పోతన గారి రామాయణం :పుస్తక సమీక్ష - సిరాశ్రీ

pothana gari ramayanam book review

పుస్తకం: పోతన గారి రామాయణం
వెల: 120/- (యూఎస్$12)
ప్రతులకు: జయంతి వి సుబ్బారావు - అమెరికా (216)765-0377
           : అక్కిరాజు రమాపతి రావు, హైదరాబాద్ (27423352)

పోతన అనగానే భాగవతం గుర్తొస్తుంది గాని రామాయణం గుర్తురాదు. కానీ ఇది పోతన గారి రామాయణం. ఇదెప్పుడు రాసాడని సందేహం రావొచ్చు. వేరుగా రాసింది కాదు. పోతన భాగవతం నుంచి నేరుగా తీసుకున్న రామాయణ సంబంధమైన పద్యాలన్నీ ఒక పుస్తకంగా వేసారు శ్రీ రామ జయంతి ప్రచురణల వారు. అక్కిరాజు రమాపతి రావు సార్థతాత్పర్యం వ్రాసారు ప్రతి పద్యానికి.

పోతన రాసింది కృష్ణ సంబంధమైన భాగవతమే అయినా అందులో కావాల్సినంత రామాయణం కూడా ఉంది. రామభక్తిలో మునిగి విష్ణు కథకు శ్రీకారం చుట్టి కృష్ణ కథను విస్తారంగా రాసాడు పోతనామాత్యుడు.

"పలికెడిది భాగవతమట
పలికెంచెడివాడు రామభద్రుండట
నే పలికిన భవహరమగునట
పలికెద వేరొండుగాథ పలుకగనేలా!?"  అనే పద్యం నోటికి రాని తెలుగు భాషాప్రియులు చాలా అరుదు.

శ్రీ రామచంద్ర జననం నుంచి, రావణ సంహారం వరకు, అటుపైన ఉత్తర రామాయణ ఘట్టాలు, సీత భూమిలో క్రుంగిపోవడం, రామావతార పరిసమాప్తి దాకా.. రామాయణ కథను శీఘ్రగతిలో కళ్లకు కట్టేస్తుంది ఈ పుస్తకం. మొత్తం 105 పద్యాల్లో పోతన పద్యాల్లో రామాయణాన్ని దర్శించవచ్చన్నమాట.

కథ ఏదైనా కథన రమణీయత వల్ల కావ్యం రాణిస్తుంది. లేకపోతే హైరాన పెడుతుంది. ఎక్కడా హైరాన పెట్టే భాషగాని, నారికేళ పాక రచన గాని, లయాత్మకత లేని పద్యం కాని, అతి వర్ణనలు కానీ లేకుండా చక్కని భాషా చమత్కృతులతో ఆద్యంత రమణీయంగా ఒకాసారి చదివాక, మళ్ళీ మళ్ళీ చదివింపజేసేలా ఉంటుంది ఈ పొత్తం. అంతా పోతన గారి కవిత్వ మహత్వ పటుత్వం, అక్కిరాజు వారి సంకల్పం, మన ప్రాప్తం.

పోతన భాగవతం చదవాలని చాలా మంది అనుకుని అంతలావు గ్రంథాన్ని చూసి భయపడి మళ్ళీ దాని జోలికి పోని అల్పశక్తులు, అల్పాసక్తులు నాకు తెలుసు. అటువంటి వారికి ఈ పెద్ద పెద్ద అక్షరాల్లో ముద్రితమైన ఈ 105 పద్యాలు రుచి చూపిస్తే చాలు.. పూర్ణశక్తులు, పూర్ణాసక్తులు అవ్వడం ఖాయం. ఆపైన పోతన భాగవతం ఈదినవాడికి ఈదినంత, తాగిన వాడికి తాగినంత.

ఇంతకు మించి నా అనుభూతులు పంచుకోవడం కంటే ఈ పుస్తకంలోని పోతన గారి పద్య పంక్తులు కొన్ని మీ ముందు పెట్టి ముగిస్తాను.

"..దునుమాడె రాముడదయుండై బాలుండై-
కుంతలఛ్ఛవి సంపజ్జిత హాటకన్,
కపట భాషా విస్ఫురన్నాటకన్,
జవభిన్నార్యరమ ఘోటకన్,
కర విరాజత్ఖేటకన్,
తాటకన్".

ఆ ప్రాసాలంకారం చూడండి. పోతన గురించి బాగా తెలిసినవారికి సరే గాని, దాదాపు అన్ని పద్యాల్లోను ఇలాంటి ప్రాస క్రీడే ఉంటుందంటే ఆయనగురించి అస్సలు తెలియని కవితా ప్రియులకి ఎలా ఉంటుంది? మరో పద్యం గురించి తెలుసుకోవాలనుంటుంది..

ఇదిగో ఇంకోటి..

"...దండకారణ్యము
తాపసోత్తమ శరణ్యము
ఉధ్ధత బర్హి బర్హ లావణ్యము
గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సాద్గుణ్యము
ఉల్లసత్తరునికుంజ వరేణ్యము
అగ్రగణ్యమున్"

ప్రాస సరే, మిగతా పదాలకి అర్థాలేమిటని కంగారుపడొద్దు. ప్రతి పదానికి అర్థం, తాత్పర్యం విపులంగా ఉన్నాయి.  ఇక మీ ఓపిక, తీరక.. నా సమీక్ష చాలిక!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు