కొత్త విద్యా సంవత్సరంలోకి యువత వడివడిగా అడుగులు వేస్తున్న సమయమిది. ఇంజనీరింగ్, మెడిసిన్ అడ్మిషన్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసి, ఫలితాలొచ్చాక ఏ కాలేజీలో అయితే బావుంటుందనే ఉత్కంఠ అనుభవిస్తున్న సందర్భం. మెడిసిన్ అయినా ఇంజనీరింగ్ అయినా తెలుగు రాష్ట్రాల్లో కుప్పలు తెప్పలుగా కళాశాలలున్నాయి. ఇతర రాష్ట్రాల్లోనూ కళాశాలలు అర్హులైన విద్యార్థుల కోసం ఎదురుచూస్తున్నాయి. ఒకప్పటిలా కాదు, ఇప్పుడు సీట్లు అధికం, విద్యార్థులూ అధికమే. చాలావరకు సీట్లు దొరక్కపోవడం అన్న సమస్య కన్పించడంలేదని పలు అంచనాలు పేర్కొంటున్నాయి. అయితే ఇంజనీరింగ్, మెడిసిన్ పట్టా అందుకుంటున్నా అలా పట్టా అందుకుంటున్నవారిలో 'స్కిల్స్' తక్కువగా ఉంటున్నాయనే విమర్శలూ లేకపోలేదు. ఈ కారణం వల్లనే ప్రతి ఒక్కరూ ఏ కళాశాల అయితే మంచిది? అని తేల్చుకోలేకపోతున్నారు.
ఏ కళాశాలలో చేరాలన్నదానిపై ఖచ్చితమైన అవగాహన, ఆ కాలేజీకి సంబంధించిన గణాంకాలు తెప్పించుకోవడం వంటివి ఈ రోజుల్లో పెద్ద కష్టం కాదు. అందుకే తగినంత సమయం తీసుకుని, అన్ని కోణాల్లో ఆయా కళాశాల విశేషాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ఏ కళాశాల అయితే బాగుంటుందనేదానిపై ఓ అవగాహనకు రావాలి. ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా ఇది తప్పనిసరి. కొన్ని కళాశాలలు పైకి 'మేకప్' బాగా చేస్తాయి, ఇంకొన్ని మంచి కళాశాలలు మేకప్‌కి దూరంగా ఉంటాయి. మేకప్ ఉన్నవన్నీ మంచివని కావు, లేనివన్నీ చెడ్డవనీ కాదు. పదిమంది చెప్పే విషయాల్ని విశ్లేషించడంలోనే మన నైపుణ్యం ఆధారపడి ఉంటుంది. అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఆయా కళాశాలలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోగలిగితే, తద్వారా మంచి కళాశాలలో చేరితే మీ ప్రయత్నం బాగుంటుంది, మీ కెరీర్ అత్యున్నతమైన వేగంతో ముందుకెళుతుంది.
ఫలానా వ్యక్తి ఆ కాలేజీలో చదివాడు, ఫలానా కాలేజీకి మంచి పేరుంది అనే ప్రచారం మాత్రమే ఆ కాలేజీ గుణగణాల్ని నిర్ధారించదు గనుక పూర్తిస్థాయి పరిశీలన అత్యవసరం. ఓ కాలేజీ నుంచి ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఎలాంటి స్కిల్స్‌తో బయటకు వచ్చారన్నదానిపైనే ఆ కాలేజీ సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. ఇంజనీరింగ్ పట్టా అందుకుంటున్న చాలామందిలో స్కిల్స్ లేకపోవడం ఆ విద్యపై రానురాను గౌరవం తగ్గిపోతున్న మాట వాస్తవం. మెడిసిన్ కూడా ఇందుకు అతీతం కాదు. కాబట్టి ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి అత్యున్నత విద్యల విషయంలో అప్రమత్తత తప్పనిసరి. ఇదొక్కటే కాదు, ఇతరత్రా కోర్సుల్లోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి భవిష్యత్ మీ కోసం ఎదురుచూస్తుంటుంది. అందుకే స్టాప్ లుక్ అబ్జర్వ్ ఎనలైజ్ అండ్ ప్రొసీడ్.