సాఫ్ట్‌వేర్‌ పరువు తీస్తోన్న 'మత్తు' - ..

drugs in software

సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నవారంటే సొసైటీలో మంచి గుర్తింపు లభిస్తోంది. కానీ, కొందరి కారణంగా ఆ రంగం ప్రతిష్ట మసకబారుతోంది. డిగ్రీ పూర్తి చేస్తే చాలు సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఏదో ఒక ఉద్యోగం చూసుకుని, అంచలంచెలుగా ఎదగాలనుకుంటోన్న యువత ఓ వైపు కనిపిస్తోంటే, ఈ రంగంలో అత్యున్నతస్థాయి గౌరవం పొందుతోన్న కొందరు, తద్వారా లభించే అత్యధిక వేతనాలతో పక్కదారి పట్టేస్తున్నారు. దురలవాట్లకు బానిసలవుతున్నారు. తెలంగాణను కుదిపేస్తోన్న డ్రగ్స్‌ వ్యవహారంలో సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందినవారి పాత్ర గురించిన వాస్తవాలు బయటపడ్తోంటే ఆ రంగంలో ఉన్నవారిలో ఆందోళన పెరుగుతోంది. సాఫ్ట్‌వేర్‌ రంగం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తోంది. దేశంలోనే హైద్రాబాద్‌కి ఈ రంగంలో ఎంతో మంచి పేరుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి, లక్షలాది మందికి ఈ రంగం ఉపాధి కల్పిస్తున్న కారణంగా, ఈ రంగంపై చిన్న ఆరోపణ వచ్చినా అది పాలకులకు కూడా ఇబ్బందికరమైన విషయంగానే మారుతుంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్‌ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది.

చిన్న వయసులో అత్యధిక వేతనం రావడంతోనే యువత డ్రగ్స్‌ వైపు మళ్ళుతున్నారనే అభిప్రాయం ఒకటి ఉంది. ఇది పూర్తిగా అపోహ కాదు, అలాగని ఇదే నిజమూ కాదు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. వేలాది, లక్షలాదిమంది సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉపాధి పొందుతూ అత్యద్భుతమైన జీవితాన్ని గడుపుతోంటే, కొందరు అంటే వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే స్థాయిలో మాత్రమే దురలవాట్లకు బానిసలవుతున్నారు. సమాజంలోని వివిద రంగాల్లో ఉన్నట్లే సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని భ్రష్టుపట్టిస్తున్నవారూ ఉంటారు. అంతమాత్రం చేత ఆ రంగానికి చెడ్డపేరు ఆపాదించవద్దని భవిష్యత్తు మీద ఎంతో ఆశతో ఈ రంగాన్ని ఎంచుకున్న నేటితరం యువత అభిప్రాయపడుతోంది. పబ్‌ కల్చర్‌, నైట్‌ ఎంజాయ్‌మెంట్‌ అనేవి పాశ్చాత్య పోకడలే అయినప్పటికీ అవి లిమిట్‌ దాటకుండా ఉంటాయని వారంటున్నారు. వారంలో ఐదు రోజులూ కష్టపడి, వీకెండ్‌ని ఎంజాయ్‌ చెయ్యాలనుకోవడం తప్పు కాదన్నది వారి ఆలోచన. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు.

సినీ రంగంపై వచ్చిన ఆరోపణల్ని కూడా సాఫ్ట్‌వేర్‌ రంగానికి చెందినవారు ప్రస్తావిస్తూ సినీ రంగమైనా, సాఫ్ట్‌వేర్‌ రంగమైనా ఇంకే రంగమైనా అందులో వ్యక్తులు తప్పు చేస్తారేమోగానీ ఆ తప్పుని ఆ వ్యవస్థకి ఆపాదించడం సబబు కాదని చెప్పారు. ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి ఎవరు కొత్తగా వచ్చినా, వారి గురించి పూర్తి వివరాలు నమోదవుతాయనీ, ఏ చిన్న బ్యాడ్‌ రిమార్క్‌ ఉన్నా ఈ రంగంలో ఉద్యోగం దొరకదు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగానే ఉంటారని ఆ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రంగంలో ఎంత స్థిరపడిపోయినప్పటికీ మార్పులు సహజం గనుక ఉద్యోగం మారాల్సి వస్తే కొత్త ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు 'చెకింగ్‌' తప్పనిసరి అనే విషయాన్ని తెలియజేస్తూ తమ రంగానికి చెందినవారు మిగతా రంగాలకు చెందినవారితో మరింత బాధ్యతగా ఉంటారని వివరిస్తున్నారు. 

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు