షార్ట్‌ ఫిలింస్‌ - స్మార్ట్‌ ఐడియాస్‌ - ..

short flims  smart ideas

వెండితెరకు ధీటుగా బుల్లితెర సత్తా చాటుతోంటే, ఈ రెండిటికీ సవాల్‌ విసురుతోంది 'షార్ట్‌ తెర'. చిన్నా పెద్దా అని తేడాల్లేకుండా ఇప్పుడందరి నోటా వినిపస్తున్న మాట షార్ట్‌ ఫిలిం. మొబైల్స్‌లోకి ఎక్కేస్తోంది, కంప్యూటర్లలో కన్పిస్తోంది. ఇంకొంచెం రిస్క్‌ చేసేసి బుల్లితెర మీదకీ ఎక్కేస్తోంది. ముందు ముందు వెండితెర మీదనా ఈ షార్ట్‌ ఫిలింస్‌ని చూసేస్తామేమో. తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఎక్స్‌పోజర్‌ కారణంగానే ఎక్కువమంది షార్ట్‌ ఫిలింస్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. చేతిలో ఓ కెమెరా ఉంటే చాలు, మెదడులో మెదిలే చిన్న చిన్న ఐడియాస్‌తో షార్ట్‌ ఫిలింస్‌ రూపొందించేయడం ఈ మధ్య బాగా చూస్తున్నాం. కొంతమంది అయితే మొబైల్‌ పోన్లలోనే షార్ట్‌ ఫిలింస్‌ చిత్రీకరించేస్తున్నారు. దాంతో అవి మరింత రియలిస్టిక్‌గా ఉంటున్నాయి. ప్రధానంగా కాలేజీ యువత ఈ షార్ట్‌ ఫిలింస్‌ మేనియాలో ఊగిపోతుండడం గమనించదగ్గ అంశమే. 

కుర్రకారు ఆలోచనలకి ఆకాశమే హద్దు. ఇంట్లో చెబితే ఊరుకోరు, ఖర్చయ్యే పనులైతే వాళ్ళే ముందడుగు వేయరు. పాకెట్‌ మనీతోనే షార్ట్‌ ఫిలిం రూపొందించే ఛాన్స్‌ ఉండడంతో యువత అస్సలాగడంలేదు. చిలిపి ఆలోచనలు, ఆలోచనాత్మక విషయాలు, ఒకటేమిటి అన్నీ షార్ట్‌ ఫిలింస్‌గా మారిపోతున్నాయి. తద్వారా సొసైటీకి మంచి మెసేజ్‌ ఇచ్చే అవకాశాన్నీ యువత సద్వినియోగం చేసుకోవడానికి షార్ట్‌ ఫిలిం మేకింగ్‌ మంచి వేదికగా మారుతోంది. ఒక్కసారి షార్ట్‌ ఫిలిం ఇంటర్నెట్‌లోకి వెళితే, అక్కడ అది క్లిక్‌ అయితే ఆటోమేటిక్‌గా ఫేమ్‌ వచ్చేస్తోంది. అలా ఫేమ్‌ సంపాదించినవారు బులిల్లతెరపైనా, వెండితెరపైనా వెలిగిపోతున్న సందర్భాల్ని చూస్తున్నాం. అందుకే, సైట్‌ సీయింగ్‌ అనే ప్లేస్‌ ఎక్కడ కన్పించినా, కెమెరాలతో యువత ప్రత్యక్షమైపోతోందక్కడ. సినిమా షూటింగ్‌ తరహాలో కాకుండా నలుగురైదుగురు మాత్రమే ఉండి పని చక్కబెట్టేస్తున్నారు. ఆ తర్వాత అది ఇంటర్నెట్‌కి ఎక్కిన తర్వాతనే, ఫలానా చోట ఫలానా వ్యక్తులు షూట్‌ చేశారని మనం గుర్తుపట్టి ఆశ్చర్యపోతున్నాం. 

మంచీ, చెడూ అన్నిట్లోనూ ఉంటాయి. షార్ట్‌ ఫిలింస్‌ పేరుతో కొందరు ఓవర్‌ స్మార్ట్‌ అవుతున్నారు. బూతు వీడియోల రూపకల్పన ద్వారా అడ్డదిడ్డంగా ఆర్జించవచ్చుననే దుష్ట ఆలోచనలూ యువత మదిలో మెదులుతుండడం పెద్ద మైనస్‌ పాయింట్‌. ఇంటర్నెట్‌లో ఇలాంటివాటికి అడ్డుకట్ట వేయడం కష్టమే. అదే వారికి వరం అవుతోంది. ఒక్కోసారి ఈ ఓవర్‌ స్మార్ట్‌నెస్‌ కారణంగా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. లైంగిక వేధింపులతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. స్మార్ట్‌ ఆలోచించి, భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికీ, తమ ఆలోచనల్ని సన్మార్గం వైపు మలచడానికీ స్మార్ట్‌ ఫిలింస్‌ని ఉపయోగించుకుంటే ఫర్లేదుగానీ, దురాలచనలు చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదు. 

మరిన్ని వ్యాసాలు