ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

( ఓఖిమఠ్ , తుంగనాధ్ )

రుద్రప్రయాగకి సుమారు 41 కిలోమీటర్ల దూరం లో వున్న హిందువుల అత్యంత పవిత్రమైన ప్రదేశం ఓఖిమఠ్ .

మా చిన్నప్పుడు అంటే 1965 ప్రాంతాలలో మా నాయనమ్మగారు వారి దోస్తులతో యీ యాత్రలన్నీ చేసి వచ్చి మాకు కథలుగా చెప్తూ వుండేవారు . ఆవిడ వివరిస్తూ వుంటే యెప్పుడు వెళ్లిచూస్తామా అని అనిపించేది . అవకాశం రాగానే అంటే మొదటిసారి ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్ర 1997 లో చేసే అవకాశం వచ్చింది , అప్పటి పరిస్థితి యెలా వుండేదంటే మొత్తం దారంతా సన్నటి మట్టి రోడ్డు మాత్రమే . ఒక వెహికల్ మాత్రమే నడవగలిగేది . ఎదురుగా మరో బండి వస్తోందంటే మేం ప్రయాణించే బస్సు వెనుకకు వెళ్లవలసి వచ్చేది కొన్ని చోట్ల కొండ అంచునుంచి ప్రయాణించవలసి వచ్చేది . కొండలరాళ్లు దొర్లి బస్సుకు అడ్డం పడితే ప్రయాణీకులు దిగి వాటిని తొలగిస్తే ప్రయాణం ముందుకు సాగేది . రాత్రి బస అంటే ఒక్కగది అదికూడా కర్రమెట్లెక్కి వెళితే అటకమీద వుండేది . అయితే మంచి వెచ్చగా వుండేది . వెలుగు రాకమందు యే చెట్టుచాటునో కాలకృత్యాలు తీర్చుకోవలసిందే , ఆరు బయట స్నానాలు చెయ్యవలసి వచ్చేది . నేను మెల్లగా హోటలు యజమానిని బ్రతిమలాడి వారి సొంత టాయిలెట్స్ , స్నానాలగదులు అంటే చిన్న రేకులషెడ్డు వాడుకొనేదాన్ని . కరెంట్ అప్పటికి ఆప్రాంతాలకి రాలేదు కిరోసిన్ బుడ్డి దీపాలేగతి . 1997 లో పరిస్థితి అలా వుంటే సుమారు ముప్పైయేళ్ల క్రిందట యెలా వాళ్లు యాత్రలు చేసేరో , కాళ్లకు జోళ్లుగాని , ఊలుబట్టలు గాని యెరుగరు . వంటపాత్రలుకూడా మోసుకొని వంటవండుకొనితిని వండుకోనిరోజు వుపవాసం చేసి యెలా యాత్రలుచేసుకున్నారో యిప్పటికీ తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది .

మధ్యలో చిన్న పిడకలవేట , యాత్రలు చేసేటప్పుడల్లా మా నాయనమ్మ గుర్తొస్తుంది నాకు .

అప్పుడు విన్నాను యీ ఓఖిమఠ్ గురించి .

ఓఖిమఠ్ లేక ఊఖిమఠ్ గా పిలువబడే యీ గ్రామం సుమారు 4,300 అడుగుల యెత్తున వుంది . దట్టమైన అడవులగుండా ప్రయాణిస్తూ వుంటే ఒకచోట మాకారుకి చిరుత అడ్డం పడి పరుగెట్టడం ఓ మరచిపోలేని అనుభూతి , దారంతా యెర్రకార్పెట్ పరచినట్టు అడవిపూలు రాలిపడి మమ్మల్ని విఐపిలమేమో అనిపించిన ప్రయాణాన్ని మరచిపోగలమా ? , అడవి అందాలని ఆశ్వాదించడం తప్ప టీ కూడా దొరకని ప్రయాణం , ముందుగా కన్పించిన దుకాణం దగ్గర కారు ఆపించుకొని టీ తాగి బిస్కెట్స్ కొనుక్కొని బయలు దేరేం .

1997 లో పరిస్తితులను కాస్త వివరించేను గాని మిగతా వన్నీ యివాళటి విషయాలే అంటే యీ సంవత్సరం మార్చ్ నెలలో వెళ్లినప్పటివి తిన్నగా ఓఖిమఠ్ కోవెల చేరుకున్నాం . కోవెల అంతా కర్ర కట్టడమే , కోవెలఅంతా రంగులు రాసి చక్కగా వుంచేరు . ఈ ప్రదేశాన్ని ఉషామఠం అని అనేవారట , కాలక్రమాన వాడుకలో ఊఖిమఠ్ లేక ఓఖిమఠ్ గా మారిపోయింది .

 

         ముందుగా యీ వూరు ఉషామఠంగా యెందుకు పిలువబడిందో తెలుసుకుందాం .

        బలి చక్రవర్తి కుమారుడు బాణాసురుణు , అతిపరాక్రమశాలి , తన వెయ్యిచేతులతో శతృవులతో పోరాడి విజయం సాధించేవాడు . అతని రాజధాని ఉషామఠ్ . అతను పరమ శివ భక్తుడు , తన తపశ్సక్తితో పరమశివుని మెప్పించి అతనిని తన రక్షకుని గా చేసుకుంటాడు . సాక్షాత్తు శివుడే తన రక్షకుడిగా వున్నందువల్ల కలిగిన గర్వంతో దేవతలను పరాజయులను చేసి పాపకార్యాలు చెయ్యనారంభిస్తాడు . అతని పుత్రిక ' ఉష ' అత్యంత సౌందర్యవతి . అంతటి సౌందర్యవతిని యెవరైనా అపహరించుకు పోతారేమో అనే భయంతో ఆమెను నేటి అస్సాం రాష్ట్రం లోని తేజ్పూర్ దగ్గర వున్న  ' అగ్ని ఘర్ ' లో ఆమె చెలికత్తెల సహాయాన దాచివుంచుతాడు . యుక్త వయస్కురాలైన ఉష ఒకనాడు స్వప్నంలో అతి సుందరుడైన పురుషుడి చూస్తుంది . మరునాడు తన చెలికత్తెలతో తన స్వప్న వృత్తాంతం పంచుకోగా వారిలో ' చిత్రలేఖ ' అనే చెలికత్తె ఉష చెప్పిన విధంగా  ఆ సుందరాంగుని చిత్రపటాన్ని చిత్రిస్తుంది . ఆ చిత్రపటం కృష్ణుని మనుమడు అనిరుధ్దునిదని తెలుసుకొని , అనిరుధ్దుని అపహరించుకొని వచ్చి అగ్ని ఘర్ లో దాచేస్తుంది . 

         అంతఃపురం నుంచి మాయమైన అనిరుధ్దుని వెతుకుతున్న కృష్ణునకు అనిరుధ్దుడు బాణాసురుని వద్ద వున్నట్టు తెలుసుకొని అనిరుధ్దుని విడిచిపెట్టవలసినదిగా కబురుపెడతాడు . బణాసురుడు కృష్ణుని మాట పెడచెవిన పెట్టి అతనితో యుధ్దానికి తలపడతాడు .

 

       బాణాసురుని రక్షకుడిగా వున్నశివునకు , కృష్ణావతారంలో వున్న విష్ణుమూర్తికి యుద్ధం జరిగింది . హరి హరుల యుధ్దం భీకరంగా చాలా రోజులు సాగింది . హరిహరుల పోరు చూసి భీతిల్లిన దేవతలు బాణాసురునకు నచ్చచెపుతారు , దేవతల బోధలవలన కనువిప్పు కలిగిన బాణాసురుడు అనిరుధ్దుని బంధంచి తీసుకురావడం తప్పని క్షమార్పణ వేడగా విష్ణుమూర్తి బాణాసురునకు అతని  గల వెయ్యి చేతుల వలన గర్వము కలిగి తప్పుడు పనులు చేసినందుకుగాను ఆ చేతులను ఖండించి ఉషా అనిరుధ్దుల వివాహానికి అనుమతి నిస్తాడు .

       దేవీదేవతలు , నారదుడు మొదలయిన ఋషుల సాక్షిగా ఉషా అనిరుద్ధులను పరిణయం శివకేశవులు జరిపిస్తారు . 

         ఇప్పటికీ తేజ్పూర్ దగ్గర యీ అగ్ని ఘర్ అలాగే వుందట , అస్సాం వెళ్లేవారు తేజ్పూర్ దగ్గర వున్న యీ కోటను దర్శించుకోవచ్చు .

      ఉషా అనిరుధ్దుల వివాహం జరిగిన మండపం కర్రతో కట్టిన కట్టడం రంగులు వేసి చాలా బాగా కాపాడుతున్నారు . 

       ముందుగా వున్న కోవెలలో శివపార్వతులు , ఉషా అనిరుధ్దుల విగ్రహాలతోపాటు నిలువెత్తువున్న మాంధాత విగ్రహాన్ని కూడా చూడొచ్చు .

 

         కేదారేశ్వరుని శీతాకాలముపు నివాసం కూడా యిదే . శీతాకాలంలో కేదారేశ్వరుని ఉత్సవ విగ్రహం పల్లకీలో పెట్టి యీ మందిరానికి తెస్తారు , ఆరునెలలు కేదారేశ్వరునికి నిత్యపూజలు నిర్వహిస్తారు . వైశాఖ తదియనాడు కేదారేశ్వరుని పల్లకి కేదార్ తీసుకు వెళతారు . అలాగే పంచకేదారాలలో ఒకటైన మధ్య మహేశ్వరుడిని కూడా శీతాకాలంలో యీ మందిరం లో వుంచి పూజలు నిర్వహిస్తారు . కోవెల కేదార్ నాధ్ మందిరం లాగే కట్టిన రాతి కట్టడం . చుట్టూ వున్న మండపాలు గదులు కర్రతో నిర్మింప బడ్డవి . నెగిషీ దిద్దిన కర్రపనితనానికి చక్కని రంగులతో ప్రాణం పోసేరు . ప్రశాంత వాతావరణం లో వున్న మందిరం యెంతో అహ్లాదాన్ని యిచ్చింది .

       సాధారణంగా ఉత్తరాఖండ్ మందిరాల దగ్గర పూజా సామగ్రులు అమ్మే దుకాణాలు వుండవనే చెప్పాలి . అమ్మవారి మందిరాలదగ్గర మాత్రం పసుపు కుంకుమ మొదలయిన సామానులు దొరకుతాయి . చాలా మందిరాలలో అలాంటి సదుపాయాలు వుండవు అందుకే నెయ్యి లో ముంచిన వత్తులు మాతో పాటు తీసుకువెళ్లి దీపం వెలిగించి మాతో పాటుతీసుకువెళ్లిన పటికపందార నైవేద్యం చేస్తూ వుంటాం . అభిషేకానికి నీరు యెక్కడ పడితే అక్కడ దొరుకుతుంది .

       ఓఖిమఠ్ తరవాత మా ప్రయాణం చోప్తా వైపు సాగింది . 

        చోప్తా ఓఖిమఠ్ నుంచి గోపేశ్వర్ వెళ్లే దారిలో వుంది . ఓఖిమఠ్ నుంచి 19 కిలోమీటర్లు ప్రయాణంచిన తరువాత ముక్కోమఠ్ అనే చిన్న గ్రామంలో వున్న చిన్న మందిరాన్ని దర్శించుకున్నాం .

 

       ఇంత చిన్న మందిరానికి యేంటంత ప్రాముఖ్యత అంటే ఆ మందిరంలో పంచకేదారాలలో ఒకటైన ' తుంగనాధ్ ' మహదేవుని శీతాకాలముపు  మందిరం . శీతాకాలం ఆరునెలలు  తుంగనాధ్ మహదేవుని ఉత్సవ విగ్రహం తో పాటు పూజారికూడా యిక్కడ నివాసముండి వేసవిలో తుంగనాధ్ మందిరానికి తీసుకువెళతారు . ఈ పూజారులు కర్నాటక నుంచి వలస వచ్చిన వారు . శంకరాచార్యులవారు యీ ప్రదేశాలలో వున్న శివ మందిరాలను గుర్తించి తనతో పాటుగా వచ్చిన శిశ్యులను పూజారులుగా నియమించేరు , యిప్పటికీ వారి సంతతివారే పూజారులుగా కొనసాగుతున్నారు .

         రుద్ర ప్రయాగకు   సుమారు 63 కిమీ దూరంలో రుద్రప్రయాగ గోపేశ్వర్ రోడ్డుమీద వున్న కూడలి లాంటి ప్రదేశం చోప్తా . మూడేళ్ల కిందటి వరకు తుంగనాధ్ కి వెళ్లే మార్గం అని రాసివున్న చిన్న బోర్డువుండేది , యిప్పుడు ఓ రెండు టీ దుకాణాలు వచ్చేయి .

          అక్కడనుంచి వున్న మెట్లదారిగుండా సుమారు 4 కిమీ ప్రయాణించి తుంగనాధ్ మందిరం చేరుతాము . 

           తుంగనాధ్  మహేదేవ్ అతి యెత్తైన ప్రదేశంలో వున్న ఈశ్వర మందిరంగా పేరు పొందింది . ఈ మందిరం సుమారు 12,100 అడుగుల యెత్తున వుంది .

       తుంగనాధ్ మందిర వివరాలు వచ్చేసంచికలో చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు