చమత్కారం - భమిడిపాటిఫణిబాబు

chamatkaaram

 మన దేశంలో కాశ్మీర్ సమస్యకంటే, అతి కష్తమైన, ఎప్పటికీ పరిష్కారమవని సమస్య ఏదైనా ఉందా అంటే—మన ఆడవారి  చీరల సమస్య… అదేమిటో, బీరువానిండా ఎన్ని చీరలున్నడీయండి, ఎప్పుడూ సరిపోనట్టుగానే ప్రవర్తిస్తారు. ఈ వ్యాసం చదివి, కోపంతెచ్చుకోవద్దని మహిళలందరికీ  ప్రార్ధన.. ఉన్నమాటేదో చెప్పడమే  నా ధ్యేయం కానీ, మరో దురుద్దేశం ఏమీ లేదు…

మధ్య తరగతి వారికైతే మరీ ఎక్కువ. కింది తరగతివారికి చీరలు కొనే ఓపిక లేదు కాబట్టి గొడవే లేదూ.  ధనవంతులకైతే చేతినిండా డబ్బుంటుంది కాబట్టి సమస్యే లేదూ.  అటూ ఇటూ కాకుండా, త్రిశంకు స్వర్గంలో వేళ్ళాడేదల్లా ఈ మధ్యతరగతి ప్రాణులే… ఏవేవో చేసేయాలనుంటుందీ, ఏవేవో ఊహించేసికుంటారూ.. ఏవిటేమిటో అయిపోయి అంతా గందరగోళం అయిపోతుంది.. ఏ చుట్టాలింటిలోనో వాళ్ళ కూతురికో, కొడుక్కో పెళ్ళి నిశ్చయం అయిందని తెలియడం తరవాయి, ముందర వీళ్ళకి హడావిడి ప్రారంభం. పైగా ఆ వెళ్ళే  పెళ్ళిలో,  పెళ్ళికూతురో, పెళ్ళికొడుకో చేసే టైముకోటీ, స్నాతకానికోటీ, పెళ్ళి టైముకైతే సరేసరి, అప్పగింతల టైములో ఇంకోటీ.. అదృష్టమేమంటే, ఆ తరవాతి కార్యక్రమానికి మరీ బావుండదేమో అని వదిలేస్తారు.కనీసం నాలుగు పట్టుచీరలైతే ఉండాలే. ఇంక ఇవి కాకుండా, ఎలాగూ ఓ నాలుగు రోజులుంటారు కదా, తెలిసిన వాళ్ళింటికేమైనా వెళ్తేనో… వాటికి పట్టు చీరలు కాకుండా, వేశవి కాలం అయితే, తగ్గట్టు నేతచీరలో, ప్రింటెడ్ వాయిల్సో…వీటన్నిటికీ నప్పే మిగిలిన   ఆభూషణాలు  అంటే, పరికిణీలూ, ఆ చీరలకి అవేవో పీకోలూ, ఫాల్సూ..  అసలు పెళ్ళివారికంటే వీళ్ళకి హడావిడెక్కువ.బీరువా నిండా అన్ని పెట్టుకుని మళ్ళీ అన్నెందుకే ఇప్పుడూ అని ఆ భర్త అనే బక్క ప్రాణి అన్నాడా, అయిపోయిందే.  ఓ పెద్ద చిఠ్ఠా తెరుస్తారు.  “ఆ కలనేతది గృహప్రవేసానిదీ , పసుప్పచ్చది  మిమ్మల్ని కట్టుకున్నప్పడిదీ, ..ఉన్నాయిలెండి సౌడభ్యం ఈ పాతికేళ్ళలోనూ ఒక్కటంటే ఒక్క చీరైనా కొన్నారా మీరూ… “ అని వీటో చేసేస్తారు. డిస్కౌంట్లలో ఏమైనా దొరుకుతున్నాయే చూసి , మొత్తానికి ఆ భర్త  నోరునొక్కేసి, కొంటారు. బావుండదేమో అని, “ పోనీ మీరూ ఓ రెండుమూడు జతలు కొనుక్కోకూడదూ … “ అని  ఓ మాటంటే సరిపోతుంది. పై హడావిడంతా, ఏ చుట్టాలింటికో పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు.

ఇంక ఊళ్ళో ఎవరింటికో ఏ శుభకార్యానికో వెళ్ళాలంటే, పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఓ వారం ముందునుంచీ   పరిస్థితులు రివ్యూ చేసి, శుభ కార్యానికి ఏ చీరబావుంటుందో  చూసుకుంటారు,  మధ్యమధ్యలో మాటవరసకి పక్కనే, తన స్మార్ట్ ఫోనులో , తన ఫేస్ బుక్ పోస్ట్ కి ఎన్ని లైక్కులు వచ్చాయో చూసుకుంటూన్న భర్త ని అడగడం. అభిప్రాయం కోసం కాదు   just for information only—పోనీ చెప్పడం అందాం. ఆ ప్రాణి తనేదో చెప్తున్నట్టుందీ అనుకుని, తలూపడం తో సరిపోదుగా మధ్యమధ్యలో ఊ కొడుతూంటాడు… మధ్యలో యూనిట్ టెస్ట్ లోలాగ ఏదైనా ప్రశ్న అడిగిందా, వీధినపడిపోతాడు.. ఈవిడకేమో చిర్రెత్తుకొచ్చేస్తుంది.. “ అవునులెండి మీరెందుకు వింటారూ.. ఇన్ని చీరలున్నాయని కానీ, అన్నీ ఎవరెవరో పెట్టినవే.. “ అని కసురుకుంటుంది. పోనీ విషయం తేలుతుందా అబ్బే, ఓ చీరతీయడం, “ఇది వాళ్ళింట్లో గృహప్రవేశాని కట్టాను. ఫలానా చీర వాళ్ళబ్బాయి బారసాలకి కట్టాను… చిత్రమేవిటంటే ఆ బారసాల గాడిదే ఇప్పుడు పెళ్ళి రిసెప్షన్. పాతిక సంవత్సరాల తరవాత  మళ్ళీ కట్టుకుంటే ఏం పోయిందో ఈ అర్భక ప్రాణికి తెలియదు. అలాక్కాదుట, ఎవరింటికైతే వెళ్తున్నామో వాళ్ళకి గుర్తుంటుందిట. అందరిలోనూ అడిగేస్తే, తలెక్కడ పెట్టుకోవాలో తెలియదు.. మీకేం తెలియదు మీరూరుకోండి.. “ . అని కొట్టిపారేయడం.  వీరి   memory power  కి జోహార్లు..

పోనీ బీరువాలో లేవా అంటే, లేకేం కావాల్సినన్నుంటాయి.  కలరా ఉండలు వేసి, వాటిని  జాగ్రత్త చేయడమే కానీ, ఒక్కరోజూ కట్టుకున్న పాపానికి పోరు. పైగా వీటన్నిటికీ ఓ వార్డ్ రోబ్బో, కబ్బోర్డో ఒకటీ. అందుకే చూస్తూంటాం,  మగాళ్ళ బట్టలకి ఓ అలమారాలో ఓ “ అర “ మాత్రమే కేటాయించుంటుంది. అదే ఆడవారి బట్టలకి, ఆంధ్రదేశానికి రాకుండాపోయిన ఓ  Special Status (  ప్రత్యేక హోదా ). పైగా మగాళ్ళు బట్టలు పెట్టుకునే బీరువా నామమాత్రానికే, నగరాల్లో, చెరువులూ నాలాలూ అన్యాక్రాంతమైనట్టుగా, ఈ బీరువాలోనే పక్క బట్టలూ, తువ్వాళ్ళూ, అప్పుడప్పుడవసరమయ్యే బట్టలూ ఆక్రమించేస్తూంటాయి.. మగాళ్ళ బట్టల గురించి ఇంకో వ్యాసం లోనే…

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి