ఉత్తరాఖండ్ ( విహార యాత్ర ముస్సోరి ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

దేశ రాజధాని ఢిల్లీనగరానికి సుమారు 200 కిలో మీటర్ల దూరంలో వున్న హరిద్వార్ కి ముందురోజు చేరుకొని గంగలో స్నానం చేసినంత మాత్రాన్నే సర్వ పాపాలు పోతాయనే భక్తితో గంగా స్నానం చేసుకొని మా చార్ ధామ్ యాత్ర మొదలు పెట్టేం .

ముందుగా చెప్పినట్లుగా మేం యే టూర్ ఆపరేటర్ల ద్వారా మా యాత్ర బుక్ చేసుకోం . ఢిల్లీ లోనే టాక్సీ అద్దెకు తీసుకొని బయలుదేరేం . మాటతో పాటు మరో రెండు జంటలనేనా యాత్రలకు తోడుగా తీసుకు వెళ్లడం అలవాటు , యీ సారికూడా అలానే బయలు దేరేం .

హరిద్వార్ లో బయలు దేరిన తరువాత ముస్సోరి లో రెండు రోజులు వుండాలని నిర్ణయించుకుని రూములు బుక్ చేసుకున్నాం . పన్నెండు కల్లా భోజనాలు చేసుకొని హరిద్వార్ లో బయలుదేరేం . ముస్సోరీకి వెళ్లే రోడ్డు రాజాజీ నేషనల్ పార్క్ మీదుగా వెళుతుంది . రాజాజీ నేషన్ల పార్క్ లో అడవి యేనుగుల సంచారం యెక్కువగా వుంటుంది . ఋషికేశ్ వెళ్లేదారికూడా యిదే అవటం వల్ల యాత్రా సీజనులో ట్రాఫిక్ చాలా యెక్కువగా వుంటుంది . సుమారు 20 కిలోమీటర్ల ప్రయాణం తరువాత ముస్సోరీ వెళ్లేదారి మారుతుంది . రాష్ట్ర ముఖ్యపట్టణమైన డెహ్రాడూన్ విమానాశ్రయం మీదుగా సాగుతుంది ముస్సోరీ వెళ్లే దారి . డెహ్రాడూన్ నుంచి ముస్సోరి 35 కిలో మీటర్లు , హరిద్వార్ కి సుమారు 90 కిలో మీటర్ల దూరం.

డెహ్రాడూన్ ముస్సోరీ బ్రిటిష్ కాలం నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ప్రసిద్ది . సుమారు హరిద్వార్ నుంచి ముస్సోరి వరకు అంతా కొండలమీదే మన ప్రయాణం సాగుతుంది .

మన దేశంలో వున్న ప్రసిద్ధ వేసవి విడుదలలో ముఖ్య మయినది కూడా కావడంతో ముస్సోరీ యెప్పుడూ రద్దీ గానే వుంటుంది . సముద్ర మట్టానికి సుమారు 6,170 అడుగుల యెత్తున వుండడంతో యెప్పుడూ చల్లగా , అతిచల్లగా వుంటుంది ముస్సోరి .

సాధారణంగా పర్వతాల మద్యనవున్న లోయలలో పట్టణాలు విస్తరించడం చూస్తాం కాని ముస్సోరీ పర్వతాలమీదనే విస్తరించడం ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది . మొత్తం ముస్సోరీని రెండు భాగాలుగా చేస్తే ఒక భాగం రెసిడెన్షియల్ స్కూల్స్  కాగా మిగతా సగభాగం మిలిటరీ ఆధీనంలో వున్నట్టు అనుకోవచ్చు .

వెడల్పుగా రోడ్లు వేసుకునే వెసులుబాటుకూడా లేదు . ఆ కొండలలో సన్నని రోడ్లమీద ప్రయాణం కాస్త భయాన్ని కలుగ జేసింది . మేం బుక్ చేసుకున్న హోటలు ఓ పర్వత శిఖరాన వుండడంతో అక్కడనుంచి లోయలు , కొండవాలులలో వున్న భవనాలు కనువిందు చేసేయి .

మాల్ రోడ్డు నుంచి సుమారు మూడు కిలో మీటర్ల దూరంలో వుంది మా హోటలు .

మాల్ రోడ్డు సుమారు పావు కిలో మీటరు పొడవునా వున్న రోడ్డు మీదే రెస్టొరాంట్స్ , నిత్యావుసర వస్తువులను విక్రయించే షాపులు , బట్టల దుకాణాలు అన్నీ అక్కడే . అక్కడే రెండు మూడు ATM లు వున్నాయి . మాల్ రోడ్డుకి దిగువన వున్న రోడ్డులో లక్మీనారాయణ మందిరం , హనుమాన్ మందిరం వున్నాయి . అక్కడే టాక్సీ స్టాండు వున్నాయి .

హరిద్వార్ లో పగలు చాలా వేడిగా వుంటుంది , డెహ్రాడూన్ చేరేసరికి గాలి చల్లబడింది , ముస్సోరీ చేరేసరికి చలి బాగా వేసింది . ఎటు చూసినా పచ్చటి చెట్లతో వున్న పర్వతాలే .

ముఖ్యంగా ముస్సోరీలో చూడవలసినవి ' గన్ హిల్ ' , యీ పర్వతం పైన వున్న ఫిరంగిని మధ్యాహ్నం చాలాకాలం కిందట వరకు పేల్చేవారట . ఆ శబ్ధం ముస్సోరి కొండలలో ప్రతిధ్వనించేదట . ముస్సోరీలోని మాల్ రోడ్డు నుంచి యీ గన్ హిల్ కి కేబుల్ కారు నడుస్తోంది . పచ్చని కొండలలో కేబుల్ కారు ప్రయాణం ఓ మరపురాని అనుభూతి .

కేమెల్ బేక్ రోడ్డు -

ఒంటె మూపురంలా ఓ కొండ పైకి వచ్చి వుంటుంది అందుకే దీనిని కేమెల్ బేక్ రోడ్డు అని అంటారు .

హేపి వేలీ. -----

ఇక్కడ యెక్కువ టిబెటియన్లు కనిపిస్తారు  . బౌద్దమందిరం చూడముచ్చటగా వుంటుంది . ముందు తలుపు దాటుకొని లోపలకు వెళితే పెద్ద హాలు , వెనుక తరగతి గదులు , ఆడుకుంటున్న చిన్న పిల్లలు , లోపల రంగులతో వేసిన బుద్దుడి జీవిత చరిత్రకు సంభందించిన బొమ్మలు కనువిందు చేస్తాయి . నిలువెత్తు బుద్దుడి విగ్రహం ఆకట్టుకుంటుంది .

మొదటి సారి భారతదేశంలో నిర్మింపబడ్డ టిబెటియన్ బౌద్ద మందిరం యిది .

ఇవికాక ప్రతీ హిల్ స్టేషన్లు లోనూ వున్నట్లు సన్ రైజ్ పాయింటు , సన్ సెట్ పాయింట్ వుండనే వుంటాయి . ఒకరోజు హాయిగా హోటల్ లోనే విశ్రాంతి తీసుకున్నాం . ఏ కిటికీలోంచి చూసినా కడుపు నిండిపోయేంత ప్రకృతి సౌదంర్యం , కిటికీలోంచి చూస్తూ రోజులు గడిపేయొచ్చు అని పెంచింది .

త్యాక్షరీ ఆడుకుంటూ , కొండలమీద తేలికపాటి నడకతో సమయం గడిపేము .

మర్నాడు పొద్దున్నే లంచ్ పాక్ చేసుకొని తేలికపాటి ఫలహారాలు , పళ్లు అందుబాటులో పెట్టుకొని మా ప్రయాణం మొదలు పెట్టేం . చలి బాగా వుండడం తో మఫ్లర్లు  చుట్టుకొని బయలు దేరేం . ముస్సోరి నుంచి యమునోత్రి వెళ్లే రోడ్డు మీద '  కేంప్టి ' ఫాల్స్ దగ్గర ఆగి వెళ్లనేది మా ఆలోచన .

కేంప్టి ఫాల్స్ చేరడానికి సుమారు 5 కిలో మీటర్ల ముందు  ' లేక్ మిస్ట్ ' అనే మానవ నిర్మితమైన సరస్సు చేరేం , సుమారు తొమ్మిది అయివుంటుంది అప్పటకి బోటింగ్ మొదలు కాలేదు . చలిగా వుండడం తో టాక్సీ లోంచి కిందకి దిగడానికి యెవరూ యిష్టపడలేదు . 

కేంప్టి ఫాల్స్ దగ్గర అందరినీకూడగట్టి కిందకి బయలు దేరేం . ఫాల్స్ చేరడానికి ఓ రెండు ఫర్లాంగులు మెట్లగుండా కిందకి దిగాలి . యిక్కడ తరచు వానలు పడడం వల్ల దారి పాకుపట్టి జారుడుగా వుంటుంది . జాగ్రత్తగా కాలువెయ్యకపోతే అంతేసంగతులు . కొండమీంచి పెద్ద శబ్ధం చేస్తూ దూకుతున్న జలపాతం చాలా బాగుంటుంది . కాని రాళ్లు లూజుగా వుండడం వల్ల జలపాతానికి దగ్గరగా వెళ్లానే ఆలోచన విరమించుకున్నాం . చలిగా వుండడం వల్ల యెక్కువ సమయం అక్కడ గడపలేక పోయాం .

ఆ చలిలో వేడి వేడి టీ తాగాలని అనిపించింది , యెక్కడా బడ్డీపాక కూడా లేదు . కొండలలో పెద్దగా జనావాసాలు కూడా వుండవు . చలికి ముడుచుకొని అందరం చిన్నగా కునుకు తీసేం . టీ దొరికే ప్రదేశం రాగానే ఆపమని మా డ్రైవరుకి చెప్పడంతో ఓ గంట ప్రయాణానంతరం కనిపించిన టీ కొట్టు దగ్గర ఆపేడు . కొట్టు చిన్నదయినా టీ మాత్రం చక్కగా చిక్కగా అల్లం వేసి పెట్టడంతో మాకు ప్రాణం లేచి వచ్చింది .

మెలికలు తిరుగుతూ కొండలు యెక్కుతూనే వున్నాం . ఒకవైపు యెత్తైన కొండలు మరో వైపు లోయ , లోయలో కిందన ప్రవహిస్తున్న భగీరథి . ఎంతసేపు చూసినా తనివి తీరని దృశ్యాలు . ఎండ యెక్కుతున్నగొద్దీ జనసంచారం కనిపించ సాగింది . కొండ వాలులలో విరగ బూస్తున్న ఊదా రంగు పూవులు , ఆ పూల నుంచి తయారు చేసిన రసం సీసాలలో పోసి అమ్ముతున్నారు . మా డ్రైవరు ఆ జ్యూసు గుండెజబ్బులకు మంచిది అన్నాడు .

పుస్తకాల సంచులు భుజాన వేసుకొని కాలినడకన బడులకు వెళుతున్న పిల్లలూ కనిపించసాగేరు .

అక్కడక్కడ మొక్కజొన్నలు కాలుస్తున్న చిన్న షెడ్డులు , వేడివేడి మొక్క జొన్నలు కనిపించగానే  అందరం కారులోంచి దూకి నచ్చిన పొత్తు యెంచుకొని కాల్పించుకు తిన్నాం .

అలా సరదాగా సాగిన మా ప్రయాణం లంచ్ యెక్కడ చెయ్యాలనే మీమాంస లో పడింది . లంచ్ మాతోనే వుంది కాని నీటి సదుపాయం వున్న చోట ఆగి తినడం అలవాటు , నది చూస్తే యెక్కడో పాతాళానికి వుంది దరిదాపులలో యెక్కడా చిన్న పల్లె వున్న ఆనవాళ్లు కూడా కనిపించలేదు . కడుపులో యెలకల గోల యెక్కువయింది . యెప్పుడూ మేము కారులో త్రాగే నీళ్లు 5 లీటర్లు , వాడిక నీరు 5 లీటర్లు  రిజర్వు లో పెట్టుకుంటాం . వాటి అవుసరం యిప్పడు కలిగింది . మా లంచ్ కానిచ్చి తిరిగి ప్రయాణంసాగించేం .

కొండలలో కల్తీ జరగని గాలి పీలుస్తూ  సాగింది మా ప్రయాణం . సాయంత్రానికి ఉత్తర కాశి లో మా బస చేరేం . ఘరెవాల్ వికాశ్ మండల్ వారి గెస్టహౌసులో రూములు తీసుకున్నాం . మిగతా హోటల్స్ లా  కొండకు ఆనుకొని కాకుండా యిది లోయలో చదునైన ప్రదేశం లో వుంది . ఆడవారం రాత్రి భోజనం యేర్పాట్లలో పడ్డాం , మగవారు మర్నాటికి కావలసిన బ్రెడ్ , పాలు , పెరుగు తేవడానికి బయటకి వెళ్లేరు .

ఉత్తర కాశి జిల్లా ముఖ్యకేంద్రం , సుమారు 3,800 మీటర్ల యెత్తులో భగీరథీ వొడ్డున వరుణావత్ పర్వతాన్ని ఆనుకొని వున్న నగరం యిది . ఉత్తరకాశి గంగోత్రి , యమునోత్రి లుకి కూడలి అని కూడా చెప్పుకోవచ్చు . ఇక్కడ యెన్నో ఆశ్రమాలు వున్నాయి .

' నెహ్రూ యినిస్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్ ' కూడా యిక్కడ వుంది . ఉత్తరకాశి తరువాత యమునోత్రి వైపు గాని గంగోత్రి వైపు కాని యాత్రీకులకు సదుపాయంగా వుండే వూరు లేదనే చెప్పాలి . యమునోత్రి లో రాత్రి వుండడానికి సదుపాయాలు చాలా తక్కువనే చెప్పాలి .   మరునాడు ప్రొద్దుట స్నానాలు చేసుకొని ఉత్తరకాశి చూడటానికి బయలు దేరేం .

భగీరథీ వొడ్డున వున్న విశ్వేశ్వరుని ఆలయం చూసుకొని , కేదార్ దేవతా మందిరం చూసుకొని యమునోత్రి వైపు ప్రయాణం సాగించేము .      యమునోత్రి వివరాలు వచ్చే సంచికలో చదువుదాం అంత వరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు