ఉత్తర కాశి నుంచి సుమారు 30 కిలో మీటర్ల దూరంలో వున్న హనుమాన్ చట్టి చేరుకొని అక్కడ నుంచి కాలినడకన 13 కిలో మీటర్లు వెడితే యమునోత్రి చేరుకోవచ్చు .
ఉత్తర కాశి నుంచి 30 కిలో మీటర్ల దూరం సుమారు రెండు గంటలలో చేరుకుంటాం . దూరం తక్కువయినా దారి తరచు కురిసే వర్షాలవల్ల కోతకు గురై కొండ చరియలు విరిగిపడి ప్రయాణానికి ఆటంకం కలిగిస్తూ వుంటాయి .
హనుమాన్ చట్టి దగ్గర సామాన్యమైన లాడ్జింగులు వున్నాయి , కాని ఉత్తరకాశిలో బస చేసుకుని పొద్దున్నే బయలుదేరి యమునోత్రి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి ఉత్తరకాశి చేరుకోడం మేలు అనేది నా అభిప్రాయం . మేం ఒకసారి యమునోత్రి దగ్గర రాత్రి బసచేసి పొద్దున్నే దర్శనం చేసుకొని మధ్యాహ్నానికి కిందకి చేరుకున్నాం . మరోసారి హనుమాన్ చట్టీ లో వుండి దర్శనానంతరం తిరిగి హనుమాన్ చట్టి చేరుకొని మరునాడు ఉత్తరకాశి చేరుకున్నాం . అయితే యీ రెండు దర్శనాలూ కూడా 2013 వరదలకు ముందు చేసినవి . వరదల తరువాత పరిస్థితి యెలా వున్నదీ తెలీదు , అందుకనే తప్పనిసరి పరిస్థితులలో తప్ప రాత్రి బస కొండలలో చెయ్యక పోవడమే మేలు .
యమునోత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రం లో ఉత్తరకాశి జిల్లాలో వున్న చార్ధామ్ యాత్రలుగా పిలువబడే యాత్రలలో ఒకటి . చార్ధామ్ యాత్ర హరిద్వార్ లో మొదలయు యమునోత్రి , గంగోత్రి , కేదార్నాథ్ బదరీనాథ్ యిదే క్రమం లో సాగి తిరిగి హరిద్వార్ చేరడం తో ముగుస్తుంది . ఇదే క్రమం లో జరపాలి యేమైనా పురాణ కథ వుందో లేక టాక్సీ వాళ్ల సౌలభ్యమో తెలీదు .
ఈ మధ్య ఉత్తర కాశికి యమునోత్రి కి మధ్యలో టెంట్ల లో సర్వసదుపాయాలు కలగజేసి అద్దెకు యిస్తున్నారు . ఓ రాత్రి ఆ టెంట్లలో గడిపేము . ముందు అలా నిర్జన ప్రదేశంలో గడపడం వల్ల చిన్నగా గాలి వేసినా ఉలిక్కి పడి నిద్ర పట్టక చాలా భయపడ్డాం , కాని వారు చేసిన సేవలు యిప్పటికీ మరువలేము . ఎప్పటికైనా మరోసారి అలాంటి టెంట్స్ లో గడపాలనే సంకల్పం మాత్రం వుంది , చూద్దాం మా కోరిక యెప్పటికి నెరవేరుతుందో .
సుమారు సముద్రమట్టానికి 3,293 మీటర్ల ( 10,800 అడుగులు ) యెత్తులో వుంది .
' బండార పూంచ్ ' పర్వతం దగ్గర కొండచాలులోంచి బయటకి వస్తూ కనిపిస్తుంది . కాని నిజానికి యమునానది సుమారు 4,420 మీటర్ల యెత్తులో వున్న కాళింది పర్వత పాదాలచెంత వున్న ' చంపాసర్ ' అనే హిమనీనదములో పుట్టినట్టుగా చెప్తారు . ప్రస్తుతం యమునోత్రిగా పిలువబడే ప్రాంతానికి మరో ఆరేడు కిలో మీటర్లు కొండలలో ప్రయాణించాలి . ట్రెక్కర్సు మాత్రమే అక్కడకి వెళ్లగలరు . దారి చాలా కష్టంగా వుంటుంది . కాని ఆ కొండలలో పూచే బ్రహ్మ కమలాల వల్ల ఆ దారి చాలా అహ్లాదకరంగా వుంటుందని అంతవరకు వెళ్లి వచ్చిన వారు చెప్తూ వుంటారు .
ఉత్తర కాశిలో బయలు దేరినప్పటి నుండి మన ప్రయాణం యమునానది వొడ్డున సాగుతుంది . పచ్చటి చెట్లమీదుగా వీచే చల్లగాలి అడవి పూల వాసనలను మోసుకు తెచ్చి మనకి అహ్లాదాన్ని కలుగ జేస్తూ , అక్కడక్కడ రోడ్ల మీద పడుతున్న ధారలకు చిన్న పైపు తగిలించి వేడినీళ్లు ( అంత చలిలోనూపొగలు కక్కే వేడినీళ్లు కొండలమీంచి కిందకి పడుతూ వుంటాయి ) పట్టుకుంటున్న పల్లె వాసులు కనిపిస్తూ కనువిందు చేస్తూ వుంటారు . నాగరికత యింకా ప్రవేశించని ప్రాంతాలు యివి .
యమున యముడితో కూడా పుట్టిన కవల సహోదరి , తల్లి సంజ్ఞాదేవి , తండ్రి సూర్యుడు .
యమున నల్లని రూపు గలదిగా పురాణాలలో వర్ణన వుంది . పురాణాలలో యమునని ' యమి ' ' కాళింది ' అనే పేర్లను వాడడం కనబడుతుంది . యమున నల్లగా అవడానికి రెండు కారణాలు చెప్తారు , ఒకటి సూర్యుని ఆగ్రహానికి గురై అతని తీవ్రమైన కిరణాలకు నల్లగా మారిందని , మరో కారణం శివుడు సతీ వియోగముతో దుఃఖపడుతూ వుండగా పరమశివుని బాధను తాను స్వీకరించటం వల్ల నల్లగా మారింది అని .
యమున ఉనికి గురించి మార్కండేయ పురాణం లోనూ పద్మపురాణం లోనూ వివరించ బడింది .
పురాణాలలో యెటువంటి ప్రాముఖ్యత లేని యమునకు ప్రాముఖ్యతను కలిగించేందుకు యముడు యెవరైతే యమునోత్రిలో యమునను దర్శించుకుంటారో వారిని మరణ సమయములలో కలిగే యమబాధనుంచి విముక్తులను చేస్తానని మాట యిచ్చేడు అని యిక్కడి పూజారులు చెప్పేరు . యమున దర్శనం వల్ల సూర్యుడు సంజ్ఞాదేవులు కూడా ప్రసన్నతను పొంది వారిని రక్షస్తారని చెప్పేరు
హనుమాన్ చట్టి నుంచి జంకి చట్టి వరకు వున్న మరో ఆరు కిలో మీటర్లు కారులు నడవగలిగే రోడ్డులు వెయ్యటంతో యమునోత్రి కి నడక పదమూడు కిలోమీటర్ల నుంచి యేడు కిలో మీటర్లు అయింది . జంకి చట్టిలో కూడా రాత్రి బస చేసుకోవచ్చు . తక్కువ సదుపాయాలు గల లాడ్జీలు లభ్యమవుతాయి . టీ ఫరవాలేదు కాని భోజనం బాగుండదు .
జంకి చట్టి నుంచి యమునోత్రి వరకు సిమెంటు రోడ్డు వెయ్యడంతో నడక సులువుగా వుంటుంది . వర్షం రోజులో యెప్పుడో ఒకప్పుడు పడుతూనే వుంటుంది కాబట్టి వాన కోట్లు పట్టుకెళ్లడం మర్చి పోవద్దు . నడవలేని వారికోసం డోలీలు , గుర్రాలు అందుబాటులో వుంటాయి . మధ్యలో టీ తప్ప మరేమీ దొరకవు . మధ్య దారిలో రంగురంగులపూలతో నిండిన లోయ వస్తుంది దీని పేరు ' ఫూల్ చట్టి ' . ఈ కొండలలో చిరు ధాన్యాలను బాగా పండిస్తున్నారు .
యమునోత్రి రెండు ఫర్లాంగులు వుందనగా పూజాద్రవ్యాలు అమ్మే దుకాణాలు టీ ఫలహార శాలలు బారులు తీరి కనిపిస్తాయి . అక్కడనుంచే పూజారులు వెంబడించడం మొదలవుతుంది .
యమునోత్రిలో యమునలో స్నానం ముఖ్యం , యిక్కడ ఆడవారికి వేరుగా మగవారికి వేరుగా యమున మీద స్నాన గదులు నిర్మించేరు . యమున నీరు చాలా వేడిగా వస్తూవుంటుంది , కొండలపక్కనుంచి ప్రవహించే గంగ నీటిని పైపులద్వారా మళ్లించి యమున నీటిలో కలిపి స్నానం చేసేందుకు వీలైన వేడిలో చిన్న కుండం లోకి వదులు తున్నారు .
కొండ పక్కన ప్రవహించే గంగ అని అన్నాను కదా ! అది నిజంగా గంగేనట , పూర్వకాలంలో ' అసిత ముని ' యిక్కడ తపస్సు చేసుకొనే వాడట , శక్తి వున్నంత వరకు ప్రతీరోజూ యమునోత్రిలో యమునలో స్నానం చేసుకొని గంగోత్రి వెళ్లి అక్కడ గంగలో స్నానం చేసుకొనే వాడట , వయసుడిగిన తరువాత అసిత ముని గంగోత్రి కి వెళ్లలేక గంగను ప్రార్ధించగా గంగ అసిత ముని కోరికపై యమునానది పక్కనే ప్రవహించసాగిందట . ఓ పక్క సలసలమని ఉడికే నీరు మరో పక్క మంచు లా చల్లగా వున్ననీరు . యమున నీటికి వేడి క్రిందనున్న సల్ఫర్ నిక్షేపాలవలన అని అనుకుంటే పక్కనే ప్రవహిస్తున్న గంగనీరు యెందుకు వేడెక్కలేదు , అనే సందేహానికి సమాధానం నా చిన్న తలకాయలకు అందలేదు .
అంతా భగవంతుని లీల అనుకొని స్నానాలు చేసుకొని , పూజా సామానులు తీసుకొని మందిరం దగ్గరకి వెళ్లేం .
ఈ మందిరానికి ప్రతీ రెండు మూడేళ్లకి మరమ్మత్తులు అవుసరం పడుతూ వుంటాయి . తరచూ కురిసే వర్షాలు , యేడాదిలో ఆరునెలలు కురిసే హిమపాతాలవల్ల మందిరం దబ్బ తింటూ వుంటుంది .
తాబేలు వాహనంగా వున్న యమున నల్లరాతి విగ్రహం యీ మందిరంలో స్థానిక రాజులచే ప్రతిష్టించబడింది .
యమునోత్రిలో ముఖ్యంగా దర్శించుకో వలసిన ప్రదేశాలు యమున స్నానకుండం , దివ్యశిల , సూర్యకుండం , యమున మందిరం . యమునోత్రి చేరగానే నదిని దాటడానికి వేసిన చిన్న కర్ర వంతెన దాటుకొని అవతల వొడ్డుకి చేరుతాం , యమునలో స్నానం చేసుకొని పూజా ద్రవ్యాలు కొనుక్కొని మందిరం వైపుగా వెళితే ముందుగా దివ్య శిల వస్తుంది , దివ్యశిలకి పూజలు చేసుకొని చేతితో దివ్యశిలను తాకమని పూజారులు చెప్తారు . దివ్యశిలను తాకినంత మాత్రానే సర్వపాపాలూ నశిస్తాయని భక్తుల నమ్మకం . దివ్య శిల దర్శనానంతరం పూజారి మనలను అక్కడ వున్న మండపం లో కూచోబెట్టి పూజలు నిర్వహిస్తూ వుంటారు . చుట్టారా మంచు పర్వతాలు వుండటం వల్ల యెముకలు కొరికే చలి వుంటుంది , ఆ చలిలో మనం కూర్చున్న గట్టు వేడిగా అనిపించి హాయిగా వుంటుంది , కాని కొన్ని నిముషాలలో చెమటలు కారడం మొదలవుతుంది .
కొండకు వున్న చీలిక పై కప్పి వుంచిన రాయిని తీసి చూపిస్తారు పూజారులు అదే యమున రూపమని చెప్తారు . చిన్న చీలీకలోంచి పొగలు చిమ్ముతూ నీరు శబ్దం చేస్తూ బయటకి చిమ్ముతూ వుంటుంది . పూజా సామగ్రిలో వున్న చిన్న బట్టలో కట్టిన బియ్యం మూటను ఆ నీళ్లల్లో ఓ నిముషం వుంచి బయటకి తీసి మనకి ప్రసాదంగా యిస్తారు . ఆ నిముషానికే బియ్యం అన్నంగా మారిపోవటం తో ఆ నీటి వుష్ణోగ్రత మనకు అర్దం అవుతుంది . తిరిగి చీలికను ఓ రాయితో కప్పి వుంచుతారు . కిందనుంచి యమున చేసే కుతకుత శబ్దాలు మనకు వినిపిస్తూనే వుంటాయి .
' జయ ' అనే ముని యమున యొక్క కృపకై ఆమె నామమైన ' కాళింది ' ని పలుమార్లు ఉఛ్చరించేవాడట , యమున అతనికి ప్రత్యక్షం కాలేదట , అందుకని అతను యిప్పటికీ కాలింది నామజపం చేస్తున్నాడట , ఆ శబ్దాలు మనకి ' కుతకుత ' శబ్దాలు వినపడుతున్నాయని పూజారులు చెప్పేరు .
యాత్రీకులు కూర్చున్న ప్రదేశాన్నే సూర్యకుండం అని అంటారు .
సూర్య కుండానికి మూడు కిలో మీటర్లు కొండపైకి నడక దారిన వెళితే మరో నీటి కుండం వుంటుంది , దానిని సప్తఋషి కుండం అని అంటారు . ఇక్కడ సప్తఋషులు యాగాది క్రతువులు నిర్వహించేరట .
మేం ఆ పైకి వెళ్లాడనికి భయపడ్డాం .
జంకి చట్టి దగ్గరనుంచి యమునోత్రి చేరడానికి రెండు దారులు వున్నాయి , యమున కుడివైపునుండి ఒకటి యెడమ వైపు నుండి ఒకటి .
కుడివైపు మార్గం గుండా వెళితే మార్కండేయ ఆశ్రమం మీదుగా యమునోత్రి చేరుదాం మార్కండేయుడు యీ ఆశ్రమం లో వున్నప్పుడే ' మార్కండేయ పురాణాన్ని ' రచించేడుట .
ఎడమవైపు మార్గం గుండా ప్రయాణిస్తే ' ఖర్సాలి ' అనే గ్రామం మీదుగా ప్రయాణిస్తాం . యమునోత్రి పూజారులు శీతాకాలం ఆరునెలలూ యీ గ్రామం లో గడుపు తారు . ఈ గ్రామం లో వున్న శని మందిరం అతి పురాతనమైన మూడంతస్తు భవనం , మూడో అంతస్తు శని నివాసమని అంటారు . ఈ కొండ జిల్లాల ప్రజలు యెంతో అమాయకంగా దేవుని నివాసమని , దేవుని పడక అని ఆ గదులను నమ్మకంగా తరచు శుభ్రపరచి వుంచడం ఆశ్చర్యానందాలను కలుగ జేస్తుంది .
కోవెల మూసేసిన ఆరునెలలూ యమునోత్రి వెండి ముఖాన్ని యీ శని కోవెలలో వుంచి పూజలు చేస్తారు . దానికి ఓ పద్దతి వుందండి , అదేంటో చూద్దాం .
దీపావళి సమయంలో ( నాలుగైదు రోజులు యిటూ అటుగా ) మందిర ద్వారాలు మూసే సమయాన శని ముఖం ధరించిన ఓ వ్యక్తి తన చెల్లెలు తన యింటికి వస్తుంది కాబట్టి ఆహ్వానించడానికి అందరూ రండని వూరిలో యింటింటికి వెళ్లి వారిని ఆహ్వానిస్తాడు . పూజారులు మందిరం మూసేసి యమున వెండి ముఖాన్ని అలంకరించిన పల్లకీలో పెట్టి ఖర్సాలి గ్రామ సివారు చేరుకోగానే ప్రజలు హర్షోల్లాసాలతో బాజా భజంత్రీలతో యమునను తోడ్కొని శనిమందిరానికి తీసుకు వెళతారు . వైశాఖ మాసంలో అక్షయ తృతీయ వరకు శని మందిరంలోనే యమున కు కూడా పూజలు జరుగుతాయి . అక్షయ తృతీయనాడు శని ముఖం ధరించిన వ్యక్తి చెల్లెలు యమున తన యింటికి మరలి పోతోంది కాబట్టి వీడ్కోలు యిచ్చేందుకు అందరిని రమ్మని ఆహ్వానిస్తాడు . వూరి ప్రజలందరూ యమునకు పసుపు కుంకుమ , కానుకలు యిచ్చి అలంకరించిన పల్లకీలో యమునను , శని ని కూర్చుండ పెట్టి గ్రామం అంతా తిప్పి బాజా భజంత్రీలతో గ్రామ శివారు వరకు దిగపెట్టి వస్తారు . యమునను యమునోత్రి మందిరం లో దింపి తిరిగి శని విగ్రహాన్ని ఖర్సాలి మందిరానికి తెస్తారు .
ఈ రెండు ఉత్సవాలకీ యీ వూరి ప్రజలు దేశం లో యే మూల వున్నా తప్పక హాజరు అవుతారు .
ఆ రాత్రి హనుమాన్ చట్టీ లో బస చేసుకొని మరునాడు మాయాత్ర కొనసాగించేము .
వచ్చే వారం గంగోత్రి వెడదాం అంతవరకు శలవు