ఇదివరకు రోజుల్లో అయితే ఇంటి పెద్ద ఏదైనా చెప్పితే నచ్చినా నచ్చకపోయినా,ఆయన మాట వినేవారు.ఎందుకూ, ఏమిటీ అని అడిగే ధైర్యం ఉండేదికాదు.అది గౌరవం కొద్దీ అయిండొచ్చు, భయం వలన కూడా అయిండొచ్చు.ఏమిటీ అని ఇప్పుడు ఆలోచించినా అర్ధం అవదు. ఒకటి మాత్రం అర్ధం అవుతుంది--కాలం మారింది.ఇప్పుడు అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ ఏదైనా చెప్పగానే వినేది--' వై '(ఎందుకూ?) అనే పదం. సో కాల్డ్ మనస్థత్వ విశ్లేషకులు దానికి ఏదో ఆధునిక అర్ధం చెప్తారు.ప్రస్తుత జనరేషన్ ప్రతీదీ దానికి కారణం చెప్పకుండా అంగీకరించరూ, వాళ్ళు కన్విన్స్ అయితేనేకానీ ఒప్పుకోరూ అంటూ. మరి ఆయనకి (విశ్లేషడు గారికి) ఇంట్లో పిల్లలు లేరా,ఉంటే ఆయన పరిస్థితి ఏమిటీ,అనేవి మనకు తెలియదు.ఎవడో పేషెంట్ వచ్చాడూ,వాడికి జెంబో నింబో ఏదో చెప్పేసి, మన ఫీజు తీసేసికుందామూ అనే తొందర.
ఇంట్లో ఉన్న కొడుకు,కూతురు దగ్గరనుండి, మనవళ్ళూ,మనవరాళ్ళ దాకా ఎవడూ ఈ పెద్దాయన మాటని 'ఎందుకూ' అని అడక్కుండా వదలరు. పాపం ఈయనకేమో ఈ 'ఎందుకూ' కి సమాధానం తెలియదు.తను వాళ్ళ నాన్న మాట ఎలాగైతే విన్నాడో అలాగ ఇప్పటి వాళ్ళు వింటారనుకుంటాడు-'పూర్ సోల్ '.ఇంట్లో ఉన్న కూతురు కానీ, కొడుకు కానీ చదువైపోయిన తరువాత సడెన్ గా ఇంట్లో 'ఓ బాంబ్ ' వేస్తారు--'నేను ఫలానా అమ్మాయి/అబ్బాయి ని ఇష్ట పడుతున్నానూ అని. ఇంక ఇంట్లో ఉన్న ఈ పెద్దాళ్ళు గింజుకుంటారు. 'అయ్యో మా చిన్నప్పుడు ఇలాటివి విన్నామా ' అంటూ.ఏం చెయ్యాలో తెలియదు, పోనీ వద్దందామా అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళి చేసికుంటారేమో అని ఓ భయం.కొంతమందిని చూశాను- అమ్మాయో,అబ్బాయో ఇలాటిదేదైనా చేసినప్పుడు, సినిమాల్లో తల్లితండ్రుల్లాగ ' నీకూ,మాకూ ఏం సంబంధం లేదూ, నీ ఇష్టం వచ్చినట్లు చేసికో'అనేస్తారు. అమ్మయ్యా గొడవ వదిలిందిరా బాబూ అని, రిజిస్టార్ ఆఫీసుకి వెళ్ళి దండలు మార్చేసికొని కాపురం పెట్టేస్తారు.
ఈ పధ్ధతే హాయి, పెళ్ళిఖర్చులేమీ ఉండవు.కొడుక్కైనా కూతురు కైనా ఈ రోజుల్లో పెళ్ళి ఖర్చులు ఒకలాగే ఉంటున్నాయి. ఓ ఏడాది అయ్యేసరికి ఏ పిల్లో పాపో పుడుతుందనేసరికి, ఈ పెద్దాళ్ళ సోకాల్డ్ కోపాలూ,తాపాలూ తగ్గుతాయి.ఏ అమెరికాయో అయితే పురుళ్ళుపోయడానికి వెళ్ళడం వగైరా వగైరా.. చూశారా పెళ్ళి ఖర్చులు ఎలా తప్పించుకున్నారో.మన చేతికి తడీ అవలేదూ,అయే పని ఎలాగూ అయింది.ఈ రోజుల్లో కొంతమంది రిటైర్ అయిన తల్లితండ్రులు బాగా స్మార్ట్ అయ్యారు.ఇలా చేస్తే ఊళ్ళోవాళ్ళ దగ్గర తన పరువూ నిలబడుతుందీ,పెళ్ళి ఖర్చూ ఉండదూ, ఎలాగూ ఓ రెండేళ్ళు పోయిన తరువాత అందరూ కలిసే ఉంటారు. ఈ 'మాచ్ ఫిక్సింగ్' హాయి. ఎవడైనా అడిగినా చెప్పొచ్చు-'మా మాట వినకుండా, ఇంట్లోంచి వెళ్ళీ పెళ్ళీ చేసేసుకున్నాడూ, ఏం చేయమంటారూ' అని. రెండేళ్ళ తరువాత ఈయనా, పెద్దావిడా అమెరికా పిల్ల/పిల్లాడి దగ్గరకు ఏ పురిటికోసమో వెళ్ళి వచ్చినా ఎవరడిగినా ఒకటే మాట-" ఏం చెయ్యమంటారూ, మా ఆవిడకి ఆ పిల్లలంటే చచ్చే అభిమానం, ఒక్కరోజూ ఏడవకుండా ఉండడం లేదూ, ఇంక నేనే పట్టుదలలకి పోవడం ఎందుకనీ సరే అన్నాను' అని మొత్తానికి తనేదో చాలా 'ప్రిన్సిపుల్డ్ మనిషి' అనీ, ఇంటావిడేదో 'వీక్ మైండెడ్ ' అనీ పబ్లిసిటీ ఇచ్చేస్తాడు. ఏమైతేనేం మొత్తానికి తను అనుకున్నది సాధించాడు. ఇదంతా ఏదో 'స్పాంటేనియస్ ' గా జరిగినది కాదు.' ప్రీ మెడిటేటెడ్, ప్రీ ప్లాన్డ్ కాన్స్పిరసీ '. పిల్లలంటే అంత ప్రేమ ఉన్నవాళ్ళు, మొదట్లోనే ఒప్పుకోవచ్చుగా.అమ్మో సంఘంలో ఎంత తలవంపూ!
మామూలుగా ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి రెండు కులాల పిల్లల మధ్యే జరుగుతూంటాయి అదేం చిత్రమో! హాయిగా వాళ్ళడిగినట్లుగా చేసేస్తే పోలేదూ? వాళ్ళకి కావలిసినట్లు వాళ్ళెలాగూ చేస్తారు,తరువాత ఏమైనా ప్రోబ్లెం వచ్చినా మనని తప్పు పట్టరు,పట్టలేరు.రిటైర్ అయిన తరువాత బ్రతికే కొద్దికాలమైనా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండొచ్చుగా. ఈ మధ్యన మా స్నేహితుడొకడు (నాకంటే అయిదేళ్ళు ముందర రిటైర్ అయ్యాడు), ఓ కూతురూ, కొడుకూ.కూతురికి పెళ్ళిచేశాడు చాలా కాలం క్రితం. పిల్లాడికి సంబంధాలు వెదకడానికి తల ప్రాణం తోక్కి వస్తోంది.పిల్లకి ఎన్ని స్పెసిఫికేషన్లో-ఒకళ్ళకి నచ్చితే ఇంట్లో ఇంకోళ్ళకి నచ్చదు.కట్నకానుకలూ, సంప్రదాయం వగైరా వగైరా... ఇప్పటికి చాలా సంబంధాలు చూశారు,'పోనీ వీడైనా ఎవరినో ఒకర్ని లవ్ చేసేస్తే బాగుండునూ' అనుకుందామా అంటే, 35 ఏళ్ళు దాటేయి లవ్ చేయడానికి ఇప్పుడు వాడికెవ్వరు దొరుకుతారూ అంటాడు. అలాగని వీడికి పధ్ధెనిమిదీ, ఇరవయ్యేళ్ళ పిల్ల ఎక్కడ దొరుకుతుందీ.ఇదివరకు రోజుల్లోలాగ పదేళ్ళూ, పన్నెండేళ్ళూ వ్యత్యాసం ఉండడం కుదరదు. ఎక్కడో అక్కడ కాంప్రమైజ్ అవల్సిందే.
ఇంకో స్నేహితుడిని చూశాను-బెంగాలీ.ముగ్గురు కొడుకులు.పెద్దాడికి పెళ్ళయింది ఈయన సర్వీసులో ఉండగానే. రిటైర్ అయి నాలుగేళ్ళయింది. మొన్నో రోజున రెండో వాడు 'ఓ మరాఠీ అమ్మాయితో పెళ్ళి చేసికుంటానూ'అన్నాడుట.ఇక్కడ మా స్నేహితుడు రియలిస్టిక్ గా ఆలోచించి ఒప్పుకున్నాడు. ఈ రెండో వాడికి ఎలాగూ తల్లితండ్రులు ఒప్పుకున్నారు కదా అని, మూడో వాడు కూడా తన 'ఇండెంట్' పెట్టేశాడు ఇంకో మరాఠీ పిల్లతో.ఈ మధ్యన నా స్నేహితుడు కనిపించి, 'అస్సలు నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండడంలేదూ, ఇంట్లో ఇదీ గొడవా అన్నాడు. అతన్ని ఓ గంట కూర్చోపెట్టి ఎలాగోలాగ కన్విన్స్ చేశాను. అంతా విని 'నీకేం ఎంతైనా చెప్తావూ, నీదేం పోయిందీ' అన్నాడు. అప్పుడు చెప్పాను, మా పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్టప్రకారమే చేశామూ,హాయిగా ఉన్నారూ అని. మెల్లి మెల్లిగా జనాల్లో మార్పు వస్తూంది.మరీ ఛాందసంగా ఉండకుండా కొంచెం 'ఫ్లెక్సిబుల్' అవుతున్నారు !!
అయినా ఇంకా కొందరు, పిల్లల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఒఎళ్ళిళ్ళు చేస్తున్నారు. అలాగని పిల్లలకి తోచినట్టుగా చేయమనీ కాదూ… ఏదో అందరికీ నచ్చినట్టు చేస్తే, వాళ్ళూ సుఖపడతారూ, ఈ పెద్దాళ్ళూ వీధిన పడక్కర్లేదు….
సర్వేజనాసుఖినోభవంతూ…