చమత్కారం - భమిడిపటి ఫణిబాబు

chamatkaram

కొడుకో. కూతురో కొత్తగా కారు కొన్నారనుకోండి, అమ్మా నాన్నల్ని లాంగ్ డ్రైవ్ పేరుతో, బయటకు తీసుకుపోతారు. కొత్తకారులో పెళ్ళాన్ని ముందర కూర్చోపెట్టుకోవాలిగా,జీవితాంతం ఉండేది ఆ పిల్లే, పైగా ఈ.ఎం.ఐ లు ఆ పిల్ల జీతంలోంచి కడుతున్నాడాయే, దానితో అమ్మా నాన్నా బ్యాక్ సీటు! అప్పుడు మొదలౌతుంది, తాపత్రయాల ఫినామినన్.కొడుకు ఇగ్నిషన్ తిప్పి కారు స్టార్ట్ చేయడం మొదలు, ప్రతీ టర్నింగులోనూ, ప్రతీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరా, ఊరికే నస పెట్టేస్తాడీయన. అంత స్పీడొద్దూ, మెల్లిగా.. తో ప్రారంభం అయి, ఓవర్ టేక్ చేయాలో వద్దో, ఎక్కడ బ్రేక్ వేయాలో, ఎక్కడ పార్క్చేయాలో దాకా! ఆ కొడుకునేదో తన దారిన తనని డ్రైవ్ చేయనీయొచ్చుగా, అబ్బే, ఇంటికి Constitutional Head ఈ పెద్దాయనాయే.ఇంకా అథారిటీ హ్యాండోవర్ అవలేదనుకుంటున్నాడీ బక్క ప్రాణి! ఎప్పుడైతే, ఈయన ప్రమేయం లేకుండా, వాళ్ళక్కావలిసిన బ్రాండు కొని తెచ్చుకున్నారో అప్పుడే, పవర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏదో ఫార్మాలిటీ కోసం, వీళ్ళని తీసికెళ్ళడం కానీ, మరీ మాస్టారుగారిలా పాఠాలు చెప్పడం మొదలెడితే ఎలాగ? ఏదో పెద్దరికం ఇచ్చారు, ఇచ్చారు కదా అని ఊరికే నస పెడితే, మళ్ళీ ఎక్కనీయడు! అప్పటికీ ఈయనగారి భార్య సణుగుతూనే ఉంటుంది-- వాడూ నేర్చుకున్నాడుగా డ్రైవింగూ, అన్నీ మీకే తెలిసినట్లు ఊరికే వాణ్ణి బెదరగొట్టేయకండి--అని.అప్పటికే సిగ్నల్స్ వస్తున్నాయి, మన పవర్ డైల్యూటైపోతూందీఅని.అయినా ఓ లాస్ట్ ట్రై అన్నమాట.

మన పెద్దాయనకి తెలిసినది ఓ స్కూటరుకి మాత్రమే పరిమితం.చివరాఖరికి బైక్కు విషయం కూడా అంత పరిచయం లేదు. కొడుకు కొన్న కారేమో అదేదో పవర్ స్టీరింగూ, గేర్ లెస్సూ ! మధ్యలో ఎక్కడేనా ఆగిపోతే, కారుని తోసే ఓపిగ్గూడాలేదు. ఎందుకు చెప్పండీ తాపత్రయం? చదువుకున్నన్ని రోజులూ, పిల్లల్ని కూరలూ అవి తీసికోడానికి, మార్కెట్ కి కూడాపంపని ధన్య జీవి ఈ పెద్దాయన. కొడుక్కి జీవితాంతం కూరలు తేవడానికి ఈ పెద్దాయన ఉండొద్దూ, దానితో ఓ రోజు మంచి ముహూర్తం చూసుకుని, ఇద్దరూ మార్కెట్ కి బయలుదేరుతారు. అదీ స్కూటరు మీదో, బైక్కు మీదో. వెనక్కాల పిలియన్ సీట్ మీద పెద్దాయన. ఇంక చూసుకోండి, రోడ్డు మీద వెళ్తున్నంతసేపూ, చెయ్యి అటు తిప్పీ, ఇటుతిప్పీ మాట్లాడ్డం. వెనక్కాల వచ్చేవాళ్ళ ప్రాణాలు తీయడం, ఎటువైపు వెళ్తున్నారో తెలిసి చావదూ… నోరు మూసుక్కూర్చోచ్చుగా  అమ్మో,పిల్లాడికి ట్రైనింగివ్వొద్దూ?

మార్కెట్ లోకి వెళ్ళిన తరువాత ఈయనగారు సంవత్సరాల తరబడీ కూరలు కొంటున్న కొట్టుకే తీసికెళ్ళడం. అక్కడకి వెళ్ళిన తరువాత, కూరలెలా సెలెక్టు చేయాలో నేర్పడం. బెండకాయలు కొనాలనుకోండి, ప్రతీదీ చూడ్డం, దాని ముచిక తెంపి లేతదా, ముదురుదా అని చూడ్డం. అన్ని కాయలూ అలా తెంపేస్తూంటే, ఆ కొట్టువాడూరుకుంటాడా, " సాబ్ మంగ్తాతో లేవో, ఖాలీ పీలీ భాజీ ఖరాబ్ మత్ కరో.." అని చీవాట్లు తినడం. అంతే మాస్టారికి బోల్డంత కోపం వచ్చేసి, 'వెధవ కొట్టు, వీడొక్కడేనా ఈ మార్కెట్ లో కూరలమ్మేదీ..' అనేసికుని ఇంకో కొట్టుకి వెళ్ళడం.అక్కడ వాడు ముందరే చెప్పేస్తాడు--" హాత్ మత్ లగానా. చున్నేకా నహీ..' అని అంటే ఊరికే కూరలమిద చెయ్యెస్తే కాళ్ళిరగ్గొడతానూ అని భావార్ధం! చివరకి కొడుక్కి అర్ధం అయిచావదు, కూరలెలా కొనాలో.

ఎలాగోలాగ, ఇంకెవరిచేతా మాట పడకుండా మొత్తానికి మార్కెటింగు చేసికుని కొంప చేరుతారు, రెండు సంచీలు నింపుకుని. ఇంటికి వెళ్ళగానే, మొట్టమొదటి ప్రశ్న మాస్టారి భార్యామణి నుంచి, నేర్పెరా మొత్తానికి కొడుక్కి, కూరలెలా తీసికోవాలో అని. ఏడవలెక నవ్వే నవ్వోటి నవ్వి, ఇంక పైవారం నుండి వాడే వెళ్తాడులే అని చెప్పడంతో, కూరల ప్రకరణం కంప్లీట్. ఇంక గ్రోసరీ సంగతికొస్తే, ఏ సరుకెంత తేవాలో తెలియదూ, ఇంట్లో పెద్దావిడేమో ఓ లిస్టిస్తుంది, త్వరలో ఏ పండగో వస్తోంది కదా పిండివంటలూ అవీ చేయాలీ అని, కాజూ కిస్మిస్,ఏలక్కాయలూ, రవ్వా మైదా వగైరాలు కూడా చెప్తుంది. కూరల మార్కెట్ అనుభవం అయిన తరువాత, కొడుకు తండ్రిని ఇంట్లోనే ఉండమని,తనూ భార్యా దగ్గరలో ఉండే కొట్టుకి బయలుదేరతారు. వెళ్ళడమంటే వెళ్ళారు కానీ, ఏ సరుకెంత తీసికోవాలో తెలుసునా ఏమిటీ, అయినా ముందుగా, పేరు బావుంది కదా అని ఏలక్కాయలు ఓ అరకిలో ఇవ్వండీ అంటారు. కొట్టువాడికి తలతిరిగిపోతుంది. మామూలుగా జనం ఒ పది గ్రాములో, మహా అయితే ఇరవై గ్రాములో తీసికుంటారు, వీళ్ళేమిటీ మరీ అర కిలో అంటున్నారూ, ఏ కిళ్ళీ కొట్టైనా ఉందా అనుకుని," మీ పాన్ షాప్ ఎక్కడా " అని అడిగేస్తాడుకూడానూ!

ఏదో కిందా మీదా పడి మొత్తానికి ఓ పిల్లో పిల్లాడో పుట్టుకొచ్చేసరికి, అన్నీ తెలిసొస్తాయి.కొత్తలో ఏదో తెలియక్కానీ, ప్రతీదానికీ ఉన్నారు కదా అని, సలహాలివ్వడం మొదలెడితేపెట్టే తిండి కూడా సరీగ్గా పెట్టరు.

నోరుందికదా అని లేనిపోని సలహాలివ్వడం, ఆరోగ్యానికి అంత మంచిది కాదేమో. నీట్లో పడేస్తే ఈత చచ్చినట్టు నేర్చుకుంటారు. అలాగే సంసార సాగరంలోకి దిగిన తరువాత, ఈదడం స్వతసిధ్ధంగానే వస్తుంది. …

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి