ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

 ( తుంగనాధ్ , గోపేశ్వర్ )

ఎక్కవలసినది 4 కిలోమీటర్లు అనగానే ఉత్సాహం వచ్చింది మాకు . అంతకుముందు 14 కిలోమీటర్లు కేదార్ , యమునోత్రి యెక్కిన మాకు నాలుగు కిలో మీటర్లు ఓ లెక్కా అని ముందుకు సాగిపోయేం . చాలా మట్టుకు మెట్లే , తుంగనాధ్ వరకు రాను పోనూ గుర్రాలు దొరుకుతాయి , కాని యిక్కడవున్న కిటుకేమిటంటే మెట్లమీద గుర్రపుసవారి చాలాకష్టం , దిగేటప్పుడు మరీ కష్టం , మొత్తం ఒళ్లు హూనమవడం ఖాయం , నడిస్తే డబ్బుమిగులు , కాళ్ల నొప్పులు మాత్రమే వుంటాయి .హూనం బదులు నొప్పుల బెటరు అనేది యెన్నో యాత్రలు చేసిన మీదట మేం తెలుసుకున్న నిజం . మరీ దూరమయితే గుర్రం తప్పదు , అందుకే నడక సాగించేము . 

తుంగనాధ్ లో నంది ముందు కాళ్లు పడ్డ ప్రదేశం . మహాభారత యుధ్దం లో జరిగిన బ్రాహ్మహత్యా పాతకం  , స గోత్రహత్యాపాతకం నివారణ కొరకు శివుని సేవించు కోడం తప్ప మరో మార్గం లేదని విష్ణుమూర్తి చెప్పగా పాండవులు పరమశివుని వెతుకుతూ కేదార్ సమీపిస్తారు . పాండవుల రాక తెలుసుకున్న శివుడు వారిపై కల కోపముతో నంది రూపం దాల్చి వారినుండి పారిపోతాడు . భీష్ముడు పారిపోతున్న నందిని శివుడిగా యెరిగి వెంబడిస్తాడు . శివుడు గుప్తకాశిలో పాతాళలోకానికి పారిపోదలచి భూమిని చీల్చుకొని వెళుతూ వుండగా భీముడు నంది వెనుక కాళ్లను పట్టుకొని విసురుగా బయటకు లాగగా నంది అయిదు ఖండములుగా ఖండింపబడి ' తుంగనాధ్ ( ముందుకాళ్లు పడ్డ ప్రదేశం ) ' , కేదార్ నాధ్ ( మూపురం పడ్డ ప్రదేశం ) , మథ్య మహేశ్వర్ ( నాభి పొట్ట మొ।। ప్రదేశాలు పడ్డ ప్రదేశం ) , రుద్రనాధ్ ( వెనుక కాళ్లు పడ్డ ప్రదేశం ) , కల్పేశ్వర్ ( తల భాగం పడ్డ ప్రదేశం ) లు పంచ కేదారాలుగా పిలువబడుతూ హిందువుల పూజలు అందుకుంటున్నాయి .

వర్షాలు తరచూ పడే ప్రదేశం కావడంతో మెట్లు కొన్ని చోట్ల పాకుబట్టి వున్నాయి . ప్రకృతి సౌందర్యం వర్ణించడానికి మాటలు లేవు . మందాకినీ అలకనందలు ప్రవహించే లోయ ఒకవైపు మంచుతో కప్పబడ్డ హిమాలయాలు ఒకవైపు , నడక ఆయాసాన్ని యిస్తున్నా వాతావరణం అహ్లాదాన్ని యిస్తోంది . కాసేపు కూర్చుంటూ కాసేపు నడుస్తూ వెళ్తున్నాం , చాలా కొద్ది సంఖ్యలో అంటే పదికి మించని యాత్రీకులు అక్కడికక్కడ యెదురు పడ్డారు . ఎక్కడా టీ దుకాణం కూడా లేదు . కొండమీద నుంచి ప్రవహిస్తున్న నీరు కాస్త ముఖం మీద జల్లుకొని సేద తీరుతూ నడిచేం . సుమారు రెండుగంటలలో పైకి చేరుకున్నాం , ఒకటోరెండో యాత్రీకులకోసం కట్టిన గదులున్నాయి . మాతో వచ్చిన వాళ్లు ట్రెక్కర్స్ , రాత్రి అక్కడ బసచేసి మరునాడు అక్కడకి రెండు కిలోమీటర్ల దూరం లో వున్న ' చంద్ర శిల ' ను చూసుకొని చోప్తా చేరుతారట , మమ్మల్ని కూడా వారిలో పాటు రాత్రి అక్కడ బసచేసి , చంద్రోదయం చూసుకొని వెళ్లమని ఆహ్వానించేరు , మేము మా సొంతకారులో డ్రైవరుని చోప్తా లో రోడ్డుపైన విడిచి పెట్టి రావడం మూలాన దేవుడి దర్శనం చేసుకొని బయలు దేరుతాం అని చెప్పాము . ఈ కొండ పైనుంచి చంద్రోదయ దృశ్యం చాలా బాగుంటాయని వారు చెప్పేరు . 

ముందుగా దేవుడి దర్శనార్థం కోవెలలోకి వెళ్లేం , కేదార్ నాధ్ మందిరాన్ని పోలిన చిన్న మందిరం . ఇందులో శివలింగం , మండపం స్థంబాలపై పాండవుల , కుంతి , ద్రౌపతి సగం విరిగిన విగ్రహాలు వున్నాయి . ఇక్కడ పూజారులు రావల్ వంశస్థులు , వీరి పూర్వీకులు కర్నాటకలోని శృంగేరీకి చెందిన వారిని , శంకరాచార్యులవారితో యీ ప్రదేశానికి వచ్చి అతని కోరిక మేరకు యీ మందిర పూజారులుగా కొనసాగుతున్నారని చెప్పేరు . మందిరం పొద్దున్న ఆరు నుండి సాయంత్రం యేడు వరకు తెరిచే వుంటుంది . రాత్రి యేడు గంటలకు శయనహారతి తరువాత మందిరం మూసివేస్తారు . మందిరం పక్కగా చిన్న పాకహోటల్ యాత్రీకుల అవసరాలను తీరుస్తోంది . 

మందిరం బయట అరుగులమీద కూర్చొని మిగతా యాత్రీకులతో పిచ్చాపాటి సాగించేం .

భోజనం యేమీ బాగులేదు యేదో వేడిగా ఓ రొట్టి తిన్నాం .

ఎదురుగా మంచుకప్పబడి వున్న పర్వతాలు శిఖరాలైన నందాదేవి , పంచచౌలి , బందేరు పూంఛ్ , కేదార్ , చౌకబారు , నీలకంఠ మహదేవ్ ఒకవైపు , ఘరెవాల్ లోయ మరో వైపు మమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది . దూరంగా స్వఛ్చమైన నీటి జలపాతాలు , అతిచల్లగా వుండే వాతావరణం ఒకటిరెండు రోజులు అక్కడ గడపాలని అనిపించింది . కనుచూపుమేరవరకు పచ్చని తివాసి పరచినట్లున్న పచ్చిక , యెవరు యీ కొండలమీద లాన్ మైంటెన్ చేస్తున్నారు  , యీ పైన్ వృక్షాలను వరుసగా యెవరునాటారు , యీ జలపాతాలు , సెలయేళ్లు వీటిని యెవరు యేర్పాటు చేసేరు . ఇంత అందం సాధ్యమా , మాతోటి యాత్రీకులు వారు మరునాడు వెళ్లబోయే చంద్ర శిల గురించి చెప్తూ వుంటే ఆ రోజు అక్కడవుండి మరునాడు ఆ చంద్ర శిలను చూసుకు వెళ్లాలని యెంతగానో అనిపించింది . 

తుంగనాధ్ దగ్గరనుంచి మరో కిలోమీటరు నడిస్తే చంద్రశిలను చేరుకోవచ్చు . అక్కడ మందిరం లాంటిదేమీ లేదు . చంద్రకాంతితో పోటీ పడుతూ  మిలమిల మెరిసే పర్వతం వుంటుందట , తుంగనాధ్ నుంచి కనిపించే శిఖరాలను దగ్గరా చూడొచ్చుట , రెండురెట్ల అందమైన ప్రకృతిని ఆశ్వాదించవచ్చునట , కాని మాకున్న కారణాలవలన మేం చోప్తావైపు ప్రయాణం సాగించేము .

ఎక్కే టప్పుడు అంతా యెత్తు కావడం వల్ల , దిగేటప్పుడు చాలా సులువుగా దిగిపోయేం . ఇప్పుడు డోలీలుకూడా దొరుకుతున్నాయి . ఆరోగ్యపరమైన యిబ్బందులు లేనివారు తప్పక తుంగనాధుని , చంద్రశిలను దర్శించుకు రండి . 

చోప్తా నుంచి గోపేశ్వర్ వైపుగా మా ప్రయాణించసాగేం .

ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా ముఖ్యపట్టణం గోపేశ్వర్ సముద్రమట్టానికి సుమారు 5200 అడుగులయెత్తులో వున్న పట్టణం .

జిల్లా ముఖ్యపట్టణం కావడంతో విద్యా సంస్థలు , ఆరోగ్యకేంద్రాలు , బ్యాంకులు మొదలయిన అన్ని సదుపాయాలు కలిగి వుంది . మొత్తం నగరం కొండలపై నిర్మించడం వల్ల అంతా యెత్తుపల్లాలే . వేసవిలో చల్లగా , శీతాకాలంలో అతి చల్లగా వుండే  ప్రాంతం , శీతాకాలంలో అప్పుడప్పుడూ మంచుకురుస్తూ వుండే ప్రాంతం . ధూళి దుమ్ము లేని ప్రాంతం కావడం వల్లనేమో యిక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్ర క్షయ వైద్యకేంద్రం నిర్మించేరు .

భోజన , రాత్రి బసలకు కావలసిన అన్ని సదుపాయాలు లభ్యమౌతాయి , యాత్రీకులు యాత్ర సమయంలో ముఖ్య పట్టణాల పట్టిక తయారు చేసుకొని పట్టుకుంటే రాత్రి బసచేయడానికి వీలైన ప్రదేశం యెంత దూరంలో వుందో తెలుస్తుంది , దీనివల్ల యేదోవొక చోట బస చేసి యిబ్బందులు పడటం నుంచి తప్పించుకోవచ్చు . 

సుమారుగా పట్టణానికి మథ్యగా వుంటుంది గోపేశ్వర్ మందిరం . చుట్టారా వున్న ప్రహరీని దాటుకొని మెట్లు దిగి లోపలకు వెళ్లడానికి 24తలుపులు వున్నాయి  . కోవెల ప్రాంగణం లో ఖండిత విగ్రహాలు చాలా కనిపిస్తాయి . మధ్యలో 5 మీటర్ల యెత్తున్న అష్టధాతు త్రిశూలం పాతిపెట్టబడి వుంది . ఈ మందిరం తొమ్మిదవ శతాబ్దంలో కట్యూరిరాజ వంశస్థులతే నిర్మింపబడింది . ముఖ్యమందిరం కేదార్నాధ్ మందిరాన్ని పోలి వుంటుంది . ముఖ్య ప్రవేశ ద్వారం దగ్గర యిరువైపులా రెండు సింహాలు వున్నాయి . లోపల శివలింగం స్వయంభూ లింగం . మేం యీ మందిరం చేరేసరికి సాయంత్రం హారతి అప్పుడే అయింది , లోపల దీపాలవెలుగు చూడండి ఫొటోలో . ముఖ్యమందిరంరి వెనుక వైపున కర్రతో నిర్మింప బడ్డ గదులున్నాయి . ముఖ్య మందిరానికి గదులకు మధ్యమును ప్రదేశంలో వందల సంవత్సరాలు వున్న స్థలవృక్షాన్ని చూడొచ్చు  ప్రతి సంవత్సరము పంచకేదార పల్లకీలు యిక్కడకు తెచ్చి పెద్ద వుత్సవం చేస్తారట , అప్పుడు ఆ విగ్రహాలను వుంచేందుకు ఆ గదులను వుపయోగిస్తారట , మెట్లెక్కి పెడితే పెద్ద హాలు లాంటి గదిలో పట్టుతో ఆసనాలు వేసి వున్నాయి , అక్కడ పంచకేదార ఉత్సవమూర్తులను వుంచుతారుట . అయితే యీ గదులు యెప్పుడూ మూసివేసే వుంచుతారు , ఇంతకు ముందు వెళ్లినప్పుడు మూసివేసి వున్నాయి , యీ సారి పూజారి మమ్మల్ని చూడగానే ఆగదులన్నింటినీ తెరచి దగ్గరుండి అన్నీ చూపించి మందిర విశేషాలను చెప్పేరు .

ఈ కోవెల పంచకేదారాలలో ఒకటైన రుద్రనాధ్ యొక్క శీతాకాలములు విడిది కూడా గర్భగుడిలో శివలింగం వెనుకాల వున్న విగ్రహం రుద్ర నాధ్ యొక్క ఉత్సవ విగ్రహం . కొండలు యెక్కి యాత్ర చెయ్యే లేని వారు అక్షయ తృతీయ లోపున యెప్పుడైనా చమోలి జిల్లాలో వున్న పంచకేదార శీతాకాలపు మందిరాలను దర్శించుకోవచ్చు . 

పూజారి చెప్పిన ప్రకారం శివుడు సతీదేవి మరణంతో విచలిత మనస్కుడై యిక్కడ తపస్సు చేసుకోగా అప్పటికే సతీదేవి పార్వతిగా జన్మించి శివుని వివాహమాడదలచి తపస్సమాధిలో వున్న శివుని సేవించుకోసాగింది . శివుడు పార్వతిని కన్నెత్తి కూడా చూడక పోవడంతో దేవతలందరూ కూడబలుక్కొని మన్మధుని శివునిపై పూలబాణం వెయ్యవలసినదిగా కోరుతారు . మన్మథుడు వారి కోరికను మన్నించి శివుడిపై పూలభాణం వేయగా శివుని మనస్సు చెదరి తపోభంగమవగా శివుడు తన త్రిశూలముతో మన్మధుని బూడిదచేస్తాడు . మందిర ప్రాంగణంలో వున్న 5 అడుగుల త్రిశూలమే ఆనాడు మన్మధుని పై ప్రయోగించిన శివుని త్రిశూలమని చెప్పేరు . అష్టధాతువులతో నిర్మితమైనదట , యెంత బలప్రయోగము చేసినా దానిని యెవ్వరూ కదపలేరట . రతీదేవి పరమశివునికై ఘోర తపస్సుచేసి శివుని ద్వారా మన్మధుని పునఃర్జీవితుని చేసుకున్న ప్రదేశం కూడా యిదే .

అస్తమిస్తున్న సూర్యకాంతిలో ఆ మందిర సౌందర్యం వర్ణించడం కవులకు తప్ప నాలాంటి వారికి సాధ్యమా ? గోపేశ్వర్ నుంచి పందొమ్మిది కిలో మీటర్ల దూరం లో అత్రి  ముని ఆశ్రమం వుంది . మేం యింతవరకు వెళ్లలేదు గాని ఉత్సాహం వున్నవారికొరకు కొన్ని వివరాలు యిస్తున్నాను . దేవుడు కరణిస్తే 2018లో వెశ్దామనే సంకల్పం వుంది . గోపేశ్వర్నుంచి పదమూడు కిలోమీటర్ల  ప్రయాణానంతరం ' మండల్ ' చేరుతాం , అక్కడనుంచి ఆరుకిలోమీటర్ల నడక తరువాత ముందుగా సతీ అనసూయ మందిరం చేరుతాం , అక్కడనుంచి కాస్త నడక తరువాత వచ్చే కొండగుహలు అత్రి ముని ఆశ్రమం . సతీఅనసూయ మందిరానికి వెళ్లమని సలహా యిస్తున్నప్పుడు ఆ ప్రదేశం యొక్క విశిష్టతను కూడా మీకు చెప్పే బాధ్యత కూడా నాదే కదా ? మరి స్థలపురాణం వినండి . 

' సతీ అనసూయ  ' సతీత్వం ' పొందక మునుపు ముల్లోకాలలోనూ ఆమె యొక్క గుణగణాలు మారుమోగుతూ వుండగా ఒకనాడు ముగ్గురమ్మలు ( పార్వతి , లక్ష్మి , సరస్వతి ) నారదునిని పిలిచి అనసూయ యెవరు ? ఆమెని అందరూ యెందుకు పొగడుతున్నారు అని అడుగుతారు . దానికి నారదుడు అనసూయ పతిభక్తిని , ఆమె యిచ్చే అథిధి సత్కారములను గురించి వివరంగా చెప్తాడు . దానికి ముగ్గురమ్మలు ' నాభర్త నా పతిభక్తికి మెచ్చి తన శరీరములలో అర్ధభాగం యిచ్చేడు , నా కన్నా అనసూయ పతివ్రతా ? ' అని పార్వతి ,  ' నా భర్త తన హృదయం లో చోటివ్వటం నా పతిభక్తికి నిదర్శనం కదా ? ' అని లక్ష్మి , ' నా భర్త నోట్లోవుండి అతని ప్రతి పలుకు నాదే అవడం నా పతిభక్తి వల్ల కాదా ? ' అని సరస్వతి అడుగుగా నారదుడు నవ్వి ' తల్లులారా అది మీ పతిభక్తికి నిదర్శనాలుకావు , మీమీ పతులకు మీయందుకల అనురాగం , పతిభక్తి  అనగా అనసూయ దే అని పలికి ముల్లోక సంచారానికి వెళ్లిపోతాడు . అనసూయ పైన అసూయతో ముగ్గురమ్మలు బ్రహ్మవిష్ణుమహేశ్వరులను అనసూయ పాతివ్రత్యమును భంగపరిచి రమ్మని పంపుతారు .  బ్రహ్మవిష్ణుమహేశ్వరులు వృధ్ద బ్రాహ్మణుల వేషంలో అత్రి ముని యింటి వాకిట నిలబడి తాము యాత్రీకులమని భోజనం పెట్టమని అడుగుతారు , అనసూయ వెంటనే భోజనం తయారుచేసి వడ్డించే సమయానికి త్రిమూర్తులు తమకొక నియమం వుందని దాని ప్రకారం ఆతిధ్యమిచ్చే గృహిణి వివస్త్ర యై వడ్డన చేయాలి లేనట్లైతే తాము ఆ యింట తినరాదని చెప్తారు . బ్రాహ్మణుల మాటలకు కలవరపడ్డ అనసూయ వారి మాటలకు మారాడక లోనికి వెళ్లి మనసులో భర్తను తలచుకొని వస్త్రములను తీయప్రయత్నించగా ఆమె మనసులో ఆ వచ్చిన వారు త్రిమూర్తులని తడుతుంది , ఆమె వారి వద్దకు వచ్చి తన పాతివ్రత్య శక్తితో పసిపాపలుగా మార్చి వారిని పెంచసాగింది . ఎన్ని దినములు గడచినా భర్తలు తిరిగిరాకపోవుటకు కారణాన్వేషణ చేస్తూ ముగ్గురమ్మలూ అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చి అనసూయ ఒళ్లో ఆడుకుంటున్న పసిపాపలే తమ పతులను తెలుసుకుని ముగ్గురమ్మలూ అనసూయ కాళ్లమీద పడి క్షమాపణలు వేడుకొని , తమ భర్తలను తమకు యివ్వమని కోరుతారు . అనసూయ పసిపాపలను తిరిగి త్రిమూర్తులను చేసి ముగ్గురమ్మలకూ వొప్పజెబుతుంది . త్రిమూర్తులు , ముగ్గురమ్మలు అనసూయకు సతీత్వం ప్రసాదిస్తారు . సతీఅనసూయ తిరుగాడిన ప్రదేశం , త్రిమూర్తులు పసిపిల్లలుగా ఆడుకున్న ప్రదేశం , ముగ్గురమ్మలు పశ్చాత్తాపం పడ్డ ప్రదేశం యీ సతీ అనసూయదేవి మందిర ప్రాంతమేనట .

ఈ కథ గోపేశ్వర్ మందిర పూజారి  చెప్పినప్పుడే మీ అందరికి యీ వివరాలు చెప్పాలని అనిపించింది .

చార్ ధామ్ యాత్ర చేసేవారు దారిలో వచ్చే ముఖ్యమైన మందిర వివరాలు తెలియక వాటిని దర్శించుకోకుండా వచ్చేస్తూ వుంటారు , అలా వెళ్లిన వారు సాధ్యమయినన్ని యెక్కువ మందిరాలు దర్శించుకోవాలనే నా తాపత్రయం .

పై వారం పంచకేదారాలలో ఒకటైన మధ్య మహేశ్వర్ గురించి చదువుదాం , అంతవరకూ శలవు .

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి