ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

మధ్యమహేశ్వర్

ఓఖిమఠ్ మఠ్ నుంచి కారులో సుమారు 18 కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ' ఉనియాన ' గ్రామం చేరేం . అక్కడ రాత్రి చిన్న గదిలో బసచేసుకొని మరునాడు పొద్దున్నే మధ్యమహేశ్వర్ వెళ్లాలనేది మా సంకల్పం  . ఎందుకంటే పొద్దున్నే బయలుదేరితే రాత్రికి మధ్యమహేశ్వర్ లో బసచేసుకొని , మరునాడు పొద్దుట తిరిగి బయలుదేరి ఉనియానా చేరాలనేది మా ఆలోచన . రాత్రి మా బస యజమానిని మధ్యమహేశ్వర్ దారి యెలావుంటుంది వగైరా వివరాలు అడిగేం . పొద్దున్నే మరో  రెండుకిలోమీటర్ల ప్రయాణం చేస్తే కొండ మొదలవుతుందని అంతవరకు కారులో వెళ్లవచ్చని తొమ్మిది లోపున అక్కడకి వెళితే గుర్రాలు దొరకవచ్చని , తరవాత గుర్రాలను మట్టిపనికి తీసుకువెళతారని , యాత్రీకులు యెక్కువగా వుండరు కాబట్టి సౌకర్యాలు యేమీ వుండవని చెప్పేరు .

మరునాడు పొద్దున్నే మేం నడక దారి మొదలయిన ప్రాంతానికి చేరుకున్నాం . మా అదృష్టం బాగుండి గుర్రాలు దొరికేయి , మొత్తం రాను పోను 38 కిలో మీటర్లు గుర్రాలమీద ప్రయాణించాలి . సాహసమే పంచకేదారాలు చూద్దాం అనుకున్నప్పుడు తప్పదుకదా ? .

ఓ జత బట్టలు బిస్కెట్స్ పెట్టుకున్న చిన్న చేతి సంచులు గుర్రం యజమాని పట్టుకోగా  మేం గుర్రాలమీద జాగ్రత్తగా కూర్చొని ప్రయాణం సాగించేం . సుమారు 11,400 అడుగుల యెత్తున వున్న మందిరం చేరాలి , సుమారు ఓ కిలోమీటరు తప్ప అంతా యెక్కడమే .

ఈ దారి కూడా కేదార్ దారిలాగే అంతా కొండలే కాకపోతే కేదార్ కి యాత్రీకుల రద్దీ యెక్కువ వుండడం వల్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం యాత్ర మొదలయే సమయానికి రోడ్డు  విశాలంగా చేసి రాకపోకలు సులువుగా జరిగేటట్లు అన్ని యేర్పాట్లూ చేస్తారు . కాని తుంగనాధ్ మధ్య మహేశ్వర్ వీటికి మొత్తం యాత్ర సీజన్లతో కలిపి సుమారు యాభై మంది రావడం కూడా గొప్పే అది యీ మధ్య చాలామంది వేసవిలో ట్రెక్కింగ్  చేస్తూ వుండడం వల్ల యీ పాటిగా వస్తున్నారు ,  దారంతా పెద్ద పెద్ద రాళ్లు పడి వాటిని దాటేటప్పుడు గుర్రం కాలు జారితే మా గుండె జారేది . భయం పోగొట్టుకోడానికి గట్టిగా నా కొచ్చిన స్తోత్రాలు చదువుకోడం , పళ్లు కరచుకునేంత భయం కలిగితే ' నమశ్సివాయ ' అని గొణుక్కోవడం చేస్తూ  మూడు కిలోమీటర్లు ప్రయాణించేం . నడ్డి విరిగినంత నొప్పి అనిపించింది , ఉనియాన పేరుకు వూరేగాని ఒక్క యిల్లు

నాలుగు గదులు వరుసగా రోడ్డు పైకి కట్టి వున్నాయి అది తప్ప మరేమీ లేదు , తినడానికి మధ్యాహ్నం రాత్రి రొట్టి తప్ప మరేమీ దొరకదు , పొద్దున టీ కూడా దొరకని ప్రదేశం కావడం వల్ల మాకు కడుపులో యెలకల గోల మొదలయింది . గుర్రాలబ్బాయితో యెక్కడైనా టీ దొరికే చోట ఆపమని చెప్పేం .  ' రాన్సి ' గ్రామం లో టీ దొరుకుతుందని చెప్పేడు . ఒకే ఒక రేకు గది వున్న ప్రదేశం దగ్గర ఆపి యిదే రాన్సి గ్రామం అన్నాడు . ఆ షెడ్డులో అప్పటికే ఓ బెంగాలీ జంట మా వయసువారే బస చేసి వున్నారు . ఓ పక్కగా కర్రల పొయ్య , దానిమీద టీ పెట్టి మాకు యిచ్చేడు . ఆ బెంగాలీ దంపతులు నడిచి మధ్య మహేశ్వర్ వెళ్లి వస్తారట , ఆ రోజు అక్కడ బస చేసి మరునాడు తిరిగి బయలుదేరి యెక్కడ కష్టమనిపిస్తే అక్కడ బస చేసుకుంటూ వెళ్తారట , టీ తాగడం అవగానే అక్కడ నుంచి బయలుదేరేం 

అక్కడ నుండి మరో రెండు కిలోమీటర్ల తర్వాత నాలుగిళ్లున్న వూరు వచ్చింది అక్కడ మాకు ' మేగీ ' వేడివేడిగా చేసి  పెట్టేరు . అది తిన్న తరువాత మాకు కాస్త ఉత్సాహం వచ్చింది . మరో నాలుగు కిలో మీటర్ల తరువాత ' గౌధర 'చేరుకున్నాం , యిక్కడ రాత్రి బస చెయ్యడానికి మూడు నాలుగు గదులున్నాయి . ఇది దాటితే మరెక్కడా బస చేసే వీలులేదు . బసలంటే వాళ్లుంటున్న గదిలోని ఓ మూల పక్క వేసి రజ్జాయిలు యిస్తారు . ఆ రజ్జాయిలు కొన్న తరువాత ఒక్క వుతుకుకీ నోచుకోనివి , ఓ మారు యెప్పుడైనా సన్నని యెంత పొడ వస్తే మాత్రం యెండలో వేస్తారు . కాబట్టి ఉత్తరాఖండ్ యాత్రలకు వెళ్లేవారు వారి సామానులతో పాటు రెండు దుప్పట్లుకూడా సర్దుకుంటే మంచం మీద వేసుకోడానికి ఒకటి రజ్జాయికింద అంటే మన శరీరానికి ఆనేది మన దుప్పటి అయితే సగం చర్మరోగాలను అరికట్టగలం , యేమంటారు   అదే సుమారు ఆప్రాంతాలకు ఆఖరు జనావాసాల గ్రామం . ఈ కొండలలో వున్న వారు వారికి కావలసిన ధాన్యం , కూరగాయలు కొండచరియలలో పండించుకుంటూ , మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు , ముఖ్యాంగా వీరు శాఖాహారులు . గౌధర్కి ఓకిలోమీటరు దూరంలో ' బంతోలి ' అనే గ్రామం , జనావాసాలు లేని వాటిని గ్రామం అనొచ్చా ? యేమో , మన సౌకర్యం కోసం ప్రదేశం అందాం  , యీ బంతోలీ అనే చోట మధ్యమహేశ్వర్ గంగ , మర్కన గంగ సంగమంచే ప్రదేశం . ఆ సంగమం చూసుకొని ముందుకు ప్రయాణించసాగేం . ఒకరో యిద్దరో ట్రెక్కర్లు తప్ప వేరే యెవ్వరూ లేరు . మా పుణ్యం బాగుంది వర్షం పడలేదు . పచ్చని చెట్లమధ్య నుంచి చల్ల గాలి శరీరానికి తగులుతూ సేదదీరుస్తూ వుంది . అడవి లోంచి వీస్తున్నగాలి యెవేవో వాసనలను మోసుకు వస్తోంది . కలుషితం కాని గాలి పీలుస్తూ సాగింది మా ప్రయాణం సాయంత్రం అయిదింటికి మధ్యమహేశ్వర్ చేరుకున్నాం . 

మందిర ట్రస్టు వారి ఆధ్వైర్యం లో నడపబడుతున్న నాలుగు గదులు మాత్రం వున్నాయి , సంతోషం యేమిటంటే ఎటాచ్డ బాత్రూము వుంది నీటి సదుపాయం వుంది కరెంటులేదు . ఒకచిన్న పాక హొటలు ట్రస్ట్ మెంబరుదే వుంది , అక్కడ దొరికిన టీ అని పిలువబడ్డ వేడినీళ్లు తాగి గది తాళం తీసుకొని దర్శనానికి వెళ్లేం , ఆరున్నరకి శయన హారతి అప్పుడు రండి అన్న పూజారిగారి మాటతో మళ్లా మా రూముకి వచ్చేం , పక్క రూములో అప్పటికే నలుగురు  ట్రెక్కర్స్ వున్నారు . వారు అప్పటికే డిన్నరు ముగించేరు , ఆరున్నరకి హోటలు మూసేస్తారు అని చెప్పేరు , మేం కూడా మా డిన్నరు కానిచ్చి మందిరంలో సాయంత్రాలు పూజా విధులు చూడ్డానికి వెళ్లేం . మందిరం చాలా పాత రాతికట్టడం , కేదార్ మందిరాన్ని పోలి వుంది , యిక్కడ శివలింగం నాభిని పోలి వుంటుంది , బయట రెండు చిన్న మందిరాలలో ఒకటి పార్వతీ దేవికి , మరొకటి అర్ధనారీశ్వరులకి కట్టేరు , రాతి విగ్రహాలు వున్నాయి . ఈ మందిరం భీముడు స్వయంగా కట్టించినట్లు చెప్తారు . పక్కగా పాలరాయి సరస్వతీ దేవి విగ్రహం వుంది సరస్వతీ దేవి విగ్రహం కొత్తదనం , యీ మధ్యకాలంలో పెట్టినట్లుంది . 

ఇక్కడ స్థలపురాణం చాలా మార్లు చెప్పిందే అయినా యీ సంచికను మాత్రమే చదివేవారికోసం మరోమారు చెప్తాను . 

మహా భారత యుధ్దంలో పాండవులచే యెన్నోవేలమంది బ్రాహ్మణులు , గోత్రీకులు చంపబడతారు , ఆ పాప  పరిహారం కొరకు కృష్ణుడి సలహా మేరకు శివుని పూజించుకోడానికి కేదార్ నాధ్ వైపుగా ప్రయాణిస్తారు . సగోత్రహత్య , బ్రహ్మహత్యలుచేసిన పాండవులపై కోపముతో వున్న శివుడు పాండవుల రాక తెలుసుకొని వారినుంచి పారిపోవాలనే తలంపుతో నంది రూపముదాల్చి పారిపోతాడు . శివుని కొరకై వెతుకుతున్న పాండవులకు శివుడు కనిపించకపోవడం తో శివుని వెతుకుతూ యీ కొండలలో సంచరిస్తూవుండగా గుప్తకాశివైపు పయనిస్తున్న నందిని భీముడు పోల్చుకొని తరుముతాడు , నంది రూపములలో వున్న శివుడు గుప్తకాశిలో పాతాళానికి పోతూవుండగా భీముడు నంది వెనుకకాళ్లను పట్టుకొని బయటకు లాగుతాడు , ఆ విసురుకు నంది అయిదు ఖండములయి అయిదు ప్రదేశాలలో పడింది ముఖం పడ్డభాగం ' రుద్రనాధ్ ' , ముందుకాళ్లు పడ్డ ప్రదేశం ' తుంగనాధ ' , మూపురం పడ్డప్రదేశం కేదార్ నాధ్ , నాభి పొట్ట పడ్డ ప్రదేశం మధ్యమహేశ్వర్ , వెనుకకాళ్లు తోక పడ్డ ప్రదేశం కల్పేశ్వర్ మహదేవ్ . ఆ అయిదు ప్రదేశాలు పంచకేదారాలుగా ప్రసిధ్ది చెందేయి . పంచకేదారాలలో శివుని పూజించుకొని పాపవిముక్తులయిన పిమ్మట పాండవులు సర్గారోహణానికి వెళతారు . 

ఈ ప్రాంతాలలో వున్న అన్ని శివమందిరాలలోనూ ఆది శంకరాచార్యులచే నియమించబడ్డ అతని శిష్యుల సంతతి వారు పూజారులుగా వున్నారు కాని యీ మందిరంలో కర్నాటక నుంచి వచ్చిన లింగధారులు ( జంగం ) పూజలు నిర్వహిస్తున్నారు . ఇతను బ్రహ్మచారి , అతనికి కేటాయించిన గదిలో వుంటూ , అతనే వండిన అన్నప్రసాదలు నివేదిస్తున్నారు . 

సూర్యుడు పడమటలో కుంగే సరికి చలి విపరీతంగా పెరిగనారంభించింది  , వున్న ఒక్క బడ్డీ హొటలు మూసేయగానే మేము మా పక్క గదిలో వున్న ట్రెక్కర్స్ తో బాతాఖానీ చెయ్యసాగేం . వారు మొత్తం యీ కొండలలో వున్న చార్ ధామ్ లే కాక మిగతా అన్ని శివకోవెలలూ చూసుకొని బదరీనాధ్ చేరుతారట , కొండలలో నడక దారి వేరుగా వుందట , అలా వారు సుమారు 20 రోజులు నడిచి బదరీనాధ్ చేరుతారట , కొండలలో మొత్తం 250 కిలోమీటర్లు నడుస్తారట . చాలా తొందరగా చీకటి పడ్డంతో చేసే పనేమీ లేక రూములోకి వెళుతూవుండగా మా కొత్త ఫ్రెండ్స నిద్రరాకపోయినా గదులోనే వుండండి గాని గదిబయటకు రావొద్దు కృూరమృగాలు తిరుగుతూ వుంటాయి అని హెచ్చరించేరు .  రూము లోకి చేరగానే మంచి నిద్ర పట్టేసింది . ఆరుకు లేచి బయటకు వచ్చి చేస్తే చుట్టారా మంచు బిందువులతో మెరుస్తున్న గడ్డి , పొగమంచులో మసకమసకగా కనిపిస్తున్న కోవెల , చల్లగా వున్న వాతావరణం మరో లోకంలో వున్న అనుభూతినిచ్చింది .

మా ట్రెక్కర్లు అప్పటికే తయారయి నడక ప్రారంభించేరు . మేం వేడివేడి టీ చప్పరిస్తూ వారు యెక్కడకి వెళుతున్నారో అడిగేం , అక్కడకి మరో మూడు కిలో మీటర్లు పైకి వెళితే బూఢా మహదేవ్ కోవెల , చక్కని సరస్సు వున్నాయి వాటిని చూడ్డానికి వెళ్తున్నాం అన్నారు . అక్కడ నుంచి చేస్తే చౌకంబా , నీలకంఠ్ , కేదార్ శిఖరాలు అధ్బుతంగా కనిపిస్తాయని చెప్పి వాళ్లు బయలుదేరేరు .

ఆ శిఖరాలు మేమున్నచోటునుంచి కూడా బాగానే కనిపిస్తున్నాయి . చెప్పకపోడమేం గాని నాకు మనసు పీకింది , యెలాగో వోలా పడుతూ లేస్తూ  వెళదాం అనిపించింది . గబగబా తయారయేం , యీ రెండు మందిరాలకు పూజారివొకరే , ఆయన రోజూ నడిచి వెళ్లి పూజలు నిర్వహించుకొస్తారట , మాకు రూములిచ్చిన మందిర ట్రస్టు మెంబరు మమ్మల్ని నిరుత్సాహ పరచడంతో  మేము తయారయి మరో మారు మందిరం దర్శించుకొని చుట్టుపక్కల ఓ మారు నడిచి , ప్రకృతిని కళ్లలో దాచుకొని గుర్రాల కోసం యెదురు చూడసాగేం . 

ఓ గంట ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపేక గుర్రాలతను వచ్చేడు . మరోమారు ఆ పరిసరాలను కళ్లనిండుగా చూసుకొని బయలుదేరేం . గుర్రాలతనితో పాటు మరోఅబ్బాయి ( స్థానికుడు ) కూడా నడుస్తూ కొండదిగసాగేడు .

ఉత్తరాంచల్ లోని మిగతా మందిరాలలాగా యీ మందిరం కూడా శీతాకాలంలో మూసెస్తారు . ఉత్సవవిగ్రహాన్ని ఓఖిమఠ్ లో వున్న ఉషామఠ్ లో నుంచి పూజలు చేస్తారు . 

గుర్రాల మీద కూర్చొని కొండలు యెక్కడం యెంతకష్టమో దిగడం దానికి రెట్టింపు కష్టంగా వుంటుంది .

ముందు రోజు ' మాగి '  తిన్నచోట భోజనం చేసుకున్నాం , అప్పుడు మాకు తెలిపిన విషయం మేమిటంటే ఉత్తరాఖంఢ్ లో వరన్నం మాత్రమే తింటారని , రోటీ చెయ్యడం రాదు అన్నం కావాలంటే వండుతానని అంటే మాకు ప్రాణం లేచొచ్చింది . పెరట్లో పండిన కాయగూరలుతో కూర , అన్నం , పప్పు , పెరుగు తో వడ్డించేరు . మనకి అంతకన్నా యింకేం కావాలి . తృప్తిగా భోజనం చేసి తిరిగి బయలు దేరేం .

సాయంత్రానికి కిందకి దిగిపోయేం . అయితే మాగుర్రాలబ్బాయితో పాటు వచ్చిన కుర్రాడు భుజం మీద మూట పట్టుకు మోస్తున్నాడు , రాత్రి చిరుత మేకలమందలో దూరి మేకను కొట్టిందట , యింట్లో వాళ్లు లేచి చిరుతను అదిలించడంతో చిరుతకు మేకను తీసుకుపోయే అవకాశం దొరకలేదు , యీ కొండలలో వారు శాఖాహారులవడంతో కుర్రాడు ఆ చచ్చిన మేకను మోసుకొని కిందకు వచ్చి ఉనియాన దగ్గర వున్న బజారులో యెక్కడో అమ్ముకొని మరునాడు తిరిగి యింటికి వెళతాడట . 

అప్పటికే మా డైవరు కారుతీసుకొని అక్కడ వచ్చి వుండడంతో వెంటనే బయలుదేరి మేం గోపేశ్వర్ వైపు బయలుదేరేం .

పై సంచికలో ' శర్ఖండా దేవి ' మందిరం గురించి తెలుసుకుందాం అంతవరకు శలవు . 

మరిన్ని వ్యాసాలు

కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి
తొలి వలపు తొందరలు...
తొలి వలపు తొందరలు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు