ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) - కర్రానాగలక్ష్మి

uttarakhand tourism

ధారివాలీ మాత

హరిద్వార్ నుంచి సుమారు 135 కిలో మీటర్ల ప్రయాణం పూర్తిచేసి శ్రీనగరు చేరుకున్నాం , మరో 35 కిలోమీటర్లు ప్రయాణిస్తే రుద్రప్రయాగ చేరుకుంటాం . మాకు యీ ఉత్తరాఖండ్లో ప్రతీ మలుపు పరిచయమే , యే మలుపులో యే హోటలు వుంటుందో కూడా తెలుసు , అలాగే ఉత్తరాఖంఢ్ వరదలలో కొట్టుకుపోయిన పెద్దపెద్ద కట్టడాలు తలుచుకుంటే వరద యెంత భీభత్సాన్ని సృష్టించిందో తెలుస్తుంది .

అలకనంద వొడ్డున నిర్మించిన ఓ రిసార్ట్ ,  ఓ రాత్రి బసచేసి భోజనం , రూము బాగున్నాయనుకున్నాం , యేదీ నామరూపాలు లేవు అలాగే మరో మలుపులో కొండ మీద కట్టిన ఓ మోస్తరు హోటల్ , మరో మలుపులో మరో కట్టడం యిలా యెన్ని  కట్టడాలో మట్టిలో కలిసి పోయేయి .

అలాగే యెన్నో వృక్షాలు కూడా , దాంతో అడవులు తగ్గిపోయేయి , మేం వెళ్లినది ఏప్రెల్ మాసం కావడం వల్ల చార్ ధామ్ యాత్ర మొదలు కాలేదు . యాత్రకోసం గవర్నమెంటు చేపట్టిన పనులు కనిపిస్తున్నాయి , తారు రోడ్డు పనులు సాగుతున్నాయి .

వివిధ రాష్ట్రాల రోజు కూలీలు ఆ చలిలో చాలీచాలని చలి బట్టలతో , పాతబట్టలతో కట్టిన టెంటులలో వుంటూ పనులు చేసుకోడం కనిపించింది . వరదలలో యాత్రీకుల లెఖ్క , స్థానికుల లెక్కలు కట్టేరు కాని యిలాంటి కూలీల లెక్క యెవరైనా కట్టేరా ? యీ ప్రదేశాలలో చిన్న వానకి కూడా కొండ చరియలు విరిగి పడుతూ వుంటాయి ,  యిలాంటి కూలీలు యెందరో మట్టి కింద కూరుకు పోతూ వుంటారు తల్చుకుంటేనే బాధ కలుగుతుంది , పొట్టకూటికోసం యెంత ప్రమాదకర పరిస్థితులలో పనులు చేసుకుంటున్నారో కదా !

ఓ పక్క యెత్తైన కొండలు మరోపక్క ఉరుకుతూ పరుగులతో ప్రవహిస్తున్న అలకనంద , సుమారు 15 కిలోమీటర్ల ప్రయాణం తరువాత ఓ కొండమలుపులో అమ్మవారి కోవెల వుండాలి , యీ సారి అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాం , యింతకు ముందు ప్రతీ సారీ యీ పక్కగా వెళ్లేటప్పుడు యీప్రదేశం పెద్దపెద్దవృక్షాలతో అడవిలా వుండటం వల్ల కోవెల వరకు వెళ్లే సాహసం చెయ్యలేదు . ఈ సారి ఆశ్చర్యంగా అమ్మవారి కోవెల మొదటి మలుపు లోనే కనిపించింది , అలకనంద మధ్యలో చిన్న ద్వీపం మీద అమ్మవారి కోవెలవుంది , కోవెల చేరడానికి ఒడ్డు నుంచి వ్రేలాడే వంతెన వుంది .

కాళ్లు నొప్పులు వెళదామా ? వద్దా ? అనుకుంటున్న మాకు నదిమధ్యలో వున్న కోవెల ఆకర్షించింది .

ఎక్కడెక్కడో కట్టిన బిల్డింగులే కూలిపోయేయికదా. అలాంటిది అలకనంద మధ్యలో కట్టిన మందిరం అలాగేవుందా ? అనే కుతూహలం కూడా తోడవడంతో నడక సాగించేం . చిన్నచిన్న  చెట్లమధ్యనుంచి కొండదిగుతున్నాం . చాలా కోతులు వున్నాయి , ఓ పావు కిలో మీటరు నడక తరువాత అలకనంద ఒడ్డున నడుస్తూ వ్రేలాడే వంతెన మీదుగా కోవెల చేరుకున్నాం .

ఇక్కడ అమ్మవారిని ' ధారివాలిమాత ' అని అంటారు . అమ్మవారిని పార్వతీ దేవి రూపంగా పూజిస్తున్నారు . వంతెన మీదుగా మందిరంలో కి వెళితే పెద్దహాలు అందరూ కూర్చొనే తమ వంతువచ్చేవరకు నిరీక్షిస్తున్నారు . కొండరాతికి ఆనించి వుంది అమ్మవారి విగ్రహం . దేవికి కొబ్బరికాయ పసుపు కుంకుమ సమర్పించుకొని దక్షిణ పూజారి అభీష్టం మేరకు హుండీలో వేసి బయటకి వచ్చేం .

అమ్మవారి ప్రదక్షిణ చేసుకుంటూ వుండగా మందిరంలోనే మరో వైపున కూర్చొని మాల తిప్పుకుంటున్న పూజారిని మందిరం గురించి వివరాలు అడిగేం . ఈ అమ్మవారి వుధ్భవం యెలా జరిగినదీ తెలియదని చెప్పేరు . కాని సుమారు వెయ్యి సంవత్సరాలకు ముందునుంచి యీ కోవెల వున్నట్లు , మొత్తం ఉత్తరాఖండ్ ని కాపాడే అమ్మ అని చెప్పేరు . అంటే ఊరి అమ్మవారిలాగ మొత్తం యీ ప్రాంతానికే అమ్మన్న మాట .

 యీ మందిరానికి కాస్త దూరంలో కొత్త నిర్మాణం జరుగుతోంది అది యేమిటి అని అడిగిన మీదట అదే అమ్మవారి మూలస్థానమని నిర్మాణం పూర్తికాగానే అమ్మవారిని అక్కడ పునః ప్రతిష్ట చేస్తారని చెప్పేరు .

ప్రదక్షిణ చేస్తూ వుండగా పెద్ద పెద్ద కాంక్రీటు పిల్లర్స్ నీళ్లల్లో పడి కనిపించేయి . వాటి గురించి అడుగగా కాస్త తటపటాయించి పూజారి యిలా చెప్పేరు .  అలకనందమీద హైడెల్ పవర్ ప్రాజక్టు నిర్మాణం జి . వి .కె సంస్ధ కు దక్కగా వారు ఆ ప్రాజక్టు  కొరకు అనువైన ప్రదేశంగా అమ్మవారి కోవెల ప్రదేశాన్ని యెంచుకోడం జరిగింది . గ్రామ పెద్దలు , బిజెపి కార్యకర్తలు వ్యతిరేకించినా కూడా కాంట్రాక్టర్లు  అమ్మవారి విగ్రహాన్ని 2013 జూన్ 16 రాత్రి 7 గంటలకు తొలగించేరు , అదే రాత్రి కొన్ని గంటల తరువాత మబ్బులు బద్దలయి మొత్తం ఉత్తరాఖండ్ ముంపుకు గరి అవడం మనకు తెలిసినదే , అప్పటికే నిర్మాణంలో వున్న పిల్లర్లు నీటిలో కొట్టుకు పోయేయి ఆ శిథిలాలను యిప్పటికీ అలకనందలో చూడొచ్చు .

1882 లో అప్పట్లో యీ ప్రాంతాన్ని పరిపాలించే రాజు యిలాగే అమ్మవారిని మూలస్థానం నుంచి తప్పించగా మొత్తం కేదార్ నాథ్ ప్రాంతం నేలమట్టమయిపోయిందని ఉత్తరాఖండ్ చరిత్ర లో లిఖించబడి వుంది .

అలకనంద వొడ్డునుంచి మందిరానికి చేరడానికి రోడ్డు నిర్మాణం జరుగుతోంది , మళ్లీ సంవత్సరం యిక్కడకు వచ్చేవారు కారులోనే వ్రేలాడే వంతెన వరకు చేరుకోవచ్చు .

ఇక్కడ పిల్లలకు పుట్టు జుత్తులు తీయించడం చేయిస్తునారు , యిక్కడ తంత్ర శక్తులకొరకు దేవీ ఉపాసన చేసేవారు కూడా కనిపిస్తారు .

ఇక్కడ దేవీ నవరాత్రులు , వసంత నవరాత్రులు విశేషంగా జరుపుకుంటారు .

మందిరం నుంచి వచ్చేటప్పుడు కోతి ప్రసాదం బేగు లాక్కొని చెట్టెక్కి వెక్కరించింది . ధారావాలి మాత మహిమ గురించి చర్చల మధ్య మా ప్రయాణం రుద్ర ప్రయాగ వైపు సాగింది . నిజంగా అమ్మవారి కి మహిమ వుందో లేదో నిర్ణయించే విజ్ఞత మాకు లేదుగాని కొట్టుకుపోయిన హైడల్ పవర్ ప్లాంటు అవశేషాలు మాత్రం నిజం , తిరిగి అక్కడ పవర్ ప్లాంటు కట్టే సాహసం చెయ్యేలేదు  అనేది కూడా నిజమే . ధారివాలి నుంచి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత. రుద్ర ప్రయాగ చేరేం .

 ' నోట్లరద్దు ' రాకముందు రుద్ర ప్రయాగలో ATM లు వుండేవి , ప్రస్తుతం హరిద్వార్ దాటాకా శ్రీనగరు లో తప్ప ATM లు లేవనే చెప్పాలి , మా టాక్సీ డ్రైవరు ప్రకారం 2013 వరదల తరువాత బ్యాంకులు ATM సేవలను రద్దు చేసాయని చెప్పేడు .

రుద్ర ప్రయాగ దగ్గర రోడ్డు రెండుగా చీలుతుంది ఒకరోడ్డు అలకనంద నది వెంట సాగి బదరీనాథ్ చేరుతుంది , మరొక రోడ్డు  మందాకినీ నది వెంట సాగి కేదార్ నాథ్ చేరుతుంది .

మందాకిని కేదార్ నాథ్ వెనుక వైపున వున్న ' ఛొరబారి ' అనే హిమనీనదమునుండి పుట్టి సోన్ ప్రయాగ దగ్గర సోన్ నది అని పిలువబడే వాసుకిగంగతో కలిసి రుద్రప్రయాగలో అలకనందతో కలుస్తుంది . నేను ముందుగా చెప్పినట్లు రెండు నదుల సంగమం యెంత బాగుంటుందంటే వర్ణించలేము . వేరు వేరు రంగులతో వచ్చి ఒకదాంతో ఒకటి కలిసి ఒకనది ఉనికిని కోల్పోయి పెద్దనదిగా మారడం ఓ అద్భుతం అని అనిపిస్తుంది 

మందాకిని అంటే నెమ్మదిగా నడిచేది అని అర్దం , అలాగే మందాకినీ నది యెటువంటి పరుగులు లేకుండా ( ఈ నది కూడా అలకనందలాగే యెత్తైన కొండల మీంచే ప్రవహిస్తూ వుంటుంది ) చాలా నెమ్మదిగా ప్రవాహముల శబ్దం లేకుండా ప్రవహిస్తూ వుంటుంది , మరోవైపు అలకనంద ఉరవళ్లు తొక్కుతూ హోరు పెడుతూ ప్రవహిస్తూ వుంటుంది . అలకనంద వేగానికి మందాకిని తలవంచి ఉనికిని కోల్పోయి అలకనందగా మారిపోయిందా అని అనిపిస్తుంది .

ఎంత సేపు చేసినా తనివి తీరని సంగమం గురించి మళ్లీ వారం మరిన్ని వివరాలతో మీ ముందుకు వస్తాను , అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Kanyakumarilo vunna tiruvalluvar vigraham nirmana charitra
తిరువళ్లువర్ విగ్రహం నిర్మాణ చరిత్ర
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
శ్రీసాయి లీలామృతం
శ్రీసాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్
మా చార్ధామ్ యాత్ర-2
మా చార్ధామ్ యాత్ర-2
- కర్రా నాగలక్ష్మి