ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

( కాళిమఠ్ , అగస్త్యముని )

2013 లో సంభవించిన వరదలలో పెద్దపెద్ద హోటల్స్ నామ రూపాలు లేకుండా కొట్టుకు పోయాయి . రిసార్టలు , కాస్త శుభ్రమైన వసతులతో వుండే హోటల్స్ నిర్మాణం జరుగుతున్నాయి . కొన్ని వాడుకలోని వచ్చేయి కూడా . వూరులో కాకుండా వూరికి ముందు వెనుకా చాలా మంచి హోటల్స్ నిర్మించబడ్డాయి . అలాంటి ఓ రిసార్ట్ లో రాత్రి బస చేసి ప్రొద్దున్న లేచి యే కిటికీలోంచి చూసినా ప్రకృతి అందం ఆనందం మా సొంతమే , కిటికీలో కూర్చొని మంచుపొరల మధ్యనుంచి కనిపిస్తున్న కొండలు చూస్తూ  , మందాకినీ గలగలలు వింటూ వేడి టీ తాగుతూ వుంటే ఈ కొండలలో జన్మంతా వుండిపోవాలనిపించింది .

రెండురకాల ఊరగాయన్నాలు , పెరుగు అన్నం కలుపుకొని డబ్బాలలో పెట్టుకొని , రెడీమేడ్ ఉప్మా వేడివేడిగా తిని రూములోంచి బయటకు వచ్చేసరికి యేడున్నర , అయినా యెక్కడా ఆదిత్య గారి దర్శనం లేదు . మంచుతో తడిచిన గడ్డి , పూలు చల్లగా వీస్తున్న గాలికి తలలూపుతూ వీడ్కోలు యిస్తుండగా మేం కాళీమఠ్ వైపు ప్రయాణం సాగించేము .

గుప్తకాశినుంచి అగస్త్యముని మీదుగా సాగే దారి కీకారణ్యం అని అడవిజంతువుల సంచారం వుంటుందని మా డ్రైవరు చెప్పేడు .

ఈ రోజు మా యాత్రలో ముందుగా కాళిమఠ్ వెళ్లాలి , డ్రైవరుకి చెప్పగానే సుమారు పదమూడు కిలోమీటర్లు వెళ్లడం తిరిగి అదే రోడ్డులో పదమూడు కిలో మీటర్లూ వెనుకకు రావడం మొత్తం సుమారు 26 కిలోమీటర్లు యెక్కువవుతుంది ఫరవాలేదా ? అని అడిగేడు . హరిద్వార్ లో టాక్సీ మాట్లాడుకొనేటప్పుడు రోజుకి 3500 రూపాయలు చొప్పను యెన్నిరోజులైతే అన్ని 3500 , ప్రతీరోజూ 250 కిలోమీటర్ల చొప్పున ప్రయాణం చెయ్యొచ్చు . ఉదా 5 రోజుల ప్రయాణం అనుకోండి 3500*5 అంటే 17, 500 యివ్వాలి , మేం అన్ని 250*5 మేఘం 1,250కిలో మీటర్లు ప్రయాణించవచ్చు . దానిపైన యెన్నో కిలోమీటర్లు యెక్కువైతే కిలోమీటర్లకు 8 రూపాయవచొప్పున యివ్వాలి అందుకన్నమాట , ఫరవాలేదు అని మేంచెప్పేం .

గుప్తకాశి రుద్రప్రయాగ రోడ్డుమీద సుమారు యిరవై కిలోమీటర్ల ప్రయాణానంతరం కాళీమఠ్ దారిలోకి మళ్లేం .

ముందుగా మా డ్రైవరు చెప్పినట్లు అంతా అడవే , ఆదిత్యుని కిరణాలను కూడా చొరనివ్వనంత దట్టంగా వున్నాయి వృక్షాలు .

కాళి మఠ్ రోడ్డు కిందకు లోయలోకి వెళుతోంది , యీ ప్రదేశం లో జనసంచారం అసలు లేదు , తరచుగా వర్షాలు పడుతూనే వుంటాయి అనడానికి గుర్తుగా నేలంతా బురదగా వుంది . తిన్నగా మా కారు మందిరం ముందు ఆగింది . కొత్తగా కట్టిన పెద్ద యినుము గేట్లు , లోపలంతా పాలరాయితో చదును చేసిన పెద్ద మండపం , క్రింద ప్రవహిస్తున్న సరస్వతీ నది . గ్రామ ప్రజలు మండపం లో కూర్చొనేందుకు కట్టిన పెద్దపెద్ద సిమెంటు బెంచీలు . కుడిచేతి వైపు వున్న పెద్ద స్థంభం , చుట్టారా కట్టిన మందిరం , యెదురుగా ఓ చిన్న మందిరం .   మమ్మల్ని చూస్తూనే మాకెదురు వచ్చి ముందుగా లోపల వున్న మందిరాన్ని దర్శించు కోవాలని చెప్తూ ముందుకు నడిచారు అక్కడకి యువ పూజారి , ముప్పైలోపే వయసు కాని మంత్రాలలో దిట్ట , .అతనే యిక్కడి ముఖ్య పూజారి . వెనుక వైపున వున్న మందిర ద్వారం నది వైపుకు తెరుచు కుని వుంది గర్భ గుడిలో లక్ష్మి , సరస్వతి , గౌరి శంకరుల మూర్తులే కాక నంది , విఘ్నేశ్వరుల విగ్రహాలు వున్నాయి . మండపం లో అఖండ ధుని వుంది . భారత దేశంలో వున్న మూడు అఖండధుని మందిరాలలో యిది రెండవది , మేం చూసిన వాటిలో కూడా యిది రెండవది , మొదటిది ' త్రియుగి నారాయణ్ ' లోని ధుని .

మందిరం లో ధుని వుండడం వల్ల వెచ్చగా వుంది , ప్రశాంతంగా వుంది . పూజారి లక్ష్మి , సరస్వతి , గౌరిశంకరులకు పూజలు చేసి ప్రసాదాలు యిచ్చేరు . తరవాత ముందుగా మేము చూసిన స్థంభం దగ్గరకి తీసుకొని వచ్చి స్థలపురాణం చెప్పేరు .

అదేంటంటే యీప్రదేశం లో పార్వతీ దేవి కాళికా మాత అవతారం దాల్చి తననుంచి యెనిమిది మాత్రికలను సృష్టించి , ఆ యెనిమిది మాత్రికలు యెనిమిదేసి మాత్రికలను సృష్టించి అంటే మొత్తం 64 మాత్రికలు సృష్టించబడి అవన్నీ కాళికాదేవి రక్తబీజుని సంహరించేటప్పుడు ఒక్క రక్తపు బొట్టు నేల మీద పడనీయకుండా త్రాగి రక్తబీజుని సంహరించడానికి సహకరించిన చోటు యిది . రక్తబీజుని సంహారానంతరం ఆ మాత్రికలు ఉపసంహరించబడతాయి . కాని కాళికా దేవి రక్తబీజుని సంహరించేటప్పుడు పొందిన ఉగ్రరూపం తోనే సంచరిస్తూ వుండగా బహ్మవిష్ణుమహేశ్వరులకు కాళికామాతను చల్లబరిచే మార్గం తెలియక తికమక పడుతూ వుండగా ఋషుల సలహా మేరకు శివుడు కాళిమాత మార్గంలో పడుకుంటాడు . రౌద్రంగా తిరుగుతున్న కాళికామాత కాలు శివునిపై వేస్తుంది . తన కాలు పతిపైన పడగానే అపరాధ భావంతో నాలుక కరచుకొంటుంది , అప్పుడు తిరిగి స్మృతిలోని వచ్చి కాళికారూపాన్ని విడిచి పెట్టెస్తుంది . ఇక్కడ కాళికా మాత అక్కడ వున్న బావిలోంచి పాతాళం చేరుకుందట .

అయితే యిక్కడ మరో కథ కూడా చెప్తారు అదేమిటంటే అలా బావిలోకి వెళ్లబోయే ముందర కాళికా దేవి రెండు భాగాలుగా మారి కింద భాగం యిక్కడ పాతాళానికి చేరుకోగా రుద్రప్రయాగ శ్రీనగర్ ( ఉత్తరాఖండ్) దగ్గర ' ధారివాలి ' లో ధారివాలి మాత గా పిలువబడుతూ కాళికామాత తల మొండెం  అలకనంద వొడ్డున కొలువై ఉత్తరాఖంఢ్ ని కాపాడుతోందట .

దేవి భాగవతం లో  కాళిమఠ్ శక్తిపీఠం గా వర్ణించేరు . తర్వాత కాలంలో వచ్చిన శంకరాచార్యులవారు యీ బావినుంచి వెలుపలకు వస్తున్న జ్వాలలను చూచి ఆ ప్రదేశంలో శ్రీచక్రాన్ని ప్రతిష్టించి చల్లబరిచేరు .

ఈ శ్రీ యంత్రాన్ని సంవత్సరంలో ఒకసారి అర్ధరాత్రి ముఖ్యపూజారి మాత్రమే వచ్చి చక్రాన్ని తొలగించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహిస్తారట .      పక్కగా భైరవమందిరాన్ని కూడా దర్శించుకున్నాం . 

      2013 వరదల సమయం లో యీ మందిరం వరకు మాత్రమే నీరు వచ్చిందట , గ్రామం లో యెటువంటి ప్రాణ నష్టంకాని ఆస్తి నష్టం కాని జరగలేదట .

      ఈ మందిరం గురించి మరికొన్ని నమ్మలేని విషయాలు ముఖ్య పూజారి మాకు చెప్పేరు , అవి మీకు తెలియజేస్తున్నాను . 

         ముప్పై సంవత్సరాలకిందటి వరకు చుట్టుపక్కల గ్రామాలలో మరణశయ్యపై నున్న వారిని యిక్కడకు తీసుకు వచ్చి పూజారిగారిచే అమ్మవారి స్నానం చేయించడానికి ఉపయోగించే శంఖం తో సరస్వతీ నది నీరు   నారాయణ మంత్రజపం తో తాగించేవారట , అలా చేస్తే వారు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్తారని నమ్మకం , అలా తీసుకు వస్తూవుండగా మరణించిన వారికి పూజారిగారు నీరు నోట్లో పోస్తే వారు గుటక వేసేవారట , అంటే మరణించిన వారు ఆనీటిని త్రాగేవారట , యీ వింత అందరూలచూస్తూ వుండగా జరిగేదట , మరణించిన వారిని మందిర ప్రాంగణం లోనే దహన సంస్కారాలు నిర్వహించేవారట .తరవాత తరవాత యీ వూరికి రోడ్డు రావడం తో ఉత్తరాంచల్ లో యెక్కడ యెవరు మరణించినా వారిని యిక్కడకు తెచ్చి తీర్థం తాగించి దహనసంస్కారాలు చేయించసాగేరట  . ఆ పూజారి యిప్పుడున్న పూజారికి తాతగారట . అలా రోజుకు పదుల సంఖ్యలో శవాలను తీసుకు రావడం తో పూజారిగారు మందిరాన్ని శుద్ధి చెయ్యడానికి యెక్కువ సమయం తడిబట్టలతో గడపలసి వచ్చేదట . అలా రోజుకి వందల సంఖ్యలో వేళాపాళా లేకుండా శవాలు వస్తూ వుండడం తో పూజారిగారు స్నానాలు యెక్కువగా చెయ్యవలసి రావడంతో జబ్బుపడ్డారట , అప్పటినుంచి యీ అలవాటుని మని వేసేరట , మందిరానికి పక్కగా వున్న శ్మశానవాటికను చూసేం . అతనికి చుట్టుపక్కల గ్రామాలలో చాలా పేరు వుంది . అతను  స్వయంగా కాళికాదేవితో సంభాషించేవారు యిప్పటికీ  చెప్తారు .

           సంస్కృతకవి కాళిదాసు జన్మించినది   ఈ గ్రామంలోనేనట .

            ఈ గ్రామంలో ' సత్ పాల్ మహారాజ్ ' కట్టించిన ధర్మశాల వుంది . కాళీమఠ్ లో బసచెయ్యదలచుకున్నవారు యిందులో వుండొచ్చు . యాత్రీకుల రద్దీ చాలా తక్కువగా వుంటుంది కాబట్టి ముందుగా బుక్ చేసుకోవలసిన అవుసరం లేదు .

          కాళిమఠ్ లో కాళికను పూజించి అనేక మంత్రశక్తులను సిధ్దులను పొందేందుకు చాలా మంది క్షుద్రోపాసకులు వస్తూ వుంటారు , అందుకే దీనిని సిధ్దపీఠం అనికూడా అంటారు .

          కాకినాడ నివాసి అయిన ఓ తెలుగు దాత యిచ్చిన విరాళాలతో మందిరంలో మరమ్మత్తులు జరుగుతున్నాయి . పేరేదో చెప్పేరుగాని నేను మరచిపోయేను .

          అక్కడ అమ్మకానికి పెట్టిన యెరుపు నలుపు పట్టు తాళ్లు అమ్మవారి శ్రీచక్రం వద్ద పెట్టి పూజచేయించి ధరిస్తే భూతప్రేత శక్తులు వారి దరిచేరవని చాలామంది యాత్రీకులు అలా తాళ్లను తీసుకు వెళుతూ వుంటే మేం కూడా తెచ్చుకున్నాం .

           ఇక్కడ మందిరం లో కోరిన కోర్కెలు కాళీమాత అనుగ్రహిస్తుందట , అలా కోర్కెలు తీరిన వారు యిక్క డ అమ్మవారికికానుకగా గంటను వ్రేడాలదీస్తారు . ఫొటోలో బారులుగా కట్టిన గంటలను చూడొచ్చు .

          ప్రకృతి అంతా ప్రశాంతంగా వున్నాయేదో తెలియని గాభరా , భయం కలిగింది . ఉత్తరాఖండ్ లో యే తీర్ధస్థలానికి వెళ్లినా అక్కడో నాలుగు రోజులైనా ప్రశాంతంగా గడపాలని అనిపించేది . మందిర పరిసరాలను వదిలి రావాలని అనిపించేదికాదు . ఇక్కడ యెంత తొందరగా వెళిపోదామా అని అనిపించింది . పూజారిగారితో యీ విషయం చెప్తే కాళిమాతను ఆవరించుకు వుండే షోడష శక్తులు వాటి అనుచరులతో యిక్కడ తిరుగుతూ వుంటాయి కాబట్టి అలా అనిపిస్తుంది అని చెప్పి మాకు రక్ష లు కట్టేరు .

         వెంటనే తిరుగు ప్రయాణ మయేం .

        తిరిగి రుద్ర ప్రయాగ రోడ్డు చేరి రుద్దప్రయాగ వైపు ప్రయాణించ సాగేం .

       రుద్రప్రయాగ పట్టణం మీదుగా ఓఖిమఠ్ వైపు తిరిగింది మా కారు . రుద్దప్రయాగ చేరేక అలకనంద మీద వున్న వంతెన దాటి కర్ణ ప్రయాగ మీదుగా బదరీనాధ్  వెళ్లొచ్చు లేదా అగస్తముని ,  ఓఖిమఠ్ , గోపేశ్వర్ మీదుగా కూడా బదరీనాధ్ వెళ్లొచ్చు . 

          మేం పంచబదరీ క్షేత్ర దర్శనానికి వెళితే కర్ణప్రయాగ మీదుగా వెళ్తాం , యీ సారి పంచకేదారాలు మా టార్గెట్ కాబట్టి గోపేశ్వర్ మీదుగా బయలుదేరేం .

 

         రుద్రప్రయాగ గోపేశ్వర్ రోడ్డుమీద రుద్రప్రయాగకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న గ్రామం ' అగస్త్యముని ' . అగస్త్యముని ఇక్కడ సంవత్సరకాలం ఘోరతపశ్సు చేసుకున్నాడట , అందకని యీ గ్రామానికి ఆ పేరు వచ్చింది . ఈ ప్రాంతంలో పంటపొలాలు వున్నాయి . ఇక్కడ పురాతనమైన చిన్న శివకోవెల , అగస్త్యముని ఆశ్రమం , అగస్యముని విగ్రహం వున్నాయి . హెలీకాప్టర్ ద్వారా కేదార్ నాధ్ వెళ్లేవారికి యిక్కడవున్న హెలీపాడ్ నుంచి హెలీకాప్టర్లు బయలుదేరుతాయి . హెలీపాడ్ వచ్చిన తరువాత అగస్త్యముని లో యాత్రీకుల సదుపాయాలు పెరిగాయనే చెప్పాలి . ఇక్కడ కొండలు వరిపంటకు అనుకూలంగా వున్నట్లున్నాయి , చాలా భాగం వరిపంట కనిపించింది .

          పై వారం ఉషా అనిరుద్ధుల వివాహ స్థలం , కొండలు యెక్కక్కరలేకుండానే పంచకేదారలలో మూడు కేదారాలని దర్శనం చేసుకుందాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు