అబ్బో రాజకీయాలంటే వయసు మళ్లిపోవాలి. తలలు పండిపోవాలి.. అనేది ఇదివరకటి మాట. కానీ ప్రస్తుతం పరిస్థితలు మారాయి. యువ రక్తం రాజకీయాల పట్ల చైతన్యవంతమైంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని చూసి విసిగిపోయింది. అసహ్యించుకుంటోంది. అందుకే యూత్ అయినా మేమూ రాజకీయం చేయగలం. ఈ ధోరణిని మార్చగలం అనుకుంటోంది. అందుకు తగ్గట్టుగానే తన అడుగులు కదుపుతోంది. పలువురు రాజకీయ నాయకులు యూత్‌ని ప్రోత్సహిస్తున్నారు. యూత్‌ని ఎట్రాక్ట్ చేసేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు కూడా. ఈ కోవలో వెలసిన కొత్త పార్టీనే పవన్ కళ్యాన్ స్థాపించిన 'జనసేన' పార్టీ. ఇది కేవలం యూత్ పార్టీ. ఈ పార్టీ ఆలోచనలు, నడవడిక అంతా యూత్‌ని అనుసరించే ఉంటుంది. ఈ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ ప్రధాన పాత్ర ధారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా యూత్‌కి పలు టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇలాంటి పరీక్షలకు హాజరయ్యేందుకూ పెద్ద సంఖ్యలో యువత ముందుకొస్తుండడం.
అనంతపురం జిల్లాలో ఇప్పటికే ఈ పార్టీకి తగిన యువకులను ఎంపిక చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. బాగా రాయగలిగే, మాట్లాడగలిగే యువకులను పార్టీ కోసం ఎంచుకుంటున్నారు. ఇదివరకటిలో యువత మంచి చదువులు చదవడం, తగిన ఉద్యోగం వెతుక్కోవడం, డబ్బులు సంపాదించడం ఇవే తమ లక్ష్యాలుగా ఎంచుకునేవారు. కానీ ప్రస్తుతం అలా కాదు. సమాజం పట్ల తమకీ ఓ బాధ్యత ఉందని గుర్తిస్తున్నారు. సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోకి యువత ప్రవేశించడం ద్వారా ఎంతో కొంత రాజకీయాల పరిస్థితిని మార్చి, సమాజం మెరుగుపడేందుకు తమ వంతు బాధ్యతని నిర్వర్తించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. రాజకీయాల్లోకి రావడం అంటే ఉద్యోగాలు మానేయాలనే అవసరం లేదు. తమ తమ ఉద్యోగాలు చేసుకుంటూనే, పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తూ కనీస బాధ్యతతో వ్యవహరిస్తే చాలు. ఇప్పటికే పలువురు యువకులు రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాగే ముందు ముందు మరింత యువ రక్తం రాజకీయాల్లో తమదైన ముద్ర వేయాల్సి ఉంటుంది. అప్పుడే రాజకీయ నాయకుల్ని ప్రశ్నించే శక్తి యువతలో ఉందనే విషయం అందరికీ అర్థమవుతుంది. తద్వారా భావి భారతం అత్యద్భుతంగా ముందడుగు వేయగలుగుతుంది. యువత రాజకీయాల్ని నడిపించే రోజున, నేటి యువతే రేపటి భావి రాజకీయ పౌరులు అనే శ్లోగన్ ఎక్కడంటే అక్కడ వినిపస్తుంది.