చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

సాధారణంగా చూస్తూంటాము—మనిషన్న ప్రతీవాడికీ  ఓ  comfort zone  అని ఒకటుంటుంది. అందులో ఉన్నంతకాలం, హాయిగా ఉంటాడు, చీకూ చింతా లేకుండా. బయటపడ్డానిక్కూడా ఇష్ట పడడు. కారణం – ఎక్కడలేని చిరాకులూ పుట్టుకొచ్చేస్తాయి. BP  పెరిగిపోతుంది.. కనిపించిన ప్రతీవాడిమీదా చిరాకు పడిపోతాడు. పైగా ఈ  comfort zone  అన్నది ఓ వ్యసనం లాటిదే.  ఏదో zone  అన్నానని దానికేమీ కొలతల్లాటివి ఉండవు,  Curfew zone, Danger Zone  ల లాగ. మనస్సుకి సంబంధించినది మాత్రమే..అందులో ఉన్నంతకాలం, తను సుఖంగా ఉండి, మిగిలినవారిని సుఖంగా బతకనిస్తాడు. సుఖంగా ఉన్నాడని జీవితాంతం అందులోనే ఉండాలంటే ఎలా కుదురుతుందీ? అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు బాయటకీ రావాల్సొస్తుంది. అక్కడే అసలు గొడవంతానూ..

దీనికి ప్రత్యేకమైన కొలమానాల్లాటివి ఉండవు. తన మనస్సుకి నచ్చిందీ-అంతే. ఉదాహరణకి , ఉద్యోగంలో ఉన్నంత కాలమూ ఓ  dress code  పాటించాల్సొచ్చింది. సూటూ, బూటూ, అవసరార్ధం జుట్టుకి రంగూ లాటివన్నమాట. తనకి ఇష్టమున్నా లేకపోయినా. ఓ  image  లాటిదుందే, దాన్ని కాపాడుకోవడానికి. చూసేవాళ్ళేమనుకుంటారో అనే కానీ, మనసారా చేసింది కాదు.ఒక్కసారి ఉద్యోగం నుండి రిటైరయ్యాడా, పేట్రేగిపోతాడు.తనక్కావల్సిన విధంగా మారిపోతాడు…ఇన్నాళ్ళూ ఉగ్గబెట్టుకుని ఉన్న కోరికలన్నీ బయటకి వచ్చేస్తాయి.  ఈ మార్పు ఏమీ ప్రాణాంతకం కాదు.. నిజం చెప్పాలంటే, ఒత్తిడి లేకపోవడం వలన , ఇంకా హుషారుగా ఉంటాడు. అందుకే కాబోలు, మన దేశం లో  Senior Citizens  అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. కారణం—వాళ్ళందరూ ఎవరిగురించీ పట్టించుకోకుండా తమతమ  comfort zone  లలో హాయిగా ఉన్నారు.

ఇన్నాళ్ళూ ఓ చాయ్ తాగాలన్నా, లోకంకోసం, ఏ పెద్ద 5 Star Hotel  కే వెళ్ళాల్సొచ్చేది. రోడ్డు పక్కనుండే, పానీ పూరీ తినాలని పాపం మనసూ, అలా తింటే చూసేవాళ్ళేమనుకుంటారో అనే భయమూ. రిటైరయిన మర్నాడే, పని కట్టుకుని దగ్గరలో ఉండే పానీపూరి బండివాడిదగ్గరకు వెళ్ళి, మనసారా పానీపూరీ అనండి, లేదా తాజాగా వేయిస్తూన్న  మిరపకాయ బజ్జీలో లాగించేయడం.. మరీ “ అతి “ అయితే  కొంచం ప్రమాదమే అనుకోండి, హాయిగా బతికున్నంతకాలం మనసుకి నచ్చినట్టు బతక్కపోతే ఈ బతుకెందుకూ అనే వేదాంతం లోకి వచ్చేస్తాడు..ఇలాటివన్నీ చేయడానికి ఆరోగ్యం కూడా సహకరించాలి. అది వేరేవిషయం, అనారోగ్యం  చేసినప్పుడు చూసుకోవచ్చులెద్దూ , అంటూ పెళ్ళాం మాటకూడా వినడు. పైగా ఈ అలవాట్లన్నీ ఆవడక్కూడా నేర్పి పెడతాడు.

ఆ మాయదారి సూటూ, బూటూ మానేసి , హాయిగా తనకు నచ్చిన వేషధారణ లోకి వచ్చేస్తాడు..ఎవడికీ సమాధానం చెప్పుకోనఖ్ఖ్ర్లర్లేదూ ఒక్క కట్టుకున్నావిడకి తప్ప. ఏ TV  అయినా చూసేటప్పుడు, పెద్దమనిషి తరహాగా, sound  పెద్దగా పెట్టకుండా చూడాల్సొచ్చేది. కానీ ఇప్పుడో, భూనభోనాంతరాలు బద్దలయ్యే సౌండు పెట్టుకుని వినడం. అడిగేవాడెవడూ, తన ఇల్లూ, తన టీవీనూ. ఇంకోరింటికి వెళ్ళడానికి, ఆఖరికి తన పిల్లలింటిక్కూడా వెళ్ళడానికి సుముఖంగా ఉండడు. అక్కడ ఎంతైనా ఈ సుకరాలు చెల్లవుగా మరి?ఒకే ఊళ్ళో ఉన్నా, రాత్రి నిద్రకి ఛస్తే ఉండడు.. తనింట్లో అయితే హాయిగా ఉంటాడు.. తన అర్ధాంగి చేతివంట కి అలవాటు పడ్డ ప్రాణమాయిరి, ఇంకోరు చేసిన వంట ససేమిరా నచ్చదు.

ఫలానా పుస్తకంచదవాలనో, ఫలానా హీరో/హీరోయిన్ నటించిన సినిమా చూడాలనో ఉంటుంది.  కానీ ఇన్నాళ్ళూ వాటిని తీర్చుకోలేక పోయాడు కారణం—ఎవరో ఏమైనా అనుకుంటారేమో…

ఇలా తన  comfort zone  లోనే ఉండడానికి ప్రతీవాడూ ఇష్టపడతాదు. ఇంకో పదేళ్ళు ఆయుద్దాయం కూడా పెరుగుతుంది దీని ధర్మమా అని.

చెప్పొచ్చేదేమిటంటే, మరీ లిమిట్ దాటకుండా, ఇతరులకి, ఇంట్లోవారితో సహా, ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా, తమదారిన తాము ఉండడంలో తప్పేమీలేదు.  ఈ పధ్ధతి నచ్చినవాళ్ళకి నచ్చుతుంది , లేకపోతే లేదు. నచ్చిందా శుభం. లేదా అసలు గొడవే లేదు. ఎవరికోసమో జీవించేకన్నా, ఉన్న నాలుగురోజులూ హాయిగా ఉండడం ముఖ్యం.. ఇలా ఉండడం కొంతమందికి నచ్చకపోవచ్చు. .. ఊళ్ళోవాళ్ళకోసం కాకుండా, కనీసం చరమాంకంలోనైనా తమకి నచ్చిన పధ్ధతిలో జీవించడంలో తప్పేమీ లేదు.ఇన్నాళ్ళూ మొహమ్మాటానికి , ఇంకోరికోసమే బతికాం, కనీసం ఇప్పటికైనా ఓ comfort zone లో బతకాలి.

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు