మాతంగ కన్యాం మనసా స్మరామి! - టీవీయస్. శాస్త్రి

maathanga kanyaam mansaa smaraami

మాణిక్యవీణా ముపలాలయన్తీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి

శ్యామలా దండకంలోని ఈ శ్లోకాన్ని వ్రాసిన వారు మహాకవి కాళిదాసు. నేను మొదటిసారిగా ఈ శ్లోకాన్ని ఘంటసాల గారి గాత్రంలో విన్నాను. అమ్మవారు సాక్షాత్కరిస్తే, భక్తిపారవశ్యం ఎలా కలుగుతుందో తన గొంతుకతో అభినయించి చూపిన గంధర్వ గాయకుడు శ్రీ ఘంటసాల. 'మాతంగ కన్య' అంటే అర్ధం ఏమిటి? అని తెలుసుకోవాలని నాకు కుతూహలం కలిగింది. వెంటనే లలితా సహస్రనామాలు వెతికాను, లక్ష్మీ సహస్రనామాలు వెతికాను -- ఎక్కడా శ్యామలాదేవి, మరియూ మాతంగ కన్యల ప్రసక్తి కనపడలేదు. నేను చూసిన మొట్టమొదటి రంగస్థల నాటకం'హరిశ్చంద్ర'. ఈ నాటకాన్ని రచించిన వారు శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు. మా నాన్న గారికి ఈ నాటకం అంటే చాలా ఇష్టం. దానికి ముఖ్య కారణం శ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం గారు వారికి ఉపాధ్యాయులు. ఈ నాటక ప్రదర్శనను తప్పక చూసేవారు.

ఒక సందర్భంలో, వారికి వీలు దొరకక, టిక్కెట్టు ఇచ్చి నన్ను వెళ్ళమన్నారు. ఆ నాటకం నాకింకా గుర్తు. ఆ రోజుల్లో హరిశ్చంద్ర పాత్రను ఇద్దరు ప్రముఖులు పోషించేవారు. ఒకరు శ్రీ డీ. వీ. సుబ్బారావు గారు, రెండవ వారు శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు. డీ. వీ. సుబ్బారావు గారి పేరు వినటమే కానీ, వారిని గానీ, వారి నాటకాలను గానీ నేను చూడలేదు. నేను చూసిన హరిశ్చంద్ర నాటకంలో -- హరిశ్చంద్రునిగా శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు, విశ్వామిత్రునిగా శ్రీ మందపాటి రామలింగేశ్వరరావు గారు, నక్షత్రకునిగా శ్రీ పీసపాటి నరసింహమూర్తి గారు, చంద్రమతిగా శ్రీ బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి గారు ప్రధాన పాత్రలు పోషించారు. అందరూ అత్యత్భుతంగా నటించిన గొప్ప నాటకం అది. ఈ 'మాతంగ కన్యల' ప్రసక్తి మళ్ళీ ఆ నాటకంలో విన్నాను. విశ్వామిత్రుడు మాతంగ కన్యలను రప్పించి, హరిశ్చంద్రుడిని, ఆ కన్యలను వివాహమాడమంటాడు. అందుకు హరిశ్చంద్రుడు వినయంగా నిరాకరిస్తాడు. అక్కడ, మాతంగ కన్యలు అంటే, మతంగ మహాముని కుమార్తెలు అని అర్ధం. మతంగ మహాముని, కులం చేత శూద్రుడు. మాదిగలు అన బడేవారు మతంగ మహాముని సంతతని కొంత మంది వాదన కూడా ఉంది. ఇప్పుడది అప్రస్తుతం.

కాళిదాసు చెప్పిన 'మాతంగ కన్య' ఈ మాతంగ కన్యలకూ ఏమైనా సంబంధం, సారూప్యం ఉందేమోనని, నా చిన్న బుర్రలో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే నేను మా ఇంటికి అతి సమీపంలోనే ఉన్న నాకు ఆరాధ్యులు, అభినవపోతన శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారిని కలసి, నా సందేహాన్నిఇలా అడిగాను -- గురువు గారూ! 'మాతంగ కన్య' అంటే అర్ధం ఏమిటి? కాళిదాసు మహాకవి 'మాతంగ కన్యను' అలా మనసారా స్మరించటానికి కారణం ఏమిటని? అని సూటిగా అడిగాను. శ్రీ పాపయ్య శాస్త్రి గారు సౌమ్యులు. వారు చెప్పే విధానం చాలా బాగుంటుంది. వారు ఇలా చెప్పారు --- 'మాతంగ కన్య' అంటే అర్ధం విడమరచి చెబుతాను. జాగ్రత్తగా విను! మాత అంటే తల్లి అనే అర్ధం అందరికీ తెలిసినదే! 'అంగ' అంటే శరీర భాగం. కన్య అంటే పవిత్రమైనది అని అర్ధం. మొత్తం కలిపి అర్ధం చెప్పాలంటే, మాతకు అంగాలు ఎలా ఉండాలో అలా ఉన్న కన్య కూడా మాతే! కుర్రవాడివి కనుక నీకు ఇంకా అర్ధం అయేటట్లుగా చెబుతాను విను! కొంతమంది చిన్న వయసులో ఉన్న స్త్రీలను చూస్తే మనకు తల్లి అనే భావన కలుగుతుంది. షష్టి పూర్తి జరిగిన కొంతమందిని చూసినా ఆ భావం కలగదు. దానికి కారణం వారి వేషాలంకరణే! --- అలా వారు చెప్పినది నాకు అర్ధం అయింది.

ముఖ్యంగా, 'శ్రీ విద్యోపాసకులకు' పర స్త్రీ తల్లిలాగా కనిపిస్తుందట! ఈ దృశ్యాన్ని శ్రీ విశ్వనాద్ గారు తీసిన 'సప్తపది' సినిమాలో అద్భుతంగా చూపించారు. కొందరి ప్రస్తుతపు వేష భాషలను చూస్తుంటే, నాకు ఈ విషయాలు చెప్పాలనిపించాయి. నాకు ఎటువంటి హిపోక్రసీలు లేవు. నా మనసులోని భావాలను నిర్భయంగా చెబుతాను. మనసులోపల ఒకరకమైన భావాలను ఉంచుకొని, బయటకు వాటికి భిన్నమైన భావాలను వెలిబుచ్చే వాళ్ళు బందిపోటు దొంగలకన్నా భయంకరులు. అదీగాక, భావాలను లోపల దాచుకుంటే ఉపయోగం ఏముంటుంది? ఏదో ఒకనాడు ఆ భావాలు మనలోనే చచ్చిపోతాయి. పవిత్రమైన ఈ శరీరం ఒక'స్మశానం' అవుతుంది. ఇటువంటి విషయాలలో నాకు ఆదర్శమూర్తులు ఇద్దరే ఇద్దరు! ఒకరు నిత్య సత్యాన్వేషి, విప్లవ తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారు, మరొకరు తన రచనల ద్వారా తెలుగు దేశాన్ని ఒక ఊపు ఊపిన'మహర్షి చలం'. కానీ, వారి భావాలకు కూడా నేను బానిసను కాను! వారి భావాలకు మనం బానిసలము అయ్యామంటే, వారి 'తత్త్వం'మనకు అర్ధం కానట్లేనని నా భావన! ఎవరి భావాలకో మనం బందీలమై మన కాళ్ళకు మనమే సంకెళ్ళను వేసుకుంటే మన గమనం ముందుకెలా సాగుతుంది?నేను అన్నీచదువుతాను, ఏదీ నన్ను బంధించలేదు. నేను స్వేచ్ఛాజీవిని!

భావదాస్యాన్ని మించిన దరిద్రం మరొకటి లేదు! స్త్రీ, పురుష బేధం లేకుండా వయసుతో నిమిత్తం లేకుండా జుట్టుకు రంగు వేసుకొని, వస్త్రాలంకరణ చేసుకుంటున్నారు చాలా మంది ఈ రోజుల్లో. 70 ఏళ్ళ వయసులోనున్న నాకు తెలిసిన ఒకామె జుట్టుకు రంగు వేసుకోకుండా మేకప్ లేకుండా బయటకు అడుగు పెట్టదు. ఏదో చిన్న వాళ్ళు, చిన్నతనంలో జుట్టు నెరిసిందని రంగు వేసుకోవటంలో తప్పులేదు. పైగా యవ్వనంలో, మధ్యవయసులో ఉన్న వాళ్లకు ఆ అలంకరణలు శోభిస్తాయి. 70 ఏళ్ళ వయసులోనున్నవారు జుట్టుకు రంగు వేసుకొని, మేకప్ చేసుకోవటంలో ఔచిత్య మేమిటో నాకు అంతు పట్టదు. పైగా ఆమె నన్నడిగింది, "మీరు జుట్టుకు రంగు ఎందుకు వేసుకోరు?" అని. "జుట్టుకు రంగు వేసుకోవటం అంటే, పాత కేలండర్లను ఇంట్లో పెట్టుకోవటం, గడియారంలోని ముళ్ళను వెనక్కి తిప్పి మురిసిపోవటమే!" అని చెప్పాను.

నేను చెప్పినది ఆమెకు అర్ధమయినట్లు లేదు, అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిచనూ లేదు. పైగా ఆగకుండా, అలుపు సొలుపు లేకుండా ఆవిడ ఇలా చెప్పటం మొదలు పెట్టింది --- మీరు T. V. చూడరా! సన్యాసులూ, సాధువులూ, అవధూతలూ, బాబాలు గడ్డాలకూ, మీసాలకూ, జుట్టుకూ రంగు వేసుకొని మేకప్ చేసుకొని ఉపన్యాసాలు చెప్పటం, చూడటం లేదా? వారే ప్రకృతికి విరుద్ధంగా నడుచుకుంటుంటే, ఇంక మానవ మాత్రులము మన మెంత! అని కొంత ఆమెకు తెలిసిన వేదాంత సారాన్ని(?) కూడా చెప్పింది. అంతే కాదు సాయంత్రం వేళల్లో ఒక యోగిని గారు (ఏదో ఛానల్ పేరు కూడా చెప్పింది) ఉపన్యాసం చెబుతుంది, ఆమె ఎంత అందంగా ఉంటుందో! నా మాట మీద నమ్మకం లేకపోతే, మీరూ చూడండి ఒక సారి. (తెలుగు వాళ్ళలో ఈ మధ్య'భక్తి'(?) బాగా పెరిగినట్లున్నది. అటువంటి ప్రత్యేకమైన ఛానళ్ళు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి) ఆమె చెప్పింది చెప్పినట్లే ఉంది.

కొంతమంది చెప్పేవాటికి, బదులు చెప్పటం వృధా! వారికి వేయి నమస్కారాలు చేసి వదిలించు కుంటాను. అర్ధం పర్ధం లేని వివాదాల లోకి వెళ్లి, కాలం వృధా చేసుకోవటం నాకు ఇష్టం ఉండదు. అటువంటి వారికి చెప్పినా ఉపయోగం ఉండదు. వాళ్ళు చెప్పేదాని మీద వారికే సరైన అవగాహన ఉండదు, ఇక మనం చెప్పి ఉపయోగం ఏముంటుంది?అన్నిT. V. సీరియల్స్ లో కూడా మీరు గమనించే ఉంటారు, అత్త పాత్రలకీ, కోడలు పాత్రలకీ వేష భాషల్లో ఏమీ తేడా కనిపించటం లేదు. నిజం చెప్పాలంటే, కొన్ని సీరియల్స్ లో అత్త పాత్ర వేసిన వారే కోడలు పాత్ర వేసిన వారి కంటే చిన్నవారుగా, గ్లామరస్ గా కనబడుతుంటారు!

ఈ ఫోటోను చూడండి. ఆ ఫోటోలోవున్న స్త్రీమూర్తిని చూస్తే, అణువుఅణువునా, మనకు మాత్రుత్వమే కనిపిస్తుంది. ఆ దివ్య స్వరూపిణిని చూసినప్పుడల్లా ఎట్టివారికైనా 'మాతంగ కన్యే' గుర్తుకు వస్తుంది. ఈ దివ్య స్వరూపిణిని, ఆమె భర్త కూడా 'అమ్మ'గానే భావించేవారట. ఆ రూపం, వేష భాషలు చూస్తే ఎవరికైనా, 'అమ్మ'అనే భావన వచ్చి తీరుతుంది. ఫోటోలో చలంగారిని చూడండి, అమ్మ దగ్గర ఒక చిన్న పిల్లవాడిలాగా చనువుగా, భయం లేకుండా ఆనందంగా ఎలా ఉన్నారో! అమ్మ దగ్గర ఆయనకు ప్రశాంతత కూడా లభించిందట. మనిషికి ఈ సువాసనలు అబ్బటానికి కొంత జన్మ సంస్కారం కారణం అయితే, మరికొంత ఈ జన్మలో కూడగట్టుకున్నసజ్జన సాంగత్యం, సౌజన్యం కారణం కావచ్చును.

'మాతంగ కన్యాం మనసా స్మరామి!'

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు