ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో.... - భమిడిపాటి ఫణిబాబు

Evaraina Emanna Anukuntaremo.....

సామాన్యంగా  చాలామంది, చూసిన వాళ్ళేమనుకుంటారో,  అనే భావనతోనే బ్రతుకుబండిని లాగించేస్తూంటారు. మనకి మనం ఏమనుకుంటున్నామూ కంటే, అవతలివాళ్ళు ఏమనుకుంటారో అనే బాధే ఎక్కువగా కనిపిస్తూంటుంది.ఉదాహరణకి ,ఇదివరకటిరోజుల్లో స్కూటర్లూ అవీ ప్రాచుర్యం చెందుతూన్నరోజుల్లో అన్నమాట, కొత్తగావచ్చాయీ మార్కెట్ లోకీ, మన దగ్గర లేకపోతే ఎలాగా అనేసికుని, ప్రతీవాడూ ఓ స్కూటరు బుక్ చేసేసికునేవాడు. స్కూటరు బుక్ చేసికోవడం ఇప్పటివారికి చిత్రంగా అనిపించొచ్చు, కానీ పూర్వపురోజుల్లో పరిస్థితి అలాగే ఉండేది మరి.

బుక్ చేసిన ఓ ఏడాదికో, ఏణ్ణర్ధానికో ఆ కంపెనీవాడిదగ్గరనుంచి ఓ సమాచారం వచ్చేది, ఈలోపులో దానికి కావలిసిన సొమ్ము ఎవడిదగ్గరో అప్పోసొప్పో చేసి రెడీ చేసికునేవారు, మరి ఆరోజుల్లో బ్యాంకులూ ఋణాలూ ఉండేవి కావుగా. పైగా వాయిదాపధ్ధతులుకూడా అంతగా ఉండేవికావు. ఏదో మొత్తానికి ఓ స్కూటరుకొన్నాడనుకుందాం, ఇంక తను నివసించే ప్రాంతంలో అందరూ చెప్పుకునేవారు, ఫలానా ఆయన స్కూటరు కొనుక్కున్నాడూ అని.  ఇంక ఆ స్కూటరుకి ఓ టార్పొలీన్ కవరూ, దాన్ని ఇంట్లోకి తీసికెళ్ళడానికి, గేటు దగ్గర ఓ చెక్కా ఉండేవి. ఈ గోల భరించలేక, కాలక్రమేణా సిమెంటుతో ఓ ర్యాంపు లాటిది కట్టించేసికునేవారు. ఇంట్లో శుభ్రతగురించి అంత పట్టింపు లేకపోయినా, ఈ స్కూటరుకి మాత్రం ప్రతీరోజూ  ఓ పసుప్పచ్చగుడ్డతో తుడవడం మాత్రం మర్చిపోయేవారుకాదు.

గేటుబయట ర్యాంపులాటిదో, చెక్కలాటిదో ఉంటేచాలు, అందరికీ తెలిసేది ఈ ఇంట్లో ఓ స్కూటరుందోచ్ అని. మొదటికొన్నిరోజులూ దానివాడకం ఆ ఇంటిపెద్దకి మాత్రమే పరిమితం, ఆఫీసుకి కూడా తాను ఒక్కడే వెళ్ళేవాడు. ఈలోపులో ఆ కాలొనీలోనే ఉంటూ, ఈయనపనిచేసే ఆఫీసులోనే పనిచేసే ఇంకొకాయనకి కూడా  స్కూటరుమీద వెళ్ళే సదుపాయం కల్పిస్తాడు. మళ్ళీ ఇందులో కూడా ఓ తిరకాసుండేది, బస్సులకోసం పరిగెత్తఖర్లేదుకదా, ఆ బస్సురేటేదో ఈయనకే ఇచ్చేస్తే బావుంటుందేమో అనుకుని, మరీ బస్సు డబ్బులూ అనకుండా, పెట్రోల్ కి నేను ఇచ్చుకుంటానులెండీ అంటాడు. స్కూటరాయన మొహమ్మాటస్థుడైతే , దానికేముందండీ, నేనేమైనా మిమ్మల్ని మొయ్యాలా ఏమిటీ, నాతోపాటే మీరూనూ, అనేసి పెట్రొల్ ఛార్జీల విషయం తేల్చడు. కారణం ఏమిటంటే, మరీ రిక్షావాళ్ళలాగ డబ్బులు తీసికుంటే బాగుండదేమో అనీ, డబ్బులిస్తున్నాడుకదా అని తను శలవు పెట్టినరోజుకూడా, ఆఫీసుదాకా విడిచిపెట్టమని అడుగుతాడేమో అని భయం ఒకటీ, పైగా రేటు ఎలా ఫిక్స్ చేయాలో తెలియకపోవడం ఒకటీ, ఇలా మొదటినెల గడిచిపోతుంది.

మొత్తానికి వెనక్కాల కూర్చుని వెళ్ళేఆయన, నెలకింతా అనే నిశ్చయించుకుంటాడు, ప్రతీ నెలా నెలకూలి అడగడానికి అవతలాయనకి మొహమ్మాటం, అడిగితే ఇద్దామని ఇవతలాయన ఉద్దేశ్యమూ, బయటపడకుండా కానిచ్చేస్తూంటారు.  ఇలా ఆఫీసుకి తీసికెళ్ళడానికి డబ్బులు తీసికుంటున్నాడని ఎవరికైనా తెలిస్తే బాగుండదేమో అని ఓ బాధా. కానీ అవతలాయన ఊరికే వెళ్తున్నానని ఎందుకు ఒప్పుకుంటాడూ, అడిగినవాడికీ, అడగనివాడికీ టముకేసేస్తాడు.ఈయనే కాకుండా ఈయనభార్య కూడా, కాలనీలోవాళ్ళందరికీ చెప్తుంది, మా ఇంటాయన ఫలానావారితో రోజూ ఆఫీసుకి స్కూటరు మీద వెళ్తున్నారూ, పెట్రోల్ ఖర్చు ఇస్తున్నారూ అని, ఆఫీసులో కనిపించిన ప్రతీవాడూ పరామర్శించడమే-- "పోనీలే స్కూటరు కొన్నందుకు పెట్రోల్ ఖర్చైనా వస్తోందీ.." అని. ఇంక ఈ గొడవలన్నీ భరించలేక, ఓరోజు సున్నితంగా చెప్పేస్తాడు.. మాస్టారూ మిమ్మల్ని ప్రతీరోజూ తీసికెళ్దామనే అనుకున్నాను, కానీ పిల్లల స్కూలు కూడా, దారిలోనే ఉండడంతో, వాళ్ళూ వస్తామంటున్నారు, అందుకోసం ఇటుపైన మిమ్మల్ని తీసికెళ్ళడానికి వీలుండకపోవచ్చూ, అని ఓ నెల నోటీసులాటిది ఇచ్చేస్తాడు.

ఇలా చెప్పాపెట్టకుండా సదుపాయం విత్ డ్రా చేసేటప్పటికి, ఓ శతృత్వం లాటిది వచ్చేస్తుంది. అయినా బయటపడడనుకోండి, అవకాశం కోసం ఎదురుచూస్తూంటాడు, ఎప్పుడు ఆయన్ని దెప్పుదామా అని.

ఇదివరకటి రోజుల్లో ఉండే స్కూటర్లెన్నీ బజాజ్ వారి వెస్పా, ఇంకోటేదో లాంబ్రెట్టా నూ. ఇందులో ఆ వెస్పా స్కూటరుకి ఓ రోగం ఉండేది.  స్టార్ట్ చేద్దామనుకుంటే, మొండికెత్తేది. అటు నొక్కీ, ఇటు నొక్కీ చివరకి ఓవైపుకి వంచితే కానీ స్టార్టయ్యేదికాదు.  ఎప్పుడో భార్యతో వాహ్యాళికి వెళ్దామనుకున్నప్పుడే సాధారణంగా స్కూటరు ఇలా ఇరుకులో పెట్టేది.ఇంటావిడేమో సరదాగా భర్తతో బయటికెళ్దామని ముస్తాబు చేసికుని, తీరా బయటకి వచ్చి, కిటికీల్లోంచి తమ దంపతుల్ని ఎవరైనా గమనిస్తున్నారాలేదా అని చూసి సంతోషిద్దామనుకుంటే, ఈయనేమో ఆ స్కూటరు స్టార్టవక తిప్పలు పడుతున్నాడు. అవ్వ..ఎంత నామోషీ ! అందరూ పరామర్శించడమే.. "అయ్యో ఈమధ్యనే కొన్నట్టున్నారు అన్నయ్యగారూ, కొంచం మంచిది కొనాల్సింది.." అంటూ. ఈవిడకేమో స్కూటర్ స్టార్టవకపోవడం కంటే, పక్కింటివాళ్ళు ముందర నవ్వులపాలైపోయామే అని బాధ ఎక్కువవుతుంది. అదేదో మొగుడు కొట్టేడని కాక తోటికోడలు నవ్విందన్నట్టు.

అలాగే మనదేశంలో కొత్తగా టీవీలు వచ్చిన రోజుల్లో, సాధారణంగా అందరిదగ్గరా బ్లాక్ ఎండ్ వైట్ టీవీలే ఉండేవి. కానీ కొంతమంది బడాయికోసం కలర్ టీవీలు కొనుక్కునేవారు. ఇప్పటిలాగ కాదు, ఒక్కటే చానెల్ ఉండేది.పోనీ ప్రసారాలైనా లక్షణంగా ఉండేవా అంటే అదీ లేదు, జిల్లాకి ఒకటో రెండో చోట్ల   LPT  లని పెట్టేవారు.వాటికి యాంటినాలూ, బూస్టర్లూ. ఏదో కొన్ని కిలోమీటర్లపరిధిలో టీవీ ప్రసారాలు చూడొచ్చుకదా అని,నలుపూ తెలుపూ టీవీలకి సమస్య ఉండేది కాదు. కానీ పంచరంగుల టీవీలున్నాయే, అవి మాత్రం నానా తిప్పలూ పెట్టేవి. ఏదో కలర్ టీవీ కొనుక్కున్నారుకదా అని, దూరం నుంచి బంధువులు వచ్చేవారు. పాపం ఆ టీవీలో ముందర రంగులే వచ్చేవి, కానీ అకస్మాత్తుగా నలుపూ తెలుపూలోకి మారిపోయేది.

ఇక్కడ ఇంటి యజమానికేమో ఖంగారూ,యాంటినా గాలికి తిరిగిపోయిందేమో అంటూ వివరణలూ, పోనీ డాబామీదకి వెళ్ళి అదేదో సరిచేయకూడదూ అంటూ భార్య సతాయింపూ, నానా గొడవా జరిగేది.అయ్యో వచ్చినవాళ్ళకి మన పంచరంగుల టీవీ లో బొమ్మచూపించలేకపోయామే అన్న బాధ కంటే, ఈ వచ్చినవాళ్ళు ఎక్కడెక్కడ యాగీచేసేస్తారో అనే బాధే ఎక్కువగా ఉండేది.




భమిడిపాటి ఫణిబాబు

మరిన్ని వ్యాసాలు