అనంతగిరి హిల్స్ - పర్యాటకం - లాస్య రామకృష్ణ

anathagiri hills - tourism

ఆంధ్రప్రదేశ్ లోని హైదరాబాద్ నుండి కేవలం 100 కిలోమీటర్ల దూరం లో నే మంత్ర ముగ్ధుల్ని చేసేంత అందమైన అనంతగిరి హిల్స్ అనే ప్రదేశం ఉంది. వికారాబాద్ నుండి 10 కిలో మీటర్ల దూరం లో ఈ ప్రాంతం ఉంది. మూసీ నది జన్మ స్థానం ఇది. ఇది అటవీ ప్రాంతం. చుట్టూ పచ్చటి కొండలు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి.ఏడాది పొడవునా ఈ ప్రాంతం పర్యాటకులని ఆహ్లాదకరమైన వాతావరణం మరియు ప్రశాంతమైన పరిసరాలతో ఆకట్టుకుంటుంది.

సాయంత్రం సరిగ్గా 4 మరియు 5 గంటల సమయమప్పుడు సూర్యాస్తమయ సమయం కావడం వల్ల సూర్యుని బంగారపు కిరణాలు పచ్చనిప్రకృతి తో కలిసి అద్భుతమైన దృశ్యంగా పర్యాటకులకి కనువిందు కలిగిస్తుంది. ఈ ప్రదేశం మొత్తం ఆకుపచ్చటి అందాలతో మెరిసి పోతుంది.  అనంతగిరి హిల్స్ కి చేరే రోడ్డు మార్గం చక్కగా ఉండడం వల్ల 100 కిలోమీటర్ల ప్రయాణంలో ని అలసట తెలియదు. కేవలం రెండు గంటల సమయం లో నే ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

ఈ ప్రాంతం పర్యాటకులకి రోజు వారీ గజి బిజీ జీవన విధానం లో నుండి ఉపశమనం కలిగిస్తుంది. అనంతగిరి లో అనంత పద్మనాభ స్వామి ఆలయం కలదు. వారాంతంలోని ఈ ఆలయం భక్తుల రాకతో కిటకిటలాడుతుంది.

అనంతగిరి హిల్స్ మొదటి సారి ట్రెక్కింగ్ అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే వారికి అనువైన ప్రదేశం.  ట్రెక్కింగ్ లో అందమైన ప్రకృతి పర్యాటకుల మనస్సు దోచుకుంటుంది. అనంతగిరి ప్రాంతం లో ఎన్నో చిన్న చిన్న కొండలు ఉన్నాయి.  ఇవి అన్నీ ట్రెక్కింగ్ లో సందర్శించే అవకాశం కలదు.

అనంతగిరి మరీ దట్టమైన అడవి కాకపోవడం వల్ల అడవి లో దారి తప్పి పోయే అవకాశాలు తక్కువ. చాలా మంది ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ కోసమే ప్రత్యేకంగా వస్తారు. అయితే, అడవి లోపలకి వెళ్ళాలని అనుకునే వారు ఒక పెద్ద గ్రూప్ గా వెళ్తే మంచిది.

అనంతగిరి లో ఎన్నో ట్రెక్కింగ్ మరియు కామ్పింగ్ అవకాశాలు కలవు. ఈ అటవీ ప్రాంతంలో రెండు ట్రెక్కింగ్ ట్రైల్స్ ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ వద్ద మరొకటి ఈ ఆలయం నుండి అర కిలోమీటరు దూరం లో కెరెల్లి వద్ద ప్రారంభం అవుతుంది. అనంతగిరి హిల్స్ లో ఉన్న కామ్పింగ్ సైట్ ని 'డెక్కన్ హిల్స్' అని అంటారు. ఇక్కడ అటవీ ప్రాంతం లో విహారం చాలా బాగుంటుంది.

వీటితో పాటు, పర్యాటకులు ఇక్కడ 'రాక్ క్లైమ్బింగ్', 'బర్మా బ్రిడ్జి', 'స్పైడర్స్ వెబ్' మరియు టార్జాన్ స్వింగ్ వంటి ఎన్నో ఆక్టివిటీస్ లో పాల్గొని ఆనందించవచ్చు.

చుట్టు పక్కల ఇతర ఆకర్షణలు

నాగసముద్రం లేక్ లేదా కోటిపల్లి రిజర్వాయర్
అనంతగిరి హిల్స్ నుండి దాదాపు 20 కిలోమీటర్ల దూరం లో కోటిపల్లి రిజర్వాయర్ లేదా నాగసముద్రం లేక్ ఉంది. ఈ సరస్సు చాలా పెద్దది. వర్షాకాలం లో ఈ సరస్సు, నీళ్ళు సమృద్దిగా కలిగి ఉండటం వల్ల ఎంతో ఆకట్టుకుంటుంది.




అనంత పద్మనాభ స్వామి టెంపుల్
అనంతగిరి హిల్స్ లో ని మరి యొక ప్రధాన ఆకర్షణ అనంతపద్మనాభ స్వామి వారి ఆలయం. ఇది దాదాపు 400 ఏళ్ళ క్రితానికి చెందినది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ఆలయం నిజాం నవాబుల చేత నిర్మించబడింది. చాలా మంది మొదటగా ఈ ఆలయాన్ని సందర్శించిన తరువాత ట్రెక్కింగ్ కి బయలుదేరతారు.

అనంతగిరి ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడం చాలా సులభం. అదే సొంత వాహనం ద్వారా లేదా ప్రైవేటు ట్రావెలర్స్ వాహనాల చేరుకోవడం మరింత సౌకర్యం. పబ్లిక్ రవాణా సౌకర్యం అంతగా అందుబాటులో లేకపోవడం ఒక కారణం. ఆహారాన్ని ఇంటి నుండి తీసుకువెళ్ళడం మంచిది. ట్రెక్కింగ్ సమయం లో కూడా తినే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా, అనంతగిరి లోని భోజన సదుపాయాలు అంతంత మాత్రమే కావడం మరొక ముఖ్య విషయం.

అనంతగిరి గురించి ఒక్క వాక్యం లో చెప్పాలంటే ప్రకృతి ఒడిలో సేద దీరాలనుకునే వారికి హైదరాబాద్ కి సమీపం లో ఉన్న అందమైన ప్రదేశం అని అనవచ్చు.

మరిన్ని వ్యాసాలు

సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
పురాణాలలో ఒకే పేరు పలువురికి 2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
డప్పు గీతాలు.
డప్పు గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు