బీ అలర్ట్‌: సెల్ఫీ కాదది కిల్ఫీ - ..

be alert not selfee menia

టెలిఫోన్‌ రంగంలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఫోన్‌ అంటే అదో బ్రహ్మపదార్థంగా భావించేవారు. ట్రంక్‌ కాల్స్‌ గురించి తెలిసినవారికి, ఇప్పటికి మొబైల్‌ టెక్నాలజీ మహాద్భుతం. వాళ్ళకే కాదు, అందరికీ ఇప్పటి టెలికాం రంగంలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు అద్భుతంగానే కనిపిస్తాయి. మొబైల్‌ ఫోన్ల రాకతో మొత్తం టెలికాం రంగం స్వరూపమే మారిపోయింది. అందునా స్మార్ట్‌ ఫోన్ల రాకతో పరిస్థితి అనూహ్యంగా మారిందని చెప్పడం అతిశయోక్తి కాదు. మొబైల్‌ ఫోన్‌తో ఫొటోలు కూడా తీసుకోవచ్చట అనే కాలం నుంచి మొబైల్‌ ఫోన్‌లో వీడియో కాల్స్‌ మాట్లాడుకోవడం సర్వసాధారణమైపోయేదాకా మారింది ట్రెండ్‌. అది కూడా అతి తక్కువ రోజుల్లోనే. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. కానీ, వాటిని ఎలా ఉపయోగిస్తున్నాం? అని తలచుకుంటేనే భయం కలుగుతుంటుంది. మొబైల్‌ ఫోన్‌లో కెమెరా ఉంటే దాన్ని ఎలాగైనా ఉపయోగించొచ్చు. అక్రమాలకీ ఉపయోగించుకోవచ్చని ఎంతోమంది నిరూపిస్తున్నారు. షాపింగ్‌ మాల్స్‌లో తమ ఫోన్లలోని కెమెరాలతో అమ్మాయిల్ని అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పెడుతున్న ఘటనలు ఎన్నో కనిపిస్తున్నాయి. ఇవి చాలవన్నట్టు సెల్ఫీ మేనియాతో ఊగిపోతున్న యువత, తమ ప్రాణాల్ని తామే తీసుకుంటున్నారు ఆ మేనియాలో పడి.

సెల్ఫీ కాదది కిల్ఫీ అని ఎంతగా మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఆ కిల్ఫీ మేనియా నుంచి బయటపడలేకపోతోంది నేటి యువత. 'ఇది ప్రమాదకర ప్రాంతం' అనే చోట, 'ఇక్కడ సెల్ఫీలు ప్రమాదకరం' అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి కొంతకాలంగా. ఎత్తయిన కొండ ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదార్లు ఇలా ఇవన్నీ కిల్ఫీ జోన్లుగా మారిపోయాయి. వేగంగా దూసుకొస్తున్న రైలు ముందు సెల్ఫీ తీసుకుంటే ఆ కిక్కే వేరప్పా అని చెబుతూ ప్రాణమ్మీదకు తెచ్చుకుంటోంది నేటి యువత. 'నీకది సాధ్యమా? నేను చేసి చూపించగలను' అన్న హీరోయిజం చాలామంది ప్రాణాల్ని తోడేస్తోంది. సాక్ష్యం కావాలా? ఇదిగో! అని సెల్ఫీ తీసుకునేలోపు, ప్రాణం గాల్లో కలిసిపోతోంది. ఒకటా, రెండా? వందల కొద్దీ ప్రాణాలు పోతున్నప్పటికీ కిల్ఫీ మేనియా తగ్గడంలేదు. మానసిక నిపుణులు, దీన్నొక మానసిక వ్యాధిగా అభివర్ణిస్తున్నారంటే ప్రమాద తీవ్రత ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

ఒక ఫోన్‌లో ఒకటే కాదు, రెండు మూడు సెల్ఫీ కెమెరాలు అందుబాటులో ఉన్నప్పుడు ఈ కిల్ఫీ మేనియా ఇంకెంతలా పెరిగిపోవాలి? అదే జరుగుతోంది. ప్రపంచంలో అతి ఎక్కువగా ఈ కిల్ఫీ మరణాలు మన దేశంలోనే చోటుచేసుకుంటున్నాయట. అంటే టెక్నాలజీ, అభివృద్ధి కోసం కాకుండా వినాశనం కోసమే ఉద్భవిస్తోందని భావించాల్సి ఉంటుంది. సోషల్‌ మీడియా వేదికగా ప్రమాదకరమైన సెల్ఫీలు పోస్ట్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టాలు రూపొందాలేమో అనే భావన కలుగుతోందంటే, దాన్ని ఎలా తప్పు పట్టగలం? యువత దేశానికి వెన్నెముక. దురదృష్టవశాత్తూ కిల్ఫీ మేనియా, యువతనే టార్గెట్‌గా చేసుకుని, యువ సత్తాను నిర్వీర్యం చేస్తోంది. బీ కేర్‌ఫుల్‌ సెల్ఫీ మేనియా కాదది కిల్ఫీ మేనియా. అది మిమ్మల్ని నాశనం చేసేస్తుంది.

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు