'ధనం మూలం ఇదం జగత్' అన్నారు పెద్దలు. అయితే మరీ ఇంత ఇదిగా ధనం దుర్వినియోగం అయిపోతుందని అనుకోలేదు అప్పట్లో పెద్దలు. ముఖ్యంగా మాట్లాడకోవాల్సింది విద్య, వైద్యం గురించి, ఈ రెండూ ఎవ్వరికీ అంత తేలికగా దొరకడం లేదు. విద్య విషయంలో మాత్రం మరీ దారుణంగా తయారయ్యాయి పరిస్థితులు. ఏనాటి నుండో మంచి గిరాకీ ఉన్న వస్తువుగా మారిపోయిం విద్య. సాధారణ చదువుకే బోలెడంత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇక పైసలుంటేనే తప్ప ఉన్నత చదువులు చదువుకోవడం కష్టమిప్పుడు. ఎల్‌కేజీ చదువులకే వేలల్లో లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్న రోజులివి. ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు అంటే వాటిని కొనుక్కోవడానికి ఇంకెంతలా ఖర్చు చేయాలి? మెడిసిన్ రేటు కోట్లలో పలుకుతోంది. టాలెంట్ ఉండీ మెడిసన్ చదువుకోవాలన్న కోరిక ఉండీ కూడా ఆ స్థాయిని అందుకునే ఆర్ధిక స్తోమత లేని విద్యార్ధులు ఎంతో మంది. చదువకోగలిగీ, చదువు కొనలేని స్థితిలో ఉన్నవారికోసం పలు బ్యాంకులు 'లోన్లు' మంజూరు చేస్తున్నాయి. అలాగే ప్రభుత్వాలు కూడా ఉన్నతమైన ప్రతిభ చూపిస్తున్నవారికి కొంత ఉపశమనం కల్పిస్తున్నాయి. ఆ రకంగా కొంత వరకూ చదుకుకోవాలనుకునేవారికి ఉపశమనం కలిగినా, కానీ అన్ని వర్గాల వారూ ఈ రకమైన చదువులను అభ్యసించలేకపోతున్నారు.
ముఖ్యంగా ప్రభుత్వాలు అందించే ప్రోత్సాహాలు అందుకోగలిగితే విద్యను కొనుక్కోవడం అనే సామాజిక రుగ్మత నుంచి కొంత బయటపడవచ్చు. అయితే ఆయా పథకాలు, ప్రోత్సాహకాల గురించి పూర్తి అవగాహన తప్పనిసరి. ముందుగా ఈ రకమైన అవగాహన అందుబాటులోకి రావాలి. అప్పుడే ఉన్నత స్థాయి, మధ్యతరగతి, పేదరికం అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు ఉన్నత చదువులు చదువుకునే అవకాశం ఏర్పడుతుంది. చాలా మంది చదవగలిగే ప్రతిభ ఉండీ, అందుకు తగిన ఆర్థిక సహాయం లేకనే మరుగున ఉండిపోతున్నారు. ఇలాంటి వారి ప్రతిభ వారితో పాటే మరుగున పడిపోతోంది. ఆర్థికంగా ఉన్నత స్థాయిల్లో ఉన్న వాళ్లు అందని ద్రాక్ష అయినా కానీ ఉన్నత చదువులను కొనుక్కుని చదువుకుంటున్నారు. అలాంటి వారిలో టాలెంట్‌కి స్థానం ఉండడం లేదు.
ప్రభుత్వం నుండి అందుతున్న ప్రోత్సాహకాలపై ముందస్తుగానే ప్రిపరేషన్ ఉంటే, వాటికి అర్హత పొందేలా మనల్ని మనం మలచుకోవడం పెద్ద కష్టం కాదు. పదో తరగతి నుంచే విద్యార్థులు తమ ఆర్థిక పరిస్థితిని గుర్తెరిగి, నడచుకుంటే ఉన్నత చదువులకు రాచబాట వేసుకున్నట్లవుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాల్సి వచ్చినా అదీ కష్టం లేకుండా చూసుకోవడానికి అవకాశముంది. తక్కువ వడ్డీకి లోన్లు మంజూరు చేసే బ్యాంకులు, పూర్తిగా విద్యాభ్యాసం తర్వాత మాత్రమే రీపేమెంట్ చేసేందుకు వీలున్న బ్యాంకులను ఎంచుకోవడం ఉత్తమం. నేటి విద్యార్ధులే భవిష్యత్తులో అద్భుతాలకు నిదర్శనాలు. అందుకే టాలెంట్ ఉన్న విద్యార్ధుల్ని ప్రభుత్వం గుర్తించి, అందుకు తగిన సహాయం తగిన సమయంలో అందిస్తే, మెరుగైన సమాజాన్ని తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది.