ప్రాణంతో బెట్టింగ్‌ - కొత్త నాన్సెన్స్‌ - ..

new nonsence

ఉడుకు రక్తం అంతే ప్రాణంతో చెలగాటమాడటం ఓ సరదాగా భావిస్తుంటుంది. ఆకాశం ఎత్తుల్ని చూడాలనీ, అగాధం లోతుల్ని చూసెయ్యాలనీ అనుకోవడం వెనుక వారిలోని 'తెలుసుకోవాలనే తపన' వరకూ బాగానే ఉంటుంది. అయితే ప్రమాదాలను కొనితెచ్చుకోవడమే బాధ పడాల్సిన అంశం. లోకం మారింది, మంచి కంటే చెడు చాలా వేగంగా పరుగులు పెట్టేస్తోంది. 'నువ్వు చెయ్యగలవా? చేసే దమ్ముందా?' అని ఎవరైనా సవాల్‌ విసిరితే చాలు, ప్రాణాన్ని పణంగా పెట్టేస్తోంది నేటి యువతరం. సాహసం చేయరా డింభకా అన్న మాట అన్ని సందర్భాలలోనూ మంచిది కాదు. సాహసం చేయొచ్చు, కానీ అది ప్రాణాల్ని తోడేసేంతటి ప్రమాదకరమైన సాహసం కాకూడదు. రెడ్‌ లైట్‌కీ గ్రీన్‌ లైట్‌కీ మధ్యలో 'ఎల్లో' లైట్‌ ఉంటుంది. ఆగి, చూసి ముందుకు వెళ్ళమని దానర్థం. ఆగడానికైనా, ముందుకెళ్ళడానికైనా అదే ఓ హెచ్చరిక, అదే ఓ సంకేతం. ఆ తేడా తెలుసుకోకపోవడం వల్లనే సమస్యలన్నీ.

బెట్టింగ్‌ కూడా ప్రమాదమే, ప్రాణంతో చెలగాటమే. మొదట సరదాగా ప్రారంభమవుతుంది, బెట్టింగ్‌పై నిషేధం ఉన్నాసరే ఆ బెట్టింగ్‌ మన దేశంలో యధేచ్ఛగా సాగుతోంది. ఈ బెట్టింగ్‌ కారణంగా ఎన్నో కుటుంబాలు బలైపోతున్నాయి. ప్రధానంగా క్రీడల చుట్టూ ఈ బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. వాటిల్లోనూ క్రికెట్‌ చుట్టూ జరిగే బెట్టింగ్‌ గురించి అందరికీ తెలిసినదే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రాకతో బెట్టింగ్‌ స్వరూపమే మారిపోయింది. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారు అక్రమార్కులు. ఆ బెట్టింగ్‌ చాలా ఈజీగా యువతను ఆకర్షిస్తోంది. వంద రూపాయల నుంచి మొదలై లక్షల రూపాయలు, కోట్ల రూపాయలదాకా బెట్టింగ్‌లో లాస్‌ అయిపోతున్నారు. లాస్‌ అవుతున్నవారిలో ఎక్కువశాతం యువతే ఉన్నారనేది ఓ అంచనా. చదువుకునే యువత, స్కూలు నుంచే ఈ బెట్టింగ్‌ పట్ల ఆకర్షితులవుతుండడం గమనించదగ్గ అంశం. బెట్టింగ్‌ నిర్వాహకులకు రాజపోషకులు విద్యార్థులే.

ఇంట్లో 'పొదుపు' అలవాటు చేసేందుకు తల్లిదండ్రులు నేర్పే 'డిబ్బీ' కల్చర్‌ తెలిసినదే. అక్కడినుంచి బెట్టింగ్‌ కోసం దొంగతనం మొదలు పెడుతున్నారు కొందరు. ఆ తర్వాత ఇంట్లో వస్తువుల్ని దొంగతనం చేయడం వరకూ చెయ్యకూడని పనులన్నీ బెట్టింగ్‌ చేయించేస్తోంది. కాలేజీ స్థాయిలో జరుగుతున్న బెట్టింగ్‌ గురించి తెలుసుకుంటే ఎవరైనా భయకంపితులవ్వాల్సిందే. తల్లిదండ్రులకు తెలియకుండా వడ్డీకి అప్పులు చేయడం, ఆ అప్పులు తీర్చే మార్గం దొరక్క ప్రాణాలు కోల్పోవడం నిత్యకృత్యమయిపోయింది. బెట్టింగ్‌ కారణంగా తామెలా నష్టపోయిందీ కొందరు బాధితులు పేర్కొనడం, కొందరైతే సెల్ఫీ వీడియోలు తీసి ఆత్మహత్యలకు పాల్పడుతుండడం చూస్తున్నాం. పిల్లలు దారితప్పుతున్న విషయం మొట్టమొదట కుటుంబ సభ్యులే గమనించాలి. ఆ తర్వాత బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలది. వీటన్నిటికీ మించి సమాజంలో బెట్టింగ్‌ లాంటి మాఫియాలపై పాలకులు కూడా అడ్డుకట్ట వేయవలసి ఉంటుంది. స్నేహమంటే కలిసి తిరగడం మాత్రమే కాదు, తమలో ఎవరు అక్రమ పంథా ఎంచుకున్నారో గుర్తించి, అప్రమత్తం కావడం, ఇతరుల్ని అప్రమత్తం చేయడం ద్వారా స్నేహం మెరుగైన సమాజానికి దారిచూపాలి.

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు