చమత్కారం - భమిడిపాటి ఫణిబాబు

chamatkaram

లాండ్రీ వాడికి బట్టలు, అదీ ఇంటావిడ చీరలు ఇచ్చి, వాటిని తిరిగి తీసికున్నప్పుడు, మన ఈతి బాధలు చాలామందికి అబుభవమే.   కొందరు చెప్పుకుంటారు, కొంతమందికి మొహమ్మాటం చెప్పుకోడానికి. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసే పరిస్థితే. ఏదో మగాళ్ళైతే ఓ డ్రెస్ రెండు రోజులు వాడేస్తారు కానీ, ఆడవారికి ఇది సుతరామూ ఇష్టం ఉండదు. కారణాలు చాలానే ఉన్నాయనుకోండి. "అదేమిటి మాడం ఇవేళ కూడా నిన్నటి డ్రెస్సే వేసికున్నారేమిటీ" అని ఎవరైనా అంటారేమో అన్నది ముఖ్యమైన ఫీలింగుట ! నాకో విషయం అర్ధం అవదూ.. ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళందరికీ ఇంకో పని లేదా, అవతలి వాళ్ళు ఏం బట్టలేసికున్నారూ అని చూడ్డం తప్ప? ఏమిటో అన్నీ సమస్యలే...

పోన్లెండి, కారణం ఏదైనా working women లకి, వారానికి మూడు డ్రెస్స్సులూ, ఓ రెండు చీరలూ తప్పవు. అదృష్టం కొద్దీ 5 Day week ధర్మమా అని, కొంతలో కొంత రక్షింపబడ్డారు. శనివారం వచ్చేసరికి, అప్పటిదాకా ఉపయోగించిన బట్టలన్నీ, ఓ వాషింగ్ మెషీన్ లో పడేసి, మధ్యాన్నం ఎండుంటే, ఎండేసి, సాయంత్రం,ఆ ఎండిన బట్టలన్నీ ఓ పేద్ద క్యారీ బాగ్గులో పెట్టి, ఆ poor soul భర్తతో," రవీ/హరీ/వెంకీ/( ఈరోజుల్ల్లో సుబ్బారావూ, వెంకటరావూ,సాంబశివరావులు ఉండరు కాబట్టి) బయటకెలాగూ వెళ్తున్నావూ, ఈ బట్టలు press చేయడానికిచ్చేసి వెళ్ళూ", అని ఆ మూట చేతిలో పెడతారు.ఆదివారం ఇచ్చేయమనూ, అని కూడా చెప్తారు. పాపం ఈ yours obediently ఓ చేతిలో హెల్మెట్టూ, ఇంకో చేతిలో బైక్కు తాళాలూ, రెండో చేతిలో ఆ ప్యాకెట్టు పట్టకపోవడం చేత గుండెలకానించుకుని, మరీ పెద్దగా విసుక్కోకుండా ( గట్టిగా విసుక్కుంటే మళ్ళీ అదో గొడవా!), మొత్తానికి, ఎదురుగుండా, వాడకంగా ఇచ్చే లాండ్రీ వాడికి ఇచ్చెసి, అమ్మయ్యా ఓ గొడవొదిలిందిరా బాబూ అనుకుని, ఓ నిట్టూర్పోటి వదిలి, తన పని మీద వెళ్ళిపోతాడు. మరీ పేద్ద పనంటూ ఉండదనుకోండి ఏదో సీడీలోకొనుక్కోడానికో, ఏ షటిల్ ఆడ్డానికో ., అదీకాకపోతే ఏ జిమ్ముకో..

అక్కడితో ప్రధమాంకం పూర్తవుతుంది.అసలు గొడవ ఆదివారం నాడు, ఈ భర్త గారు ఏ సినిమా చూస్తున్నప్పుడో, , భార్య, " నిన్న బట్టలిచ్చావుగా, ప్రెస్ చేశాడేమో చూసి తీసుకొచ్చేయ్ ప్లీ...ప్లీ..ప్లీజ్, మంచివాడివి కదూ. " అంటూ చెప్పగానే, మళ్ళీ విసుక్కుంటూ, ఆ షార్ట్స్ తోనే సొసైటీ ఎదురుగుండా ఉన్న లాండ్రీకి వెళ్తాడు. అప్పటికే కొట్టు మూసే టైమవుతుంది. మనవాణ్ణి చూడగానే, " సార్ వచ్చేశారా, మీకోసమే చూస్తున్నానూ, అమ్మగారి బట్టలు కూడానూ, డ్రెస్సులు బ్యాగ్ లో పెట్టేశాను, చీరల రంగులేవో చెప్పండి, అవికూడా మడత పెట్టి పెట్టేస్తాను..." అంటాడు. అప్పుడు వస్తుంది ఆలోచన, ఎంత memory recallచేసినా ఆ చీరల రంగు మాత్రం ఛస్తే గుర్తుకు రాదు. పైగా అక్కడ హ్యాంగ్ చేసిన చీరలన్నీ ఒకేలాగుంటాయి. ఏదో ఓ పిందో, బుటావో తేడాగా. ఇందులో మనదేదో తెలిసికోడం ఎలాగరా భగవంతుడా? అప్పటికే అంతకుముందు రెండు మూడుసార్లు చివాట్లు తిన్న ఘటమాయె, ఏదో రంగు తెలిసున్నదవడం చేత ఎవరిదో చీర తీసికెళ్ళి. " ఆ మాత్రం నా చీరైనా తెలిసికోలేరా, నాలుగేళ్ళనుండీ కాపరం చేస్తున్నారు, నా చీరకేమో బుటా ఉంటుంది, దీనికేమో పిందెలున్నాయి. వెళ్ళి మార్చేసి తీసుకురండీ ..." అని.

అసలు గొడవెందుకొచ్చిందీ, ఎప్పుడైనా భార్యల చీరలు లాండ్రీకి ఇస్తే, వాటి రంగులు, మీ hard disk లో store చేసేసికోవాలి. ఏదో ఓ క్యారీ బాగ్గు లో పెట్టి ఇచ్చాము కదా అంటే సరిపోదు. మామూలు బట్టలు బాగానే పెడతాడు లాండ్రీవాడు. చీరల దగ్గరే అసలు గొడవంతా. పోనీ ఏదైనా లేబుల్ తగిలిస్తే వాడి సొమ్మేంపోయిందీ.అలాటప్పుడు ఏ hi-fi drycleaners కో వెళ్ళాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది. ప్రపంచంలో మీకొక్కరికే ఇలాటి "కష్టం" వచ్చిందనుకోకండి. ఇలాటి చీర బాధితులు వెదకాలే కానీ, కావలిసినంత మంది దొరుకుతారు.

ఎప్పుడూ చీరల రంగులు గుర్తుండి చావ్వు. ప్రతీ సారీ ఓ యజ్ఞమే.  లాండ్రీవాడికి బట్టలిచ్చేటప్పుడు, హాయిగా ఓ ఫొటో తీసేయడం especially చీరలు. ఆ కెమేరాయో, సెల్ ఫోనో తీసికుని వెళ్ళడం, ఠక్కుమని మనావిడ చేరేదో టుపుక్కున తెచ్చేసికోడం... ఎలా ఉంది ఐడియా?  ఏ గొడవా లేకుండా జీవితం "నాలుగు చీరలూ నాలుగు డ్రెస్సులూ.." గా వెళ్ళిపోతోంది.

లాండ్రీ బట్టలతో అయిపోదు గొడవ. ఎప్పుడైనా టైలర్ దగ్గరకి వెళ్ళి, ఓ బ్లౌజు పీసూ, ఓ "ఆది" జాకెట్టూ ఇవ్వాల్సొస్తూంటుంది. రసీదుకి ఆ బ్లౌజు పీసు ముక్కోటి తగిలించి ఇస్తాడు. ఆ " ఆది జాకెట్టే" మనల్ని కష్టాల్లోకి పెడుతుంది. కుట్టిన బ్లౌజులు పరవా లేదు, ఎదూరుగా వేళ్ళాడుతూంటాయి. దాని రంగేమిటీ అంటాడు ఆ టైలర్, మళ్ళీ action replay. ఓ పేద్ద అట్ట పెట్టిలోంచి, ముడతలు పడిపోయిన నానా విధములైన ఆది జాకెట్లూ బయటకొస్తాయి. అందులో మనదెలా కనుక్కోడం? పోనీ కొత్తగా కుట్టిన బ్లౌజుకి దగ్గరలో ఉండే రంగు తీద్దామా అంటే, అబ్బే అంతదృష్టం కూడానా. ఆది జాకెట్టు రంగు always differs కొత్త బ్లౌజు నుంచి. అదెప్పుడూ constanటే.సమస్యకి పరిష్కారం .... ఫొటో మాత్రమే....

సర్వేజనా సుఖినోభవంతూ…    

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు