సప్త సముద్రాల అవతల ఉన్న వ్యక్తితో లైవ్‌లో మాట్లాడేస్తున్నాం. రాకెట్‌తో నింగిలోకి దూసుకుపోతున్నాం. టెక్నాలజీ అద్భుతాలివి. మనిషి జీవనాన్ని మరింత సరళతరం చేస్తున్న టెక్నాలజీకి హేట్సాఫ్ చెప్పాలి. టెక్నాలజీలోనూ 'ఇంటర్నెట్' ఓ విప్లవం. కంప్యూటర్ రూపకల్పన, ఇంటర్నెట్‌తో కంప్యూటర్ల అనుసంధానం, దానికి 'స్మార్ట్' టెక్నాలజీ తోడవడం ఇవన్నీ మనిషి సాధించిన అద్భుతాలు. అయితే అంతా అద్భుతమే కాదు, కొంచెం నిర్లిప్తంగా ఉన్నా ప్రమాదం ముంచుకొస్తుంది టెక్నాలజీతో. ఇప్పుడదే జరుగుతోంది. ప్రపంచాన్ని కుగ్రామం చేసిన కంప్యూటర్, స్మార్ట్ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచాన్ని ముంచేస్తోంది. ప్రమాద ఘంటికలు మోగాయి. మాల్ వేర్, వైరస్ పేరేదైనా ఓ 'బగ్' ప్రపంచాన్ని శాసించేయడం ఆశ్చర్యకరం. ప్రపంచమంతా వణుకుతోందిప్పుడు. బ్యాంకింగ్, రైల్వే, ఎయిర్ కనెక్టివిటీ ఇలా పలు రంగాలు కుదేలయ్యాయి. హెల్త్ సెక్టార్ కూడా తీవ్రంగా ప్రభావితమయ్యింది. ప్రపంచంలో 150 దేశాలకు పైగా ఇప్పుడు భయాందోళనల నడుమ కొట్టుమిట్టాడుతుండడం శోచనీయం.
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడం ఒకందుకు మంచిదే. టెక్నాలజీతో అన్నీ అద్భుతాలే కాదు, ప్రమాదాలూ ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ఆ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేశాం. అన్నిటికీ స్మార్ట్ ఆలోచనలే చేశాం. ఏం కావాలన్నా స్మార్ట్‌గానే పనైపోతుందని అనుకున్నాం. అలాగే అయ్యాయి కూడా. ఇంట్లో కూర్చునే కూరగాయలు కూడా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నాం. ఫిజికల్ మనీని డిజిటల్ మనీ రీప్లేస్ చేసేలా చర్యలు తీసుకున్నాం. కానీ మాల్ వేర్ ప్రపంచాన్ని వణికించేయడంతో ఇప్పుడంతా పునరాలోచించాల్సి వస్తోంది. ఒక్క మాల్ వేర్, ప్రపంచాన్ని స్తంభింపజేసేస్తే ఆ ప్రమాదం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. అంచనాలకు అందని సాంకేతిక విధ్వంసం జరిగిపోయిందని నిపుణులు అంటున్నారు. 'పరువు పోతుంది' అనే కోణంలో జరిగిన నష్టం గురించి ఎవరూ పెదవి విప్పడంలేదట. అయితే మాల్‌వేర్‌ని నిరోధించడానికి సకాలంలో చర్యలు చేపట్టడంతో నష్టం సంభవించడంలేదని కూడా ఇంకొందరు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు.
హ్యాకర్లు ఎవరైనా కావొచ్చుగాక. మనిషి జీవనాన్ని సులభతరం చేస్తున్నవారే, మనిషి జీవనాన్ని భయాందోళనల్లోకి నెట్టేస్తున్నారు. మనిషే అన్నిటికీ సృష్టికర్త. ప్రపంచం మీద అణుబాంబులు వేయక్కర్లేదు, మాల్ వేర్ లాంటి టెక్నాలజీ బాంబులు పేల్చితే చాలు ప్రపంచంలో కనీ వినీ ఎరుగని విధ్వంసం చోటు చేసుకుంటుంది. బ్యాంకింగ్ వ్యవస్థ కుప్ప కూలిపోతే, రవాణా వ్యవస్థ స్తంభించిపోతే, మ్యూనికేషన్ వ్యవస్థ నిలిచిపోతే, హెల్త్ రంగం కుదేలైపోతే - ఇదంతా జస్ట్ ఓ చిన్న మాల్ వేర్‌తోనే అయితే ఆ దారుణాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. సృష్టికర్తలం మనమే, విధ్వంసకారులమూ మనమే. బీ అలర్ట్. సాంకేతికత అన్ని సందర్భాల్లోనూ అద్భుతం కాదు. అతి సర్వత్ర వర్జయేత్.