ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

తపోవనం , ఔలి

భవిష్య బదరినుంచి సుమారు 5 , 6 కిలో మీటర్లు  ప్రయాణించగానే ఆ యెత్తులో  పచ్చిక మైదానాలు కనిపించి మనని ఆశ్చర్యానికి గురి చేస్తుంది . కొన్ని వేల యెకరాలు పచ్చిక తివాసీ కప్పుకున్నట్లు , అక్కడక్కడ రంగు రంగు పువ్వులతో అహ్లాదాన్ని కలుగ జేస్తుంది . చక్కని సువాసనలు వెదజల్లుతూ వీస్తున్న చల్లనిగాలి , జన్మంతా యిక్కడే గడిపెయ్యాలని అని పించక మానదు .

అక్కడక్కడ ఆపిల్ తోటలు ( యిక్కడ యాపిల్స్ కాస్త పుల్లగా వుంటాయి ) , దేవదారు , ఓక్ వృక్షాలతో కూడిన అడవులు కనిపిస్తాయి . ఋషులు మునులు తపస్సుచేసుకొని మంత్ర సిధ్దులను పొందిన ప్రదేశం . ప్రశాంతతను కోరే వాళ్లు సాధారణంగా యిక్కడ గడుపుతూ వుంటారు . ఈ ప్రాంతంలో మనశ్శాంతికి వచ్చిన మునుల ఆవాసాలను  వారి భక్తులు మరమ్మత్తులు చేసి ఆశ్రమాలుగా నడుపుతున్నారు . సాధారణంగా యీ ఆశ్రమాలలో పర్యాటకులకు ఉచిత భోజన వసతి సౌకర్యాలు అందజేస్తూ వుంటారు . ప్రవచనాలు , యోగా లాంటివి , చుట్టుపక్కల గ్రామాలలోని పిల్లలకు ఉచిత విద్య , వైద్య సౌకర్యాలు అందజేస్తూ వుంటారు .

ఆన్ లైన్లలో అలాంటి ఆశ్రమాలను చూసుకొని ముందుగా రూములు బుక్ చేసుకొని ఒకటి రెండు వారాలు యిక్కడ గడపగలిగితే అది మన జీవితంలో మరపురాని అనుభవంగా చెప్పుకోవచ్చు . వీలున్నవారు ప్రయత్నించండి , మీలో సకారాత్మకమైన మార్పులను గమనించండి .  పచ్చిక మైదానాలలో నడక మనోల్లాసాన్ని కలుగజేస్తుంది . ప్రకృతికి దగ్గరగా కలుషితంకాని గాలి నీరు ఆహారం పుచ్చుకుంటూ , యే వొత్తిడికీ లోనుకాకుండా కనీసం మూడు నాలుగు రోజులు గడిపితే యెంత హాయిగా వుంటుందో అనుభవించాలి అంతే .

ప్రతీ పచ్చికలోను , చెట్టులోనూ , గలగల ప్రవహించే సెలయేళ్ల లోనూ దైవం కనిపిస్తాడు .

నిశ్వార్ధ సేవలను అందిస్తున్న ఆశ్రమ వాసులలో సాక్షాత్తు భగవంతుడు కనిపిస్తాడు .

ఆ ప్రకృతిలో గడిపి రిలాక్సైన మేము జోషి మఠ్ కి సుమారు 22 కిలో మీటర్ల దూరం లో వున్న ఔలి చేరుకున్నాం .

ఔలి------

ఉత్తరాఖండ్ రాష్ట్రం లో చమోలి జిల్లాలో సుమారు 8200 అడుగుల యెత్తు నుండి పదివేల అడుగుల యెత్తు వరకు వున్న యెగుడు దిగుడుగా వుండే పచ్చిక మైదానాలు యిక్కడ ప్రత్యేకత .

దీనిని స్ధానికులు ' భుగియాల్ ' అని అంటారు , అంటే ' ఉద్యానవనం ' అని అర్దం . ఈ ప్రదేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ' హెవన్ టెర్రెస్స్ ' గా పిలుస్తారు . వేసవిలో యీ మైదానాలు పచ్చిక తోనూ పేరుతెలియని గడ్డి పూలతోనూ  , అక్కడక్కడ పచ్చిక మేస్తున్న పశువులతోనూ దర్శనమిస్తాయి .

అదే శీతాకాలమైతే యెనిమిది పదడుగుల వరకు కురుసిన హిమపాతం తో కను చూపు మేరవరకు తెల్లగా , సూర్యకాంతి పడ్డప్పుడు బంగారు రంగులో మెరుస్తూ కనువిందు చేస్తుంది .

ఔలి లో స్థానిక జనాభా చాలా తక్కువ , యిక్కడ వున్న కొండవాలులు స్కీయింగుకి చాలా అనుకూలంగా వుండడం తో ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంటు వారు రోప్ వే నిర్మాణం చేసి ప్రతీ యేటా శీతాకాలములు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు .

ఈ రోప్ వే సుమారు నాలుగు కిలో మీటర్లు పొడవునా కేబుల్ కారు నడుపుతున్నారు , ఛైర్ లిఫ్ట్ , స్కీలిఫ్ట్ కూడా నడుపుతున్నారు .     సుమారు పదహారు కిలో మీటర్లు స్కీయింగుకి అనుకూలంగా వుంటుంది . స్కీయింగ్ వెనుక మంచుతో కప్పబడ్డ నందాదేవి , కామెట్ , మనా , దునిగిరి , హథి , చేతాన్ తోలి , ఘోరా మొదలైన పర్వత శిఖరాలు కనిపిస్తాయి .

ఈ పర్వత వాలులు గుల్ మార్గ్ పర్వత వాలులకంటె స్కీయింగ్ కి అనువుగా వుండడంతో పేరు పొందిన స్కీయర్స్ ఔలి స్కీయింగ్ రిసార్ట్ ని యిష్టపడతారు .

ఔలి లో ఫిబ్రవరి మార్చి లలో శీతాకాలపు ఆటల పోటీలు నిర్వహిస్తారు . బదరీ  యాత్ర సమయంలోయాత్రీకులు యీ ప్రదేశం సందర్శించుకుంటే పచ్చని గడ్డి కప్పిన మైదానాలను చూడొచ్చు . మంచు తో కప్పబడ్డ మైదానాలు , స్కీయింగ్ నేర్చుకోవాలని అనుకొనే వారు ఫిబ్రవరి , మార్చి లలో వెళితే మంచిది .

అక్కడ నుంచి తిరిగి జోషిమఠ్ చేరేం .

జోషిమఠాన్ని పురాణకాలంలో ' కార్తికేయ పురం ' అని వ్యవహరించేవారట .

జోషిమఠం నుంచి కైలాస మానససరోవరానికి నడక దారి వుంది .

సిక్కు యాత్రీకులకు అన్ని సదుపాయాలు అందజేయడానికి సిక్కులు ఓ భవనం నిర్మించుకున్నారు . హరిద్వార్ నుంచి మనకు సిక్కు యాత్రీకులు మనకు యెదరవుతూనే వుంటారు . బదరీ రోడ్డు మీదనే  ఉచిత ఆహార పదార్ధాలు అందజేసే టెంటులు , కొన్ని చోట్ల ఉచిత వసతి భోజన సదుపాయాలు అందజేసే ' లంగరులు ' వున్నాయి . వీటిలో సిక్కుమతస్థులకే కాక హిందూ మతస్థులకు కూడా అన్ని సౌకర్యాలు ఉచితంగా అందజేస్తున్నారు .

జోషి మఠ్ కి సుమారు పది పదిహేను కిలోమీటర్ల దూరంలో సిక్కులకు అత్యంత పవిత్రమైన ' హేమకుంఢ్ సాహెబ్ ' కి నడక దారి మొదలయే కూడలి గోవింద్ ఘాట్ దాటి మరో పన్నెండు కిలో మీటర్ల ప్రయాణం తరువాత పాండుకేశ్వర్ అనే గ్రామం చేరుకున్నాం .       హరిద్వార్ నుంచి జోషిమఠ్ వరకు ప్రయాణం ఒక యెత్తు , జోషిమఠ్ నుంచి బదరీ నాథ్ వరకు మరో యెత్తు . మనం హిమపాతం జరిగే ప్రాంతాలకు దగ్గరకు చేరుతున్న గొద్దీ వాతావరణం లో మార్పులు కనిపిస్తూ వుంటాయి . చలి పెరగడం , వాతావరణం లో తేమ  పెరగడం , సన్నగా వాన పడుతూ వుండడం జరుగుతుంది , కొండలలో వాన పడడం జరిగితే మంచు కరిగి నీరు కొండల మీద నుంచి జారడం , దాంతో పాటు రాళ్లు చెట్లు జారి రోడ్డు మీద పడడం సర్వసాధారణం

అందు నుంచి తరచు రోడ్డు బంద్ అవుతూ వుంటుంది . అలాంటివి జోషిమఠ్ నుంచి బదరీ వరకు తరచు జరుగుతూ వుంటుంది .       జోషిమఠ్ నుంచి బదరీ వరకు వున్న  మార్గం మిలిటరీ వారి అధీనంలో వుంది , మిలిటరీ వారు సాయంత్రం అవగానే రెండువైపుల రాకపోకలను నిలిపి వేస్తారు .

పాండుకేశ్వర్ బదరీ రోడ్డు పైన వున్న చిన్న గ్రామం . దీనిని " యోగధ్యాన బదరి " అని కూడా అంటారు . పంచబదరీలలో యిదొకటి . బదరీ రోడ్డు దిగి ఓ అర కిలోమీటరు కిందకి వెళితే ఆది బదరీ లాగే చిన్నచిన్న మందిరాలతో కూడిన మందిర సముదాయం వుంటుంది . ఈ మందిరాలలో శీతాకాలంలో బదరీ నాధుని నివాసం . వేసవిలో బదరీలో నివాసం . మందిరాలలో విగ్రహాలు వున్నా లేకున్నా నిత్యం పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వుంటారు యిక్కడ పూజారులు . ఇక్కడ బదరీ నారాయణుడు ఆరు నెలల కాలం యోగసమాధిలో వుంటాడు .

ఈ గ్రామం తో ముడి పడి వున్న మరో పురాణగాధ కూడా చెప్పుకుందాం .

మహాభారత కాలంలో ముని ఆగ్రహానికి గురైన పాండురాజు కుంతి మాద్రిలతో పాటు  నివసించిన ప్రదేశం .

ధర్మరాజు , భీముడు , అర్జనుడు , నకులుడు , సహదేవుడు జన్మించిన ప్రదేశం . పాండురాజు ప్రాణత్యాగం చేసిన ప్రదేశం కూడా యిదే .       ఆ చిన్న గ్రామం చూసుకొని బదరీ వైపు బయలు దేరేం .

బదరీ నాధ్ గురించి వివరాలు పై సంచికలో చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు