస్ వెకేషన్‌ని అత్యద్భుతంగా మలచుకోవచ్చని అంటున్నారు అడ్వంచరస్ క్లబ్స్ నిర్వాహకులు. ఒకప్పుడు విదేశాలకు మాత్రమే పరిమితమైన ఈ క్లబ్స్ చాలా వేగంగా భారతదేశంలోని ప్రముఖ నగరాలన్నిటికీ విస్తరించేశాయి.
ముందుగా వెళ్ళాలనుకుంటున్న ప్రాంతం గురించి మనకు మనంగా చాలా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఏయే సంస్థలు సహకరిస్తున్నాయో వాకబు చేసి, ఆయా సంస్థలను సంప్రదించి, అవి అందించే ప్యాకేజీలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. వీటన్నిటితోపాటుగా, తమ ఆరోగ్యం ఎంతవరకు ఆయా సాహసాలకు సహకరిస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. గతంలో ఆయా ప్రాంతాల్లో సంభవించిన ప్రమాదాలు, వాటి వివరాలు సేకరించడం ద్వారా మరింత అప్రమత్తంగా ఆ సాహస యాత్రల్ని పూర్తి చేయడానికి వీలు కలుగుతుంది. ప్రమాదంలోనే ఆనందం ఉంటుందని అనుకోవడం కూడా సబబు కాదు. మదిని ఉల్లాసభరితంగా మార్చే ఎన్నో పర్యాటక కేంద్రాలున్నాయి. అక్కడ ప్రమాదాలకు ఆస్కారం లేని సాహస క్రీడలు కొలువుదీరి ఉంటాయి. వాటి వైపు మొగ్గు చూపడం చాలావరకు మంచిది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు వ్యక్తిగత వాహనాల్ని వినియోగించాల్సి వస్తే, పూర్తి కండిషన్ తప్పనిసరి. అవసరమైన మందుల్ని 'కిట్'లో భద్రపరచుకుంటే అనారోగ్య సమస్యలు మీ సాహసయాత్రల్ని ఏమాత్ర డిస్టర్బ్ చెయ్యవు. ఇంకెందుకు ఆలస్యం, తగు జాగ్రత్తలు తీసుకుని సాహసయాత్రలకి ఈ సమ్మర్‌లో సిద్ధమైపోండి.