ఏడాదిన్నర వయసులో ఉన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకు బానిసలైపోతున్నారు. మా పిల్లాడు లేదా మా అమ్మాయి చిన్న వయసులోనే ట్యాబ్‌తో ఆటలాడేసుకుంటోందని తల్లిదండ్రులు మురిసిపోతున్న రోజులివి. చిన్న చిన్న గేమ్స్, రైమ్స్‌ని పిల్లలు ఎంజాయ్ చెయ్యడం మామూలే. అయితే ఒక్కసారి స్మార్ట్ ఫోన్‌లోని ఫీచర్స్‌కి పిల్లలైనా పెద్దలైనా అలవాటుపడిపోతే, ప్రమాద తీవ్రత దాదాపు ఒకేలా ఉంటుంది. పెద్దవాళ్ళు సైతం స్మార్ట్ ఫోన్ కారణంగా విజ్ఞత కోల్పోతున్న సందర్భాలు కోకొల్లలుగా చూస్తున్నాం. ఓ గేమ్‌లోకి వెళితే, అది మనల్ని ఇంకో లోకంలోకి తీసుకెళ్ళిపోతుంది. నిజమైన లోకం కాదది, అలా ఫీల్ అవుతాం. తద్వారా ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటాం. 'పోకేమాన్' అనే గేమ్ ప్రపంచ వ్యాప్తంగా ఎందరి ప్రాణాల్నో తీసేసింది. ఆటకి లిమిట్స్ ఉంటాయి. కానీ ఆ లిమిట్స్ గురించి ఆలోచించేదెవరు? హెచ్చరికల్ని పట్టించుకునేదెవరు?
కొత్తగా ప్రపంచాన్ని పీడిస్తోన్న ఇంకో గేమ్ 'బ్లూ వేల్'. ఆన్‌లైన్ ద్వారా ఈ గేమ్‌కి బానిసలుగా మారిపోతుండడం భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఓ పదహారేళ్ళ కుర్రాడు ఈ గేమ్ కారణంగా బలైపోయాడన్న వార్త మొత్తంగా భారతదేశాన్ని కదిలించేసింది. అంతలోనే అలాంటి ఘటనే ఇంకోటి వెలుగు చూసింది. ఈసారి 17 ఏళ్ళ బాలిక ఆ గేమ్ వల్ల ప్రాణాలు కోల్పోయింది. ఇది గేమ్ కాదు, ఆన్‌లైన్ నరకం. కొందరు గ్రూప్‌గా ఏర్పడి ఈ బ్లూ వేల్ అనే ప్రమాదకరమైన గేమ్ షురూ చేస్తారు. మొదట్లో ఇదొక సరదా ఛాలెంజ్ గేమ్‌లా ఉంటుంది. ఆడుతుంటూ పోతే, ఆ ఛాలెంజ్ సీరియస్ అయిపోతుంది. ఒక్కసారి ఆ గేమ్‌కి అడిక్ట్ అయితే అంతే సంగతులు. తమను తాము మైమర్చిపోవాల్సిందే. గేమ్‌లో కొందరు వికృత చేష్టలు చేస్తారు, ప్రమాదకరమైన చర్యలతో ఎట్రాక్ట్ చేస్తారు. అలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయాలని ఇవతలివారికీ అన్పిస్తుంటుంది. అంతే అడిక్షన్ పీక్స్‌కి వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నామో తెలియని ఓ ప్రత్యేక పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారు. శరీరంపై కోతలు మాత్రమే కాదు, ప్రాణాలు తీసుకోవడానికీ వెనుకాడరు. ఇదీ 'బ్లూ వేల్' గేమ్‌లో పైశాచికత్వం. సింపుల్‌గా చెప్పాలంటే గేమ్ ఆడటం అనే ముసుగులో ఆత్మహత్యల్ని ప్రేరేపించడమన్నమాట.
ఈ బ్లూ వేల్ ఇప్పుడు ప్రపంచానికి ప్రమాదకారిగా మారింది. ముఖ్యంగా భారతదేశంలోని యువత ఈ గేమ్ పట్ల ఆకర్షితులవుతుండడం ఇంకా దారుణమైన విషయం. ఇప్పటికిప్పుడు దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉంది. అలాగే తల్లిదండ్రులూ తమ పిల్లల్ని ఓ కంట కనిపెట్టాల్సిందే. ఇంటర్నెట్ కనెక్షన్‌తో కూడిన కంప్యూటర్, లేదా స్మార్ట్‌ఫోన్ పిల్లల చేతికిచ్చేటప్పుడు జాగ్రత్త. బ్లూ వేల్ ఒక్కటే కాదు, ఈ తరహా భయంకరమైన ఆటలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. సో, బీ కేర్‌ఫుల్.