హిందువులు అందరి ఇళ్ళలోనూ పూజా మందిరంలోనో, దేవతా మూర్తుల ముందరో రోజూ దీపం వెలిగించడం మనం చూస్తున్నాము. కొంతమంది ఉదయము, కొంతమంది సాయంకాలము మరికొందరు రాత్రి పగలు దీపం ఉండేలా అఖండ దీపం వెలిగించి ఉంచడం మనకు తెలుసు . అంతేకాక,శుభకార్యములలోనూ, ప్రత్యేక పూజా సమయములందు, సామాజిక ఇతర కార్యక్రములు సభలు జరుగునపుడు ముందుగా దీపారాధన చేయుట మనము చూస్తున్నాము.
ఈ దీపం ఎందుకు వెలిగించాలి? కాంతి జ్ఞానానికి సంకేతం, చీకటి అజ్ఞాననికి సంకేతము. అజ్ఞానాన్ని పారద్రోలి చైతన్యాన్ని ప్రసరింప చేయడమే ఆదర్శముగా దీపాన్ని వెలిగిస్తాము. జ్ఞానము మన అందరిలో నిబిడీక్రుతమయిన సంపద. ఆ సంపదకు ప్రణమిల్లడమే దీపం వెలిగించుటలో ఉన్న ఆంతర్యం. మనకున్న జ్ఞాన సంపద చేత మనము చేయు పనులు మంచివయిననూ, చెడ్డవయిననూ భగవంతునికి తెలియుటకు సాక్షిగా దీపాన్ని వెలిగిస్తాము.
మనము జరిపించు కార్యములు సభలూ పూజలూ మొదలగు అన్నియూ విద్యుద్దీప కాంతులలో చేయుచున్నప్పుడు మరల మరో దీపం వెలిగించుట ఎందుకను సందేహము రావలెను గదా!. సనాతనముగా వచ్చు నూనె లేక నేతి దీపములు మన వాసనలకు అహంకారములకు ప్రతీకలు. దీపం వెలుగుచున్నప్పుడు అందులోని నూనె/నెయ్యి క్రమీణా తరిగిపోయి కొంతసేపు తరువాత
హరించుకు పోవును. అటులనే మన లోని రాగ ద్వేషాలుకూడా హరించునని చెప్పుటయే దీని భావము. నూనె/నేతి దీపం వెలుగునప్పుడు ఆ జ్వాల ఊర్ద్వముఖముగా ఉందును గదా! అటులనే మన జ్ఞానసంపద కూడా పైపైకి పెరగవలెనను సంకేతము కూడా ఇచ్చుచున్నది.
ఒక చిన్న దీపము మరికొన్ని వందల దిపములను వెలిగించగలదు. అటులనే మన జ్ఞానదీపము కూడా మరికొంత మందిని జ్ఞాన వంతులను చేయునని భావము. ఒక దీపము తో ఎన్ని దీపములు వెలిగించినను ఆ దీపము తరిగిపోదు అటులనే ఎంతమందిని విజ్ఞాన వంతులను చేసిననూ మన మేధా శక్తి తరిగిపోదు. మరియు అది మరింత ప్రజ్వరిల్లి నలు దిశలందు వెలుగులు నింపును.
మనలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించుకొని పునీతులము కావలెనను ఆదర్శమును అందరికీ తెలియజేయుటయే ఈ దీపారాధన ప్రాముఖ్యము భావము.