తెలుగువారందరికీ సుపరిచయమైన పేరు శ్రీమతి మాలతీ చందూర్. ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత, ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞావంతురాలు. మాలతీ చందూర్ కృష్ణాజిల్లాలోని నూజివీడులో 1930 లో జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు అనే దంపతులకు జన్మించారు. తల్లితండ్రులకు వీరు ఏడుగురు సంతానం. ఆరుగురు సోదరుల మధ్య అనురాగ ఆప్యాయతలతో పెరిగిన ఏకైక ఆడపడుచు ఈమె. ఆమె బాల్యం ఎక్కువభాగం నూజివీడులోనే గడిచింది. ఈమె, నూజివీడులోని ఎస్. ఎస్. ఆర్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదివారు. ఆ తరువాత, ఏలూరులోని ఆమె మేనమామగారైన చందూర్ గారింటిలో ఉండి, సెయింట్ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చదువుకున్నారు. అక్కడే ఆమెకు ప్రఖ్యాత రచయిత్రులు డి. కామేశ్వరి, ఆనందారామం లాంటి వారితో పరిచయమయ్యింది.
ఆ రోజుల్లో ఏలూరు నుండి 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ప్రచురించబడేది. అక్కడికి అతి తరచుగా శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకట చలం లాంటి నాటి ప్రఖ్యాత రచయితలు, కవులు వచ్చేవారు. ఈమెకు చిన్నతనం నుండీ సాహితీ అభిలాష ఉండటం చేత, వీరందరినీ చూడటానికి ఉబలాటపడటమే కాకుండా, వారితో పరిచయాన్ని కూడా పెంచుకుంది. 1947 లో, అనగా ఆమె తన 17 వ ఏట, మేనమామగారైన శ్రీ చందూర్ గారితో కలసి మద్రాసుకు చేరారు. 1947 డిశంబర్ లో వీరిరువురికీ వివాహం జరిగింది. పాఠశాలలో ఆమె చదువుకుంది, కేవలం 8 వ తరగతి వరకే! పెళ్ళైన తరువాత ప్రైవేటుగా ఎస్. ఎస్. ఎల్. సి పూర్తిచేసారు. ఆమె విద్యార్హత అదే! నిరంతరం అనేక పుస్తకాలు అధ్యయనంచేసి అపారమైన జ్ఞానసంపదను సొంతం చేసుకున్నారు. తన 19 వ ఏటనే ఈమె రచనా వ్యాసంగాన్ని చేపట్టారు. మొదట్లో ఆకాశవాణిలో తన రచనలను, చదివి వినిపించేవారు.
ఆ రోజుల్లోనే ఈమెకు మరికొంతమంది ప్రముఖ రచయితలైన ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, రాజమన్నార్, మునిమాణిక్యం నరసింహారావు గార్ల వంటి వారితో పరిచయమయింది. 1952 నుండి అనేక కథలను, వ్యాసాలను, నవలలను వ్రాసారు. 1952 నుండి ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ద్వారా ఈమె స్త్రీల కోసం'ప్రమదావనం' అనే శీర్షికను అప్రతిహతంగా, నిరాటంకంగా నిర్వహించారు. దాదాపుగా నాలుగు దశాబ్దాలపాటు ఆ శీర్షికను విజయవంతంగా నిర్వహించి, గిన్నీసు బుక్ లో స్థానం సంపాదించుకున్నారు. విశేష మేమంటే, పురుషులు కూడా ఎక్కువగా ఆ శీర్షికను చదివేవారు. ఆమె విజ్ఞానఖని, నడిచే విజ్ఞాన సర్వస్వం! ఆ శీర్షికలో పాఠకులు ఆమెను రకరకాల ప్రశ్నలను వేసేవారు. వాటిలో వ్యక్తిగత సమస్యలు కూడా ఉండేవి. వాటన్నిటికీ నేర్పుగా, ఓర్పుగా సమాధానమిచ్చి, పాఠకులను సంతృప్తి పరచటమే కాకుండా, వారి ప్రశంసలు కూడా పొందారు. ఉదాహరణకి, రెండవ ప్రపంచయుద్ధానికి కారణాలు ఏమిటని ఎవరైనా అడిగితే, దాని పూర్వాపరాలతో పాటు హిట్లర్ చరిత్ర కూడా చెప్పేది.
ఆ రోజుల్లో, నా స్నేహితులు, వారికి తెలియని విషయం నన్ను ఏదైనా అడిగితే, నేను వారితో సరదాగా -- అన్నీ తెలియటానికి నేనేమైనా మాలతీచందూర్ నా! అనే వాడిని!! తెలుగులో మొదటి సారిగా వంటల పుస్తకాలను గురించి చక్కగా వ్రాసారు. ఆ పుస్తకం ఎన్నో ముద్రణలకు నోచుకుంది. దాదాపుగా 25 నవలలను, స్త్రీల ఇతివృత్తాన్ని నేపధ్యంగా తీసుకొని వ్రాసారు. 300 ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించారు. ప్రతి వారం, పాఠకులకు ఒక ఆంగ్ల నవలను కూడా పరిచయం చేసారు. స్వాతి పత్రిక వీటిని 'పాత కెరటాలు' అనే శీర్షిక ద్వారా ప్రచురించారు. ఉత్తమ కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా 11 సంవత్సరాలు పనిచేసారు. తెలుగు, తమిళ, ఆంగ్ల భాషలపై మంచి పట్టు సాధించారు. అనేక తమిళ రచనలను కూడా తెలుగులోకి అనువదించారు.
ఆమె మొదటి కథ 'రవ్వ లడ్డూలు' కాగా, మొదటి నవల 'చంపకం చెదపురుగులు'. ఆమె వ్రాసిన వాటిలో మరికొన్ని ముఖ్యమైనవి--'ఆలోచించు, భూమిపుత్రి, హృదయనేత్రి, కలల వెలుగు, మనసులోని మనసు, శతాబ్ది సూరీడు, శిశిర వసంతం'. 1987లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, కలకత్తాకు చెందిన భారత భాషా పరిషత్ అవార్డు, తెలుగు వర్సిటీ అవార్డు అందుకున్నారు. ఇంకా పెక్కు సన్మానాలు, సత్కారాలు పొందారు. ఈమెకు, ఇంతటి పేరు ప్రఖ్యాతులు రావటం వెనుక ఆమె భర్త అయిన చందూర్ గారి పాత్ర కూడా మరువలేనిది. గత కొద్దికాలంగా కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఈమె, 21-08-2013 న చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆమె పార్ధివ శరీరాన్ని, ఆమె కోరిక మేరకు, పరిశోధనల నిమిత్తం చెన్నైలోని శ్రీ రామచంద్ర వైద్య కళాశాల వారికి ఆమె మిత్రులు, కుటుంబ సభ్యులు అందచేసారు.
'ముదితల్ నేర్వగ రానిది కలదే, ముద్దాడ నేర్పించినన్ ' అన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈమె జీవిత చరిత్ర. స్వయంకృషి, పట్టుదలతో ఎన్నో శిఖరాలాను అధిరోహించిన ఈమె మరణం, సాహితీలోకానికి ఒక తీరని పెద్ద లోటు. ఈమె స్త్రీల ఇతివృత్తాంతాన్ని నేపధ్యంగా తీసుకొని అనేక నవలలు వ్రాసినప్పటికీ, నేటి కొద్దిమంది స్త్రీవాద రచయిత్రుల లాగా పురుష ద్వేషి మాత్రం కాదు! స్వయంకృషితో పైకి వచ్చిన ఈ నారీశిరోమణి మరణానికి సంతాపం తెలియచేస్తూ, భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని వేడుకుంటున్నాను.
అరుదైన ఈ రచయిత్రికి ఘనమైన నివాళిని సమర్పించుదాం!