ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్‌ ఇండియా ఈజ్‌ బెస్ట్‌ - ..

east or west india is best

'అరేయ్‌, అమెరికాలో నీతోపాటు నాక్కూడా ఏదన్నా ప్లేస్‌మెంట్‌ ఉంటే చెప్పరా' అనో, 'ఆస్ట్రేలియా వెళుతున్నావు కదా, నన్ను మర్చిపోకు బ్రదర్‌' అనో ఇప్పటిదాకా సన్నిహితులతో చెబుతూ వచ్చాం. కానీ ఇకపై అలా చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు. పైపెచ్చు, అమెరికాలో సెటిలైపోయిన మనోళ్ళే తిరిగి మనల్ని 'ఇండియాలో పొజిషన్‌ బాగానే ఉందా? మేం వచ్చేయడానికి పరిస్థితులు అక్కడ అనుకూలంగా ఉన్నాయా?' అని అడిగేలా రోజులు మారిపోనున్నాయి. అమెరికాలో ట్రంప్‌ దెబ్బ మాత్రమే కాదు, ఆస్ట్రేలియాలో కూడా ఇండియన్స్‌కి దెబ్బ తగిలిది. పైకి చెప్పే మాట ఏదైనా విదేశాల్లో ఇప్పుడు భారతీయుల పట్ల 'చిన్నచూపు' కనిపిస్తోంది. ప్రపంచం కుగ్రామంగా మారిపోయిందని చెప్పుకునే రోజులు పోయి, ఇది నాది, అది నీదని గిరి గీసుకునేలా ఆయా దేశాలు ఇతరుల పట్ల వ్యవహరించేస్తుండడం శోచనీయం. ఇలాంటి పరిస్థితిని ఇప్పటిదాకా ఎవరూ ఊహించలేదు. అంతకు మించిన గొప్ప అవకాశాలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో లభిస్తాయని మాత్రమే మనం అనుకున్నాం. కాలమెప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఈస్ట్‌ ఆర్‌ వెస్ట్‌, ఇండియా ఈజ్‌ బెస్ట్‌ అని మన భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా ఇదే మాట అనుకుంటున్నారు.

మనది అనుకున్నాం, మనది కాకుండా పోతోందనే భావన అమెరికాలోని భారతీయులందరికీ కలుగుతోంది. ట్రావెల్‌ బ్యాన్‌, వీసాల కోత వంటి చర్యల ద్వారా ట్రంప్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టినప్పటికీ అవేవీ తమను ఇబ్బంది పెట్టబోవని ముందుగా మన భారతీయులు అనుకున్నారు. పైపెచ్చు, ట్రంప్‌ తీసుకునే నిర్ణయాలు ఏవీ భారతీయులకు వ్యతిరేకంగా ఉండవని కూడా భావించారు. కానీ వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. ఈ దేశం మనది కాదేమో, ఇన్నాళ్ళుగా స్థిరపడ్డ ఈ దేశం పరాయిదయిపోతోందనే భావన పెరిగిపోయింది. మన తెలుగు వ్యక్తి ఒకరు ఇటీవల జాత్యహంకార దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా ఇంతలా అక్కడి భారతీయులు భీతిల్లలేదు. కానీ రోజురోజుకీ అక్కడి వాతావరణం మనకు వ్యతిరేకంగా మారిపోతోంది. ఈ తరుణంలో ఏం చేయగలం? అన్న చర్చ భారతీయుల్లో జరుగుతోంది. అందుకే భారతీయులు అమెరికా నుంచి భారత్‌కి తిరుగు ప్రయాణమయ్యేందుకే మొగ్గుచూపుతున్నారట. కంపెనీల స్థాపన, వివిధ రంగాల్లో పెట్టుబడులు వంటి అంశాల గురించి విదేశాల్లో స్థిరపడిపోయిన భారతీయులు, ఇక్కడి తమ సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. భారతదేశంలోనూ వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఎన్నారై పెట్టుబడిదారులకు రెడ్‌ కార్పెట్‌ వేస్తుండడం శుభపరిణామం. మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఈ విషయంలో మిగతా రాష్ట్రాలకన్నా ముందుండడం ఇంకా అభినందనీయం. 

మరిన్ని వ్యాసాలు