హరి కీ పౌడీ నుంచి ఋషికేశ్ వెళ్లేదారిలో సుమారు 5 కిలో మీటర్లు ప్రయాణంచేక కుడివైపుకి మళ్లి సుమారు ఓ కిలో మీటరు ప్రయాణించేక సప్తఋషి ఆశ్రమం చేరుకోవచ్చు . అసలు హరిద్వార్ నుంచి ఋషి కేశ్ రోడ్డు మీద యెన్నో ఆశ్రమాలు వున్నాయి , వీటి నిర్మాణాల వెనుక యెన్నో పురాణగాథలు , ఆధారాలు వున్నాయి . అలాంటి ఆశ్రమాలలో సప్తఋషి ఆశ్రమం ఒకటి . ఇక్కడ సప్తఋషులు తపస్సు చేసుకున్నారని పురాణకధలలో వుంది . కశ్యపుడు , వశిష్ఠుడు , అత్రి , విశ్వామితృడు , జమదగ్ని , భరద్వాజుడు , మరియు గౌతముడు యీ యేడుగురిని సప్తఋషులు అంటారు .
దీనిని సప్త సరోవర్ అని కూడా అంటూ వుంటారు . హరిద్వార్ లో దర్శించుకో దగ్గ మరో ప్రదేశం యిది
సప్తఋషుల తపస్సుకు భంగం కలగకుండా గంగామాత యేడు పాయలుగా విడిపోయి చాలా నిశ్శబ్దం గా ప్రవహిస్తూ వుంటుంది . మరికొందరి స్థానికుల ప్రకారం సప్తఋషులు తపస్సు చేసుకుంటూ వుంటే వారి శరీరం నుంచి ఉత్పన్న మయిన వేడి వల్ల అక్కడ ప్రవహిస్తున్న గంగ యెండి పోయిందని , యిప్పటికీ సప్తఋషులు యిక్కడ తపస్సు చేసుకుంటున్నారని అందుకే యీ ప్రాంతం లో గంగ యేడు పాయలు చీలిపోయి యేడు చిన్నచిన్న ద్వీపాలు యేర్పడ్డట్టుగా ప్రవహిస్తోంది . ఆ యేడు ద్వీపాలు సప్తఋషులు తపస్సు చేసుకుంటున్న ప్రదేశాలని , గంగకు యెంత యెక్కవ నీరు చేరినా ఆ ద్వీపాలు అలాగే వుంటాయని అంటారు .
ఈ ఆశ్రమంలో వేదపాఠశాల , వసతులు వున్నాయి .
హరిద్వార్ లోనూ రిషికేశ్ లోనూ వున్న ఆశ్రమాలలో చాలా మటికి వుచిత వసతి , భోజన సదుపాయాలు అందజేస్తున్నాయి . అన్ని ఆశ్రమాలకీ వెబ్ - సైట్స్ వున్నాయి వాటిద్వారా ముందుగా ఆ శ్రమాలలో రూములు బుక్ చేసుకోవచ్చు , అప్పటికప్పడు కావాలంటే యే ఆటో అతనికి మంచి ఆశ్రమం చూపించమని చెప్పినా అతను చూపిస్తాడు . చాలా ఆశ్రమాలు చాలా నీటుగా వుంటాయి .
రోడ్డుకి యిరువైపులా చాలా అందంగా తీర్చిదిద్దిన ఆశ్రమాలను దాటుకుంటూ మా కారు ఋషికేశ్ వైపు గా సాగింది .
మా కారు డ్రైవరు స్థానికుడు కావడం వల్ల యిన్నేళ్లుగా దాదాపు 20 సార్లు ఉత్తరాఖండ్ సందర్శించినా మేం చూడని ముఖ్యమయున ప్రదేశాలను యీసారి యీ డ్రైవరు చూపించేడు .
అలాంటిదే యీ ' త్రివేణి ఘాట్ ' . ఋషికేశ్ బస్టాండు నుంచి సుమారు మూడు నాలుగు కిలో మీటర్ల దూరంలో వుంది ' త్రివేణి ఘాట్ ' . రెండువైపులా తినుబండారాలు , నిత్యావసరవస్తువలు అమ్మే దుకాణాలు , యిత్తడి విగ్రహాలు అమ్మే దుకాణాల మధ్యనుంచి గంగ వొడ్డుకి చేరేం .
గంగ వొడ్డున పెద్ద గేటు లోకి ప్రవేశించేం . అక్కడ ముందుగా వృత్తాకారం లో యినుప కమ్మీ ల మధ్య వున్న ప్రదేశాన్ని శ్రీకృష్ణుని నిర్యాణ ప్రదేశం చేరుకున్నాం . ఓ పక్కగా గీత మందిరం వుంది పైన గీతోపదేశం బొమ్మ వున్నాయి , మరో పక్క శివ కోవెల వున్నాయి , కాస్త దూరంగా హిమాలయాలలో జరిగిన గంగావతరణ బొమ్మలు చాలా హృద్యంగా నిర్మించేరు .
ఇక్కడ గంగ , యమున , సరస్వతి నదులు సంగమించినట్లు పురాణ గాధ .
సప్త ఋషులు ప్రతీ రోజు త్రివేణి సంగమం ( అలహాబాదు ) లో స్నానం చేసి తిరిగి రావడం కష్టంగా వుందని తమ తపశ్శక్తి తో గంగ వున్న ప్రదేశం లో యమున , సరస్వతి నదులను ఆహ్వానించేరు , యీ సంగమంలో సప్తఋషులు స్నానమాచరించి తపస్సు చేసుకున్నారు . ఈ సంగమంలో ఒకసారి స్నానంచేస్తే సప్త జన్మలలోని పాప పరిహారం కాడమేకాక , వచ్చే సప్త జన్మలవరకు పాపం అంటదు అని అంటారు .
ఈ త్రివేణీ ఘాట్ శైవులకూ , వైష్ణవులకూ కూడా పుణ్యస్థలం .
ముందుగా శైవులకు యెందుక పవిత్ర స్థలమో తెలుసుకుందాం . హిమగిరి పుత్రి హైమవతిని వివాహ మాడేందుకు శివుని పరివారం యీ త్రివేణి ఘాట్ లో పూజలు నిర్వహించుకొని , శివుని పెండ్లికుమారుని గా యీ ప్రదేశంలో చేసి మగపెళ్లి వారు ప్రయాణమైన ప్రదేశం ట .
వైష్ణవుల నమ్మకం గురించి తెలుసు కుందాం .
విష్ణుమూర్తి బోయవాని బాణం దెబ్బ తగలగానే కృష్ణావతారం చాలించవలసిన సమయం ఆసన్నమైందని గుర్తించి యీ ఘాట్ కి వచ్చి యీ సంగమం లో స్నాన మాచరించి కృష్ణావతారంలో కురుక్షేత్ర సంగ్రామ సమయంలో చేసిన పాపాలనుండి విముక్తి పొంది అవతారం పరిసమాప్తి చేసిన ప్రదేశం కావడం వల్ల మరణించిన వారికి యిక్కడ పిండప్రదానం చెయ్యడం కూడా వుంది . తలపై నీళ్లు జల్లుకుందామనుకున్న నేను కాలు జారి నీళ్లల్లో పడి మునక వెయ్యడం కూడా భగవత్సంకల్పంగా భావించుకున్నాను .
ఆ తడి బట్టలతోనే మా ప్రయాణం ( బట్టలు మార్చుకొనే వీలు లేకపోవడం వల్ల ) ఋషి కేశ్ వైపు సాగింది .
గంగా నది వొడ్డున మా ప్రయాణం సాగుతోంది మా కీ ప్రయాణం లెక్కకు మించినదైనా మా అన్నా వదినలకు మొదటి మారు కావడం వల్ల యింతకు ముందు మేం యేయే ఆశ్రమాలలో వున్నామో , యెవరెవరితో వచ్చామో మొదలైన విశేషాలు వినిపిస్తూ రామ ఝూలా చేరేం .
ఋషి కేశ్ లో గంగ యివతల వొడ్డునుంచి అవతలి వొడ్డుకి చేరడానికి వుపయోగించే సస్పెన్షన్ వంతెన , మనం నడుస్తూ వుంటే వుయ్యాలలో వూగుతున్న అనుభూతినిస్తుంది . చిన్న వాహనాలను తప్ప కార్లు అంత కంటె పెద్ద వాహనాలను అనుమతించరు . ఈ వొడ్డునుంచి ఆ వొడ్డుకి వెళ్లేందుకు గవర్నమెంటు వారిచే నడపబడుతున్న బోటు సౌకర్యం కూడా వుంది . గంగకి అవతల వొడ్డున ' చోటీవాలా ' అనే సంస్థ ద్వారా నడుపబడుతున్న యెన్నో ఫలహార శాలలు వున్నాయి . మంచి భోజనం చెయ్యాలనుకునేవారు ఆ వొడ్డున వున్న ' చోటీవాలా ' లలో తినొచ్చు . అవతల వొడ్డున సర్గాశ్రమం , గీతా మందిరం వున్నాయి , గీతా మందిరం సాయంత్రం అయిదుకల్లా మూసివేస్తారు . అక్కడకి సుమారు రెండు మూడు కిలో మీటర్ల ప్రయాణం చేసి లక్మణ ఝూలా కి చేరుకున్నాం .
కారు పార్కింగ్ కి దగ్గరగా వున్న మందిరం లక్మణ మందిరం ముందు చాలా చిన్నదిగా వుండేది , ప్రస్తుతం దీనిని కూడా పాలరాతి పలకలు అవీ వేసి నిర్మాణం చేస్తున్నారు .
ఇది లక్మణుడు మేఘనాధుని సంహరించిన పాప పరిహారార్ధం తపస్సుచేసుకొని అవతారం చాలించి శేషునిగా గంగా ప్రవేశం చేసిన ప్రదేశం . ఇక్కడ లక్ష్మణుడు ధనుధ్దారిగా కాక తపస్సు చేసుకుంటున్నట్లుగా తలపైన శేషుని పడగలు వుంటాయి . ప్రాంగణం లో వున్న ఋద్రాక్ష వృక్షాన్ని కూడా దర్శించుకోవచ్చు . ఈ మందిరం పక్కనే లక్ష్మణ ఝూలా వుంటుంది . ఈ వంతెన లక్ష్మణ మందిర పక్కనే వుంది కాబట్టి దీనిని లక్ష్మణ ఝూలా అనే పేరు వచ్చింది . ఈ మందిరానికి యెదురుగా చాలా మందిరాలు వున్నాయి అందులో 21 విష్ణుమూర్తి అవతారాలకోవెల , వీటిలో హనుమంతుడు హయగ్రీవుడు జాంబవంతుడు మొదలయిన వారుకూడా విష్ణుమూర్తి అవతారాలు అని అంటారు . పారశ్ ( పాదరసం ) శివలింగం వున్న మందిరం , స్పటిక లింగం వున్న మందిరం కూడా చూడదగ్గవే .
ఈ ప్రదేశం లో మనకి చాలా మంది విదేశీయులు కనిపిస్తారు , వీరు యిక్కడ ఆశ్రమాలలో యోగ , ధ్యానం నేర్చుకోడానికి వస్తారు . చాలా మంది సాంప్రదాయ దుస్తులు ధరించి కనిపిస్తారు .
ఋషికేశ్ లో చాలా చోట్ల రాఫ్టింగ్ నిర్వహించే యేజెన్సీలు వున్నాయి . అడ్వంచర్ స్పోర్టస్ యిష్టపడే వారు యిది ట్రై చెయ్యొచ్చు . అక్కడ నుంచి మా ప్రయాణం దేవ ప్రయాగ వైపుగా సాగింది .
పై వారం దేవప్రయాగ వివరాలు చదువుదాం, అంతవరకు శలవు .