విదేశీ విద్యపట్ల ఆకర్షితులవుతున్నవారి సంఖ్య ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగింది. ఇంజనీరింగ్ పూర్తవగానే ముందుగా విదేశీ యూనివర్సిటీలవైపుకు దృష్టి సారిస్తోంది నేటి యువత. అదొక్కటే కాదు, మెడిసిన్ రంగంలోనూ ఇతర విభాగాల్లో కూడా విదేశీ విద్యా సంస్థలు భారతీయు యువతను ఆకర్షించడం జరుగుతోంది. సందట్లో సడేమియా ఫేక్ విద్యా సంస్థలు భారతీయ యువతను కొల్లగొడుతుండడం దురదృష్టకరం. ఫేక్ అడ్మిషన్ల కారణంగా విద్యార్థులు ఎయిర్‌పోర్టుల్లోనే అడ్డగింతకు గురవుతున్న సందర్భాలను చూస్తున్నాం. అన్నీ సక్రమంగానే ఉన్నా అమెరికా లాంటి దేశాల్లో చదువులు ఇటీవలి కాలంలో కష్టంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో విద్యాభ్యాసం పట్ల యువత ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. విదేశాలపై మోజు పెంచుకోవడం కంటే భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థలపై ఓ లుక్కేయాలన్న ఆలోచన పెరుగుతోంది నేటి యువతలో. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలన్న కోరిక ఇంకా చాలామందిలో అలాగే ఉంది. మరేం చేయాలి? విదేశాల్లో విద్యనభ్యసించాలనుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అని ఆలోచించినప్పుడు, ముందుగా విదేశీ విద్యాసంస్థలు అందిస్తున్న కోర్సులతోపాటుగా, ఆ సంస్థలకు అక్కడ ఉన్న గుర్తింపు గురించి పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం.
స్కాలర్ షిప్‌లు లభిస్తాయనో, చదువుకుంటూ చిన్నపాటి ఉద్యోగం ఏదన్నా చూసుకుని అక్కడ చదువుని కొనసాగించవచ్చుననో ఆలోచించడం అన్ని సందర్భాల్లోనూ మంచిది కాదు. పూర్తిస్థాయిలో ఆర్థిక వనరుల్ని చూసుకోగలిగినప్పుడే విదేశీ విద్యపై మమకారం పెంచుకోవడం మంచిది. అలాగే అక్కడి చట్టాల గురించి పూర్తి అవగాహన సంపాదించుకోవడం తప్పనిసరి. వీలైనంతవరకు తెలిసినవారి ద్వారా ఆయా విద్యాసంస్థల స్థితిగతుల్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్ కోసం ప్రయత్నించడం మంచిదంటారు నిపుణులు. వీటన్నిటితోపాటుగా వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించి 'కౌన్సిలింగ్' అందించే కేంద్రాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. విదేశాల్లో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలి? ఇతరులతో అక్కడ ఎలా మాట్లాడాలి? వంటివాటిపై ఈ కౌన్సిలింగ్ కేంద్రాలు అవగాహన కల్పిస్తాయి. అక్కడికి వెళ్ళి వచ్చినవారి సలహాలు తీసుకోవడం అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వనరులు పుష్కలంగా వుండి, అక్కడి యూనివర్సిటీల్లో చేరడం అన్ని విధాలా శ్రేయస్కరమని భావించినప్పుడు ఇక ఆలోచించాల్సిన పనిలేదు. ఇంకో వైపున సోషల్ మీడియా ద్వారా మీ వ్యవహార శైలిని కూడా కొన్ని దేశాలు, యూనివర్సిటీలు పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఈ విషయంలో కూడా అప్రమత్తంగా ఉంటే మేలు.