పర్యాటకం - కర్రా నాగలక్ష్మి

paryatakam

 ఉత్తరాఖండ్ 

కిందటి వారంలో మీరు చదివిన కంఖల్ లో మరికొన్ని విశేషాలు అక్కడి బోర్డుమీద రాసినవి మీకు తెలియచేస్తాను.

దక్షుడి పరిపాలనలో వున్న దక్షవాటికగా పలువబడిన కంఖల్  లో సతీదేవి జన్మించింది , పరమశివుని యిష్టపడిన  ఆమె శివుని అనుగ్రహానికై యిదే ప్రదేశం లో తపస్సుచేసి అతని మనసుని గెలుచుకొని దక్షుని అనుమతిని కోరగా దక్షుడు శివుని అల్లునిగా చేసుకొనేందుకు నిరాకరిస్తాడు .

అప్పుడు శివుడు సతీదేవిని పంచభూతాల సాక్షిగా యిదే ప్రదేశంలో పాణిగ్రహణం చేసి , పరిణయమాడేడు , అప్పటినుంచి పెళ్లి చేసుకోవడం అనే సంస్కారం మొదలయిందట , సతీదేవి ప్రాణత్యాగం చేసిన ప్రదేశం కూడా యిదే .

సరే యిక మిగతా వివరాలలోకి వెళితే ---

ప్రస్తుత యాత్రీకులు సందర్శించు కునే మరో ప్రదేశం పతంజలి ఆశ్రమం . యోగగురు రామదేవ్ బాబా గారిచే నిర్మింపబడి నిర్వహింపబడుతున్న ఆశ్రమం . గేటులోకి ప్రవేశించగానే రంగురంగుల పువ్వులతో నిండిన వుద్యానవనం కనువిందు చేస్తుంది . కొన్ని వందల యెకరాలలో నిర్మింపబడ్డ ఆశ్రమం , వుద్యానవనం లో యెత్తైన పీఠం మీద పతంజలి ముని విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తుంది .

లోపల యోగమందిరం , ఆయుర్వేద కాలేజి , ఆయుర్వేద హాస్పిటల్ , పతంజలి వారి సర్వ ఉత్పాదనలు విక్రయించే దుకాణమే కాక ఆరోగ్యవంతమైన ఆహారపదార్థాలను అందించే భోజనశాల కూడా వుంది . ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి కనీసం మూడు గంటలసమయం పడుతుంది . 

మాయాదేవి మందిరం---

హరి కీ పౌడీ కి తూర్పున వుంది మాయాదేవి మందిరం . ఆదిశక్తి రూపాలలో మాయాదేవి రూపం ఒకటని , యీ దేవి పేరు మీదుగా యీ ప్రాంతం మాయాపురిగా పిలువబడేదని స్థానికులకధనం . దక్షుని యజ్ఞంలో అవమానింపబడ్డ సతీదేవి యజ్ఞకుండంలో పడి , సొరంగ మార్గం ద్వారా యీ ప్రదేశానికి వచ్చి ప్రాణత్యాగం చేసుకున్న ప్రదేశం కూడా యిదే .     హరిద్వార్లో వున్న మూడు సిధ్ద పీఠాలలో యిది వొకటి . సిధ్ద పీఠం అంటే యిక్కడ వున్న దేవి భక్తులు కోరినకోర్కెలు తీర్చేదేవి అని అర్ధం . 

ఇది శక్తి పీఠం కూడా , యిక్కడ సతీదేవి యొక్క నాభి భాగం మరియు హృదయ భాగాలు పడ్డ ప్రదేశం . ఆ ప్రదేశంలో అమ్మవారి విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులవారు ప్రతిష్టించేరు . ఈ మందిరాన్ని పదవ శతాబ్దం లో అప్పటి రాజులు నిర్మించేరు . అదే మందిరాన్ని అలాగే వుంచి చుట్టూరా కొత్త మందిర నిర్మాణం జరిగింది .

ఈ మందిరం లో మధ్యన మూడు తలలు నాలుగు చేతులతో మాయాదేవి ఓ పక్క లక్ష్మీదేవి మరోవైపు కమాక్షిదేవి కొలువై వుంటారు . 

ఈ దేవిని దర్శించుకుంటేనే హరిద్వార్ యాత్ర పూర్తయినట్లు అర్దం అని స్థానిక పూజారులు యాత్రీకులకు చెప్తూవుంటారు . హరి కీ పౌడి నుంచి సులభంగా యీ మందిరం చేరుకోవచ్చు .

బిల్వ తీర్థం ---

మాయాదేవి దర్శనం తరువాత మేం మానసాదేవి మందిరానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం . మానసాదేవి దేవి మందిరం పర్వతం పైన వుంది అక్కడకు చేరడానికి నడకదారి , రోప్ వేవున్నాయి . 

శివాలిక్ పర్వతశ్రేణులు లలో వున్న బిల్వ పర్వతం మీద వున్న మానసాదేవి మందిరం హరిద్వార్ సందర్శకులు తప్పక దర్శించుకునే ప్రదేశం . దీనినే బిల్వతీర్థం అని అంటారు. మాయా దేవి మందిరం నుంచి మానసాదేవి మందిరం పైకి వెళ్లడానికి రోప్ వే టికెట్స్ యిచ్చే ప్రదేశానికి వెళ్లి  మానసా దేవి మందిరానికి , ఛండీ దేవి మందిరానికి వెళ్లడానికి రోప్ వే టికెట్స్తీసుకున్నాం .

ఈ రోప్ వే సుమారు అరకిలోమీటరు దూరం , సుమారు 178 మీటర్ల యెత్తుకి చేరుస్తుంది . హరిద్వార్లో వున్న మూడు సిధ్ద పీఠాలలో యిది రెండవది . ఇక్కడ అమ్మవారికి తమ కోరికలువిన్నవించుకొని యెర్రదారం మందిరం లో వున్న చెట్టుకి కడతారు , కోరికలు తీరిన తరువాత తిరిగి వచ్చి ఆ దారాన్ని విప్పుతారు , అలాగే యిక్కడకు వచ్చే వారు యెర్ర రక్షను కట్టించుకుంటారు . ఆ రక్ష వారిని అన్ని చెడు శక్తులనుంచి కాపాడు తుందని నమ్మకం .

అమ్మవారికి కొబ్బరికాయ , పసుపు కుంకుమ యెర్ర వస్త్రం సమర్పించడం ఆనవాయితీ . చైత్ర నవరాత్రులు , దశరా నవరాత్రులు వుత్సవాలు నిర్వహిస్తారు . మనసా దేవి శివుని మానసం నుంచి వుద్భవించిన దేవి , యీమె వాసుకి ( నాగరాజు ) కి సహోదరి అని అంటారు . ఈమెని హరిద్వార్ వూరి అమ్మవారని , ఈమె హరిద్వార్ ని కాపాడుతూ వుంటుందని స్థానికులు చెప్తారు . చాలా మంది భక్తులు కాలినడకన యీ మందిరం చేరుకొని పూజాదులు నిర్వహిస్తూ వుంటారు . రోప్ వే మీద వెళ్లేటప్పుడు ఆ యెత్తనుంచి కిందన వున్న గంగానది , హరిద్వార్ నగరం చూడ ముచ్చటగా వుంటుంది . ఈ మందిరం ప్రతీ రోజూ ఉదయం యెనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి రెండు నుండి సాయంత్రం  అయిదు వరకు తెరచి వుంటుంది . మా నసా దేవి దర్శనం తరువాత మేం ఛండీ మందిరానికి ప్రయాణ మయేం . రోప్ వే టికెట్స్ తో పాటు ఛండీపర్వతం వరకు వెళ్లేందుకు టాక్సీ కి కూడా ముందుగా రుసుము  చెల్లించడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వపు వారి వాహనంలో మేము ఛండీ పర్వతం చేరుకున్నాం . 

శివాలిక్ పర్వతాలలో వున్న నీల పర్వతం పైన 1912 ప్రాంతాలలో కశ్మీరును పరిపాలించిన రాజులు యీ పర్వతం పైన ఛండీ మందిరాన్ని నిర్మించేరు . శివాలిక్ పర్వతాలలో వున్న యీ నీల పర్వతం పైన శక్తిమాత  శుంభు నిశుంభులను సంహరించేందుకు ఛండీ అవతారం యెత్తివారితో యుధ్దం చేసే సమయంలో యీ నీల పర్వతం మీద కాస్సేపు విశ్రమించి , తిరిగి వారితో యుధ్దం చేసి శుంభ నిశుంభులను సంహరించింది .  ఈ కథను నిజమేనని చెప్పేందుకుఋజువుగా నీల పర్వతానికి దగ్గరగా శుంభ నిశుంభ పర్వతాలు కూడా వున్నాయి . కొండపైన సంతోషిమాత , లక్ష్మీ , సరస్వతి , వినాయకుడు , ఆంజనేయుడు మొదలయిన విగ్రహాలువున్నాయి . రోప్ వే కి వెళ్లే దారిలో టీ ఫలహార శాలలు వున్నాయి . ఛండీ మందిరం హరిద్వార్ లో వున్న మూడో సిధ్ద పీఠం . హరిద్వార్ లో వున్న అయిదో తీర్థం కూడా యిదే . 

ఇవి కాక హరిద్వార్ లో యింకా యెన్నో పేరున్న చిన్న చిన్న ఆశ్రమాలు చాలా వున్నాయి . హరిద్వార్లో సమయం వున్న వారు సప్తఋషులు తపస్సు చేసుకున్న ప్రదేశం కూడా చూడొచ్చు.

హరిద్వార్ నుంచి ఋషికేశ్ వెళ్లే దారిలో రాజాజీ నేషనల్ పార్క్ కూడా చూడవలసినదే . ఇందులో చిరుతపులులు , యేనుగలు యితర చిన్నా పెద్దా జంతువులు వున్నాయి . ఈ దారిలో తరచు అడవి యేనుగలు తిరగడం , కొన్ని సార్లు ప్రయాణీకుల పై దాడి చెయ్యడం చేస్తూ వుంటాయి . 

హరిద్వార్  నుంచి ఋషికేశ్ వెళ్లేటప్పుడు రాజాజీ నేషనల్ పార్కు గుండా సాగుతుంది ప్రయాణం .

మళ్లా వారం ఋషికేశ్ గురించి చదువుదాం అంతవరకు శలవు . 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు