చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

సాధారణంగా ప్రభుత్వరంగ సంస్ఠలలో ఎవరైనా సర్వీసు లో ఉండగా దివంగతులైనప్పుడు ' డైడ్ ఇన్ హార్నెస్' రూలు క్రింద,చనిపోయినవారి కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి ( భార్య కానీ, కొడుకు కానీ) ఉద్యోగం ఇస్తూంటారు. మరీ ఖాళీలు లేనప్పుడు, కొడుకుకి ఆర్డర్లీ క్రింద ఇస్తూంటారు. ఈ ఆర్డర్లీల సంగతి బహు విచిత్రంగా ఉండేది. తండ్రి పోయినప్పుడు అతని భార్యకు వచ్చే టెర్మినల్ బెనిఫిట్స్ తో ముందుగా ఓ బైక్కు తీసేసుకుంటాడు. పోయిన అతని పెన్షన్ ఎలాగూ వస్తుంది.

దానికి సాయం ఈ కుర్రాడికి ఉద్యోగం. ఇంక వీడిని పట్టేవాడుండడు.ఏ సెక్షన్ లో వేసేరో, అక్కడ ఇన్ ఛార్జేమో, ఏ బస్సులోనో, నడిచో ఆఫీసుకి వస్తూంటాడు, ఇతనేమో ఝూమ్మని బైకు మీద వస్తూంటాడు, పైగా దారిలో కనిపిస్తే లిఫ్ట్ కూడా ఆఫర్ చేస్తూంటాడు! ఇంక ఈ కుర్రాడు ఆఫీసులో పనేం చేస్తాడు? మొట్టమొదట వీడు చేసే పనేమిటంటే ఏదో ఒక యూనియన్ లో చేరిపోవడం.ఆఫీసులో మొదటి రెండు మూడు నెలలూ ముంగిలా ఉంటాడు.ఆ తరువాత నీళ్ళు వంట పడతాయి! రూల్సూ, రెగ్యులేషన్సూ మాట్లాడతాడు. ఏమినా అంటే యూనియన్ వాళ్ళని తీసికొచ్చేస్తాడు.మనం ఏమీ అనకూడదు.పైగా పైనుంచి ఆర్డర్స్-- 'డిప్లొమాటిక్ ' గా 'హ్యాండిల్' చేయడం నేర్చుకోవాలీ అంటూ. దాని అర్ధం 'నోరు మూసుకుని కూర్చో" అని! ఎవరైనా బయటి వాళ్ళు ఆఫీసుకి వస్తే ఈ కుర్రాడి స్టైలు చూసి అతనే ఇన్ ఛార్జేమో అన్నంతగా ఉంటాడు. వాడికి నచ్చిన పనే చేస్తాడు.మనకు ఇష్టం అయితే చేయించుకోవడం లేకపోతే తూర్పుకి తిరిగి దండం పెట్టడం! మామూలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో రెండోదే జరుగుతూంటుంది, ఇందులో సందేహం లేదు.

వీళ్ళు కాకుండా కొంతమంది లేడీస్ ఉంటారు. నేనేదో ఎమ్.సి.పి అనుకోకండి, నాకు జరిగిన అనుభవాలు చెప్తున్నాను.ప్రతీ చోటా ఇలాగే ఉంటారనడం లేదు. మా సెక్షన్ లోకూడా చాలా మంది సిన్సియర్ లేడీస్ ని చూశాను.ఏదో పేరంటానికి వెళ్ళినట్లు ఖబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. ఇదేమిటీ అని అడిగితే కళ్ళంబట నీళ్ళేట్టేసికుని, పై ఆఫీసరు దగ్గర ఉల్టా మనమిద కంప్లైంట్ చేసేస్తారు. ఆయనేమో మన 'శీలాన్ని' శంకించేస్తాడు! ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయడం అంటే నిజంగా ' అశిధారావ్రతం' లాటిది.

ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న పెద్ద జాడ్యం యూనియన్లు. ఆఫీసరు దగ్గరనుంచి, క్రింద ఆర్డర్లీ దాకా ప్రతీవాడూ పేద్ద లీడర్ అనే అనుకుంటాడు. యూనియన్లు అనేవే లేకుంటే, వీళ్ళ మాట ఎవడు వింటారూ అంటారు. కానీ ప్రతీ దానికీ ఏదో పేద్ద రభస చేయఖ్ఖర్లెదుగా! పైగా ప్రతీదీ 'హక్కు' అంటారు. మరి పని దగ్గరకు వచ్చేసరికి ' విధి' అనే మాట గుర్తుకు రాదా? ఇంకోటి- నిన్నో మొన్నో పెపర్లో చదివాను- మంగళూరు ఎయిర్పోర్ట్ లో ఏక్సిడెంట్ జరిగిన తరువాత, ఎయిరిండియా వాళ్ళు సమ్మేచేస్తున్నారు, అందులో యూనియన్ లీడర్స్ అసలు పనికే వెళ్ళరుట!కానీ అందరిలాగే జీతభత్యాలు అవీ మాత్రం ఠంఛనుగా తీసేసుకుంటారు. ఇలాటి ' జీవులు' ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థలోనూ ఉంటారు.వీళ్ళ కి పనేమీ ఉండదు, మన రాజకీయనాయకుల 'మీనిఏచర్ రూపాలు'.సంస్థలో ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగిందా, అక్కడ వీళ్ళు హాజర్. ఏ గొడవా లేకుండా ఉంటే వీళ్ళకి కడుపుబ్బరం వచ్చేస్తుంది. మన బి.జే.పీ వాళ్ళు చూడండి, ఏ పనీ లేనప్పుడు అయోధ్య లో రామ మందిరం వ్యవహారం మాట్లాడతారు. అలాగే ఈ యూనియన్ నాయకులు, జీతాల ఎగ్రిమెంట్లంటారు.ఇన్ని గొడవలతో ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేయడానికి టైము ఎక్కడుంటుంది?

బ్యాంకుల్లో ఒక్కోసారి ఆఫీసర్లు సమ్మె చేస్తూంటారు! ఏమీ తోచకపోతే చేసే పని ఇదోటి.ఇంకా మన రక్షణ బలాల్లోనూ, పోలీసుల విభాగంలోనూ ఈ సమ్మెల రోగం రాలెదు. నాకు ఒక సంగతి అర్ధం అవదు-' కోర్ సెక్టార్' లో చూస్తూంటాము.

ఈ సమ్మెలూ అవీ. మరి పాపం ఐ.టీ లొ ఇలాటివేవీ ఉండవా అని.అయినా వాళ్ళననేం లాభం? అసలు ఒకే మనిషి ఒకే సంస్థలో చాలా కాలం పనిచేసిందెప్పుడూ? ఎక్కడ జీతాలెక్కువిస్తే అక్కడికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు జీవితంలో మంచి 'థ్రిల్' మిస్స్ అవుతున్నారు! ఈ మధ్యన ఐటీ రంగంలో కూడా వస్తోంది ఈ జాడ్యం. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఈ ఐటీ రంగంలోనూ ఉద్యోగాలు తీసేస్తున్నారుగా, దానితో వీళ్ళూ యూనియన్లూ, సింగినాదాలూ మొదలెట్టారు.

ఊరికే ప్రభుత్వ కార్యాలయాల్లోనివాళ్ళనే ఆడిపోసుకుంటే బాగో లేదు. మిగిలిన రంగాల్లోని వాళ్ళ గురించి కూడా చెప్తే 'బాలెన్స్'అవుతుంది. సరదాగా, మీడియా అంటే ప్రింట్ , టి.వీ. ల్లోని తెరవెనుక భాగవతాల్ని కూడా చెప్తూంటే, 'ఓహో మన భారత భూమి ఎంత ప్రగతి సాధించిందీ' అని చంకలెగరేసుకోవచ్చు.

సర్వేజనాసుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి