ఇది వరకటి రోజుల్లో పిల్లాడో పిల్లదో చదువు సందర్భంలోనో, ఉద్యోగసందర్భం లోనో, ఎక్కడో దూర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు, వీళ్ళెళ్ళిన ఊళ్ళల్లో, వాళ్ళకి తెలిసిన ఏ చుట్టానిదో, స్నేహితుడిదో ఎడ్రసో, ఫోన్ నెంబరో సంపాదించి, వాళ్ళకి ఉత్తరం వ్రాసో, ఫోను చేసో చెప్పేవారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే, ఏదో ఒకళ్ళైనా తెలిసినవారుంటే మంచిదీ అని. అంతేకానీ, వీళ్ళ పిల్లలకి ఆ అవతలివాళ్ళేదో ముద్దచేసి భోజనం పెట్టాలనీ, బ్రష్షుతో పళ్ళు తోమాలనీ, ఒళ్ళు తోమి స్నానం చేయించాలనీ కాదు! ఎప్పుడెలాటి అవసరం వస్తుందో చెప్పలేము కదా, ఒక్కొప్పుడు ఇంటినుండి వచ్చే డబ్బు ఆలశ్యం అవొచ్చు ( ఆరోజుల్లో మరి డబ్బులు ఎం.ఓ. ద్వారానే కదా), ఏ వంట్లోనో బాగోపోవచ్చు, ఏదైనా కావొచ్చు. తెలిసినవాళ్ళుంటే నష్టం ఏమీలేదు. అదేకాకుండా, తెలిసినవారో చుట్టమో అని ప్రతీవారి గురించీ చెప్పేవారు కాదు. ఈ రెండు కుటుంబాల మధ్యా ఉండే స్నేహమూ, చనువూ మాత్రమే ఇలాటి వాటికి foundation.
తెలిసినవారొకరైనా ఉన్నారులే అని ఆ పిల్లా/పిల్లాడూ, ఫరవాలేదూ తెలిసినవారున్నారూ అని ఇక్కడ తల్లితండ్రులూ ధైర్యంగా ఉండేవారు. ఉన్నారుకదా అని ఈ పిల్లలూ ప్రతీవారం వెళ్ళి ఆ తెలిసినవాళ్ళ నెత్తిమీద కూర్చునేవారు కాదు.ఎవరి సంస్కారం వాళ్ళకుండేది. అది ఆనాటి పరిస్థితి. స్నేహాలకీ, అనుబంధాలకీ ఇంకా భూమ్మీద నూకలున్న రోజులు! ఇప్పుడో, అంతా consumerism & materialstic జనాలు తెలివి మీరేరు కదా! అవతలివాడివలన మనకేమైనా ఉపయోగం ఉందా, లేక మన అమ్మా నాన్నల్లాగే వీళ్ళ సోది కూడా వినాలా అనే అనుకుంటారు. అమ్మాయైతే పెళ్ళయ్యేదాకానూ, అబ్బాయైతే చదువుకున్నన్ని రోజులూ , పోన్లెద్దూ ఏదో అవసరానికైనా ఉపయోగపడతారూ అనో, లేక తల్లితండ్రులమీద గౌరవం చేతనో వినేవారు. చదువుల హడావిడిలోనో, కొత్త స్నేహాలవలనో, కొత్తగా వచ్చిన ఫ్రీడం వలనో, వాళ్ళ క్షేమసమాచారాలు తెలుపలేనప్పుడు, దూరం లో ఉన్న తల్లితండ్రులకి ఈ స్నేహితులూ, చుట్టాలే దిక్కు. ఓ ఉత్తరం వ్రాసో, ఫోను చేసో " ఓసారి హాస్టల్ కి వెళ్ళి మా అబ్బాయి/అమ్మాయి ఎలా ఉన్నారో" చూసిరమ్మనేవారు.
పిల్లలు పరాయి రాష్ట్రాల్లో చదువు నిమిత్తమో, ఉద్యోగరీత్యానో ఉండడం సాధారణమయిన ఈరోజుల్లో, వాళ్ళ్ ఏ జన్మదినసందర్భంలోనో, ఇంకోదానికో ఏ కేక్కో ఏదో పంపాలంటే ఈరోజుల్లో అయితే online deliveries ఉన్నాయి కానీ, ఇదివరకటి రోజుల్లో, ఈ స్నేహితులో, చుట్టాలో మాత్రమే మన rescue కి వచ్చేవారు. కానీ దురదృష్టవశాత్తూ అలాటివన్నీ పాత చింతకాయ పచ్చడైపోయాయి.These may be small things, but they matter a lot.
మరి ఇప్పుడో, ఇంకా పాతపధ్ధతుల్నే పట్టుకుని వేళ్ళాడే తల్లితండ్రులున్నారు. కానీ వచ్చిన గొడవంతా పిల్లలతోనే. అందరూ అలాటివారని కాదు. ఇప్పటికీ, కొడుకు ఏదో దూరప్రదేశానికి ఉద్యోగానికి వెళ్తుంటే, ఆ వెర్రితల్లి, ఏదో ఆ ఊళ్ళో ఉండే ఓ చుట్టానికి ఫోను చేసి, మావాడు మీ ఊళ్ళో ఉద్యోగంలో చేరాడూ, వాడి నెంబరు ఫలానా, ఏదైనా అవసరం వస్తే నువ్వున్నావని చెప్పొచ్చా, అని అడిగే వాళ్ళూ ఉన్నారు. ఎందుకంటే ఈ చుట్టరికం ఫిజికల్ ది, అంతర్జాలానిది కాదు. ఏదో ఫోన్నెంబరిచ్చింది కదా అని, ఓసారి ఫోను చేస్తాడీ చుట్టం.
ఆ పిల్లాడు ఓసారి తిరిగి ఫోను చెయ్యొచ్చుకదా. చేయలేదూ అంటే, మనతో అంత సంబంధబాంధవ్యాలు పెంచుకోడం ఇష్టం లేకే కదా! అంత అవసరం లేనివాడితో అంతలా రాసుకు పూసుకు తిరగడం ఎందుకూ అంటుంది, ఇంటి ఇల్లాలు ! ఇప్పటి రోజుల్లో ముందర చూసేది వీడు మనకి Facebook లో ఫ్రెండా, Twitter లో ఫ్రెండా, లేక Buzz లో ఫ్రెండా అని చూసుకుంటారు తప్ప, ఏదో అమ్మా నాన్నా చెప్పారూ, ఓసారి ఫోనుచేస్తే పోలా అని మాత్రం అలోచించరు. ఇదంతా అంతర్జాల మహిమ.ఇంటిపక్కనున్నవాడితోనే పరిచయం లేని ఈ రోజుల్లో, ఎక్కడో ఊరికి ఆ మూలున్నవాళ్ళతో స్నేహం చేసే తీరికెక్కడిది? ప్రతీ మనిషికీ ఇంకో మనిషి అవసరం ఉంటుంది, అదీ ఏదో తెలిసినవాడైతే ఇంకా మంచిదికదా. మళ్ళీ కొత్తగా introduction అవసరం ఉండదు.
ఇంకో రకం వాళ్ళని చూశాను- ఏదో తిరగడానికి ఏదో ఊరు వెళ్తారు, అక్కడేమో వీళ్ళ చుట్టాలెవరో ఉంటారు. కొడుకు దగ్గరకో, కూతురు దగ్గరకో వెళ్ళినప్పుడు, అడుగుతారు, ఫలానా మన చుట్టాలున్నార్రా ఓసారి తీసికెళ్ళూ అని. ఏదో చుట్టపు చూపుగా వచ్చిన తల్లితండ్రుల్ని disappoint చేయడం ఎందుకూ అనుకుని, ముక్కుతూనో, మూలుగుతూనో, మొత్తానికి మొక్కుబడిగా వాళ్ళింటికి తీసికెళ్తాడు. మళ్ళీ తుపాగ్గుండుకి కూడా దొరకడు.For the simple reason ఈ చుట్టం వల్ల ఏగాణీ " ఉపయోగం" లేదు....
బహుశా ఈ కారణాలవలనే ఏమో ఈరోజుల్లో మాన్వ సంబంధాలు కొండెక్కిపోయాయి… ఈరోజుల్లో ఉన్నఊళ్ళోనే ఉద్యోగాలు దొరకాలంటే మాటలు కాదు. పైగా ఉన్న ఊళ్ళోనే ఉద్యోగమంటే, కొత్తగా వచ్చిన కోడలికి ఒళ్ళుమంటాయె. ఒకే ఇంట్లో ఉండడానికే ఇష్ట పడక, ఆఫీసుకి దగ్గరని ఊళ్ళోనే ఇంకో ప్రాంతానికి మకాం మార్చేసిన కొత్త జంటలని ఎంతమందిని చూడ్డంలేదూ ?
ఈ చుట్టాలూ, స్నేహాలూ, పాతకాలపు అనుబంధాలూ అంతా just thrash ! Life goes on and on …
సర్వే జనా సుఖినోభవంతూ…