ప్రపంచంలో అత్యంత ఎక్కువగా 'యువత' ఉన్నది మన భారతదేశంలోనే. ఈ విషయాన్ని మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. అయితే, ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నది కూడా ఈ 'యువతరం' కేటగిరీలోనే కావడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఆత్మహత్యల్లో భారతదేశం ఏమీ వెనుకబడి లేదు. ప్రధానంగా ఆత్మహత్యలకు కారణం క్షణికావేశం. చాలా ఆత్మహత్యలు క్షణికావేశంలోనే జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆందోళన ఎవర్నయినా ఆత్మహత్య వైపు నడిపిస్తుంది. కానీ ఆ మానసిక ఆందోళనను అదుపు చేసేది ఎలా? భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఉడుకురక్తం పరుగులు పెడుతుంది. కానీ ఒక్కసారి మానసిక ఆందోళన ఆ యువతరంలో మొదలైతే ఇక ప్రమాదపుటంచులకు చేరుకున్నట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రేమ, ఉద్యోగం, స్నేహం, కుటుంబ సంబంధాలు వంటివన్నీ ఆత్మహత్య కేసుల్లో కీలక భూమిక పోషిస్తున్నాయని వారు చెప్పడం జరుగుతోంది. 'నేను సాధించలేకపోతున్నాను' అన్న నైరాశ్యం ఎక్కువ ఆత్మహత్యల్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా మానసిక నిపుణులు స్పష్టం చేయడం చూస్తున్నాం.
మరి ఈ మానసిక ఆందోళనను అడ్డుకోవడానికి ఏం చేయాలి? అంటే దానికి సమాజమే పూర్తి బాధ్యత తీసుకోవాలంటారు నిపుణులు. సమాజం అంటే అది కుటుంబం దగ్గర్నుంచే ప్రారంభమవుతుంది. కుటుంబం, ఆ తర్వాత స్నేహితులు, స్కూల్, కాలేజ్, ఉద్యోగం చేసే కార్యాలయం, ఇవన్నీ సమాజంలో భాగమే కదా! మానసిక ఆందోళనతో ఉన్నవారిని గుర్తుపట్టడం చాలా తేలిక అని నిపుణులు చెబుతారుగానీ పైకి ఎలాంటి ఆందోళనా కన్పించనీయకుండా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని, తమ ప్రాణాలు తామే బలిగొన్నవారిని ఎంతోమందిని చూస్తున్నాం. ఈ క్షణికావేశానికి పేదరికంతో సంబంధం లేదు. ధనవంతుల కుటుంబాల్లోనూ క్షణికావేశం శోకాన్ని మిగుల్చుతోంది. కౌన్సిలింగ్ పేరుతో కొత్త కొత్త క్లినిక్‌లు పుట్టుకొస్తున్నప్పటికీ అవేవీ ఆత్మహత్యల సంఖ్యను తగ్గించలేకపోతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలనీ చర్చిస్తుండడం, వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడం, అనుమానమొస్తే అప్రమత్తంగా ఉండటం ద్వారా ఆత్మహత్యల్ని కొంతవరకు నివారించవచ్చు.
ఏదైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసం నుంచి ఏమీ సాధించలేమన్న ఆత్మన్యూనత వైపుకు యువత నడవడం వెనుక సమాజంలోని చాలా అంశాలు తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆకాశానికి నిచ్చెన వేసే ధైర్యంతోపాటుగా, అది అందకపోతే దాన్ని తట్టుకోగలిగేంతటి మానసిక దృఢత్వం కూడా యువతరంలో పెంపొందించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులే కాకుండా, విద్యా సంస్థలూ యువతకు ఈ విషయంలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా ఆత్మహత్యల్ని చాలావరకు నివారించడానికి ఆస్కారముంటుంది. భారతదేశానికి యువత ప్రధాన బలం. ఆ బలాన్ని కోల్పోయే పరిస్థితి రాకూడదంటే సమాజంలో మార్పులతోపాటు, ప్రభుత్వాలు కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. మాయమైపోతున్న కుటుంబ బాంధవ్యాలు ఒంటరితనాన్ని పెంచేస్తున్న దరిమిలా, కుటుంబ వ్యవస్థ సైతం మరింత దృఢమవ్వాల్సిన అవసరం ఉంది.