ఇదివరకటి రోజుల్లో, ఎవరైనా ఏదైనా కొనాలంటే, ఆతి తూచి , బేరాలాడికానీ కొనేవారు కారు. కారణం—తాము పెట్టుబడి పెడుతున్న డబ్బుకి తగిన విలువ దక్కుతోందా లేదా అంటే Value for money , అని చూసుకునేవారు.. అయినా రాబడికూడా అంతగా ఉండేది కాదు.. ఆరోజుల్లో మనుషులు కూడా నిజాయితీగా ఉండేవారు. కొనే మనిషి , ఎన్ని సందేహాలు వెలిబుచ్చినా, ఓపిగ్గా సమాధానం చెప్పి, మొత్తానికి బేరం ఖరారు చేసికునేవారు కూడానూ..
కాలక్రమేణా, ఆ నిజాయితీలు అటకెక్కేశాయి. ఈరోజుల్లో ప్రతీదీ వ్యాపారాత్మకమైపోయింది, మానవ సంబంధాలతో సహా. “ నేను నీకేమైనా ఇస్తే నువ్వు నాకేమిస్తావు.. “ అనే రంధిలో పడ్డారు ప్రతీవారూ.. “ దొందుకు దొందే “ అన్నట్టు, కొనేవారూ, అమ్మేవారూ కూడా ఒకే కోవలోకి చేరిపోయారు. కానీ, ఇంకా పాత పధ్ధతుల్లో జీవిస్తున్నవారే, ఎటూ కాకుండా పోయారు. ఈరోజుల్లో చేతిలో డబ్బుకి ఏమీ లోటులేదు. ఒకప్పుడు మధ్యతరగతి జీవులన్న వారు, అకస్మాత్తుగా ఓ మెట్టు పైకెక్కేసారు… ఏమైనా అంటే అదేదో “ inflation అంటారు… ఈ కొత్త పరిస్థితి ధర్మమా అని జరుగుతున్నదేమిటంటే, ఈరోజుల్లో value for money అన్నది అసలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఒకానొకప్పుడు, కుటుంబంలోని ప్రతీవారూ, ఏదైనా అడగాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ అడిగేవారు.. “ ఎందుకులెద్దూ, పాపం నాన్నగారికి అనవసరపు ఖర్చూ…అసలే ఈ నెల చుట్టాలతో చాలా ఖర్చయిందీ…” అనుకునేవారు పిల్లలు కూడా… పైగా సంపాదించేది ఒక్క మగాడు మాత్రమే… కుటుంబ సహకారం అంటే, ప్రతీవారూ సంపాదించాలని కాదు, సంసారం లాగించడానికి ఇంటి ఇల్లాలు తనవంతు, పిల్లలు కూడా తమవంతు తామే ఖర్చులు తగ్గించుకోవడం కూడా , . వెరసి హాయిగా ఉండేవారు.
ఇప్పుడు పరిస్థితులూ మారాయి, సంపాదనా మార్గాలూ మారాయి, వాటితోపాటే అవసరాలూ మారాయికదా. ..ఒకానొకప్పుడు “ విలాస వస్తువులు “ ( Luxuries ) గా ఉన్నవన్నీ , ఈరోజుల్లో “ అవసరాలు “ ( necessities ) గా మారిపోయాయి… బజారులో కొత్తగా ఏదైనా వస్తే చాలు , మనింట్లో ఉండాల్సిందే. అవసరమా కాదా అన్న ప్రశ్నే లేదు… ఈరోజుల్లో ఏదైనా కొత్తవస్తువు కనిపిస్తే చాలు, అవసరమా కాదా అన్నది అనవసరం… మా కొలీగ్ దగ్గరుందీ అని ఇంటాయనా, పొరుగింటి మీనాక్షమ్మ దగ్గరుందని ఇంటావిడా, తన ఫ్రెండ్సందరిదగ్గరా ఉందని పిల్లలూ.. బజారుకెళ్ళి కొంటే అందరికీ తెలుస్తుందని, ఇంట్లోనే కూర్చుని Amazon, Flipkart, కాకపోతే ఇంకో సింగినాదం.. అంతర్జాలంలో కావాల్సినన్ని online stores ఉన్నాయి, ఏదో ఒకదాన్నుంచి ఆర్డరు చేసేయడం.
ఇదివరకటి రోజుల్లో, ఎంతో అత్యవసరమైతేనే కానీ బయట హొటల్స్ కి వెళ్ళే అలవాటు లేదు. ఈరోజుల్లోనో , శుభకార్యాల దగ్గరనుంచి, పన్నెండో రోజు జరిగే క్రతువులదాకా క్యాటరింగే… నిజమే ఈరోజుల్లో విందుభోజనాలూ, సంతర్పణలూ చేసే ఓపికాలేదు.. అంతదాకా ఎందుకూ, ఇంట్లో ఓ పెళ్ళి చేయాలంటే, వాడెవడో Event Manager ట , వాడికి టెండరిచ్చేస్తే, మొత్తం అన్నీ వాడే చూసుకుంటాడు. కన్యాదాత ఒఠ్ఠి నిమిత్తమాత్రుడు మాత్రమే.
ప్రస్తుతం so called high income లోకి ఎదిగిన చాలామంది, మధ్య / అంతకంటె తక్కువ జాతికి చెందిన వారే.. స్థాయి పెరిగేటప్పటికి వాళ్ళ కోరికలూ, సూకరాలూ కూడా పెరిగిపోయాయి… ఢక్కా మొక్కీలు తింటూ రైళ్ళలోనూ, బస్సుల్లోనూ ప్రయాణాలు చేసినవారు, ఇప్పుడు ఏరోప్లేన్లు తప్ప ఎక్కరు… కారణం—టైము కలిసొస్తుందని. నిజమే అదీనూ.. కానీ అసలు కారణాం టైము కాదు, intolerance , ఓర్పూ సహనం తగ్గడం. మూలకారణం చేతులో గలగలలాడే డబ్బులు… బయట ఓ పదిరూపాయల్లో వచ్చే చాయ్ / కాఫీకు 5Star Hotel ల్లో తాగితేనే మజాట. ఒకానొకప్పుడు, మొదటిరోజు సినిమాకి కుస్తీలు పట్టి టిక్కెట్టు కొని చూసినవారు , Multipex లో సినిమా చూస్తేనే చూసినట్టుంటుందిట.
సంతకెళ్ళి కూరగాయలు కొనుక్కున్న విషయం మరుగునపడిపోయి, Big Basket లో తెప్పించుకుంటేకానీ తిన్నట్టుండదుట.. ఎక్కడో అరాకొరా, తమ తల్లితండ్రులని తమతోటే ఉంచుకునే ,ఈనాటి యువతరం, పోనీ ఇవన్నీ ఆ తండ్రిచేతో, మామగారిచేతో తెప్పించుకుంటారా అంటే అదీ లేదూ.. వాళ్ళైతే పాతచింతకాయ పచ్చళ్ళలాగ, Traditional కూరలే తెస్తారు. కానీ, వీళ్ళేమో ఏ dietician చెప్పినవే తిని, వారంవారం వాడిదగ్గరకు వెళ్ళి దక్షిణ సమర్పించుకోవాలే బరువెంత తగ్గిందీ, కొలెస్ట్రాల్ పరిమితిలో ఉందా లేదా తెలుసుక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే, అసలు మనీ అన్నదానికి విలువ చూడ్డమేమిటీ… అంతా trash అనుకోవడం, తూర్పు తిరిగి దండం పెట్టడం…
సర్వేజనా సుఖినోభవంతూ…