నందప్రయాగ నుంచి మా ప్రయాణం బదరీ నాధ్ వైపు సాగింది . సుమారు 63 కిలో మీటర్ల ప్రయాణం తరువాత విష్ణు ప్రయాగ చేరేం .బదరీనాథ్ దారిలో వున్న పంచప్రయాగలలో ఒకటిగా యీ విష్ణు ప్రయాగని లెక్కపెడతారు . ఇక్కడ అలకనంద ' నీతి పాస్ ' లో పుట్టిన దౌళిగంగతో సంగమించి విష్ణు గంగగా పిలవబడుతోంది . ధౌళి గంగ నీరు చాలా తెల్లగా ప్రవహిస్తూ పాల నురుగను తలపిస్తుంది .
సంగమం నుంచి కాలినడకను రెండు మూడు కిలో మీటర్లు వెళితే విష్ణు కుండం వస్తుంది . పచ్చని ప్రకృతి మధ్యన యీ కుండం చాలా ప్రశాంతతను కలుగ జేస్తుంది . అందుకనేనేమో నారదుడు విష్ణుమూర్తి కొరకై యిక్కడ తపస్సు చేసుకొని విష్ణుమూర్తి ని పిన్నును చేసుకున్నాడు . పురాతనమైన పాడు పడ్డ చిన్న మందిరం , విష్ణుకుండినులు తప్ప మరకమీద లేవు .
విష్ణ ప్రయాగ లో 400MW హైడెల్ పవర్ ప్రోజెక్ట్ నిర్మ్ంచిన తరువాత యిక్కడ జనావాసాలు పెరిగాయి , కాలక్రమేణా విష్ణు కుండానికి ప్రాముఖ్యత పెరిగి యీ మందిరం పునరుధ్దరింప బడుతుందని ఆశిద్దాం .
విష్ణుప్రయాగ కి దగ్గరగా వున్న ' హనుమన్ చట్టి ' నుంచి కాలినడకన వెళితే హనుమంతుడి మందిరం వుందని అన్నారు , కాని ఆ నిర్జనమైన దారిలో మందిరానికి వెళ్లే సాహసం చెయ్యలేక పోయేము .
సంగమ ప్రదేశంలో విష్ణు గంగ పైన షడ్భుజాకారంలో ఓ చిన్న మందిరం వుంది , ఆ మందిరం ' అహల్యా బాయి హోల్కర్ ' చే నిర్మింపబడిందని , అందులో ఆమె తపస్సు చేసుకొనేదని స్థానికులు చెప్పేరు .
మేం వెళ్లినప్పుడు ఆ మందిరానికి మరమ్మత్తులు చేస్తున్నారు .
హైడల్ పవర్ ప్రాజక్టు రావడంతో యీ గ్రామం పట్నం గా మారింది , యిళ్లు, గెస్ట్ హౌసులు స్కూల్స్ వచ్చేయి . రోడ్లుకూడా విశాలంగా మారేయి .
విష్ణు ప్రయాగ నుంచి మనకి మంచుతో కప్పబడ్డ పర్వతాలు కన్పించి కనువిందు చేస్తాయి . పాతికేళ్లముందు ఋషికేశ్ నుంచే చలి మొదలయేది , అడపాదడపా గడ్డకట్టిన మంచు కొండలపై కనిపిస్తూ , ఒక్కో మలుపులో వరసగా తెల్లని మంచుకప్పుకున్న యెత్తైన పర్వతాలు కనువిందు చేసేవి . కాని యిప్పుడు అలాంటి సుందర దృశ్యాలు సుమారుగా లేవనే చెప్పాలి .
బదరీ వెళ్లే దారిలో వచ్చే మరో చిన్న వూరు ' హేలంగ్ ' , యీ వూరు లో పదికి మించి యిళ్లు వుండవు కాని యీ వూరికి దగ్గరగా వున్న మూడు మందిరాలవల్ల యీ వూరు యాత్రీకులలో ప్రాముఖ్యతను పొందింది .
ఇక్కడ నుండిసుమారు రెండుకిలోమీటర్ల దూరంలో కొండదిగువన పంచబదరీ క్షేత్రమైన ' ధ్యానబదరి మందిరాన్ని దర్శించుకోవచ్చు . చాలా చిన్న మందిరం . ఇక్కడ బదరీ నారాయణుడు ధ్యానం చేసుకున్నాడనేది స్థలపురాణం వల్ల తెలుస్తోంది .
హేలంగ్ నుంచి సుమారు పద్నాలుగు కిలోమీటర్ల నడక తరువాత పంచకేదార క్షేత్రమైన ' కపాలేశ్వర మందిరాన్ని , భవిష్య కేదార్ మందిరాన్ని దర్శించుకో వచ్చు .
బదరీ వెళ్లే దారిలో వచ్చే మరో వూరు ' పిపల్ కోటి ' . దీని గురించి ప్రత్యేకంగా యెందుకు చెప్తున్నానంటే యీ ' పిపల్ కోటి ' లో మనకి కాలసిన దక్షిణ భారతదేశముపు ఫలహారాలు దొరకు తాయి . ఇప్పడు మనకి బదరీనాథ్ లో కూడా మన ఆహారాలు గత అయిదారు సంవత్సరాలుగా దొరకుతున్నాయి . కాని ' పిపల్ కోటి ' లో పాతిక సంవత్సరాల నుంచి ( అప్పట్లోనే మొదటి మారు యాత్ర కి వెళ్లేం ) పాతికేళ్ల కిందట బదరీ లో అన్నం పెరుగు దొరికేవి కావు . పాలు లేని కాఫీ , టీ లు వుండేవి , అప్పట్లో మంచి టీ టిఫిన్స్ , భోజనం ' పిపల్ కోట ' లోనే దొరికేవి .
జోషీమఠ్
ఋషికేశ్ కి సుమారు 251 కిలోమీటర్ల దూరంలో ఉత్తరాఖండ్ రాష్ట్రం లో చమోలి జిల్లాలో వుంది జోషిమఠ్ .
శీతాకాలంలో బదరీనాథుని మందిరం మూసివేసినప్పుడు ఆ విగ్రహాలను జోషిమఠ్ లో వుంచి పూజలు చేస్తారు .
శంకరాచార్యుల వారు పురాణాలలో వున్న బదరీనాధ్ వర్ణనను అనుసరించి యిక్కడకు రాగా హిమపాతం వల్ల బదరీకి దారి మూసుకు పోగా ఆది శంకరులు తన శిష్యులతో యిక్కడ బస చేసి మఠస్థాపన చేసి మంచు కరిగినతరువాత బదరీ చేరి నారద కుండంలో వున్న విగ్రహాలను వెలికి తీసి ప్రతిస్టించేరు . శంకర భగవత్పాదులు నివాసమున్న స్థలం వారు వాడిన వస్తువుల యిక్కడ మనం చూడొచ్చు . శంకరాచార్యుల వారిచే స్థాపింపబడ్డ బదరీపీఠం జోషిమఠలో వుంద్ , యీ మఠం అధర్వణ వేదానికి సమర్పితమైంది .
జోషిమఠ్ లో టాక్సీ స్టాండు నుంచి కిందకి దిగితే నరసింహ మందిరం వస్తుంది . ఇది చాలా పురాతన మైన మందిరం , లోపల పూజారుల నివాసాలు వున్నాయి , పైన గదులలో ఆదిశంకరుల పడక , ఆసనం మొదలైనవి చూడొచ్చు . యీ మందిరానికి వున్న ప్రాముఖ్యత యేమిటంటే యీ మందిరం లో వున్న మూలవిరాట్టు కి ఒక చెయ్య విరిగిపోయి వుంటుంది . రెండో చెయ్య విరిగి పోయిన నాడు బదరీనాథ్ మందిరప్రాంతం మొత్తం నేలమట్టం అయిపోతుందట . తర్వాత బవిష్య బదరీ లో బదరీనారాయణుడు పూజలందుకుంటాడట .
జోషిమఠ్ నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో వున్న తపోవనం వెళ్లొచ్చు . తపోవనం ఋషులు మునులు తపస్సు చేసుకున్న ప్రదేశం అని అంటారు .
ఎక్కువ యాత్రీకుల తాకిడి లేని ప్రదేశం , ఆశ్రమాలు తప్ప మరేమీలేవు .
పచ్చని ప్రకృతి , ప్రశాంత కావాలనుకునే వారు తప్పక వెళ్ల వలసిన ప్రదేశం .
జోషిమఠ్ వూరులోంచి కొండపైకి వెళితే అక్కడ రెండుదారులు వస్తాయి . ఒకటి ఔలి , రెండవది తపోవనం వైపు వెళతాయి , బవిష్య బదరీ వెళ్లాలంటే తపోవనం రోడ్డు మీదుగా వెళ్లాలి .
భవిష్య బదరి వెళ్లడానికి ప్రయాణ సాధనాలు అంతగా లేవు , జోషిమఠ్ నుంచి టాక్సీ తీసుకోవచ్చు . ఋషికేశ్ నుంచి వచ్చిన టాక్సీలలో కూడా వెళ్లొచ్చు .
ఒకటి అరా లోకలు బళ్లు తప్ప మరే రాకపోక వుండవు , ఓ అయిదారు కిలో మీటర్లు వెళ్లిన తరువాత రోడ్డు కి కుడి వైపున రోడ్డు పైనే వేడినీటి బావి వుంటుంది . అందులో నీరు యెంత వేడిగా వుంటుందంటే నీరు కుతకుతలాడుతూ వుంటుంది . పసుపు వర్ణం లో లోపలనుంచి మన్ను బయటకి వస్తూ వుంటుంది . మేము బవిష్యబదరి వెళదామనుకొని స్థానికుల దగ్గర సమాచారం సేకరిస్తూ వుంటే వారు యీ బావి గురించి , అందులోంచి వచ్చే పసుపుపచ్చటి మన్ను గురించి చెప్పి ఆ మన్నుకి చాలా మెడిసనల్ వేల్యూ వుందని యెటువంటి చర్మ రోగమైనా తగ్గిపోతుందని అక్కడ చుట్టుపక్కల గ్రామాల వారు దానినే చర్మరోగాలకు మందుగా వాడుతారని చెప్పడంతో మేము రెండు మూడు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకు వెళ్లేం . మన్ను వేడిగా వుండటం వల్ల మేం డబ్బా తో తియ్యడాని ప్రయత్నిస్తే డబ్బా కడిగి సొట్టపడింది . అయితే యెలాగో మన్ను కలక్ట్ చేసేం .
సైన్సు ప్రకారం కిందన గంధకం నిక్షేపాలు వున్న చోట వేడినీటి బుగ్గలు యేర్పడతాయని , ఆ ప్రకారంగానే యిక్కడ పైకి వస్తున్న పసుపురంగు మన్నులో గంధకం కలసిందను కుంటే అక్కడ మట్టికి గంధకం వాసనలేదు . నాకు సల్ఫర్ యెలర్జీ వుండడం వల్ల నేను చర్మ రోగాలకు యే ఆయింట్ మెంట్ వాడను , వాడలేను . కాని యీ మన్ను వాడితే నాకు యెటువంటి ఎలర్జీ కలుగలేదు . ఈ వ్యాసం చదివిన పెద్దలు యెవరైనా నా సందేహం తీర్చగలరు .
అక్కడ నుంచి మరే 4 కిలో మీటర్ల ప్రయాణం తరువాత భవిష్య బదరీకి వెళ్లే కాలి దారి దగ్గర ఆగేం .
భవిష్య బదరీ స్థానికులలో ప్రాముఖ్యం పొందినా యెక్కువ యాత్రీకులు రాకపోడం తో యిక్కడ యాత్రీకులకు కావలసిన సదుపాయాలు లేవు , అంటే నడవ లేని వారికి కోసం గుర్రాలు , డోలీలు లాంటివి , వసతి సౌకర్యాలు లేవు .
భవిష్య బదరి కొండలపై అయిదు కిలో మీటర్ల నడకన చేరుకోవచ్చు . ఆ ప్రాంతంలో రెండే గుర్రాలున్నాయని , ప్రొద్దుట వెళితే గుర్రాలు దొరకొచ్చని , ఆలశ్యం అయితే మన్నుమొయ్యడానికి తీసుకు వెళ్తారని చెప్పడంతో తొందరగా వెళ్లేం, స్థానికులు చెప్పినట్లు మాకు ఆ గుర్రాలు దొరికేయి , అయితే జీను కట్టని గుర్రాల మీద ప్రయాణం మహా సాహసమనే చెప్పాలి . యెలోగోవోలా ప్రయాణించసాగేం . గుర్రాలతోపాటు వూరు మీదుగా వూరంటే నాలుగు కుటుంబాలు అంతే , అదేవూరు . అక్కడ ఆ పేదవారిచ్చిన ఆథిధ్యం తీసుకున్నాం , యేదో వారు వండుకున్నది మాకు పెట్టేరు , అది తిని మేం యిచ్చిన డబ్బు వారు పుచ్చుకోకపోతే వారి పిల్లల చేతిలో పెట్టి బట్టలు కొనుక్కోమని చెప్పేం .
వారు వాళ్ల యిళ్ల ముందున్న స్థలంలో కూరగాయలు , గోధుమలు పండించుకుంటున్నారు .
తర్వాత దారిలో మరో పల్లెను కూడా దాటేం , పడిపోతున్న పెద్దపెద్ద రాళ్లను దాటుకొని , జలపాతాలను దాటుకొని పైకి చేరేం . పైన పేద్ద మైదానం , కనుచూపు మేర వరకు పచ్చని తివాసీ పరచినట్లుంది .
అక్కడ నుంచి పచ్చిక మీద నడుస్తూ మరో అర కిలో మీటరు నడిచేం , ఆ నడక ఆయాసం కలుగజేసినా రెండింతలు అహ్లాదాన్నిచ్చింది . కోనిఫర్ చెట్లతో నిండివున్న అడవిని చేరడం అక్కడ చిన్న కుటీరం , అందులో నివసిస్తున్న స్వామీజీని కలుసుకున్నాం , పేరడిగితే స్వామీజీలకు పేరేమిటి ? అనే సమాధానం చెప్పేరు . ఆ కుటీరం యెండని కాని వరాన్ని కాని ఆపలేదు , అలాగే స్వామీజీకి యే రక్షగా యివ్వలేదని చూడగానే తెలుస్తోంది . మరో కాషాయ అంగ వస్త్రం తప్ప మరేమీ లేవు . ఎలా వుంటున్నారు అనే ప్రశ్నకి " యిలాగే " అనే సమాధానం వచ్చింది .
మా గుర్రలాబ్బాయి , స్వామీజీ కుటీరానికి యెదురుగా వున్న కొండదగ్గరకు మమ్మలని తీసుకు వెళ్లేరు . కొండముందర చిన్న చిన్న కర్రలతో పందిర కట్టి వుంది , వెనుకాతలకొండని ఆనుకొని ఓ రాతి ఆకారం , కొండలోంచి బయటకి వస్తున్నట్టుగా వుంది . మొహం , కాళ్లు చేతులు వున్నాయి , మిగతా అవయవాలు తీరుగా యేర్పడలేదు . అదే బదరీనాథుని బవిష్య రూపమని , ఆకృతి పూర్తిగా యేర్పడిననాడు యిప్పటి బదరీ మూసుకుపోతుందని , యీ ఆకృతి బదరీనారాయణునిగా పూజలందుకుంటుందని వివరించేరు .
ప్రస్తుతం స్వామీజీ పూజలు నిర్వహిస్తున్నట్లు చెప్పేరు .
అక్కడ యెంత ప్రశాంతంగా వుందంటే అలా యెంతసేపైనా గడిపేయొచ్చని అని పించింది .
అయితే మా గుర్రాలబ్బాయి , స్వామీజీ పులులు తిరిగే వేళయిందని అంటే బయలుదేరి పోయేం .
రోజూ అదే వేళకు పులులు అటు వైపు వస్తాయట , స్వామీజీ రోజూ చూస్తూ వుంటారట , కాని అతనిని యేమి చెయ్యవట . నాకు నమ్మబుద్దికలుగలేదు .
మట్టిలోంచి , నూతులలోంచి విగ్రహాలు బయటకి రావడం చూసేం అలా వచ్చిన విగ్రహాలు పూర్తిగా చెక్కబడి వుండడం కూడా చూసేం , నిరంతరంగా నీటి రాపిడికి ఆకృతులు యేర్పడడం కూడా చూసేం కాని యిక్కడ యెటువంటి నీరు పడకుండా యెవరూ చెక్కకుండా ఓ కొండ నుంచి ఆకృతి వుబ్బుగా పైకి రావడం మహా వింతగా అనిపించింది . రెండు చేతులు , తల , కాళ్లు , మధ్య శరీరం తెలుస్తున్నాయి అలాగే ఓ చెయ్యి పైకెత్తి శంఖం ధరించినట్లు మరొక చెయ్య అభయముద్రలో వున్నట్లు తెలుస్తోంది .
ఆ ప్రదేశాన్ని వదిలి రాలేక రాలేక వచ్చేం .
తర్వాత తపోవనం వైపు ప్రయాణం సాగించేం . భవిష్య బదరీనుంచి సుమారు 10 కిలోమీటర్ల ప్రయాణానంతరం లోయ లాంటి ప్రాంతం చేరుకున్నాం .
మిగతా వివరాలు పై వారం చదువుదాం అంత వరకు శలవు .