చిదిమేస్తోన్న 'బేకార్‌ బెట్టింగ్‌' - ..

betting is so dangerous

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పదో సీజన్‌ వచ్చింది. మ్యాచ్‌లు అదిరిపోతున్నాయ్‌. అరరె, గెలిచే మ్యాచ్‌ ఓడిపోతున్నారే! బౌండరీ లైన్‌ దగ్గర బంతిని భలేగా ఒడిసిపట్టాడే! అర్థ సెంచరీ కొడతాడనుకున్న ఆటగాడు, అనూహ్యంగా ఔటయ్యాడే! చేతిలో పడ్డ బంతిని వదిలేశాడే! ఇలాంటి ఆశ్చర్యాలకు కొదవే ఉండదు. ఆట అన్నాక అందులో అన్నీ ఉంటాయి. అద్భుతాలూ ఉంటాయి, చిత్ర విచిత్రాలు కూడా ఉంటాయి. అలాగే మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు కూడా ఉంటాయి. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆధారాలు ఇప్పటికే బయటపడటంతో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కి 'మకిలి' అంటుకుంది. దాన్ని తొలగించేందుకు నిర్వాహకులు తంటాలు పడుతూనే ఉన్నారు. ఇంకో వైపున ఫిక్సింగ్‌ వెనుక బెట్టింగ్‌ మాఫియా పది తలల రాక్షసుడిలా కనిపిస్తోంది. ఈ బెట్టింగ్‌ మాఫియాకి ప్రధానంగా యువత బలైపోతోంది. సామాన్యుల జీవితాలు చితికిపోతున్నాయి బెట్టింగ్‌ మాఫియా వల్ల. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ పోటీలకు ముందు నుంచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బెట్టింగ్‌ అందరికీ అందుబాటులోకొచ్చేసింది. ప్రధాన నగరాలే కాకుండా, చిన్న చిన్న గ్రామాలకూ ఈ బెట్టింగ్‌ విస్తరించింది. కేవలం ఓ మొబైల్‌ ఫోన్‌ ద్వారానే బెట్టింగ్‌ సామ్రాజ్యంలోకి ఎంటర్‌ అయిపోవచ్చనేంతలా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. బెట్టింగ్‌ మాయలో పడొద్దని పోలీసులు, నిపుణులు హెచ్చరిస్తున్నా ఆ మాఫియా పడగ నీడ కిందకి చాలా తేలిగ్గా వెళ్ళిపోతోంది యువతరం. 

గతంలో కొన్ని ఘటనలు బెట్టింగ్‌ మాఫియా వైపరీత్యాల్ని బయటపెట్టాయి. బెట్టింగ్‌ మాఫియా చేతికి చిక్కి ఎంతోమంది విగత జీవుల్లా తేలారు. హత్యలు, ఆత్మహత్యలు లెక్కలేనన్ని జరిగాయి. ఈ ఉదంతాల్ని మీడియాలో చూస్తున్నాసరే, బెట్టింగ్‌ అంటే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుగా యువత ఈ వికృత క్రీడవైపుకు మొగ్గు చూపుతుండడం శోచనీయం. ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్‌ మాయలో చిక్కి విలవిల్లాడుతుండడంతో, వారిని అందులోంచి బయటకు లాగాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. తమ పిల్లలు ఏం చేస్తున్నారనేదానిపై ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం అనుమానం వచ్చినాసరే, వారిని ప్రేమతో అక్కున చేర్చుకుని, పరిస్థితుల్ని ఆరా తీస్తే, అప్పటికే ఆర్థిక నష్టం సంభవించినా తమ పిల్లల్ని కాపాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అలాగే యువత కూడా కెరీర్‌ మీద ఫోకస్‌ పెట్టి, ఇలాంటి బెట్టింగ్‌ ప్రక్రియలకు దూరంగా ఉండాలి. బెట్టింగ్‌ అంటే జూదమనే భావన పెంపొందించుకోవడం తప్పనిసరి. మన స్నేహితులెలాంటివారన్నదానిపైనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుందంటారు పెద్దలు. కాబట్టి స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితులు చేస్తున్న చెడుపనులపైనా అప్రమత్తంగా ఉండడం అవసరం. ఆటని ఎంజాయ్‌ చేయడం తప్పు లేదు కానీ, ఆ ఆట వెనుక దాగి ఉన్న బెట్టింగ్‌ అనే నరకంలోకి మాత్రం దిగకూడదు. బేకార్‌ బెట్టింగ్‌తో జర జాగ్రత్త.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు