హైద్రాబాద్‌లో ఓ విద్యార్థిని హత్యకు గురైంది. ఆమెను హత్య చేసింది సాక్షాత్తూ ఆమె స్నేహితుడే. ఆ స్నేహితుడు ఆమె ఇంట్లోనివారికీ సుపరిచితుడే. 'స్నేహమే అనుకున్నాం, ఆ స్నేహం మాటున ప్రేమ ఉందని గ్రహించలేకపోయాం. ఆ ప్రేమ తమ బిడ్డ ప్రాణాల్ని తోడేస్తుందని అనుకోలేకపోయాం' అని బాధిత కుటుంబం కంటతడిపెడుతోంది. అయితే పోలీసుల విచారణలో సభ్య సమాజం ఆశ్చర్యపోయే ఎన్నో విషయాలు వెలుగు చూశాయి. 'ప్రాజెక్ట్' పేరుతో 50 మందికి పైగా విద్యార్థినీ విద్యార్థులు ఓ హోటల్‌లో మూడు రోజులు 'గడిపారు' అన్నది అందులో ఒక అంశం. వారికి అక్కడ స్వేచ్ఛగా మద్యం లభించింది. ఆడ, మగ కలిసి విచ్చలవిడిగా 'ఎంజాయ్' చేసినట్లూ విచారణలో తేలింది. ఆ ఎంజాయ్‌మెంట్ ఆ ఇద్దరు మైనర్ ప్రేమికుల మధ్య చిచ్చుపెట్టింది. ఇంకొకరితో తన లవర్ చనువుగా ఉండటం నచ్చక, ఆమెతో తెగతెంపులు చేసుకోవాలనుకున్నాడు. కుదరలేదు, ఆమె వెంట పడేసరికి మట్టుబెట్టాలనుకున్నాడు. బాధితురాలు, నిందితుడూ ఇద్దరూ మైనర్లే.
ఇది కథ కాదు, వ్యధ. ఇరు కుటుంబాల్లోనూ తీరని విషాదం మిగిల్చింది ఈ ఘటన. ఓ కుటుంబానికి కడుపు కోత, ఇంకో కుటుంబానికి ఇదొక మాయని మచ్చ. పిల్లల్ని ఎంతో ప్రేమతోనే ఇరు కుటుంబాలూ పెంచి ఉంటాయి. తమ బిడ్డలకు కావాల్సినంత స్వేచ్ఛని కూడా ఇచ్చాయి. ఆ స్వేచ్ఛ వెనుక బాధ్యత లేకపోవడమే ఇంతటి దారుణానికి కారణం. పబ్‌లకు వెళితే తప్పేంటి? అని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. పబ్‌లకు వెళ్ళడమే తప్పయితే, వాటిని నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారామె. ఆమె ఆవేదన వాస్తవం, ఆమె ప్రశ్నలో నిజాయితీ కూడా వాస్తవమే. కానీ, తమ బిడ్డ ఎప్పుడు ఏం చేస్తోందో తెలుసుకోలేకపోవడం ఖచ్చితంగా ఆ కుటుంబం చేసిన తప్పే అవుతుంది. అలాగే నిందితుడి కుటుంబం కూడా, తమ పుత్రరత్నం ఎప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోకపోతే ఎలా? ఇంటినుంచి జరిగే చిన్న చిన్న తప్పిదాలు పెను ప్రమాదాలుగా మారుతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
ఇంట్లోనూ, స్కూల్‌లోనూ ఇతరుల పట్ల ప్రేమాభిమానాలు, బంధాలు, బాంధవ్యాల గురించి అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలి. 'మా పిల్లలకి అన్నీ తెలుసు' అని వదిలేయడం కాకుండా, స్మార్ట్ ఫోన్లలో ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు? స్నేహితులెలాంటివారు? వంటి అంశాలపైనా నిఘా పెట్టక తప్పనిసరి. ఘోరం జరిగిపోయాక 'ఇదీ తప్పు' అని చెప్పడం కష్టం. ఆ ఘోరం జరగకూడదంటే చాలా తప్పుల్ని తప్పు అని ఒప్పుకునేంత విజ్ఞత కూడా ఉండాలి. నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది, నమ్మకం లేని చోట మోసానికి ఆస్కారమే ఉండదు. కాబట్టి ఆ నమ్మకం వెనుక 'కుట్రకోణం' వయసు తెచ్చిన అనుభవంతోనే తెలుసుకోవచ్చు. అది పూర్తిగా తల్లిదండ్రుల బాధ్యతే. పిల్లల మూడ్ ఛేంజ్ అవుతోందంటే తేడా జరుగుతున్నట్లే, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. స్వేచ్ఛ అవసరమే, కానీ అది బాధ్యతతో కూడిన స్వేచ్ఛ అయి ఉండాలి. బాధ్యత లేని స్వేచ్ఛ ఖచ్చితంగా కడుపు కోతనే మిగుల్చుతుందనే కఠోర వాస్తవాన్ని గుర్తెరిగి అప్రమత్తంగా ఉంటే చాలా ప్రమాదాల్ని నివారించుకోవచ్చు.