ఎప్పటికప్పుడు యిటువంటి మహత్తర సంఘటనలు జరుగుతున్నా నరేంద్రునికి ఇంకా గురువును పరీక్షించాలనే కోరిక తొలగిపోలేదు. అందువల్ల ఒకనాడు పరమహంస తన శిష్యులతో కలసి కలకత్తా వెళ్ళటం చూసి, ఎవ్వరూ లేని సమయంలో, నరేంద్రుడు ఒక వెండి రూపాయిని రామకృష్ణుని ప్రక్క మడతలో పెట్టాడు. రామకృష్ణుడు తిరిగి వచ్చి ప్రక్క మడత మీద కూర్చోగానే, అతని శరీరానికి ముచ్చెమటలు పోశాయి. భరించలేని బాధ ప్రారంభం కాగానే రామకృష్ణుడు ప్రక్క మీద నుంచి లేచిపోయాడు. పురుగు ఏదైనా వున్నదేమోనని, శిష్యుడొకరు ప్రక్క దులపగా వెండిరూపాయి క్రిందపడింది. ఇది, ఇక్కడికి ఎలా వచ్చినదని రామకృష్ణుడు ఆలోచించి, తనను పరీక్షించడానికి నరేంద్రుడే ఈ పని చేశాడని గ్రహించి చాలా ఆనందించాడు పరమహంస.
అందరినీ తనలో కలుపుకునే విశాల బుద్ధిని తెలియజేసే అనేక సంఘటనలు శ్రీ రామకృష్ణుల జీవితంలో మనకు కనిపిస్తాయి. మధురానాధునితో కలిసి కాశీ, ఇతర పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్తూ, దారిలో వైద్యనాధం వద్ద ఒక గ్రామంలో ఆగినప్పుడు, శ్రీ రామకృష్ణులు అక్కడి ప్రజల పేద, దయనీయ స్థితిని చూసి తీవ్రంగా చలించిపోయారు. తన కాశీ ప్రయాణాన్ని మానుకుని, ఆ గ్రామ ప్రజలకు నూనె, బట్టలు, ఆహారం యిస్తే గాని, తాను అక్కణ్ణించి కదలనని భీష్మించుకుని ఆ పేద ప్రజల మధ్య కూర్చున్నారు. పరమహంస ఆదేశాన్ని మధురుడు అమలుపరిచాడు. ఆ వస్తువులన్నీ కలకత్తా నుంచి తెప్పించి ఆ గ్రామంలోని పేద ప్రజలకు పంచిపెట్టాడు.
పరమహంస, నరేంద్రుని కఠినాతి కటినంగా పరీక్షించిన సంఘటనలు కూడా చాలా వున్నాయి. అన్నిటికీ నరేంద్రుడు ధైర్యంతో నిలబడి గురువుగారికి, ప్రియ శిష్యుడైనాడు. శ్రీ రామకృష్ణులు "సాధు! సావధాన్" అని మరీ, మరీ చెప్పేవారు. "సాధు" అంటే సన్యాసులే కాదు, ఆధ్యాత్మిక పధంలో వున్న ప్రతివారికీ వర్తిస్తుంది ఆపదం.
మహాత్ముల జీవిత చరిత్రలు పరిశీలిస్తే, వారు అమోఘమైన సంకల్పశక్తి, స్థిరమైన నిర్ణయము కలిగిన వారని మనకి అర్ధమవుతుంది. నరేంద్రుడు ఒకసారి అనారోగ్యంగా ఉన్నప్పుడు, వైద్యులు ఆయన్ను 3వారాల పాటు నీళ్లు, ఉప్పు వాడవద్దని చెప్పారు. స్వామీజీ శిష్యుడు శరత్ చంద్ర చక్రవర్తి, ఈ విషయం విని, ఆశ్చర్య చకితుడై స్వామీజీని "ఇది మీరెలా చేయగల"రని అడిగాడు. ధృడమైన సంకల్పశక్తి, నిర్ణయం వలన అది సాధ్యమవుతుందని నరేంద్రుడు చెప్పారు.
అటువంటి సంఘటనలు రామకృష్ణుని జీవితంలో ఎన్నో కనిపిస్తాయి. ఒకసారి ఆయన ఒక చేతిలో కొన్ని నాణేలు, మరొక చేతిలో మట్టితీసుకుని, ఆ రెండూ సమానమేనని అంటూ, గంగానదిలోకి రెంటినీ విసిరివేశాడు. పరమహంస మనస్సు ఎంత ధృడమైనదంటే, ఆ తర్వాత ఎప్పుడూ ఆయన ధనాన్ని తాకలేదు. ఆయన మనస్సు పూర్తిగా ఆయన స్వాధీనంలో ఉండేది. నరేంద్రుడు తాను రచించిన శ్రీ రామకృష్ణ స్త్రోతంలో ఆయన్ను "ధృడ నిశ్చయ మానసవాన్" అంటూ ధృడ నిర్ణయం తీసుకొనే వ్యక్తిగా వర్ణించాడు.
నరేంద్రుడు కళాశాలలో తత్వశాస్త్రాన్ని తీసుకొని, పాశ్చాత్య తత్వవేత్తల గ్రంధాలను తదేక దీక్షతో చదివేవాడు. అంతేకాకుండా అతను ప్రాచ్య పాశ్చాత్య తత్త్వశాస్త్రాలకు గల పోలికలనూ, తేడాలనూ పరిశీలించి ఏవి ఉపయోగకరమైనవో తనంతట తాను నిర్ణయించుకుంటూ వుండేవాడు.
నరేంద్రుడు 1884 వ సంవత్సరంలో బి.ఏ. పరీక్షకు హాజరయ్యాడు. ఫలితాలు రాకముందే, అతని తండ్రి విశ్వనాథుడు మరణించాడు. తండ్రి మరణించేటప్పటికి అతనికి 19 సంవత్సరాలు కూడా లేవు. దానితో నరేంద్రుని కష్టాలు ప్రారంభమయ్యాయి. కుటుంబాన్ని పోషించేవారు లేక కుటుంబ భారమంతా అతని భుజస్కందాలపై పడింది. తండ్రి సంపాదించిన ఆస్తులు ఆయనతోనే అంతరించిపోయాయి. దరిద్రదేవత నరేంద్రుని చుట్టుముట్టింది. చాలా రోజులు వారు పస్తు ఉండవలసివచ్చింది. తల్లినీ, నలుగురు తోబుట్టువులను పోషించవలసిన భారం అతనిపై బడింది. ఒక ప్రక్క అప్పుల వాళ్ళ బాధ ఎక్కువయింది. మరొక ప్రక్క ఆప్త బంధువులే ఆగర్భ శత్రువులయ్యారు.
పరిస్థితులు ఇలా వున్నా నరేంద్రుడు ఎలాగో న్యాయ కళాశాలలో చదువు కొనసాగిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు తినడానికి తిండి కూడా లేక అతడు ఎన్నో అవస్థలు పడవలసి వచ్చేది. అనేక మంది స్నేహితులు నరేంద్రుని తమ ఇంటికి భోజనానికి రమ్మని పిలిచేవారు. కాని తన తల్లి అవస్థలనూ, తోబుట్టువుల దైన్య స్థితినీ తల్చుకొనగానే నరేంద్రుడు దుఖ భారంతో కుమిలిపోయి ఎవరి ఇంటికీ వెళ్ళేవాడు కాడు. ఈ ఘోర దరిద్రావస్థ నుంచి సంసారాన్ని కాపాడటం కోసం నరేంద్రుడు ఎన్నో తీవ్ర ప్రయత్నాలు చేసేవాడు.