చిన్నతనం లో అయితే జ్ఞాపకశక్తి బాగానే ఉంటుంది.కానీ వయస్సు పెరిగేకొద్దీ కొంచెం కష్టాల్లో పడిపోతూంటాము.అదీ ఏ సరుకు ఎక్కడ పెట్టామో,ఏ కాగితం ఎక్కడ జాగ్రత్తగా పెట్టేమో,సమయానికి ఛస్తే గుర్తుకు రాదు.సరుకులైతే ఫర్వా లేదు, కనిపించకపోతే బజారులోకి వెళ్ళి కొనుక్కునేనా రావచ్చు. కాగితాల సంగతి అలా కాదే.
కొంతమందికి ఓ అలవాటుంటుంది. బస్ టిక్కెట్లదగ్గరనుండి, ప్రతీదీ ఓ బ్యాగ్గులో పడేయడం. ఉద్యోగాలు చేసేవారికైతే టైముండదుకానీ, రిటైరయిన నాలాటి వాడికి పుష్కలంగా ఉండేది టైమే, డబ్బులు కావు.నెలకో, రెండునెలలకో ఇంటావిడ చేత చివాట్లు తిన్న తరువాత, అవన్నీ ముందేసుకొని, పోస్ట్ మాన్ లా సార్టింగ్ చేసి, అందులో మళ్ళీ కొన్ని వడబోసి, కాలక్షేపానికి,ఈ వ్యాపకం బాగానే ఉంది.ఇందులో కొన్ని పరీక్షల ముందు మార్క్ చేసుకుంటామే ప్రశ్నలు, Imp, V.Imp, V.V.Imp లాగ,కొన్నింటిని కప్బోర్డ్ లో దాచడం.వాటిని సార్ట్ చేయడానికి ఇంకో రోజు.
సమయానికి కనిపించనివి ఎన్నో ఉంటాయి. ఎప్పుడైనా అవసరం వస్తాయని తీయించుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు --ఎక్కడో భద్రంగా దాచేమని అనుకుంటాము,అబ్బే సమయానికి కనిపించవు. మళ్ళీ ఏదో ఫోటోఫాస్ట్ కో వెళ్ళి, ఇంకో డజను ఫొటోలు తీయించుకోవడం.
ఈ డిజిటల్ కెమేరాలూ,హాట్షాట్లూ రాని ముందర, కొడాక్ డబ్బా కెమేరా తో తీసిన బ్లాక్ ఎండ్ వైట్ ఫొటోలు చాలానే ఉంటాయి,వీటినన్నీంటినీ ఆల్బంలో అంటించడానికి గత 30 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తున్నాను, ఈవేళా ,రేపూ అంటూ, వాయిదా వేస్తూ, అన్నీ కలిపి ఓ కవరులో జాగ్రత్త చేశాను. ఆ కవరులో ఉండి ఉండి,వాటి షేప్ కూడా మారిపోయింది. ఎప్పుడో జ్ఞాపకం వచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ చూసి ఆనందించడం!
మా ఇంట్లో ఉన్న wardrobe లో మా ఇంటావిడ నాకు ఒక్కటంటే ఒకటే అర అలాట్ చేసింది. పోనీ దానిలో నా బట్టలు పెట్టుకుందామా అంటే, మళ్ళీ అందులోనే,కొంచెం 'హడప్' చేస్తూంటుంది. ఏమైనా అంటే, మీకు,మీ బట్టలకీ ఈ మాత్రం జాగా ఎక్కువే అంటుంది ! వీటిలో నాచేత బలవంతంగా కొనిపించి,ధరింపచేసిన డ్రెస్సులూ(మా అబ్బాయి ఎంగేజ్మెంట్, వివాహం సందర్భంలో).అవి ఎప్పుడైనా వేసికుందామా అంటే, ఒక్కదానికీ బటన్ ఉండదు.అవన్నీ ఎక్కడో జాగ్రత్త చేసి ఉండే ఉంటాను!
ఇదిలా ఉండగా, ఇంట్లో అన్నిటికంటే ఎక్కువ జాగా ఆక్రమించేవి పాదరక్షలు.ఒక్కోళ్ళకి నాలుగేసి చెప్పులూ,నాలుగేసి షూస్సూ.నేను వీలైనంతవరకూ చెప్పులు వేసికుంటాను. ఎవరైనా ( ఇంకెవరు, మా ఇంటావిడ) బలవంతం చేస్తే షూస్ వేసికుందామనుకుంటే వాటికి సాక్స్ దొరకవు.దొరికినా వాటికి ఎక్కడో చిల్లుంటుంది.
ఏ ప్రయాణానికైనా వెళ్ళేముందర , ఎంత వెతికినా కనిపించని ముఖ్యాతిముఖ్యమైనవి సూట్ కేసులకీ, జర్నీ బ్యాగ్గుల జిప్పులకు వేయాల్సిన బుల్లి బుల్లి తాళాలు. ఛస్తే కనిపించవు. కిందటిసారి ప్రయాణం చేసి వచ్చి, పేద్ద గొప్పగా, ఆ సూట్కేసు జిప్పుకే తాళం కప్పని వేల్లాడతీయడం. మరి దాన్ని తీయడానికి ఓ తాళంచెవోటుండాలిగా. అన్నీ గుర్తుగా ఓ ప్లాస్టిక్ డబ్బాలో వేసినట్టైతే గుర్తుంటుంది. ఆ డబ్బా మాత్రం కనిపించదు. కానీ ఈ బుల్లిబుల్లి తాళాలకి ఓ సౌలభ్యం ఉంది. ఏ తాళంచెవితోనైనా, ఎలాటి తాళంకప్పనైనా ఠక్కున తీసేయొచ్చు.
ఈ రోజుల్లో ప్రతీదీ కొరియర్ ద్వారానేగా తెప్పించుకునేదీ--- ఆ తెచ్చినవాడు ఓ కాగితం ఇచ్చి సంతకం చేయమంటాడు—పెన్ను కనిపించదు. అప్పుడప్పుడు మందులన్నీ ఓ ప్లాస్టిక్ డబ్బాలోనూ, నొప్పి క్రీములన్నీ ఓ డబ్బాలోనూ విడివిడిగా పెట్టడం చేస్తాం. కానీ ఎక్కడ పెట్టామో మాత్రం గుర్తుకు రాదు.
అంతదాకా ఎందుకూ, ఊళ్ళోవాళ్ళందరికీ ఫోన్లు చేస్తామే, మన స్వంత నంబరు ఎంతమందికి గుర్తుంటుందీ? ఇదివరకటి రోజుల్లోనే హాయీ, ఓ నోట్ పుస్తకంలోనో, ఓ డైరీలోనో రాసుకునుంచుకునేవాళ్ళం. ఈ కొత్త మొబై ఫోన్లొచ్చిన తరవాత, దాంట్లోనే అవతలివాడి నెంబరెక్కించుకుని save చేసేసికోవడం.. పైగా వాటికి కూడా ఓ నెంబరిచ్చి, అదేదో Speed dial ట దాంట్లో దాచుకోవడం. పూర్తినెంబరు dial చేయడానిక్కూడా బధ్ధకం. ఫలానా నెంబరు నొక్కితే ఫలానావాడికి వెళ్తుంది. ఇంక నెంబర్లు గుర్తుండమంటే ఎక్కడ గుర్తుండి ఛస్తాయీ…
మహాత్ములు జ్ఞానం అన్వేషీంచేవారుట. మనమూ అలాగే జీవితమంతా ఏదో ఒకటి అన్వేషిస్తూనే ఉంటాము. ఎవరి కష్టాలు వాళ్ళవీ !!
ర్వేజనా సుఖినోభవంతూ…