చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaaram

Acquired  పంచేంద్రియ  Deficiency   Syndrome  అని చాప కింద నీళ్ళలా వ్యాపించేస్తోంది ఈరోజుల్లో… అది   AIDS  కంటే మహమ్మారి లాటిది.ఆ దేవుడు ఏదో భూమ్మీద సుఖంగా బతకండిరా అని  “ పంచేంద్రియాలు “ ఇచ్చేడా లేదా?

వాటిలో ఎన్నిటిని సరీగ్గా ఉపయోగిస్తున్నామంటారూ?

ముక్కు : ఏదో సువాసనలు ఆఘ్రాణించడిరా అంటే, ఈ రోజుల్లో  ఒరిజినల్ సువాసనలెక్కడా? అన్నీ  fragrance  ల మయం. రెండుమూడు రోజులకోసారి స్నానం చేస్తూ, రోజూ అవేవో  spray  లు కొట్టుకోడమే.తొలకరికి వచ్చే మట్టిసువాసనలైతే , మర్చేపోయారు.. కాంక్రీటు ధర్మమా అని.. స్వఛ్ఛభారత్ అని పేరుకీ,  brand ambassador  లకీ పరిమితమయిపోయింది, ఏ కొద్దిచోట్లో తప్ప.. మధ్యమధ్యలో టీవీ ల్లో ప్రకటనలోటీ..

చెవి : “ సువార్తలు “ ( ఆ మైక్కుల్లో చెప్పేవికావు ) వినండిరా అంటే, ఈరోజుల్లో సినిమాల్లో ద్వందార్ధ డయలాగ్గులూ, టీవీ సీరియళ్ళలో అత్తా కోడళ్ళ అరుపులూ కేకలూనూ… ఏదో ఆ శ్రీ చాగంటి వారి ధర్మమా అని, ప్రవచనాలు మంచిమాటలు ఇంకా బతికున్నాయి… ఆయన మాత్రం ఏంచేస్తారూ, ఎక్కడచూసినా చెవుల్లో అవేవో కర్ణాభరణాలు(  Ear phones) పెట్టుకుని జోగుతూండేవారే ఎక్కువ.

కళ్ళు : నయనాందకరంగా చూడ్డానికేమీ అసలు లేనేలేవాయె.  మహా అయితే రోడ్లమీద ట్రాఫిక్ జామ్ములు..ఊసురోమంటూ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని చూస్తూండడం…

నోరు :   Less said the better..   మార్కెట్ లో దొరికే ప్రతీ కూరగాయా హైబ్రిడ్ రకమే. రుచీ పచీ ఉండదు. ఎక్కడ చూసినా ప్రతీదీ రెడీ మిక్సే.. ఉప్మా దగ్గరనుంచి. ఓపిగ్గా తయారుచేసికునే టైమెక్కడిదీ అసలూ, అవీకాకపోతే  “ కర్రీ సెంటర్లూ “…చూడ్డానికి మాత్రం నవనవలాడుతూ ఉంటాయి. కూరలూ, పళ్ళూనూ.. పోనీ పోపులోవేసుకునే కరివేపాకేమైనా సువాసనొస్తుందా అంటే అదీలేదూ..చెప్పుకుంటూ పోతే రుచీ, వాసనా అనేవి కొండెక్కేశాయి…

చర్మం:  అసలు ఈరోజుల్లో స్పర్శ అనేది ఎవరైనా అనుభవిస్తున్నారా? ఒకానొకప్పుడు “ పుస్తకం హస్తభూషణం “ అనేవారు. ఓ కొత్త పుస్తకం చేతులో పట్టుకుని చదువుతూంటే, కొత్త పుస్తకం సువాసనతో మిళితమయి, ఆ రచయితో/ రచయిత్రి వో మనోభావాలు మన గుండె ల్లోకి వెళ్ళి, మనసు ఆర్ద్రమయేది.. ఇప్పుడూ  చదివేవాళ్ళు చదువుతున్నారు, కాదనడం లేదు. కానీ పుస్తకం చేతిలోపెట్టుకుని కాదు, ఓ స్టాండ్ కి    కిండిలో(  Kindle )  సింగినాదమో అదేదో పెట్టుకునే చదివేయడం.  But the personal touch is missing..ఏ విషయం తీసికున్నా “ స్పర్శ” అనేది అటకెక్కేసింది… ఒకానొకప్పుడు పురిటినొప్పులు పడి ప్రసవించేవారు.. కారణాలేవ్వైతేనేం ఈ రోజుల్లో ఎక్కడో కానీ, అన్నీ సిజేరియన్లే.. ఇంక బిడ్డ పుట్టిన తరవాత బయటకెళ్ళాలంటే అవేవో  “ కంగారూ “ ల్లాగ  అవేవో సంచులూ.. రైటే, రెండుచే$తులూ ఉపయోగించుకోడానికి వీలుగా ఉంటుంది, కానీ ఆ పసిబిడ్డకి కావాల్సిన స్పర్శ మాటేవిటి?

ఈరోజుల్లో అందరూ “ఓలాలూ” “ఊబర్లూ” పిలవలేరుగా, ఏదో బస్సుల్లోనే డక్కామొక్కీలు తింటూ ఎక్కాలి.ఆబస్సుల్లో  పడే పాట్లు పగవాడిక్కూడా ఉండకూడదు. ఎవణ్ణి చూసినా, పిప్పళ్ళ బస్తాల్లాగ అవేవో  Backpack  లుట. వీపుమీద వేళ్ళాడతీస్తాడు. ఆ బ్యాగ్గుధర్మమా అని, పదిమంది నుంచోవలసిన జాగా, ఓ నలుగురు ఈ బ్యాగ్గుగాళ్ళు ఆక్రమించేస్తారు.. వాడిదారిన వాడు అటూ ఇటూ ఊగుతూంటాడు, వాడికేం తెలుస్తుందీ, ఆ పక్కన సీట్లమీద కూర్చున్నవాడి అవస్థా? వాడు తిరిగినప్పుడల్లా, వాడిబ్యాగ్గూ తిరుగుతుంది. ఏ కళ్ళజోడుకో కొట్టుకుందా, అంతే సంగతులు. పోనీ వాడిని తట్టి చెప్దామా అంటే, వాడి “ స్పర్శాస్థానం మనకి దూరం. ఆ బ్యాగ్గుమీద తడితే ఉపయోగం ఏమిటీ? బైక్కు మీద వెళ్తున్నప్పుడు, దురదెడితే హెల్మెట్ మీద గోక్కున్నట్టుగా…పోనీ చెప్తే వినిపించుకుంటాడా, మళ్ళీ ఆ చెవుల్లో కర్ణాభరణాలాయె.. ఏం వింటాడో కానీ, అలుకిక ఆనందంలో ఓలలాడుతూంటాడు… చివరకి మనమే చొరవ చేసి, ఆ బ్యాగ్గు మనల్నేమీ చేయకుండా పట్టుక్కూర్చోవడమే…

చెప్పొచ్చేదేమిటంటే ఈ సిండ్రోమ్ నుంచి బయట పడకపోతే, చివరకి భగవంతుడిచ్చిన పంచేంద్రియాల గురించి, సైన్సు పుస్తకాలకే పరిమితమయిపోతాయి…అప్పుడు చేయగలిగిందేమీ ఉండదు.

సర్వేజనా సుఖినోభవంతూ…

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు