చమత్కారం - భమిడిపాటిఫణి బాబు

chamatkaaram

మా చిన్నప్పుడు ఇళ్ళల్లో పుస్తకాలున్న చోట "చెద" అని ఒకటి పట్టేది. ఏవర్షాలకైనా తేమ ఎక్కువైతే,ముందుగా ఈ చెదపురుగులు పుస్తకాల్ని ఎటాక్ చేసేవి. పైగా తెలిసేది కాదుకూడానూ. ఏదో వెదకడానికి ఏ పుస్తకాల ర్యాక్కు దగ్గరో చూసేటప్పటికి తెలిసేది- అడుగు అర అంతా చెదపట్టేసిందని. అదేం కర్మమో కానీ, చదువుకునే క్లాసు పుస్తకాలకి పట్టేది కాదు! కనీసం ఆ కారణం చేతైనా క్లాసుపుస్తకాలు రోజూ బట్టీపట్టే గొడవొదిలేది. అబ్బే మనకంత అదృష్టం కూడానా? అలా చెద పట్టిన పాతపుస్తకాలూ, న్యూసుపేపర్లూ ఎండలో పడేసి, salvage చేయకలిగినవేవో చేసేసి, ఎక్కదైతే చెదపట్టేదో, అక్కడంతా, కిరసనాయిలు గుడ్డలో ముంచి, ఆ గుడ్డతో శుభ్రపరిచేసి తిరిగి పుస్తకాలూ, ఏమైనా మిగిలితే ఆ పేపర్లూ మళ్ళీ అక్కడ "బొత్తి" గా పెట్టేయడం. ఆరోజుల్లో చాలాభాగం పెంకుటిళ్ళే కాబట్టి, భూమిలోని తేమ కూడా తోడై, ఏ గోడమూలలోంచో మొదలై గోడమీదుగా ఇల్లంతా పాకేసేవి ఈ చెదపురుగులుకూడా. ఆరోజుల్లో "చెద" పట్టని మధ్యతరగతి ఇల్లుండేదనుకోను. పెద్దపెద్దవాళ్ళ సంగతి వేరనుకోండి. ఏదో ఆ కిరసనాయిలు గుడ్డతో తుడిచేస్తే మిగిలిన పురుగులు- బొద్దింకలూ, నల్లులూ వగైరాలుకూడా, ఎవరిదారిన అవి పడుండేవి. ఆరోజుల్లో మరీ తెలివిమీరలేదు అవికూడా, ఏదో చెప్పిన మాట వినేవి !

నగర జీవితాలకి వచ్చేటప్పటికి ఆ చెదపురుగులు కూడా urbanization కి తట్టుకోలేక, మనవైపే ఉండిపోయాయి!    తరవాత్తర్వాత నగరాలకొచ్చేటప్పటికి చెదల మాటెలా ఉన్నా బొద్దింకల గొడవ ఎక్కువైపోయింది.పైగా వాటిని సరైన సమయంలో అంటే చిన్నగా ఉన్నప్పుడే control చేయకపోతే, అవిపెరిగి పెద్దయి గరుడ పక్షుల్లా ఎగురుతాయికూడానూ.ఎవరైనా ఇంటికొచ్చేసరికి, ఇవి బయటకి వచ్చేసి, మన "పరువు" వీధినపెట్టేసేవి.అదేదో "ఫ్లిట్" అనేదుండేది. ఓ డబ్బా, దానికో పంపూ, ఆ డబ్బాలో కిరసనాయిలూ, బొద్దింకలమందూ కలిపి ఇల్లంతా ఆ పంపుతో కొట్టుకోడం. మనం ఇంటిని శుభ్రంగా ఉంచితే సరిపోదు, ఇంకో ఎపార్టుమెంటులో వాళ్ళు, ఏ క్లీనింగైనా చేస్తే, అక్కడుండే బొద్దింకలన్నీ మనింట్లోకి వచ్చేసేవి. ఇదో గొడవా!అదేదో మార్కెట్ లోకి "లక్ష్మణ రేఖ" లో ఏవో వచ్చేవి. రాత్రి పడుక్కునేముందు దానితో ముగ్గులు పెట్టేస్తే, ప్రొద్దుటికి ఎక్కడలేని బొద్దింకలూ చచ్చిపడుండేవి, కొన్నైతే గిలగిలా కొట్టుకుంటూ ఉండేవి. ఇంటిముందు ముగ్గు వేసినా వేయకపోయినా "లక్ష్మణరేఖ" ముగ్గులు మాత్రం తప్పేవి కావు ! ఆ స్టిక్ ఖరీదుకూడా, మరీ ఎక్కువ కాకుండా, ఏదో మనకొచ్చే జీతంలో కొనగలిగేదిగానే ఉండేది. వీడికొచ్చే జీతానికి, అంతకంటే ఎక్కువ ఖర్చుపెడతాడూ, అనేసికుని ఆ బొద్దింకలు కూడా మనతో సహకరించి ప్రాణ త్యాగం చేసేవి.

మనం ఉండే ప్రదేశాలనిబట్టికూడా, ఈ నివారణోపాయాలు ఉపయోగిస్తూంటాయి. ఏ మధ్య తరగతి “ ఇలాకా” లోనైనా అయితే, “ లక్ష్మణ రేఖ” తో పనికానిచ్చేసికోవచ్చు. అదే ఏ “ పోష్ ఏరియా “ కో వెళ్తే, ఈ లక్ష్మణ రేఖలూ, శతృఘ్నరేఖలూ ఉపయోగించవు. ఎంత చెట్టుకంత గాలన్నట్టు,  మనం ఉండే ప్రదేశాలనిబట్టే పరిస్థితులు కూడా మారుతూంటాయి.    కూరలు ఖరీదు, బట్టల ఇస్త్రీ ఖరీదు, అన్నీ ఖరీదే. ఇంక బొద్దింకలు మాత్రం తక్కువ తిన్నాయా, అవికూడా "లక్ష్మణరేఖ", ముగ్గు లకి లొంగడం మానేశాయి.అప్పటికీ మా ఇంటావిడ, క్రమం తప్పకుండగా ప్రతీరోజూ కిచెన్ ప్లాట్ఫారమంతా ముగ్గులు గీసేసేది. పైగా వాటికో డిజైనోటీ.. బొద్దింకలు ఈవిడమాటవినడం మానేసి, యథారాజ్యంగా తిరగడం మొదలెట్టేశాయి.పోనీ మా ఇంటావిడేమైనా ఇల్లు శుభ్రంగా ఉంచదనడానికీ లేదు. రోజంతా ఫినాయిలు గుడ్డా, చీపురూ తోనే ఉంటుంది. తుడిచిందే తుడవడం. అయినా ఈ బొద్దింకలుమాత్రం వదలవు.ఈమధ్యన Pest Control  అని ఒకటి మొదలెట్టారు. వాళ్ళకి ఫోనుచేసి ఉన్న ఇంటికి ఎంతవుతుందో అడిగి పనిచేయించుకోడం.వాడొచ్చి అదేదో herbal దిట, ఆ పేస్టు ఇంట్లో చాలాచోట్ల కార్నర్స్ లో అద్దేస్తాడు..అదేమిట్రా, ఫలానా చోట పెట్టలేదూ అని అడిగితే, మీరేమీ వర్రీ అవకండీ, బొద్దింకలన్నీ ఓ వారంరోజుల్లో వాహ్యాళికి ఈ మందుపెట్టిన చోటుకి వచ్చి చచ్చూరుకుంటాయీ,మళ్ళీ ఆరునెలలదాకా ఫరవాలేదూ అని ఓ assurance ఇచ్చి వెళ్తాడు ! ఈలోపులో ఒక్క బొద్దింక కనిపించినా సరే, ఫోను చేయండీ ఊరికే మందెడతామూ అని ఓ ఆరువందలు పట్టికెళ్తాడు.

ఈ మందుతో దోమలు పోవుట, అలాగే నల్లులకీ, బల్లులకీ ఇంకో మందు వాడాలిట. ఏమిటో, మనరోగాలకి రకరకాలైన స్పెషలిస్టుల్లాగ ఈ పురుగులక్కూడా రకరకాల మందులు...

సర్వేజనా సుఖినోభవంతూ…..

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు