ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) - కర్రానాగలక్ష్మి

uttarakhand tourism

మాతా చంద్రబదని

దేవ ప్రయాగ చూసుకొనే సరికి మద్యాహ్నం ఒక్కగంట అవడం వల్ల బజారులో వున్న ఓ పాటి హోటల్ లో భోజనం చెయ్యడానికి కూర్చున్నాం ఇక్కడ చెప్పుకో వలసిన ముఖ్య విషయం యేమిటంటే మేము చార్ధామ్ యాత్రలు నిర్వహించే యే టూరు ఆపరేటర్ ద్వారా మా టూర్లు బుక్ చేసుకోము , మాకు మేమే టూర్ ఆపరేటర్స్ మి . సాధారణంగా నలుగురు నుంచి ఆరుగురం టూరు ప్లాను చేసుకుంటాం . అంటే మా దంపతులం కాక మరో కుటుంబం కాకపోతే మరో రెండు జోడీలతో ప్రయాణం ప్లాను చేసుకుంటాం . అందరూ ఒకే మాట మీద నడవాలండోయ్ అప్పుడే మనం యాత్రలను యెంజాయ్ చెయ్యగలం .

దేశ రాజధాని వరకు ట్రైనులో గాని ముందుగా బుక్ చేసుకుంటే మూడు నాలుగు వేలకి ఫ్లైట్ టికెట్స్ లభిస్తాయి అలా ప్లైటులో గాని చేరి అక్కడనుంచి మేము దిగిన ప్రదేశం నుంచి టాక్సీ లో హరిద్వార్ చేరి ( అంటే టాక్సీ హరిద్వార్ వరకే మాట్లాడు కుంటాం ) అక్కడ యేదో ఒక ఆశ్రమం లో వుండి రెండురోజులు హరిద్వార్, ఋషికేశ్ లలో చూడవలసినవి చూసుకొని హరిద్వార్ లో ఉత్తరాఖండ్ లో తిరగడానికి టాక్సీ మాట్లాడుకొని ప్రయాణం రోజు పొద్దుట యేడుకల్లా బయలుదేరుతాం, సాయంత్రం వెలుగుండగానే రూములలో చేరుతాం అది మా అలవాటు ఉత్తర భారత యాత్రలలో మనకు సరైన భోజనసదుపాయాలు దొరకవు , వారువాడే పదార్ధాలు మన శరీరాలకు పడక ఆరోగ్యం దెబ్బతినడం తరచూ జరుగుతూ వుంటుంది . ఇవన్నీ అనుభవించిన తరువాత మేం పోర్టబుల్ కిచెన్ మాతో తీసుకు వెళుతూ వుంటాం . అందులో ఒకటి లేక రెండు రైసు కుక్కర్స్ , హాట్ వాటర్ కెటిల్ టీ , కాఫీ , పంచదార పేకెట్లు , మేగీ , యిన్స్టెంటు ఉప్మా ప్యాకెట్ల , పులిహోర మిక్స్ యింట్లో చేసుకున్నది , ఊరగాయలు , పొడులు , పులుసు మిక్స్ యింట్లో చేసుకున్నది . స్పూన్స్ , ప్లేట్స్ , నేప్కిన్స్ మొదలయినవి అందులో వుంటాయి . రకరకాల యెలట్రికల్ ప్లగ్ పిన్స్ కూడా పట్టుకోవాలండోయ్ . సూపు పేకెట్స్ పట్టుకుంటే ఉత్తరాంచల్ చలిలో వేడివేడి సూపు తాగుతూ వుంటే ఆ మజావే వేరు . బియ్యం , వుల్లిపాయలు కూడా పట్టుకోవాలి . బియ్యం మనకి యెక్కడైనా దొరకుతాయి కాబట్టి రెండు రోజులకు సరిపడా పట్టుకుంటే చాలు . వీటితో పాటు గిన్నెలు తోముకొనే సామగ్రి మరచిపోకండి .

ముందుగా స్నానం చేసిన వాళ్లు రైసుకుక్కర్లో బియ్యం పడేస్తే రెండో వారు తయారయేసరికి మన భోజనం తయారు . ఉడికిన అన్నంలో మనకి కావలసిన పొడులతో ఊరగాయలో పులిహోర పోపో కలుపుకొని డబ్బాలలో మూతవేసుకొని బయలుదేరేమంటే మన భోజనం మనవెంటే , ఎప్పుడు కావాలంటే అప్పుడు వడ్డించుకు తినెయ్యడమే .

సాయంత్రం బస చేరేక ముందు సూపు చేసుకు తాగడం తరవాత అన్నం పడేసుకుంటే మనం కాళ్లు చేతులు కడిగే సరికి డిన్నర్ రెడీ . దేశం లో అయినా విదేశాలలో అయినా మా వంటిల్లు మాతోనే వుంటుంది . అలా మేము తెచ్చుకున్న భోజనాలు చేసి తిరిగి ప్రయాణం సాగించేం .దేవప్రయాగ నుంచి కీర్తనగర్ వైపు వెళ్లే రోడ్డుమీద  మా ప్రయాణం సాగింది . సన్నని రోడ్డు  , దట్టమైన అడవి , చాలా కోతులు కనబడుతూ వుంటాయి . సుమారు 35 కిలో మీటర్ల ప్రయాణం తరువాత ' కాంది ఖల్  ' చేరుతాం , అక్కడనుంచి సుమారు ఓ కిలోమీటరు దూరం కొండ యెక్కి యీ మందిరం చేరుకుంటాం . ఉత్తరాఖండ్ లో యే మందిరం దర్శంచాలన్నా కనీసం ఒకటిరెండు కిలోమీటర్లు కొండ యెక్కడమో దిగడమో చెయ్యాలి . కాబట్టి యిటువైపు ప్రయాణాలు చెయ్యాలనుకొనే వారు వారి ప్రయాణానికి ఆరు నెలల ముందు నుంచి బ్రిస్క్ వాకింగు చేసుకుంటూ వుంటే మంచిది .

సరే యిక ప్రస్తుతం లోకి వస్తే ఓ కిలో మీటరు కొండ యెక్కాక చిన్న సిమెంటుతో కట్టిన మందిరం వస్తుంది . కొండ కు మూడు వైపులా కట్టిన మందిరం . లోపల వున్న కొండకు బట్ట కట్టి వుంటుంది . బట్ట వెనుక వున్నది యేమిటి అనేది యెవ్వరికీ తెలియదు . పూజాది కార్యక్రమాలు పొద్దుట ఒక్కసారి విగ్రహానికి జరుగుతాయి . అప్పుడు ముఖ్య పూజారి కళ్లకు గంతలు కట్టుకొని పూజ నిర్వహిస్తారు . కొండమీద నుంచి చూస్తే కను చూపు మేర వరకు ఆకుపచ్చని తివాసి కప్పుకున్నట్లు వున్న నేల కనువిందు చేస్తుంది . చల్లని గాలి శరీరాన్ని సేద తీరుస్తుంది  ఇక్కడ వున్న బోర్డు  మీద స్థలపురాణం రాయబడింది .

స్థలపురాణం చెప్పుకుందాం .

దక్షయజ్ఞం లో పతికి జరిగిన అవమానం సహించలేని సతీదేవి ప్రాణత్యాగం చేసుకుంటుంది .  సతీదేవి పార్థివశరారాన్ని భుజాన వేసుకొని తిరుగుతున్న శివుని మోహవిముక్తుడను చేయదలచి విష్ణుమూర్తి తన చక్రం తో సతీ దేవి శరీరాన్ని ఖండించగా ఆశరీరఖండాలు 54 గా ఖండించబడి హిందూ దేశం లో విరజిమ్మ బడ్డాయి , సతీదేవి నగలు 54 ప్రదేశాలలో విరజిమ్మబడ్డాయి . అవే శక్తి పీఠాలుగా తరవాత శంకరాచార్యుల వారు గుర్తించేరు .

ఈ ప్రదేశం లో సతీదేవి యొక్క ' అంగం ' పడిందట . అందుకే యెప్పుడూ బట్టతో కప్పి వుంచుతారు . ప్రతీరోజూ పూజారి కళ్లకు గంతలు కట్టుకొని నిత్యపూజాది కార్యక్రమాలు నిర్వహించి తిరిగి బట్టతో కప్పెస్తారు . కొందరి స్థానికులు బట్ట వెనుక శ్రీయంత్రం వున్నదని అంటారు , కొందరు సతీదేవి అంగం వున్నదని అంటారు . ఈ ప్రదేశంలో యెన్నో లోహపు త్రిశూలాలు కనిపిస్తాయి . ఇక్కడ అమ్మవారిని పూజించుకొని శక్తులను పొందిన వారు అమ్మవారికి లోహపు త్రిశూలాలు బహూకరిస్తారని అంటారు .

చంద్రబదనీ దేవిని దర్శించుకొని శ్రీనగరు వైపు పయనమయేం . ఉత్తరాఖండ్ లో ఓ శ్రీనగరు వుంది . దేవప్రయాగ బదరీనాథ్ దారిలో దేవప్రయాగ కి సుమారు 35 కిలో మీటర్ల దూరంలో వుంది శ్రీనగరు .

శ్రీనగరు లోయ కావడంతో నగరం చేరడానికి ముందు సుమారు పది కిలో మీటర్లు మైదానంలో ప్రయాణిస్తాం . అలాగే యిక్కడ వుష్ణోగ్రతలు కొండలలో కన్నా యెక్కువగా నమోదవుతూ వుంటాయి . ఈ ప్రాంతాలలో వరి , గోధుమ పంటలు మామిడి , నిమ్మ లాంటి పండ్ల తోటలు యెక్కువగా కనబడతాయి . చాలా రకాల కూరలు కూడా పండుతాయి . ఈ కొండలలో యెక్కువగా తియ్యగుమ్మడి కాయడం చూసేం , సాయంత్రం అయేటప్పటకి రోడ్డు మలుపులలో గుట్టలు గుట్టలుగా గుమ్మడి పళ్లు పోసి ట్రక్కులలోకి చేరవేయడం గమనించేం .

పౌరీ ఘరేవాల్ జిల్లాలో వుంది శ్రీనగరు . హరిద్వార్ తరువాత యాత్రీకులకు కావలసిన అన్ని వస్తువలు దొరికే ప్రదేశం కూడా యిదే యిక్కడ అన్ని తరగతులవారికి అందుబాటులో వుండేటట్టుగా భోజనవసతి సౌకర్యాలు లభిస్తాయి .

శీతాకాలపు దుస్తులు మరచిపోయినవారు యిక్కడ దుస్తులు కొనుగోలు చేసుకోవచ్చు . ఇక్కడినుంచి పైకి వెళుతున్నగొద్దీ చలి పెరుగుతూ వుంటుంది . చలిబట్టలు పట్టుకోని వారు , తెచ్చినవి సరిపోని వారూ యిక్కడకొనుగోలు చేసుకోవచ్చు .

ఈ వూరు తరువాత అన్నీ యేదో నిత్యావసర వస్తువలు దొరికే వూర్లేతప్ప పెద్ద మార్కెట్టు వున్నవి మనకి దారిలో రావు . శ్రీనగరులో 420 పడకలుగల సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ వుంది యిక్కడ పిజి కోర్స్ లు బోధించే వైద్య విశ్వవిద్యాలయం 2010 లో నిర్మించేరు . అలాగే పోలిటెక్నిక్ కాలేజీ  వుంది . అలాగే యితర స్కూల్స్ కాలేజీలు వున్నాయి .

శసశ్త్ర సీమా బల్ వారి కేడట్ ట్రైనింగు సెంటరు వుంది . ఇక్కడ ఉత్తరాఖండ్ గవర్నమెంటువారిచే నడపబడుతున్న గెస్ట్ హౌసులో వసతి భోజన సదుపాయాలు బాగుంటాయి  . ఇది బదరీనాథ్ రోడ్డుని ఆనుకొని వుంటుంది .

యాత్రీకులకు మరో చిన్న సూచన యేమిటంటే యే హోటల్ లో వుండదలచుకున్నా ముందుగా రూములు , బాత్రూములు చూసుకొని నచ్చితేనే రెంటు బేరమాడుకోండి . బేరం అన్నాకదా ! బేరం బాగా చెయ్యాలి , సుమారుగా సగానికి సగం తగ్గిస్తారు .

ఆ రాత్రి శ్రీనగరులో బస చెయ్యాలనుకున్నాం . అందుకే శ్రీనగరు ప్రవేశించగానే రూములు వెతకడం మొదలుపెట్టేం ( బేరం కూడా ) నచ్చిన రూము నచ్చిన రేటుకి బజారులో దొరకడం తో మగాళ్లను బియ్యం , పాలు , పెరుగు తేవడానికి పంపి కుక్కర్లో బియ్యం పడేసుకున్నాం . కెటిల్ లో నీళ్లు మరిగించి సూపు కలుపుకున్నాం .

ప్రయాణపు బడలిక , కొండలలో నడక వల్ల కలిగిన అలసట సూపు తాగడంతో తగ్గి కొత్త ఉత్సాహం వచ్చింది .

అరుదైన మందిరాలను దర్శించుకున్నాం అన్న తృప్తితో వేడివేడి అన్నం తిన కమ్మగా నిద్రపోయాం .

మరునాడు మరో అధ్బుతమైన మందిరం చూడబోతున్నామని తెలియదు అప్పటికి , మళ్లీ వారం ఆ వివరాలు తెలుసుకుందాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి