సాంకేతిక పరిజ్ఞానం ధర్మమా అని ఈరోజుల్లో ఎవరిని చూసినా కంప్యూటరు భాషే వాడతారు. నాలాటి అర్భకులకు అర్ధం అయి చావదాయె. ఏదో కాలక్షేపానికి నేర్చుకున్నాము కానీ, అన్ని తెలివితేటలెక్కడ ఏడిసాయీ? అలాగని వదిలిపెడతామా, అబ్బే అవకాశం వస్తే ఎడాపెడా ఉపయోగించేయడమే… ఈమధ్యన అవేవో soft skills లేకపోవడం వలన అవేవో, Pink Slips ఇచ్చేసి ఉద్యోగాలనుండి పీకేస్తున్నారుట.అసలు ఈ “ పీకేయబడ్డానికి“ Pink Slip అని ఎందుకంటారో అర్ధం అయి ఏడవదు.. బహుశా “ పింక్ “ కీ, “ పీకేయడానికీ “ యతిప్రాసలు కుదిరాయనేమో.. ఎక్కడ చూసినా, ఆత్మహత్యలూ అవీనూ. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారూ, ఉద్యోగం ప్రారంభం లోనే వేలకొద్దీ జీతాలూ, పైగా సహధర్మచారిణి కూడా ఏదో ఉద్యోగంలో ఉండే ఉంటుంది.. ఉండాలిగా మరి, EMI లు కట్టుకోవద్దూ. ఇంకేముందీ, మొదటి నెల జీతం రావడం తరవాయి, ఓ ఎపార్టుమెంటూ, ఓ కారూ , ముందర బుక్ చేసేసికోవడం. వాటికీ సదుపాయాలున్నాయి, తను పనిచేసే ఆఫీసులోనే, ఈ అప్పులిచ్చే కంపెనీల డెస్క్ లు కూడా ఉంటాయిట… వాడికీ తెలుసు, వీడికెంత జీతం వస్తుందో, ఇంకేముందీ ఓ దస్తా కాయితాలు తెచ్చి, ఓ పాతిక సంతకాలు పెట్టించేసుకుంటాడు. ఏం సంతకం పెడుతున్నాడో వీడికీ తెలియదు, వాడూ చెప్పడూ.. కార్యం మాత్రం సఫలం…
వీళ్ళు కాకుండా, ఆర్ధిక సలహాదార్లని ( Financial Consultants ) కొందరుంటారు. వీళ్ళూ, మరీ ఆఫీసుల్లో కాకుండా, ఇంటికొచ్చి మరీ హితబోధ చేస్తారు, ఎందుకైనా మంచిదని. ఎక్కడలేని స్కీములూ చూపించి, ఏవేవో కలలోకి దీంపేసి, ఆ కబురూ ఈకబురూ చెప్పేసి, మొత్తానికి ఓ ఇన్స్యూరెన్స్ పాలసీ, ఓ మ్యూఛ్యుఅల్ ఫండూ, మొహమ్మాటానికి ఓ పీపీఎఫ్ఫూ, ఇలాటివి ఉండకూడదనడం లేదు, ఉండాలే.. వచ్చిందంతా ఇంటి, కారు EMI లకే వాడేస్తే, రేపు పిల్లలొచ్చిన తరవాత వాళ్ళ బాగోగులెవడు చూస్తాడూ, కన్నందుకు బాధ్యత వీళ్ళదేగా మరి…
ఈ మైకంలో గుర్తురానిదల్లా, ప్రతీనెలా కట్టాల్సిన EMI లు.. పైగా వాటిని ఆఫీసులో కదా చేస్త, ఆ చేయించినవాడు మహ తెలివైన వాడు, మళ్ళీ ప్రతీనెలా చెక్కులిచ్చి EMI లు కట్టడం ఎందుకూ అని, వాడి జీతంలోంచే అవేవో, ECS చేయించేస్తాడు.గొడవుండదు, ఆ బకాయిలన్నీ తీసేసే , మిగిలినదేదో వీడి ఎకౌంటులో జమవుతుంది..తీరా ఎకౌంటు చూసేసరికి , అన్ని కోతలూ పోనూ , ఆరు దశాంసాల్లో ఉండాల్సిన సంఖ్య, నాలుగు అక్షాంశాల్లో కనిపిస్తుంది.రైమింగ్ బావుందికదా అని వాడేశాను ఈ పదాలు.. మరీ అర్ధాలు వెదక్కండి. ఇంక చేయడానికేమీ లేదు, తూర్పు తిరిగి దండం పెట్టడమే.. పరవాలేదు లెద్దూ, తన జీతంకూడా ఉందిగా, లాగించేయొచ్చనుకుంటాడు. ఇంటికొచ్చి, అవేవో స్కీములు తెరిపించాడే, వాటన్నిటికీ కట్టొద్దూ నెలనెలా కట్టేవీ.
కంగారు పడకండి, అవన్నీ నేను చూసుకుంటాకదాండీ.. “ అని ఆశ్వాసన్ ఇచ్చేస్తుంది పాపం. ఎంతైనా కాబోయే కన్న తల్లికదా. ఇంకా మొదటిరోజులుకదా, వీటి impact వంటబట్టడానికి కొద్దిగా టైము పడుతుంది.ఈ లోపులో హనీ మూన్లూ, వీకెండ్ పార్టీలూ అవీనూ. పిల్లలొచ్చిన తరవాత కుదరదుగా మరి. అయినా ఈ రోజుల్లో “పిల్లలు “ ఏమిటిలెండి. మహా అయితే ఓ పిల్లో, పిల్లాడో.. బస్.. “హం దో హమారా ఏక్ “.. ఆంధ్ర ముఖ్యమంత్రిగారు ఏం చెప్పినా సరే.. ఆయనదేం పోయిందీ.. తనేమో ఒక్కడితో సరిపెట్టుకుని, ఊళ్ళోవాళ్ళందరికీ హితబోధ చేస్తున్నారు, “ జనాభా పెంచండీ..” అంటూ, ఓట్లకోసం. Anyway leave it.. ఎక్కడొ మొదలెట్టి ఇంకోదాంట్లోకెందుకులెండి. మనం చర్చిస్తున్నది “పింకు స్లిప్పులూ, వాటి పరిణామాలూ “కదా.
మొదటేడాది వెళ్ళేసరికి జమాఖర్చులు చూసేసరికి భూమ్మీదకి వస్తారు. రాబడింతా, ఖర్చింతా. EMI, ECS ల కట్లు పోగా, రోజువారీ ఖర్చులోటుంటాయిగా, ఆఫీసుకెళ్ళి రావడానికి కారు పెట్రోలో/ డిసెలో ఖర్చోటీ. ఇద్దరి ఆఫీసులూ ఒకేవైపైతే కలిసే వెళ్తారు. చెరోవైపూ అయితే, ఈవిడకి కంపెనీ బస్సుంటే సరేసరి, లేకపోతేనె గొడవంతా.అంతంత దూరాలు బస్సుల్లో ఎవడెళ్తాడూ, హాయిగా ఏ ఊబరో, ఓలాయో పిలిచేస్తే సరీ.. ఇవన్నీ కనిపించని ఖర్చులు…
ఈ ఖర్చులేమైనా తగ్గించుకునేవా అంటే , అదీ కుదరదూ. దేనికదే ముఖ్యం, అనివార్యంలా కనిపిస్తాయి… చేతికొచ్చేది సరిపోక, చెసేదేమీలేనప్పుడు చిరాకులూ, పరాకులూనూ… ఒకరినొకరు అర్ధం చేసుకుంటే, ఎలాగోలాగ పరిష్కరీంచుకోవచ్చు… మధ్యలో ఉరుములేని పిడుగులా కంపెనీలు ఈ పింకు స్లిప్పులంటే, గుండె బేజారెత్తిపోదూ మరి? వేలల్లో, లక్షల్లో సంపాదించి జీవితం సుఖమయం చేసుకుంటారనే కదా, తల్లితండ్రులు, అంతంత చదువులు చెప్పించిందీ, అందులో వాళ్ళ స్వార్ధం ఏమీ లేదు… కానీ ఖర్చులు చేసేటప్పుడైనా కొద్దిగా వళ్ళు దగ్గరపెట్టుకోపోతే అకస్మాత్తుగా వచ్చే కష్టాలు ఎదుర్కోడానికి ధైర్యం ఉండదు. ఫలితం… ఆత్మహత్యలు…
ప్రణాలికా బధ్ధంగా ఖర్చులు చేసికుంటే సమస్యే లేదూ. పింకవనీయండి, ఇంకోరంగేదైనా కానీయండి, ఎలాటి స్లిప్పులకీ భయపడకుండా, ఆనందంగా సంసారాలు చేసుకోవచ్చు.
సర్వే జనా సుఖినోభవంతూ…