చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaaram

ఒక్కొక్కప్పుడు చూస్తూంటాము, ఎవరైనా వాళ్ళింట్లో జరగబోయే, వివాహ మహోత్సవానికి, ఆహ్వాన పత్రిక ఇచ్చేటప్పుడు, దాంట్లో 'బంధుమిత్ర పరివారం...' అని ఉన్నప్పటికీ, మన పేరు వ్రాసేటప్పుడు, కవరు పైన, ఫలానా శ్రీమతి, శ్రీ అని వ్రాస్తూ ఎండ్ ఫామిలీ అనికూడా వ్రాస్తూంటారు. కానీ కొంతమందుంటారు, ఇంటి పెద్ద ఒకడినే పిలుస్తారు! మహ అయితే, అతని భార్యనీ.రిసెప్షన్ లో ఎన్ని ప్లేట్లు డిన్నరో, లంచో ఖర్చవుతుందో తెలియాలి కదా. ఇలా ఇంటి పెద్ద బతికుంటే అతని పేరూ అండ్ ఫామిలీ అని రాసినా కొంతవరకూ బాగానే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో జరుగుతున్నదేమిటంటే, రెండో తరం వారి పేరుమీద ఇన్విటేషను ఇవ్వడం, అలాటప్పుడు ఆ భార్యా భర్తా వెళ్తే బాగుంటుంది కానీ, కుటుంబం మొత్తం వెళ్ళాల్సిన అవసరం లేదు.

ఇంకో రకం జనాల్ని కూడా చూశాను.మా కొలీగ్గొకడు, వాళ్ళ అమ్మాయి పెళ్ళికి, మగ కొలీగ్గులని మాత్రమే పిలిచాడు. పొనీ మర్చిపోయాడా అందామా అంటే, ప్రత్యెకంగా మరీ చెప్పాడు- కొలీగ్గులని మాత్రమే పిలుస్తున్నానూ అని! ఈ కారణంగా ఎవరూ వెళ్ళలేదనుకోండి, అది వేరే విషయం.  ఇంకొకతనూ అలాగే, కొలీగ్గులనే పిలిచి, ప్రత్యేకంగా చెప్పాడు, ఇంటికొక్కరే అని!

అందుకే అంటాను, ఏ విషయమైనా, అనుభవం మీదే తెలుస్తుందీ అని. ఎవరో చెప్తే అంత పట్టించుకోరు. ఊరికే చెప్పొచ్చారూ పేద్ద, ఎవరో ఒకరి పేరు వ్రాస్తే సరిపోదా అని.అది పధ్ధతి కాదు, శ్రీమతి, శ్రీ ఫలానా ఎండ్ ఫామిలీ అని వ్రాస్తే, మీ సొమ్మేంపోయిందండీ, అలా వ్రాస్తే, ఏమైనా ఫామిలీ అంతా తీసికొచ్చేస్తారని భయమా, అలా తీసికొచ్చేవాడు, మీరు వ్రాసినా వ్రాయకపోయినా తీసికొస్తాడు.కానీ, అలా వ్రాయనప్పుడు మాత్రం, నాలాటి తిక్క శంకరయ్యలు పట్టించుకుంటారు! రేపెప్పుడో కనిపించి, మా రిసెప్షన్ కి ఎందుకు రాలేదూ అని అడిగితే, ఇదీ కారణం అని చెప్పే ధైర్యం ఉందా, అదీ లేదూ.   శుభలేఖల్లో చూస్తూంటాము, క్రింద ఫలానా వారి అభినందనలతో అని, వాళ్ళ కుటుంబం లోని బంధువులందరి పేర్లూ వ్రాస్తూంటారు. ఎవరి పేరు వ్రాయకపోతే వారికే కోపం.ఎక్కడిదాకానో ఎందుకూ, మా ఇంట్లోనే, మా పెద్దన్నయ్య గారి పెళ్ళి అయినప్పుడు, శుభలేఖ, మా పెదనాన్నగారి పేరుమీద వేశారు, ఫలానా మా సోదరుడి కుమారుడు అని మా నాన్నగారి పేరు ఎలాగూ వేశారు, వచ్చిన గొడవల్లా, మా ఇంకో పెదనాన్నగారి పేరు రాలేదని ఆయనకి కోపం వచ్చింది! ఈ రోజుల్లో అసలు ఆ గొడవలే లేవు- " బంధుమిత్రుల అభినందనలతో.." అని వ్రాసేస్తున్నారు!

ఇది వరకటి రోజుల్లో పెళ్ళి  నిశ్చయం అయిన తరువాత, ఈ శుభలేఖలు అచ్చేయించి, వాటిని బంధుమిత్రులకి పోస్టు చేయడమనేది ఓ పెద్ద కార్యక్రమం.  ఆ శుభలేఖకి నాలుగు మూలలా పసుపు రాయడం ఒకరూ, వాటిమీద ఎడ్రసు రాయడం ఇంకొకరూ, వాటికి తగిన పోస్టల్ స్టాంపులు అతికించడం ఇంకోరూ, వాటిని పోస్టు డబ్బాలో వేయడం ఇంకోరూ… ఇలా ఉండేది.

చెప్పొచ్చేదేమిటంటే, ఎప్పుడైనా శుభకార్యాలకి ఆహ్వానం పంపేటప్పుడు వీలైనంతవరకూ ఇంటి పెద్ద పేరు వ్రాసేసి, ఎండ్ ఫామిలీ అని వ్రాసేస్తూండండి. ఇంకో విషయం ఈ కార్డులు ఇచ్చేటప్పుడు చూస్తూంటాము, ఎవడిదో పేరు కొట్టేసి, ఏ ఇంటికైతే వెళ్ళామో ఆఇంటాయన పేరు వ్రాసేయడం! ఇదో పరమ దౌర్భాగ్య పధ్ధతి.ఏదో టైము కలిసొస్తుంది కదా అని , ఎవరెవరికివ్వాలో వాళ్ళ పేర్లన్నీ వ్రాసేస్తారు, ఆ ఇంటికెళ్ళే సరికి, వాళ్ళ పేరున్న కార్డు ఛస్తే దొరకదు, దాంతో చేతికొచ్చిన కార్డు తీసి, దాని మీదున్న పేరు కొట్టేయడం. హాయిగా బ్లాంకు కార్డులు తీసికుని, ఎవరింటికైతే వెళ్ళేమో వారి పేర్లు వ్రాసి ఇవ్వడం మంచి పధ్ధతి. పైగా మనం పేరు వ్రాసే లోపులో, కాఫీయో, చాయో దొరికినా దొరకొచ్చు!. ఇలా బ్లాంకు కార్డులుంటే, ఎవరింటికో వెళ్ళినప్పుడు, ఏ తెలిసిన పెద్ద మనిషో ఉంటే ఆయన పేరుమీదా, ఓ కార్డిచ్చేయొచ్చు. ఇలాటివన్నీ మొహమ్మాటం పిలుపులే అనుకోండి.

ఇవన్నీ శుభలేఖలు స్వయంగా అందచేయాలనే సదుద్దేశం ఉన్నప్పుడు మాత్రమే. ఈరోజుల్లో ఎక్కడ చూసినా  ఓ శుభలేఖని  scan  చేసేసి, తెలిసినవారందరికీ mail  లోనో  Whatsapp  లోనో పంపించేస్తున్నారు. నయాపైసా ఖర్చు లేని పని.. పోనీ మర్యాదకోసం ఫోనైనా చేసి చెప్తారా అంటే అదీలేదూ, ఏ కొద్ది సందర్భాల్లో తప్ప. సమాచార వ్యవస్థ మెరుగుపడింది కదా అని, ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదని పట్టించుకునేవారు కూడా ఉంటారు.

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు